నవ్వుల రేణు... నువ్వెలా ఉన్నావు?
అజ్ఞాతవాసం: అందంగా ఉన్న అమ్మాయిని చూస్తే కలిగే ఫీలింగ్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అందంగా నవ్వే అమ్మాయిని చూస్తే ఆ అనుభూతి కొన్నాళ్ల పాటు వెన్నాడుతుంది. చిన్నపిల్లల నవ్వులంటే ఇష్టపడని వారుండరు. కల్మషరహితంగా, స్వచ్ఛమైన నవ్వులు రువ్వే ఆ నటి అందుకే.. అందరికీ చాలా తొందరగా ఇష్టమైపోయింది. మరి ఇప్పుడు తెరనొదిలి ఎటు వెళ్లిపోయింది?
చిన్నితెర నుంచి సినీతెరకు ఎదిగిన నటీనటుల్లో అదృష్టానికి కొదవుంటుందేమో కాని ప్రతిభకు కొదవుండదు. ఎందుకంటే స్మాల్‌స్క్రీన్ మీద తమని తాము ఎంతో నిరూపించుకుంటేనే సిల్వర్‌స్క్రీన్ పిలుస్తుంది మరి. అలాంటి నటీమణుల్లో రేణుకా సహాని ఒకరు.
చిన్నితెరకు వన్నెలద్ది...
పాటలు చూడాలంటే చిత్రలహరి, సీరియల్ చూడాలంటే రామాయణం... ఇలా దూరదర్శన్ తప్ప మరో చానెల్ తెలియని రోజుల్లో... సురభి అనే సూపర్‌హిట్ షో ఒకటి టాక్ ఆఫ్ ద కంట్రీ అయింది. దూరదర్శన్‌లో 1993లో ప్రారంభమైన ఈ షో 2001 దాకా కొనసాగిందంటేనే ఆ షో ఎంత విజయం సాధించిందో అర్థమవుతుంది. అంతటి పాప్యులర్ షోకి సమర్పకురాలుగా వ్యవహరించింది రేణుకా సహాని. ఇంపైన నవ్వులతో ఇంటింటి ఇంతి అయిపోయింది. వీక్షకులు సొంత మనిషిలా భావించేంత ఆప్తురాలైపోయింది.
మహారాష్ట్రలో పుట్టిన రేణు... మితిబాయి కాలేజిలో ఆర్ట్స్ స్టూడెంట్. మరాఠీ సినిమాతో కెరీర్‌కు శ్రీకారం చుట్టిన సహాని... ఆ తర్వాతా ఎన్నో మరాఠీ సినిమాలు చేసింది. ఆమె తల్లి శాంతా గోఖలే రాసిన రిటా వెలింగ్కర్‌లోని రిటా అనే పాత్రతో తన తొలి మరాఠీ సినిమా చేసిందామె. సర్కస్ అనే తొలి దశపు భారతీయ సీరియల్‌లోనూ ఆమె మెరిసింది. ఆ తర్వాత సురభి టీవీ షో చేసింది. మరాఠీ సినిమాల ద్వారా రాని పేరు ప్రఖ్యాతులు సురభి ద్వారా వచ్చాయి. అవే ఆమెను హమ్ ఆప్ కే హై కౌన్ వంటి సూపర్‌హిట్ సినిమాలో ప్రాధాన్యమున్న క్యారెక్టర్ వరించేలా చేశాయి. హిందీలో జాకీష్రాఫ్, పల్లవి జోషి తదితరులతో నటించింది. ఇంతిహాన్ అనే టివీ సీరియల్‌లో పోషించిన బలమైన ఆత్మవిశ్వాసం కలిగిన యువతి పాత్ర ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది.
రామూ స్కూల్ ద్వారా టాలీవుడ్‌లోకి...
ప్రతిభను వెతికిపట్టుకోవడంలో మంచి పట్టున్న రామ్‌గోపాల్‌వర్మ నిర్మాణంలో తెలుగులో... మనీ సినిమాలో చిన్నాకు జోడీగా నటించింది. కొన్నేళ్ల తర్వాత దానికి సీక్వెల్‌గా తీసిన మనీమనీలోనూ నటించింది. అటు నటిగా జన్మనిచ్చిన చిన్నితెరని వదలకుండానే వెండితెర మీదా రాణించిన రేణూ... తెరమీద తళుక్కుమన్నది తక్కువే అయినా ఎక్కువగా గుర్తుండిపోయే పాత్రలు పోషించింది. 1998 వరకూ వరుసగా నటిస్తూ వచ్చినా... ఆ తర్వాత అరకొరగా అదీ 2010 దాకా కనిపించి గత ఐదారేళ్ల నుంచి పూర్తిగా మాయమైంది. ఏమైపోయిందీ నవ్వుల జల్లు?
విలన్‌తో జోడీకట్టి...
అత్యంత క్రూరంగా నవ్వే అశుతోష్‌రాణా తెలుసా? బాలీవుడ్‌కు మాత్రమే కాదు బంగారం లాంటి సినిమాల ద్వారా టాలీవుడ్‌లోనూ పాప్యులర్ అయిన నటుడు. నవ్వితే మన చావుకొచ్చినట్టే అనిపించే అంతటి విలన్ రూపుడ్ని నవ్వితే మన ముందు మల్లెలు విరిసినట్టుండే రేణూ 2001లో ప్రేమించి పెళ్లాడింది. శౌర్యమన్, సత్యేంద్ర అనే ఇద్దరు కొడుకులకు తల్లయింది. ఫుడ్ ఫుడ్ ఛానెల్‌లో చివరిసారిగా కనిపించిన రేణూ... ‘‘మహిళా వీక్షకులతో కనెక్ట్ అయి ఉండడం చాలా ఆనందం ఇస్తుంది. సీరియల్స్‌నూ, సినిమాలనూ, షోలనూ ఒకేలా ఎంజాయ్ చేశాను. అయినప్పటికీ ఇందులో దేని ఇంపార్టెన్స్ దానిదే’’ అంటున్నారు.
దాదాపు ఏభై ఏళ్ల వయసులో నటుడిగా ఇంకా బిజీగానే ఉన్న భర్త, ఇద్దరు కొడుకుల బాగోగులు చూసుకుంటూ ఆమె హాయిగా కాలం గడిపేస్తున్నారు. మంచి పాత్రలు వస్తే నటించడానికి అభ్యంతరం లేదంటూనే... దర్శకత్వం వహించాలనే కోరికను వ్యక్త పరుస్తున్నారు. రెండు స్క్రీన్‌ప్లేలు కూడా రాసిన రేణూ... త్వరలో హిందీ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉందంటున్నారు. హాయిగా నవ్వే వాళ్లని చూస్తే అంత హయిగా ఎలా నవ్వగలరా అనిపిస్తుంది. రేణుకా సహానీ జీవితాన్ని గమనిస్తే నవ్వుని తోడు చేసుకున్న వారి జీవనయానం కూడా అంతే హాయిగా కొనసాగుతుందని అనిపిస్తుంది.
- ఎస్.సత్యబాబు