సాంగ్‌రే బంగారు రాజా
మధురగాయకుడు పి.బి.శ్రీనివాస్ పాటలు తెలుగు శ్రోతలకు సుపరిచితమే. అయితే, ఆయన తొలి సినిమా పాట తెలుగులో కాదు, హిందీలో పాడారు. గాయకుడిగా ఆయన తొలి చిత్రం ‘మిస్టర్ సంపత్’ (1952). ఆ తర్వాత మూడేళ్లకు గానీ ఆయనకు తెలుగులో పాడే అవకాశం లభించలేదు.
కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడి దానా... / బుగ్గమీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా?
నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే / వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో...
చాలాకాలం ఈ పాటను శ్రీశ్రీ రాశాడని అనుకున్నారు. ఇప్పటికీ అనుకునేవారు ఉన్నారు. కాని ఆత్రేయ దీనిని రాసి తన కలానికి ఈ అంచు కూడా తెలుసని నిరూపించుకున్నాడు. ఈ పాటను చూడకూడదు. వినాలి. చూస్తే కాంటెక్స్ట్ లేకుండా పాడుతున్నట్టు ఉంటుంది. వింటే ఎవరినో నిలదీస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీనికి నేపథ్యం రష్యాలో ఉంది. సోవియెట్ యూనియన్ ఏర్పడ్డాక ప్రపంచ దేశాలలో చాలామంది దానివైపు ఆశగా చూశారు. తమ దేశాలలో కూడా ఇలాంటిది సాధ్యమవ్వాలని ఆకాంక్షించారు.
ఉన్నవాడు లేనివాణ్ణి దోచుకోవడం అసమ సమాజం కొనసాగడం ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది? మనదేశంలో కూడా సాహిత్యం, ముఖ్యంగా కవిత్వం ఈ నిలదీతను మొదలెట్టింది. కొందరికి అది ఫ్యాషన్ కూడా అయ్యింది. మంచి సిద్ధాంతం ఎవరికైనా ఆమోదమేనని రాయవలసిన సందర్భం వచ్చినప్పుడు ఎవరైనా దానికి మద్దతుగా రాయగలరని ఆత్రేయ నిరూపించడానికా అన్నట్టు ఈ పాటను రాశాడు. ‘నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే... వారి బుగ్గన నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో’ అని కారులో షికారుకెళ్లే అమ్మాయిని ఉద్దేశించి అన్నా అది ప్రతి డబ్బున్నవాణ్ణి తాకుతుంది.
‘చెమట చలువ’ను చేర్చి పేదలెందరో పైవాళ్లకు చలువరాతి మేడలు కడతారట. ‘చిరుగుపాతల బరువూ బతుకుల నేతగాళ్ల’ కష్టం జిలుగు వస్త్రాల వెనుక ఉంటుందట. ఆత్రేయ అదరగొడతాడు. ‘చాకిరొకరిది సౌఖ్యమొకరిది’ అనే చెప్పే ఈ పాట తేలిక మాటల్లో సామ్యవాదం సారాన్ని చెబుతుంది. అనుభవించేవారిని మెత్తటి బెత్తంతో బాదుతుంది.చిత్రం: తోడికోడళ్లు (1957)
సంగీతం: మాస్టర్ వేణు
రచన: ఆత్రేయ
గానం: ఘంటసాల
నీ వుండేదా కొండపై నా స్వామి / నేనుండేది నేలపై
ఏ లీలా సేవింతినో / ఏ పూల పూజింతునో
తెలుగువారి అదృష్టం. వేంకటేశ్వరుడు మన తిరుపతి కొండల్లోనే వెలిశాడు. పెద్ద దూరాభారం లేదు. ఆపద వస్తే రాత్రికి రాత్రి పరిగెత్తుకుని పోవచ్చు. ఆనందం కలిగితే ఉన్నపళంగా బయలు దేరి ఆలింగనం చేసుకోవచ్చు. ఏడుకొండల ఎత్తున ఉన్నాడు. కాని కోరి కొలిస్తే ఎంత దగ్గర. అదివో అల్లదివో ఉన్నాడు. కాని ప్రార్థిస్తే ఎంత సన్నిహితం.
తెలుగు సినిమా హాళ్లన్నీ ‘నమో వెంకటేశా నమో తిరుమలేశా’ పాటతోనే తెరను తొలిగించి రోజూ మొదటి ఆటను ప్రారంభిస్తాయి. ఆ స్వామి పేర్లలో ఏదో ఒకదాని మీద ప్రతి ఊళ్లో ఒక థియేటర్ అయినా ఉంటుంది. సినీ నిర్మాణ సంస్థలైతే లెక్కే లేదు. ఇక సినిమాల్లో ఆయనను శ్లాఘిస్తూ స్తుతిస్తూ ఉండే పాటలకూ సన్నివేశాలకు ఏకంగా కథలకు ఏం కొదవ? ‘భాగ్యరేఖ’లో ఈ పాట చాలామంది తెలుగువారికి సుప్రభాతం.
దీనిని వింటే ఇంట్లో అగరు పొగలు వెలిగించినట్టుంటుంది. మంద్రధ్వనితో గంట మోగిస్తూ హారతి పడుతున్నట్టుగా ఉంటుంది. తులసి కోట మీద నుంచి మెల్లమెల్లగా వీస్తున్న గాలి ఒకటి మనసును తాకినట్టుగా ఉంటుంది. ‘ఈ పారిజాత సుమాలెన్నొ పూచి’... సుశీల గొంతు ఆయన పాదాల దగ్గర పూలు పెడుతున్నట్టుంటుంది. కృష్ణశాస్త్రి రచన గంధం రాసినట్టుగా. బాణీ పెండ్యాల కట్టాడు. ఇది హిందీలో ‘నా ఏ చాంద్ హోగా నా తారే రహేంగే’ (షర్త్) నుంచి ఇన్‌స్పిరేషన్ కావచ్చు. కాకపోనూ వచ్చు. ఆ మంద్రం మాత్రం అలాగే అనిపిస్తుంది.చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రీ
గానం: పి.సుశీల
ముకుందా... మురారీ / జయ కృష్ణా ముకుందా మురారీ
జయ గోవింద బృందా విహారీ / కృష్ణా ముకుందా మురారీ
ఒక పాట ఎన్ని నిమిషాలుంటుంది? ఇప్పుడైతే మూడు నిమిషాలు. లేదా నాలుగు నిమిషాలు. లేదా అయిదు నిమిషాలు. మరీ అనుకుంటే ఏడు నిమిషాలు. కాని ఆ రోజుల్లో ఒక భక్తి గీతాన్ని ఏకంగా 11 నిమిషాల పాటు రికార్డు చేసి దానిని సినిమాలో ప్రేక్షకులు కుర్చీల్లో నుంచి కదలకుండా చూపించి హిట్ చేసి అంతటితో ముగిసిపోకుండా కొన్ని తరాలపాటు నిలిచేలా ఒక పాటను నిలబెట్టడం అంటే తమాషా కాదు. ఆ ఫీట్‌ను సాధించింది సంగీత దర్శకుడు టి.వి.రాజు, రచయిత సముద్రాల, గాయకుడు ఘంటసాల.
పిల్లలకు శ్రీకృష్ణలీలలు తెలియాలంటే పెద్ద పుస్తకాలు చేతిలో పెట్టక్కరలేదు. ఇప్పుడైనా ఈ పాట చూపిస్తే చాలు. సులభంగా గ్రహిస్తారు. పాండురంగ మహత్యం- జననీ జనకులకు మించిన దైవం లేదు అని పుండరీకుని ద్వారా నిరూపించిన కథ. ఎన్టీఆర్ తన సొంత బేనర్ మీద తీశారు.
తండ్రి పాత్ర పోషించిన చిత్తూరు నాగయ్య పాదాలు నొక్కుతూ ఎన్టీఆర్ పాడే ఈ పాట ఘంటసాల అసామాన్య ప్రతిభ వల్ల ఒక్క క్షణం కూడా చెవి మరల్చకుండా వినేలా చేస్తుంది. మనసును భక్తి తరంగాలలో నింపుతుంది. ఇదే సినిమాలోని ‘అమ్మా అని పిలిచినా’ పాట కూడా పెద్ద హిట్. ఇటీవల ఈ సినిమా రీమేక్ కూడా అయ్యింది. ఏమైనా తెలుగు పల్లెటూళ్లల్లో గుడి తలుపులు తీయాలంటే ఇప్పటికీ ఎప్పటికీ ‘కృష్ణా ముకుందా మురారీ’ మొదటి గంటగా మోగాల్సిందే.చిత్రం: పాండురంగ మహత్యం (1957)
సంగీతం: టి.వి.రాజు
రచన: సముద్రాల రాఘవాచార్య
గానం: ఘంటసాల