మనవాళ్లూ రిస్క్ చేస్తున్నారు!
తెలుగు చానెళ్లలో ఇప్పటి వరకూ బోలెడన్ని గేమ్ షోలు వచ్చాయి. అయితే అవి ఎప్పుడూ వినోదాత్మకంగానే ఉండేవి తప్ప సాహసోపేతంగా ఉండేవి కాదు. సరదా సరదా ఆటలు, చిన్న చిన్న పోటీలు మాత్రమే ఉండేవి తప్ప హిందీ, ఇంగ్లిషు షోలలో మాదిరిగా రిస్కీగా ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మనవాళ్లు కూడా రిస్క్ తీసుకోవడం మొదలుపెడుతున్నారు.
మన వీక్షకులు ఈ మధ్య ఫియర్ ఫ్యాక్టర్, ఖత్రోంకే ఖిలాడీ లాంటి అడ్వెంచరస్, డేంజరస్ ఎంటర్‌టైన్‌మెంట్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే తెలుగు చానెళ్ల నిర్వాహకులు వాటికి ముహూర్తం పెట్టారు. ఇప్పటికే ఖత్రోంకే ఖిలాడీ షోని ‘సాహస వీరులు’గా జెమినీ చానెల్ వారు డబ్ చేసి ప్రసారం చేస్తున్నారు. జీ తెలుగు వాళ్లయితే ‘వన్’ అనే వెరైటీ షోకి తెర తీశారు. చీకటి గదిలో రకరకాల జీవుల్ని పట్టుకుని గుర్తించడం, నీటి తొట్లలో అడుగున ఉన్న వస్తువుల్ని సేకరించడం వంటి రిస్కీ రౌండ్లు ఉన్నాయి ఈ షోలో. ఉత్కంఠభరితంగా ఉండటంతో బాగానే ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ముందు ముందు అన్ని చానెళ్లవారూ ఇలాంటి షోలు మొదలు పెడతారేమో చూడాలి!