పోరాట పటిమ... రుద్రమ! | rani rudramadevi World Women's Day | Sakshi
Sakshi News home page

పోరాట పటిమ... రుద్రమ!

Published Sun, Mar 6 2016 12:35 AM | Last Updated on Sun, Sep 3 2017 7:04 PM

పోరాట పటిమ... రుద్రమ!

పోరాట పటిమ... రుద్రమ!

 రుద్రమదేవి... దక్షిణ భారతదేశాన్ని ఏలిన ఓ మహా సామ్రాజ్ఞి. అందుకు గుర్తుగా వరంగల్ కోట శిథిలాలు, శాసనాలు, కొన్ని కట్టడాలు - తవ్వించిన చెరువులు, హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద ఓ విగ్రహం.ఇంకా అయితే తెలుగు వాచకంలోనో, చరిత్రలోనో ఒక పాఠం. గూగుల్ సెర్చ్‌లో మహా అయితే రెండు పేజీల సమాచారం.ఇంతే అయితే ‘రుద్రమదేవి’ని ఈ ప్రపంచ మహిళా దినోత్సవం నాడు తలుచుకోవలసిన అవసరం ఉండేది కాదు. తనకి స్త్రీవాదం తెలియకపోయినా పురుషాధిక్య ప్రపంచం ఎలా ప్రవర్తిస్తుందో జీవితమంతా తెలుసుకుంటూనే ఉంది.
 
 ఆడపిల్ల పుడితే ఖర్చు పెరిగిందని ఏడ్చే తల్లిదండ్రులున్న ఈ సమాజంలో - తన శత్రువుల మీద పగ తీర్చుకునే ఓ మగబిడ్డ కోసం ఎదురుచూస్తున్న గణపతిదేవ చక్రవర్తి (తన తండ్రి), ఆమె పుట్టినప్పుడు ఎంత బాధపడి ఉంటాడు?తాను ఎదుగుతున్నప్పుడు తండ్రి బాధ, నిరాశ ఏదో క్షణాన చవిచూసే ఉంటుంది రుద్రమదేవి.ఆ వేదనని దిగమింగుకుని - తండ్రిని బంధించిన దేవగిరి సేనలని ఒకానొకనాడు జయించింది. దేవగిరి ప్రభువు మహదేవుడు కాళ్ల బేరానికొచ్చేంత ఎదిగింది.  
 
 ఓ మనిషికి అయినా తను తనలా బతకలేకపోవడాన్ని మించిన శాపం ఉండదు. కాని అత్యంత సుకుమారమైన, ఆనందకరమైన స్త్రీ వేషధారణ పక్కనబెట్టి, పురుష వేషంలో రుద్రదేవుడిగా పాలించాల్సిన స్థితి వచ్చింది. అలాంటి క్లిష్టమైన మానసిక ఘర్షణ ఎవరైనా ఎదుర్కొని ఉంటారా?!గుండె ధైర్యానికి స్త్రీ పురుష భేదం లేదు. పైన ధరించే కవచాలో, వస్త్రాలో స్త్రీయా పురుషుడా అని నిర్ణయించవచ్చు.13వ శతాబ్దపు మధ్యయుగం అంటే  ఆడవాళ్లని పరిచారికలుగానో, పడకటింటి సుఖంగానో చూసే కాలం.
 
 ఒకవైపు రుద్రమదేవి పరిపాలనలోకి రావడానికి ముందు - ఢిల్లీ సామ్రాజ్యాన్ని రజియా సుల్తానా నాలుగేళ్లపాటు పరిపాలించి, ఘోరంగా విఫలమయ్యింది.మరోవైపు పల్నాటి యుద్ధానికి కారణం - నాయకురాలు నాగమ్మే అని జనం మొత్తుకుంటున్నారు.‘నస్త్రీ స్వాతంత్రమర్హతి’ అని మనుధర్మాలు చెవిలో పోరు -ఇంట్లోనే భార్య పెత్తనం భరించలేని మగ మనస్తత్వాలు నేటి ఆధునిక కాలంలో కూడా ఉన్నాయి. అలాంటిది 800 ఏళ్ల క్రితం.. 40 సంవత్సరాల పాటు రుద్రమదేవి ఓరుగల్లు కేంద్రంగా దక్షిణ భారతదేశాన్ని పాలించిందంటే - అనునిత్యం ఎలాంటి సమస్యలు, సంఘర్షణలు ఎదుర్కొని ఉంటుంది?
 
 పెళ్లయితే ఆడపిల్లకి ఇంటిపేరు మారిపోతుంది. కాని రుద్రమదేవికి భర్త నిడదవోలు రాజు చాళుక్య వీరభద్రుడు అయినా, ఒక్కనాడు కూడా చాళుక్య రుద్రమదేవి కాలేదు. ఆనాడు - ఈనాడూ కాకతీయ రుద్రమదేవే. తన అస్తిత్వాన్ని ఎలా నిలబెట్టుకుంటూ వచ్చిందో? మగాడి పరిపాలనకి, ఆడదాని పరిపాలనకి ఖచ్చితంగా తేడా ఉంటుంది.
 
 యుద్ధాల కన్నా జీనవ పరిస్థితులు మెరుగుబడేలా చేసింది రుద్రమదేవి. కాకతీయ రాజవంశం తవ్వించిన చెరువులతో పాటు ఏ కాలంలో ఎలాంటి పంటలు పండాలో సూచించే వ్యవసాయ శాస్త్రం అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఆ రోజుల్లోనే ప్రసూతి వైద్యశాలలు ఏర్పరిచింది. ఆడవాళ్లపై అత్యాచారం చేస్తే బీజచ్ఛేదం చేయించేది. ఏళ్ల తరబడి విచారణలు, సాక్ష్యాలు, మానవతావాదం పోరాటాల గురించి ఆగిందే లేదు.రాజ్యాధికారం కోసం భర్త వేధించినా, సహించిందే తప్ప, లొంగలేదు. సంసారం కోసం దేశాన్ని తాకట్టు పెట్టలేదు.
 
 తండ్రిని ఎంతగా ప్రేమించి, గౌరవించిందంటే గణపతి దేవుడు చనిపోయినప్పుడు - తండ్రితో పాటు సహగమనానికి సిద్ధపడింది. (అది చూసి పొరబడ్డ తొలి తెలుగు చరిత్రకారుడు ఏకామ్రనాథుడి నుంచి విదేశీ యాత్రికుడు మార్కోపోలో వరకూ గణపతి దేవుడు, రుద్రమదేవి భార్యాభర్తలని తప్పుగా అర్థం చేసుకుని రాసినవాళ్లున్నారు)‘రుద్రమదేవి’ గురించిన రెండున్నర గంటల సినిమా తీసినా ఆవిడ గురించి చెప్పడానికి సరిపోలేదు. అలాంటిది రుద్రమదేవిని ఈ ఒక్క పేజీలో ఆవిష్కరించడం అంటే చాలా కష్టం. అయినప్పటికీ ఒక విషయం చెబుతున్నాను - ‘రుద్రమదేవి’ సినిమాలో ‘రుద్రమదేవి’ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే కొన్ని మాటలు రాశాను. ‘ఒక తల్లిపాలు తాగినవాళ్లు అన్నదమ్ములయితే - ఒకే నది నీళ్లు తాగేవాళ్లు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు కాలేరా?’
 
 ఈ మాట రుద్రమదేవి అందో లేదో తెలీదు. కాని మహారాణి అయినా ఒక అమ్మ కాబట్టి - ఆడది కాబట్టి ఖచ్చితంగా అనే ఉంటుంది. లేకపోతే శత్రుసైన్యాన్ని చంపి, వాళ్ల రక్తంతో బలికూడు తినే ఆ కిరాతకపు మధ్యయుగపు రోజుల్లో ఆగర్భ శత్రువు దేవగిరి మహదేవుణ్ని రుద్రమదేవి ఎందుకు క్షమించి ఉంటుంది?
 
 స్త్రీకి మాత్రమే ప్రత్యేకమైన సున్నితమైన మనసు, మాతృత్వ భావన అది. ‘ప్రపంచ మహిళా దినోత్సవం’ లాంటి వేడుక రుద్రమదేవి కాలంలో జరుపుకున్నారు. అదే దసరా తర్వాత వచ్చే కౌముదీ ఉత్సవం.ఆ శరత్కాలపు పౌర్ణమి రాత్రి ఆడవాళ్లకి కావల్సినంత స్వేచ్ఛావిహారం. మగవారు ఆ రోజు బయట తిరగడానికి వీల్లేదు.  ఆటలు, పాటలు, అలంకరణలు, వేడుకలు, ఏమైనా లేడీస్ నైటవుట్.
 
 అలా ఈ మహిళా దినోత్సవం రోజున అయినా ఆడవాళ్లని వేధించకుండా - వారి మనసుకి నచ్చినట్లు ఉండనివ్వగలరా? ఆ కౌముదీ ఉత్సవం నాడయినా - ఈ మహిళా దినోత్సవం నాడయినా - ఆడవాళ్లు ఏం కోరుకుంటారో నేను కొంత ఊహించగలను. వాళ్ల వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ ఇచ్చే స్వేచ్ఛ - వారి ఆనందానికి, సంతోషానికి అడ్డురాని కట్టుబాట్లు - వారి రక్షణకి ఆటంకం కలిగించని సామాజిక పెంపకం- ఈ లోకమంతా పచ్చగా - యుద్ధాలు, రక్తపాతాలు, ద్వేషాలు, హింసలు లేని - గలగల నవ్వుల ఓ రసమయ జీవన గీతాన్ని!!                      
     
 ఇంట్లోనే భార్య పెత్తనం భరించలేని మగ మనస్తత్వాలు నేటి ఆధునిక కాలంలో కూడా ఉన్నాయి. అలాంటిది 800 ఏళ్ల క్రితం.. 40 సంవత్సరాల పాటు రుద్రమదేవి ఓరుగల్లు కేంద్రంగా దక్షిణ భారతదేశాన్ని పాలించిందంటే - అనునిత్యం ఎలాంటి సమస్యలు, సంఘర్షణలు ఎదుర్కొని ఉంటుంది?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement