పిన్‌వీల్ శాండ్‌విచ్
కావలసినవి: పెద్ద సైజు బ్రెడ్ స్లయిసెస్ - 3, కొత్తిమీర పేస్ట్ - 2 చెంచాలు, క్యారెట్ తురుము - పావు కప్పు, తురిమిన చీజ్ - పావు కప్పు, ఉడకబెట్టిన బంగాళదుంప - 1, తరిగిన పాలకూర - పావు కప్పు, నల్ల మిరియాల పొడి - 1 చెంచా, జీలకర్ర పొడి - అరచెంచా
తయారీ: ఉడికించిన బంగాళాదుంపను తొక్కు తీసేసి, మెత్తగా చిదమాలి. బ్రెడ్ ముక్కల అంచులను తీసేసి, చపాతీ కర్రతో వాటిని వెడల్పుగా చేసుకోవాలి. తర్వాత వాటన్నిటి మీద కొత్తిమీర పేస్ట్ రాయాలి. ఆపైన బంగాళాదుంప పేస్ట్‌ని పరవాలి. తర్వాత క్యారెట్ తురుము, చీజ్, జీలకర్ర పొడి, మిరియాల పొడిని ఒకదాని పైన ఒకటిగా వేయాలి. దానిపై మరో బ్రెడ్ ముక్కను పెట్టి దానిపై కూడా అన్నిటినీ పరవాలి. పైన ఒక బ్రెడ్ స్లైస్ పెట్టి.... మొత్తాన్నీ రోల్‌లాగా చుట్టాలి (ఫిల్లింగ్స్ మరీ ఎక్కువైతే లావుగా ఉండి రోల్ అవ్వడం కష్టమవుతుంది. కాబట్టి పల్చగా ఉండేలా చూసుకోవాలి).
తడి చేత్తో అంచుల్ని మూసేసి, వ్యాక్స్ పేపర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. అరగంటలో గట్టిగా అవుతుంది. అప్పుడు బయటికి తీసి, పేపర్‌ని తొలగించాలి. ఆపైన చాకుతో రోల్‌ను కావాల్సిన సైజులో ముక్కలుగా చేసుకోవాలి. టమాటో సాస్ లేదా చిల్లీ సాస్‌తో తింటే బాగుంటాయి. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్లు లోపలి ఫిల్లింగ్‌ను మార్చుకోవచ్చు. కావాలంటే బేక్ కూడా చేసుకోవచ్చు.