అండగా ఉంటానన్న ఆ అన్నయ్య ఎక్కడున్నాడు? | Raksha Bandhan special story | Sakshi
Sakshi News home page

అన్నాయం ఆపండి ప్లీజ్

Published Sun, Aug 26 2018 2:26 AM | Last Updated on Tue, Nov 6 2018 4:13 PM

Raksha Bandhan special story - Sakshi

రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములకైనా, స్నేహితుల్లో, బంధువుల్లో ఉన్న అన్నదమ్ములకైనా తమ అక్క చెల్లెళ్లకు అన్యాయం జరిగినప్పుడు కలిగే బాధ... ఇంకో ఆడపిల్ల విషయంలో ఎందుకు అనిపించడం లేదు? అన్నా! ఇది అన్యాయం కాదా?

రాఖీ పండుగరోజు చెల్లెమ్మ రాఖీ కడితే, ‘అండగా ఉంటానమ్మా!’ అనే ఒక ధైర్యాన్నిచ్చేస్తారు అన్నలు.  ఇష్టంగా ఒక చిన్న బహుమతిని కూడా ఇచ్చేస్తారు. కానీ ఎల్లప్పుడూ అండగా ఉంటున్న అన్నయ్యలు ఎందరు? ఎంత మంది చెల్లెళ్లు ఈరోజు ఈ సమాజంలో ఇబ్బంది పడుతున్నారు! అండగా ఉంటానన్న ఆ అన్నయ్య ఎక్కడున్నాడు?

రక్షాబంధన్‌... రాఖీ... అదొక అన్నాచెల్లెళ్ల పండుగ. ఒక పండుగ అనే కంటే పవిత్రమైన ప్రమాణాల వేడుక. అంటే ఒక ముఖ్యమైన బాధ్యతను ప్రతినిత్యం గుర్తు చేసుకోవచ్చునేమో. రాఖీ ఎలా పుట్టింది? పురాణాలు ఏం చెబుతున్నాయి? మొదటి రాఖీ కట్టిన ఆమె ఏ సంబంధం ఉన్న అతనికి కట్టింది, దాని ఫలితమేంటి? అనే చారిత్రక అంశాలు తెలిసినా, తెలియకపోయినా రాఖీ అంటే రక్షణ కల్పించే ఒక నమ్మకం. మతాలకు అతీతంగా అక్కా చెల్లళ్లు అన్నదమ్ములకు రాఖీలు కడతారు. ఒక పండుగ వాతావరణంతో ఆ రోజంతా గడుస్తుంది. బుడిబుడి అడుగులు వేసుకుంటూ చిట్టిచిట్టి చేతులతో వచ్చీరాని ముడులు వేసే వయసులో అన్న అల్లరిగా గెంతుతూ కళ్ల ముందే ఉంటాడు.

నూనూగు మీసాల అన్నయ్య తను దాచుకున్న డిబ్బీ పైసలలోంచి చెల్లెలికి ఒక రంగుల పుస్తకమో, బొమ్మలో కొనిచ్చినప్పుడు కంటి నిండా కనిపిస్తాడు. అక్క పెళ్లికి ముందు జరిగే ఆఖరి రాఖీ పండుగ రోజున తనకిష్టమైన నెమలికంఠం రంగు జరీ చీర కొనిచ్చి ఆజన్మాంతం నీకు రక్షణ కల్పిస్తానని ప్రమాణం చేసినప్పుడు చెట్టంత మనిషిలా, నిలువెత్తు భరోసాలా కనువిందు చేస్తాడు. అదేంటో బావమరిదిగా మారినా, ఇంటి కొడుకుగా నిలబడాల్సి వచ్చినా ఆ అన్న మాయమౌతాడు. ఏది ఏమైనా తన అక్క లేక చెల్లి మెట్టినింటే ఉండాలనుకుంటాడు. తన ఇంటి ఆడబిడ్డ భర్త దగ్గర దెబ్బలు తింటున్నా బావకు ఆర్థికంగా సహకరిస్తే అక్కను బాగా చూసుకుంటాడని నమ్ముతాడు. కానీ అన్నగా తమ్ముడిగా కనుమరుగవుతుంటాడు. మళ్లీ ఏడాది రాఖీనాడు కనిపిస్తాడు. అన్నగా తమ్ముడిగా రాఖీలు కట్టించుకునే వాడిగా.

ఈ అన్నదమ్ముల్ని నిర్వీర్యం చేసేదేమిటి? తమ అక్కలకు చెల్లెళ్లకు తమ నుంచి ఏ కష్టం రాకుండా చూసుకుంటే సరిపోతుందా? అదీ ఎన్నోసార్లు కష్టతరమే. రోజూ సొంత ఇంట్లోనే వివక్షకు గురవుతున్న చెల్లెళ్లకు, ఆఫీసుల్లో చిల్లర చూపులకు బలవుతున్న అక్కలకు, రోడ్ల మీద, మెట్టినిళ్లలో అవమానాలకు, అఘాయిత్యాలకు బలవుతున్న ఆడబిడ్డలకు ఈ అన్నదమ్ములు ఏమీ చేయలేరా? వీళ్లు చేయాల్సింది నిరంతరం ఇంటి ఆడవారి వెన్నంటే ఉండి రక్షించడం కాదు, వారికి ఆత్మరక్షణ పద్ధతులను నేర్పించడమే కాదు, ఈ తోడబుట్టిన అన్నదమ్ములందరూ ప్రతి మగాడికీ తెలిసేలా తమను తాము సంస్కరించుకోవడం. ఈ బంధాల కన్నా స్త్రీలు భయపడకుండా తిరగగలిగే స్వేచ్ఛనివ్వడమే గొప్పది.

రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములైనా, స్నేహితుల్లో, బంధువుల్లో ఉన్న అన్నదమ్ములైనా తమ అక్క చెల్లెళ్లకు అన్యాయం జరిగినప్పుడు కలిగే బాధ ప్రతి ఆడపిల్లకూ ఎందుకు వర్తించడం లేదు? ఇటీవల సంచలనం సృష్టించిన చలనచిత్రం క్లైమాక్స్‌లో మోసం చేసిన ప్రేయసిని ప్రియుడు హింసిస్తున్న సన్నివేశాలను దాదాపు ప్రతి యువకుడూ ఈలలతో అరుపులతో రాక్షసానందం పొందుతూ చూశాడు. వీళ్లందరికీ ఇళ్లల్లో ఆడపడుచులు ఉన్నా లేకపోయినా సాటి మనిషిగా స్త్రీని గుర్తించి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేదెవరు? తప్పుకి లింగభేదం ఉండదు. దానికి చట్టం ఉంది. ఎప్పుడైతే స్త్రీ ఆత్మరక్షణ పద్ధతులను భయం వల్ల నేర్చుకుంటుందో అప్పుడు ఆ సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్టే! ఆ ధైర్యాన్ని నిర్భయాన్ని మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఈ అన్నలు తమ్ముళ్లు అనేవాళ్లు తమ తోటి స్నేహితులతో కలసి స్త్రీ సమాజానికి అభయహస్తం అందించాలని ఎందుకు చర్చించుకోలేకపోతున్నారు?

ఒక అఘాయిత్యమో, అత్యాచారమో జరిగిన తర్వాత ఆ నేరం చేసిన వాడిని ఆమె అన్న లేక తమ్ముడు వెళ్లి శిక్షించడం లేదు. అసలు అటువంటి పరిస్థితులు రాకుండా పురుషులందరూ కలసి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని ఒక ఎరుక ఉండాలి. తమ వర్గంలో ఎందుకిన్ని నేరాలు జరుగుతున్నాయని చర్చలు జరపాలి. అడపాదడపా కళాశాలల్లో జరిగే చర్చోపచర్చల్లో మగపిల్లలు మాట్లాడే మాటలు, వారి వాదన చూస్తుంటే భయం కలగక మానదు. ‘ఆడపిల్లలు తక్కువ తీసిపోరు. మోసం చేస్తారు. కురచ దుస్తులు ధరిస్తారు. అటువంటప్పుడు అఘాయిత్యాలు జరగక మానవు’ అన్న ఆలోచనలు, ఆ ధోరణి యువకుల్లో చూస్తుంటాం. అవును! ఆడపిల్లలూ తప్పులు చేస్తారు. ఎందుకంటే దేవతలు కారు. మనుషులు. ఆడపిల్లల్లో కూడా చదువు అబ్బని మొద్దులుంటారు. ఘరానా మోసాలు చేసేవారు ఉంటారు. నేరాలు చేసేవారు ఉంటారు. అచ్చు మగవాళ్లలాగానే! ప్రతి పురుషుడూ నీచుడు కానట్టే ప్రతి ఆడపిల్లా మంచిది కాకపోవచ్చు. అయితే, ఆమె తప్పు చేసిందని ఆమెకు ‘తగిన‘ శాస్తి చేయడానికి ఏ పురుషుడికీ హక్కు లేదు.

ఎవరూ ఎవరికీ నేరం చేసి గుణపాఠం నేర్పాల్సిన పని లేదు. నిజానికి నిర్భయ ఘట్టం ఈ ‘గుణపాఠం’ అనే ఆలోచనలోంచే అంతటి విషాదం జరిగిందని చెప్పవచ్చు. ఆమె అర్ధరాత్రి స్నేహితుడితో ఎందుకు బయట తిరగాలి? అనే దానికి ఆ నేరస్తులే సొంత పరిష్కారం సృష్టించుకుని ఆమెను అతి కిరాతకంగా, భయానకంగా అత్యాచారం చేసి చంపేశారు. ఆ సందర్భంలో వేలాదిగా యువతీ యువకులు ఢిల్లీలో నిర్భయకు మద్దతుగా నిలిచారు. పోలీసు దెబ్బలు తిన్నారు. అయితే కొన్ని రోజులకే ఆ ఆవేశమంతా చల్లారిపోయింది. పదేపదే పల్లెల్లో, మురికివాడల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో అత్యాచారం, లైంగికదాడి, ఆకతాయితనం అరికట్టడంపై సదస్సులు నిర్వహిస్తుండాలి. ప్రతినిత్యం పురుషులు ఒకరికొకరు గుర్తు చేసుకుంటూ ఉండాలి. సాటి మనుషులను ఏ రకమైన హింసకు గురిచేయకుండా గౌరవించాలన్న స్పృహ ఉండాలి. ఇతరుల్లో పెంచాలి. సాధారణంగా ఇలాంటి అన్యాయాలు, అక్రమాలు జరిగినప్పుడు పూర్వం ‘నీకు అక్కా చెల్లెళ్లు లేర్రా!’ అని అంటుండేవారు. ఇప్పడైతే ‘ఇదే నీ అక్కనో చెల్లినో అయితే చేస్తావా?’ అంటున్నారు. లేదా ‘ప్రతి స్త్రీలో అమ్మతనం ఉంటుంది కాబట్టి అమ్మాయిలను ఎలా అవమానిస్తావు’ అనో, ‘స్త్రీని దేవతగా పూజించే ఈ దేశంలో ఆడదాన్ని ఎలా హింసిస్తార’నో అంటుంటారు.

వాస్తవానికి ప్రతి పురుషుడిలో తండ్రిని, అన్నని చూడనట్టే ప్రతి స్త్రీలో అమ్మను చూసి గౌరవించడం అనేది జరగదు. స్త్రీ ముందుగా ఒక మనిషి. ఆ తర్వాతే ఆమె ఒకరికి కూతురు, అక్కా చెల్లెలు వగైరా. స్త్రీని గౌరవించడానికి, ఆమెపై అన్యాయం జరపకుండా ఉండటానికి ఆమెలో తోబుట్టినదాన్ని వెతుక్కోవాల్సిన పనిలేదు. ఆమెను మనిషిగా చూస్తే చాలు. ఒక పురుషుడు తనను ఎలా గౌరవించాలని, సమానంగా చూడాలని కోరుకుంటాడో స్త్రీతో అదే విధంగా నడుచుకుంటే చాలు. ఇవన్నీ ఇలా ఉంటే అన్నదమ్ములు, తండ్రుల తర్వాతి స్థానం తీసుకుని ఇంట్లోని ఆడవారిపై జులుం చేస్తుంటారు. ఎటువంటి బట్టలు వేసుకోకూడదు దగ్గర నుంచి ఇంటికి ఎప్పుడు తిరిగి రావాలి వరకు వీరు ఆంక్షలు విధిస్తుంటారు. అది వారి ధర్మంగా ఒంటబట్టించుకుంటారు. వీళ్లే కూతుళ్లకూ కొడుకులకూ వారి వారి కర్తవ్యాలుగా ఈ వివక్షను పెట్టి పెంచి పోషిస్తుంటారు. దీనిని ఏదో ఒక తరంలో అన్నదమ్ములే అరికట్టాలి. చదువుకున్న కుటుంబాలలో కట్నం ఆచారాల విషయంలో కాకపోయినా, కనీసం ఆడపిల్లల పెంపకంలో చాలా మార్పును కనబరుస్తున్నారు.

ఏది ఏమైనా ఒక పండుగ వస్తుందంటే మనం ఇల్లు శుభ్రం చేసుకుని ఆ రోజుకు మాత్రం అతి భక్తి నటిస్తూ ఉంటామో, లేదా ఏ స్వాతంత్య్ర దినోత్సవం నాడో, గణతంత్ర దినోత్సవం నాడో దేశభక్తిని సామాజిక మాధ్యమాల్లో మన పేర్ల తరఫున నింపేస్తుంటామో అదేవిధంగా ఈ రాఖీ పండుగ కూడా మిగిలిపోవడం విషాదం. ఆ రోజు అన్నలు తమ్ముళ్లు తమ అక్కలను చెల్లెళ్లను సంరక్షించుకుంటామని వారికి భరోసా ఇచ్చే కంటే ముందే వారివల్ల ఏ ఆడపిల్లకూ హాని జరగదని ప్రమాణం చేసుకోవాల్సిన అవసరం కూడా అంతే ఉంది. రక్షాబంధన్‌ వేడుకను వర్ణించడానికి వాడే అన్నాచెల్లెళ్ల బంధం, ఆ పవిత్రతను నిజమైన అర్థంలో సంపూర్ణంగా జరుపుకోవాలని ఆశిద్దాం. రక్షణ కోసం అన్నదమ్ముల అవసరం రాని రోజు కోసం ఎదురు చూద్దాం.

మొదటి రాఖీ కట్టిన ఆమె ఏ సంబంధం ఉన్న అతనికి కట్టింది, దాని ఫలితమేంటి? అనేది తెలిసినా, తెలియకపోయినా రాఖీ అంటే రక్షణ కల్పించే ఒక నమ్మకం.

ఇదీ అక్కాచెల్లెళ్ల పరిస్థితి
మహిళలకు భద్రత కరువైన దేశాల జాబితాలో భారత్‌ మొదటి స్థానానికి చేరుకోవడం తాజా పరిణామం. ‘నిర్భయ’ సంఘటన తర్వాత దేశంలోని పరిస్థితులు మరింతగా దిగజారాయి. మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయి. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో గత ఏడాది విడుదల చేసిన లెక్కల ప్రకారం...

1ని. 39 నేరాలు దేశంలో మహిళలపై ప్రతి నిమిషానికి 39 నేరాలు జరుగుతున్నాయి.
83% నేరాలు - గత దశాబ్ద కాలంలో... అంటే, 2007–17 కాలంలో మహిళలపై నేరాలు 83% పెరిగాయి.
25 లక్షలకు పైగా ఇదే దశాబ్ద కాలంలో మన దేశంలోని మహిళలపై 25 లక్షలకు పైగా నేరాలు జరిగాయి.
11% గడచిన ఏడాది వ్యవధిలోనే మహిళలపై అత్యాచారాలు 11.5 శాతం పెరిగాయి.
25% గడచిన ఏడాది కాలంలో మహిళలపై లైంగిక దాడులు 25 శాతం పెరిగాయి.
19% గడచిన ఏడాది కాలంలో మహిళలు, బాలికల కిడ్నాప్‌లు 19 శాతం పెరిగాయి.
దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాల కేసులు ప్రతి గంటకు నాలుగు చొప్పున నమోదవుతున్నాయి.


నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో విడుదల చేసిన లెక్కలన్నీ దేశంలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా వెల్లడించినవి మాత్రమే. దేశంలో వాస్తవంగా మహిళలపై జరుగుతున్న నేరాలతో పోలిస్తే, పోలీస్‌ స్టేషన్లలో నమోదవుతున్న కేసులు నామమాత్రమేనని, నమోదు కాని సంఘటనలు 99 శాతానికి మించే ఉంటాయని గత ఏడాది నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే నివేదిక వెల్లడించింది. దేశంలోని అక్క చెల్లెళ్ల పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఈ లెక్కలు చాలవూ!

రాఖీరోజు అన్నలు తమ్ముళ్లు తమ అక్కలను చెల్లెళ్లను సంరక్షించుకుంటామని వారికి భరోసా ఇచ్చే కంటే ముందే వారివల్ల ఏ ఆడపిల్లకూ హాని జరగదని ప్రమాణం చేసుకోవాల్సిన అవసరం కూడా అంతే ఉంది.

– మానస ఎండ్లూరి
 

రాఖీ విశేషాలు
రక్షాబంధన్‌ ఆచారం మన దేశంలో ప్రాచీనకాలం నుంచే ఉంది.  పురుషులు యుద్ధాలకు బయలుదేరేటప్పుడు వారి విజయం కోసం మహిళలు పూజలు చేసేవారు. పూజల తర్వాత పురుషుల నుదుట వీరతిలకం దిద్ది, ముంజేతికి నూలుదారాలతో అల్లిన సన్నని తాడును రక్షాబంధనంగా కట్టేవారు.

బలి చక్రవర్తి స్వర్గంపై దండెత్తి, ఇంద్రుడిని ఓడించి స్వర్గాన్ని కైవసం చేసుకున్నాడు. స్వర్గం రాక్షసరాజ్యంగా మారింది. పదవీచ్యుతుడైన తన భర్తకు విజయం దక్కేట్లు చూడాల్సిందిగా శచీదేవి విష్ణువును కోరింది. విష్ణువు ఆమెకు నూలుదారాలతో అల్లిన తాడును ఇచ్చాడు. ‘ఈసారి యుద్ధానికి వెళ్లే ముందు నీ భర్త ముంజేతికి ఈ రక్షాబంధనాన్ని కట్టు. తప్పక విజయం సాధించగలడు’ అని చెబుతాడు. బలి చక్రవర్తిపై తిరిగి యుద్ధానికి సిద్ధపడిన ఇంద్రుడికి శచీదేవి విష్ణువు ఇచ్చిన రక్షాబంధనాన్ని కడుతుంది. ఇంద్రుడు బలిచక్రవర్తిని ఓడించి, తిరిగి స్వర్గాధిపత్యం సాధిస్తాడు. ఇది భవిష్యపురాణంలోని గాథ.

వామనావతారంలో వచ్చిన విష్ణువు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసిన కథ తెలిసిందే కదా! మహాభక్తుడైన బలిచక్రవర్తి ఆ సమయంలో విష్ణువును నిత్యం తన వద్దనే ఉండాలంటూ కోరుకుంటాడు. బలి కోరిక మేరకు విష్ణువు పాతాళంలోనే ఉండిపోతాడు. లక్ష్మీదేవి వైకుంఠంలో ఒంటరిగా మిగిలిపోతుంది. తన భర్తను తిరిగి తనతో తీసుకుపోవడానికి లక్ష్మీదేవి స్వయంగా వచ్చి బలి చక్రవర్తికి రక్షాబంధనం కడుతుంది. కానుకగా ఏం కావాలని బలి అడిగినప్పుడు తన భర్తను తనతో పాటే వైకుంఠానికి పంపమని కోరుతుంది. బలి సరేననడంతో పతీసమేతంగా లక్ష్మీదేవి వైకుంఠానికి చేరుకుంటుంది. ఈ గాథ భాగవతంలోను, విష్ణుపురాణంలోను ఉంది.

ఆయువు తీరినవారి ప్రాణాలను హరించడంలోను, నరకానికి వచ్చిన పాపుల పాప విచారణ చేసి, వారికి శిక్షలు విధించడంలోను నిరంతరం తలమునకలుగా ఉండే యమధర్మరాజు ఒకసారి పన్నెండేళ్ల పాటు తన చెల్లెలు యమునను చూడటానికి వెళ్లలేకపోయాడు. అన్నను చూసి ఏళ్లు గడుస్తున్న కొద్దీ యమున దిగులుతో కుంగిపోసాగింది. గంగ వద్ద ఒకసారి ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. అప్పుడు గంగ యముడి వద్దకు వెళ్లి యమున బాధను వివరిస్తుంది. అప్పుడు యముడు నరకాన్ని వీడి బయలుదేరి యమున వద్దకు వస్తాడు. ఇంటికి వచ్చిన అన్నకు యమున షడ్రసోపేతమైన భోజనం వడ్డించి, రక్షాబంధనాన్ని కడుతుంది. కనీసం ఏడాదికి ఒకసారైనా తనను చూడటానికి రావాలని కోరుకుంటుంది.

అలెగ్జాండర్‌ భార్య రుక్సానా కేకయ రాజు పురుషోత్తముడికి, చిత్తోడ్‌ రాణి కర్ణీదేవి మొఘల్‌ చక్రవర్తి హుమాయూన్‌కు రక్షాబంధనాలను పంపి, వారి సాయం కోరినట్లుగా చారిత్రక గాథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే, వీటికి స్పష్టమైన ఆధారాలు ఎక్కడా లేవు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement