ఆ చూపు మర్చిపోలేను! | Remember of Girls | Sakshi
Sakshi News home page

ఆ చూపు మర్చిపోలేను!

Published Sun, Oct 25 2015 12:55 AM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM

ఆ చూపు మర్చిపోలేను! - Sakshi

ఆ చూపు మర్చిపోలేను!

జ్ఞాపకం
అమ్మాయిల గురించి కామెంట్ చేయడం అంటే నాకు భలే సరదా! అమ్మాయి కనిపిస్తే చాలు... వాళ్లు నొచ్చుకునేలా ఏదో ఒక కామెంట్ చేసేవాడిని. ఇది మంచి పద్ధతి కాదని ఒక్కరిద్దరు చెప్పినా ‘కొందరు యువకులు పుట్టుకతో వృద్ధులు’ అని పాడుతూ వారిని చాదస్తపుగాళ్లు, ఎంజాయ్ చేయడం రానివాళ్లంటూ వెక్కిరించేవాణ్ని. ఒకరోజు ఒక అమ్మాయి మా కాలేజీలో చేరడానికి వచ్చింది. నేను ఆమెను టీజ్ చేస్తుంటే... నా పక్కన ఉన్నవాళ్లు నవ్వడం ప్రారంభించారు.

అవమానంతో ఆ అమ్మాయి ముఖం ఎర్రబారింది. కళ్లనిండా నీళ్లతో అక్కడి నుంచి విసవిసా వెళ్లిపోయింది. పది నిమిషాల తరువాత వాళ్ల అన్నయ్యను తీసుకొచ్చి ‘వీడే నన్ను కామెంట్ చేసింది’ అని చూపించింది. వాళ్ల అన్నయ్య చాలా సన్నగా ఉన్నాడు. దీంతో నేను మరింత రెచ్చిపోయాను. ‘మైక్ టైసన్ మీ అన్నయ్య అని ఒకమాట చెబితే నేను అలా చేసేవాడినా?  మీ అన్నయ్య సిక్స్‌ప్యాక్ బాడీ చూస్తే చెమటలు పడుతున్నాయి’ అంటూ ఓవర్ యాక్షన్ చేయడం ప్రారంభించాను. ‘అలా మాట్లాడడం తప్పు తమ్ముడూ’ అన్నాడా అన్నయ్య శాంతంగా. ‘పోవోయ్’ అన్నాను నేను. నా తీరు అర్థమై పాపం ఆ అన్నాచెల్లెళ్లిద్దరూ మౌనంగా నిష్ర్కమించారు.
 
ఇది జరిగిన రెండు నెలల తరువాత ఓరోజు... మా వదినకు ఒంట్లో బాలేకపోతే, తనని తీసుకుని బైక్ మీద హాస్పిటల్‌కి బయలుదేరాను. ఒకచోట వర్షపు నీళ్లు, గుంతలు ఉండడంతో బైక్ స్లో చేశాను. అక్కడే కొందరు కుర్రాళ్లు ఉన్నారు. వాళ్లు మా వదిన్ని కామెంట్ చేయడం మొదలెట్టారు. పాపం మా వదిన సిగ్గుతో తల దించు కుంది. అది చూసి నా రక్తం మరిగి పోయింది. వెళ్లి అడగా లనుకున్నాను. కానీ వాళ్లు ఏడెనిమిది మంది ఉన్నారు. అందరూ కలిసి చావబాదుతారేమోనని భయమేసి వాళ్ల కామెంట్స్ విననట్టే నటించాను.

ఇదా నువ్వు చేసేది అన్నట్టుగా అప్పుడు మా వదిన నా వైపు చూసిన చూపు నేనిప్పటికీ మర్చిపోలేను. ఆరోజు కాలేజీలో ఆ అన్నయ్య బలం నా బలం ముందు దిగదుడుపు అనే గర్వంతో విర్రవీగాను. ఇప్పుడా బలం ఏమైంది? అంతకంటే పెద్ద బలం ముందు తోక ముడిచింది! ఆ దెబ్బకి నా పొగరు అణిగి పోయింది. ఆ తర్వాత మళ్లీ ఏ అమ్మాయినీ కామెంట్ చేయలేదు నేను.
- వీఆర్‌సీ, చిత్తూరు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement