క్లబ్బులో కామెడీ కరువవుతోంది!
టీవీక్షణం
కొంతమంది పాపులర్ నటీనటుల్ని ఒక్కచోట చేర్చడం, వారితో స్కిట్లు వేయించి ప్రేక్షకుల పెదాల మీద నవ్వుల్ని పూయించడం అన్ని చానెళ్లూ చేసేదే. హిందీలో ఇలాంటి కార్యక్రమాలు విరివి అయిపోయిన తర్వాత తెలుగు చానెళ్లు కూడా ఆ దిశగా అడుగులు వేశాయి. ఆ క్రమంలో జీ తెలుగులో మొదలైనదే ‘కామెడీ క్లబ్’. సీనియర్ టీవీ, సినీ కళాకారులు కొందరు ఒకచోట చేరి చలోక్తులతోటీ, తమ హావభావాలతోటీ ప్రేక్షకులను నవ్వించేందుకు చేసే ప్రయత్నమే ఈ కార్యక్రమం.
మొదట్లో చక్కగా సాగిన ఈ కార్యక్రమం ఇప్పుడు కాస్త డల్ అయినట్టుగా అనిపిస్తోంది. సుమ, ఝాన్సీ, ప్రీతీనిగమ్, హేమ, హరిత, శ్రీరామ్, కృష్ణకౌశిక్ లాంటి సీనియర్ నటీనటులు బోలెడంతమంది పాల్గొంటున్నా పస లేని స్క్రిప్ట్, పాత వాసన వేసే జోక్స్ కాస్త బోరు కొట్టిస్తున్నాయీ మధ్య. ఎనర్జిటిక్ యాంకర్ ప్రదీప్ తన టాలెంట్‌తో నెట్టుకొస్తున్నాడేమో అనిపించక మానదు ప్రోగ్రామ్ చూస్తే. అలాగని మరీ తీసి పారేయాల్సిన షో కూడా కాదు. ఇప్పుడే జాగ్రత్తపడి కాస్త క్వాలిటీని పెంచితే కచ్చితంగా నిలబడే కార్యక్రమం ఇది!