గాయక సార్వభౌముడు
కృష్ణమ్మ గలగలలతో పాటే ఇక్కడ సరిగమలూ వీనుల విందు చేస్తాయి. ఇక్కడ పుట్టి పెరిగిన ఎందరో గాయనీ గాయకులకు కృష్ణమ్మ గలగలలే సరిగమలు మప్పి ఉంటాయి. కృష్ణాతీరానికి చెందిన వారిలో ‘గాయక సార్వభౌమ’ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు చిరస్మరణీయుడు. కృష్ణాజిల్లా శ్రీకాకుళంలో 1883లో జన్మించిన పారుపల్లివారు త్యాగరాజస్వామి శిష్యపరంపరకు చెందినవారు.
త్యాగరాజస్వామి ప్రశిష్యుడైన సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి వద్ద గురుకుల పద్ధతిలో సంగీతాన్ని అభ్యసించిన పారుపల్లివారు విద్యార్థి దశలోనే కచేరీలు చేసేవారు. తిరువయ్యూరులోని త్యాగరాజ ఆరాధనోత్సవాలలో తొలిసారి వయోలిన్ వినిపించారు. పన్నెండేళ్ల సంగీతాభ్యాసం తర్వాత విజయవాడ చేరుకుని గురుకులాన్ని స్థాపించారు.
కులమతాలకు అతీతంగా ఎందరో విద్యార్థులకు సంగీతం నేర్పించారు. నిరుపేద విద్యార్థులకు భోజన, వసతులు సమకూర్చి మరీ సరిగమలను బోధించారు. సంగీత దిగ్గజం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణతో పాటు అన్నవరపు రామస్వామి, నల్లాన్‌చక్రవర్తుల కృష్ణమాచార్యులు, నేతి శ్రీరామశర్మ, టీకే యశోదాదేవి, అరుంధతి వంటి వారెందరో పారుపల్లివారి శిష్యులే. నండూరి సుబ్బారావు రాసిన ఎంకి పాటలకు స్వరకల్పన చేసిన ఘనత పారుపల్లివారికే దక్కుతుంది. త్యాగరాజ ఆరాధనోత్సవాలతో పాటు తన గురువు సుసర్లవారి ఆరాధనోత్సవాలను కూడా పారుపల్లివారు క్రమం తప్పకుండా నిర్వహించేవారు. ఆయన గతించి ఆరు దశాబ్దాలైనా, ఇప్పటికీ ఆయన శిష్యులు ఈ ఉత్సవాలను నిర్వహిస్తుండటం విశేషం.
- శివాజీ శీతాల