S. Satya Babu
-
నా కంటిపాప
సెలబ్రిటీలనగానే.. రంగుల లోకంలో విహరిస్తారనుకుంటారు. ఏ బాదరబందీ లేని వీరికి.. పక్కవాడి బాధ గురించి ఆలోచించే తీరిక ఉండదని నిష్టూరాలాడుతుంటారు. కానీ.. తమకూ మనసుందని సెలబ్రిటీలు నిరూపిస్తున్నారు. టాలీవుడ్ వర్ధమాన నటుడు హర్షవర్ధన్ రాణె ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆ అమ్మాయి ఆలనాపాలన ఆన్నీ ఆయనే. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. - ప్రజెంటేషన్: ఎస్.సత్యబాబు రెండేళ్ల క్రితం.. హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్ సమీపంలోని చీర్స్ ఫౌండేషన్ హోమ్‌కి వెళ్లినప్పుడు కలిసింది నాలుగేళ్ల స్వాతి. ఆ చిన్నారి తల్లిదండ్రులు కొన్నేళ్ల కిందట హెచ్ఐవీతో చనిపోయారు. అనాథలా మిగిలిన స్వాతి ఆ హోమ్‌లో ఆశ్రయం పొందుతోంది. అమాయకపు చూపులతో ఉన్న ఆ అమ్మాయిని చూసినప్పుడు చాలా బాధనిపించింది. పాప భవిష్యత్తు ఏమిటా అని హృదయం బరువెక్కింది. లాలనగా దగ్గరకు తీసుకుని పెద్దయ్యాక ఏమవుతావ్ అంటే.. ‘డాక్టర్’ అని ముద్దుగా పలికింది. ఆ చిట్టితల్లి తన కల నిజం చేసుకోవడంలో తండ్రిలా తోడుండాలనిపించింది. హోమ్ నిర్వాహకుడు అశోక్ ని కలిసి స్వాతిని దత్తత తీసుకుంటానని, చదువుతో సహా తనకు అయ్యే ఖర్చంతా నేనే భరిస్తానని చెప్పాను. గ్యారేజ్ సేల్.. చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాను. కెరీర్ ఇంకా ప్రారంభంలోనే ఉంది. చారిటీ ఈవెంట్‌కి గెస్ట్‌గా వెళ్లిన నాకు.. ఓ పాపను దత్తత తీసుకుందామనేంత ఉద్వేగం ఏమిటి ? ఏమో.. ఆ చిన్నారి అమాయకపు చూపులు నన్ను ఇవేమీ ఆలోచించనీయలేదు. మాటయితే ఇచ్చాను.. స్వాతికి సాయం చేయడమెలా..? అని ఆలోచించినప్పుడు.. ఓ విషయం గుర్తొచ్చింది. వెస్ట్రన్ కంట్రీస్‌లో వాడని వస్తువులు, దుస్తులు, పుస్తకాలు.. పోగుచేసి కారు గ్యారేజ్‌లో పెట్టి విక్రయిస్తారు. ఆ సొమ్మును చారిటీకి స్తారు. దీన్ని గ్యారేజ్ సేల్ అంటారు. అదేరకంగా నేను కూడా తకిట తకిట, నా ఇష్టం, అవును, ప్రేమ ఇష్క్ కాదల్.. సినిమాల్లో వాడిన టీ షర్ట్‌లను షర్ట్ ఆఫ్ పేరుతో వేలం వేశాను. నాకు కారూ లేదు గ్యారేజ్ కూడా లేదు. అందుకని దుర్గం చెరవు దగ్గర ఫ్రెండ్ రాము నిర్వహిస్తున్న ప్రొటెన్స్ జిమ్‌నే గ్యారేజ్గా మార్చాను. ఆ వేలం ద్వారా రూ.48 వేలు వచ్చాయి. దానికి కొంత మొత్తం కలిపి స్వాతి ఖర్చులకు అందజేశాను. పుత్రికోత్సాహం.. ఏదో అన్నందుకు ఇంతని ఇచ్చేశాం అని ఊరుకోకుండా తరచూ స్వాతిని కలసి వస్తున్నాను. మనిషికి ‘నా’ అన్నవారు లేరే అనే ఫీలింగ్ జీవితంపై నిరాసక్తతని కలిగిస్తుంది. నాకంటూ ఒక్కరైనా ఉన్నారనే ఆనందం పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. ఆర్థికంగా ఆదుకోవడం ఎంత అవసరమో ఆ భరోసా ఇవ్వడం కూడా అంతే ముఖ్యం అనే ఉద్దేశంతో స్వాతిని కలవడం, కొన్ని గంటల పాటు తనతో కబుర్లు చెప్పడం, ఆడుకోవడం చేస్తున్నాను. స్వాతి చాలా బాగా చదువుతోందని, చాలా చురుకుగా ఉంటోందని నిర్వాహకులు చెబుతుంటే పుత్రికోత్సాహం కలుగుతోంది. తన కల నెరవేరే వరకూ వెన్నంటి ఉండాలనే ఆలోచనకు అది మరింత బలమిస్తోంది. సూపర్‌స్టార్ ఫీలింగ్.. వర్తమానంలో మనం ఎన్నో సాధించవచ్చు.. కాని ఫ్యూచర్ జనరేషన్‌కి మంచి మార్గం చూపలేనిది విజయమే కాదు. నిరుపేద చిన్నారులకు ఉపకరించేలా వలంటరీ యాక్టివిటీస్ చేస్తున్న వారికి వీలున్నంత సహకరిస్తున్నాను. వచ్చే మార్చి 8న మహిళాదినోత్సవం సందర్భంగా గ్యారేజ్ సేల్ లాంటిదే మరేదైనా ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఇలా ఏటా.. ఒక ఈవెంట్ చేసి ‘స్వాతి’లాంటి కొందరి చిన్నారుల జీవితాల్లోనైనా వెలుగులు నింపగలిగితే.. అది నన్ను నేను సూపర్స్టార్లా భావించుకునేంత గర్వాన్నిస్తుంది. -
లైట్ అండ్ స్మైల్
నగరంలో కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. పెరుగుతున్న వాహనాలు, సాంకేతిక పరికరాల వాడకం, పచ్చదనం తగ్గిపోతుండటం.. ఇలాంటి కారణాలతో పొల్యూషన్ ఒక సొల్యూషన్ లేని సమస్యగా మారిపోతోంది. అయినా పండుగ సంబరాల పేరిట రూ. వేలల్లో ఖర్చుపెట్టి మరి కాలుష్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం. కాలుష్యం లేని క్రాకర్స్‌తో, మరిన్ని దీపాల వెలుగులతో పండుగను జరుపుకోలేమా? టపాసులతో పాటు ఈ దీపావళిని పచ్చని పండుగగా మలుచుకుందాం. - ఎస్.సత్యబాబు సుప్రీంకోర్టు విధించిన పరిమితి ప్రకారం.. క్రాకర్స్ చేసే శబ్ద పరిమాణం 125 డెసిబుల్స్ మించకూడదు. అది దాటితే వ్యక్తుల్లో వినికిడి లోపం కలిగే ప్రమాదం ఉంది. అయితే నగరంలో అత్యధికులకు ఎకో ఫ్రెండ్లీ, స్మోక్ లెస్ ఫైర్ క్రాకర్స్ గురించి అవగాహన లేదు. దేశంలోని ఢిల్లీ వంటి మెట్రో నగరాలతో పోలిస్తే మన సిటీలోనే వినియోగం తక్కువ. ఈ ఉత్పత్తులపై అవగాహన పెరిగితే మాత్రమే మనం కాలుష్య రహిత దీపావ ళిని భావితరాలకు పండుగ లాంటి పర్యావరణాన్ని బహుమతిగా ఇవ్వగలం. ఎకో ఫ్రెండ్లీ.. సంప్రదాయ క్రాకర్స్‌కు భిన్నంగా ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ వాక్యూమ్ కంబషన్ మెథడ్‌లో రూపొందుతున్నాయి. వీటిని రిసైకిల్డ్ పేపర్‌తో తయారు చేస్తారు. తయారీలో ఎటువంటి కెమికల్స్ వినియోగించరు. తద్వారా శబ్దం, పొగ రెండూ తక్కువగానే వస్తాయి. వీటిని వీధిలోనే అక్కర్లేదని ఇంట్లో సైతం కాల్చుకోవచ్చని ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ తయారీదారులు చెబుతున్నారు. మరోవైపు ఈ క్రాకర్స్ విభిన్న రకాల సైజ్లు, షేప్స్‌లో, పోకీమాన్, మ్యాంగో మ్యాజిక్, రెయిన్బో స్మోక్, స్వీట్.. వంటి పేర్లతో లభిస్తున్నాయి. ఇవి కూడా తమిళనాడులోని శివకాశిలోనే తయారవుతున్నాయి. మామూలు క్రాకర్స్ రూ.100 నుంచి రూ.10,000 దాకా ఖరీదులో ఉంటే, ఇవి రూ.40 నుంచి రూ.1,500 వరకూ మాత్రమే ఉన్నాయి. జర దీరే జలావో.. రెగ్యులర్ క్రాకర్స్‌లో కాపర్, పొటాషియం నైట్రేట్, కార్బన్, లెడ్, కాడ్మియమ్, జింక్, సల్ఫర్.. వంటి రసాయనాలుంటాయి. ఇవి కాల్చినప్పుడు విషతుల్యమైన వాయువులు వాతావరణంలోకి కలసిపోతున్నాయి. వీటి ద్వారా వినికిడిలోపం, అధిక రక్తపోటు, శ్వాసకోస ఇబ్బందులు, స్కిన్ అలర్జీస్ వంటి రకరకాల సమస్యలు కలుగుతున్నాయి. చప్పుడు లేకుండా వెలుగులు చిమ్మే అవకాశం వున్న మతాబులు, ఆకాశ దీపాలు వంటి ఆప్షన్లతో.. లెటజ్ గో ఫర్ ఎకో అండ్ ప్యాకెట్ ఫ్రెండ్లీ ఫెస్టివల్. ‘గ్రీన్’ టిప్స్.. - దీపాలను అమర్చే రంగోలీని ఆర్గానిక్ రంగులతో నింపండి. తాజా పువ్వులు, మట్టి ప్రమిదలతో చూడచక్కని రంగోలీ చేసుకోవచ్చు. - ఫుడ్ కార్నర్, రీడింగ్ కార్నర్ లాగా ఈ దివాలీకి ఇంట్లో గ్రీన్ కార్నర్‌ని ఏర్పాటు చేయండి. - బాల్కనీ లేదా టైపై గ్రీన్ కార్నర్‌ను ఏర్పాటు చేసుకోగలిగితే.. గ్రీన్ దివాలీ సూపర్బ్‌గా చేసుకోవచ్చు. - విద్యుత్ ఆదా చేసే ఎనర్జీ సేవింగ్ ఎల్ఈడి లైట్స్‌తో ఇంటిని వెలిగించండి. - పచ్చని మొక్కలు, ఎల్ఈడీ లైట్లు, హ్యాండ్ మేడ్ దీపాలు, జ్యూట్‌తో చేసిన కళాత్మక వస్తువులు... వీటిని బహుమతులుగా అందించవచ్చు. - వీటితో పాటు వర్చువల్ టపాసులు, లైట్లు, సౌండ్స్‌తో పండుగ సంబరాల అనుభూతిని కాలుష్యరహితంగా కలిగిస్తాయి. -
ర్యాంప్ వాక్ రోల్ మోడల్స్
సక్సెస్‌ను మించిన ఫ్యాషన్ ఏముంది? సక్సెస్ఫుల్ పర్సన్‌ను మించిన మోడల్స్ ఎవరుంటారు? అందాలను ఒలకబోస్తూ, వయ్యారాలు పోయే ప్రొఫెషనల్ మోడల్స్.. విజయాలకు ప్రతీకలైన నారీమణుల ముందు దిగదుడుపే కదా. దీనినే నిరూపిస్తున్నాయి ఇటీవల నగరంలో నిర్వహిస్తున్న కొన్ని ఫ్యాషన్ షోలు. ర్యాంప్ ‘షో’ అంటే మోడల్స్‌కు మాత్రమే పరిమితమనే సూత్రాన్ని తిరగరాస్తూ.. విభిన్న రంగాల్లో విజయాలు సాధించిన వారికి ప్రాధాన్యమిస్తూ నిర్వహిస్తున్న ఈ తరహా షోలు సూపర్‌హిట్ అవుతున్నాయి. హుందాగా మెరిసిపోయే పొడవాటి వేదిక.. దాని మీద వయ్యారంగా సాగే నడక. పేరు ర్యాంప్‌వాక్. పొలిటీషియన్స్ నుంచి వెండితెర ప్రముఖుల దాకా అతిరథ మహారథుల వంటి అతిధులు, నిర్విరామంగా వెలిగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కెమెరాలు, వీటన్నింటి మధ్యలో తడబడకుండా నడవడమే కష్టం. ఇక వయ్యారాలు ఒలకబోయాలంటే.. ప్రొఫెషనల్ మోడల్స్‌కు మాత్రమే సాధ్యం అనుకునేవారు ఒకప్పుడు.. అయితే సిటీలో సక్సెస్ఫుల్ పర్సన్స్ ర్యాంప్‌వాక్‌కు పెరుగుతున్న క్రేజ్ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. విభిన్న రంగాల్లో రాణిస్తున్న మహిళలు పెళ్లయి, తల్లులయినా ఫిట్నెస్ను మెయిన్టైన్ చేస్తూ దానికి తమ సక్సెస్ అనే బ్యూటీని అదనంగా జత చేస్తూ ఆహూతుల మనుసులు గెల్చుకుంటున్నారు. వారిలో కొందరు మహిళలతో సిటీప్లస్ సంభాషించింది. ఫస్ట్ అండ్ బెస్ట్... ఫ్యాషన్ రంగంలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎప్పుడూ ర్యాంప్వాక్కి ఓకె చెప్పలేదు. అయితే మొన్న జరిగిన ఒక చారిటీ ఈవెంట్లో మాత్రం పార్టిసిపేట్ చేశాను. అది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఒక మంచి నేపథ్యం ఉన్న షోలో పాల్గొన్నాననే కాకుండా ఆత్మవిశ్వాసం ఉట్టిపడే నడకతో అందరి హర్షధ్వానాలు అందుకోవడం ఆనందాన్నిచ్చింది. -అయేషా లఖోటియా, ఫ్యాషన్ డిజైనర్ ఫిట్ ఫర్ షో.. రోజూ ఇంటికి ఫిట్నెస్ ట్రైనర్ వస్తారు. రోజుకి రెండు గంటలు అన్ని రకాల వ్యాయామాలు చేస్తాను. మనం ఫిట్‌గా, పర్ఫెక్ట్గా ఉన్నాం అనే కాన్ఫిడెన్స్ ఉంటే పెళ్లయినా, తల్లయినా ర్యాంప్‌వాక్‌కు జంకాల్సిన పనిలేదు. నాలుగైదు సార్లు ర్యాంప్ వాక్ చేశాను. అందరి ముందు మోడల్ తరహాలో నడవడం ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఆ ఆత్మవిశ్వాసం నాకు అవసరమైనదే. - బీనా మెహతా, బిజినెస్ ఉమెన్ మంచి వేదిక ర్యాంప్‌వాక్ అంటే మోడల్స్‌కే పరిమితం కాదు. విభిన్న రంగాలకు చెందిన ప్రతినిధులుగా వాటిని రిప్రజెంట్ చేస్తూ మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడానికి ఇది చక్కని వేదిక. ఇదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. - పూర్ణిమ మండవ, సెలబ్రిటీ వెల్నెస్ కోచ్ ఇది ఇంటర్నేషనల్ స్టైల్... విభిన్న రంగాల్లో విజయాలు సాధించిన వాళ్లతో ర్యాంప్‌వాక్ చేయించడం మన దగ్గర ఇప్పుడిప్పుడే పెరుగుతోంది ఇది విదేశాల్లో సర్వసాధారణం. సక్సెస్ఫుల్ పర్సన్స్‌తో రూపొందిన కేలండర్స్ కూడా విడుదల చేస్తారు. -కరుణా గోపాల్, ఫ్యూచర్ సిటీస్ ఆనందంగా ఉంది.. విభిన్న రంగాల్లో విజయవంతమైన మహిళల్ని ర్యాంప్‌పై చూడడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇలాంటి మహిళలు ర్యాంప్ వాక్ చేస్తుంటే హాజరైన మహిళలు సైతం మరింత బాగా స్పందిస్తారు. ఎందుకంటే వారితో తమని ఐడెంటిఫై చేసుకునేందుకు వీలుంటుంది. పూర్తిగా మోడలింగ్, గ్లామర్ రంగాలకు సంబంధం లేని మహిళలతో ఒక షోని నిర్వహిస్తే చూడాలని ఉంది. - రేణు సుఖేజా, కొరియోగ్రాఫర్ - ఎస్.సత్యబాబు -
కస్టమర్‌కు రెడ్‌కార్పెట్
‘కొనుగోలుదారుని మించిన అతిథులు లేరు..’ అన్నట్టుగా సిటీలోని షాపర్స్ కోసం బిజినెస్ వర్గాలు అందిస్తున్న ఆతిథ్యం కొత్త పుంతలు తొక్కుతోంది. శనివారం.. 6 డిగ్రీస్ అనే సంస్థ బ్రాండెడ్ దుస్తుల కంపెనీలతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నం.36లో ఉన్న వయా మిలానో రెస్టారెంట్లో వినూత్న డిజైనర్ ఎగ్జిబిషన్ నిర్వహించింది. ఛాయిస్ ఆఫ్ ది సిటీగా నిలిచింది. నగరంలో ఇంటీరియర్ డిజైనర్‌గా పేరొందిన రమా భట్ ఈ ప్రదర్శనకు హాజరయ్యారు. తనకు నచ్చిన డ్రెస్ ఎంచుకున్నారు. ట్రయల్రూమ్లోకి వెళ్లి దానిని ధరించారు. తర్వాత మేకప్ ఆర్టిస్ట్ ఆమెకి మేకోవర్ పూర్తి చేశారు. అనంతరం రెడ్‌కార్పెట్‌పై రమాభట్ ఒక మోడల్ తరహాలో ర్యాంప్ వాక్ చేశారు. సిద్ధంగా ఉన్న ముగ్గురు ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్లు క్లిక్ క్లిక్ మనిపించారు. వెంటనే ఫొటోలు సిస్టమ్‌లోకి అప్లోడ్ చేసి చూపించారు. ఫొటోలు చూసి ఆమె...‘వావ్’ అని అప్రయత్నంగానే అనేశారు. తగిన మొత్తాన్ని చెల్లించి స్వంతం చేసుకున్నారు. ‘ఈ ఎక్స్పీరియన్స్ అమేజింగ్. ఒక సెలబ్రిటీ ఫీల్ వచ్చింది’ అంటూ ఆమె ‘సిటీప్లస్’తో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ఆనందం రమాభట్ ఒక్కరిదే కాదు అక్కడికి హాజరైన డాక్టర్ సుమేధ, సుమలత... తదితరులెందరిదో! కొనేవారికి కొత్త అనుభవం ఇవ్వాలని... ఏ మాత్రం సందేహం లేకుండా తమకు నప్పే డ్రెస్ కొన్నామనే సంతృప్తితో పాటు, వినూత్నమైన అనుభవాన్ని అందించాలని ఈ కాన్సెప్ట్‌కు రూపకల్పన చేశామని 6 డిగ్రీ నిర్వాహకులు అమిత్, కౌముది బ్రాండ్ దుస్తుల ఉత్పత్తిదారు షర్మిలా నాగరాజ్‌లు వివరించారు. జైపూర్‌కి చెందిన కాస్సా, ముంబయికి చెందిన బ్రహ్మ కర్మ, హైదరాబాద్‌కు చెందిన కౌముది బ్రాండ్స్ ఉత్పత్తి చేసిన పురుషులు, మహిళల దుస్తులను ప్రదర్శనలో ఉంచారు. మేకోవర్‌తో మెరిపించి మరీ కస్టమర్ల చేత వీరు కొనిపించిన తీరు సిటీలో సరికొత్త బిజినెస్ కాన్సెప్ట్‌గా మారితే... ఇక సిటీజనులంతా ర్యాంప్‌వాక్‌కు రెడీ అవ్వాల్సిందే. - ఎస్.సత్యబాబు -
నవ్వుల రేణు... నువ్వెలా ఉన్నావు?
అజ్ఞాతవాసం: అందంగా ఉన్న అమ్మాయిని చూస్తే కలిగే ఫీలింగ్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అందంగా నవ్వే అమ్మాయిని చూస్తే ఆ అనుభూతి కొన్నాళ్ల పాటు వెన్నాడుతుంది. చిన్నపిల్లల నవ్వులంటే ఇష్టపడని వారుండరు. కల్మషరహితంగా, స్వచ్ఛమైన నవ్వులు రువ్వే ఆ నటి అందుకే.. అందరికీ చాలా తొందరగా ఇష్టమైపోయింది. మరి ఇప్పుడు తెరనొదిలి ఎటు వెళ్లిపోయింది? చిన్నితెర నుంచి సినీతెరకు ఎదిగిన నటీనటుల్లో అదృష్టానికి కొదవుంటుందేమో కాని ప్రతిభకు కొదవుండదు. ఎందుకంటే స్మాల్‌స్క్రీన్ మీద తమని తాము ఎంతో నిరూపించుకుంటేనే సిల్వర్‌స్క్రీన్ పిలుస్తుంది మరి. అలాంటి నటీమణుల్లో రేణుకా సహాని ఒకరు. చిన్నితెరకు వన్నెలద్ది... పాటలు చూడాలంటే చిత్రలహరి, సీరియల్ చూడాలంటే రామాయణం... ఇలా దూరదర్శన్ తప్ప మరో చానెల్ తెలియని రోజుల్లో... సురభి అనే సూపర్‌హిట్ షో ఒకటి టాక్ ఆఫ్ ద కంట్రీ అయింది. దూరదర్శన్‌లో 1993లో ప్రారంభమైన ఈ షో 2001 దాకా కొనసాగిందంటేనే ఆ షో ఎంత విజయం సాధించిందో అర్థమవుతుంది. అంతటి పాప్యులర్ షోకి సమర్పకురాలుగా వ్యవహరించింది రేణుకా సహాని. ఇంపైన నవ్వులతో ఇంటింటి ఇంతి అయిపోయింది. వీక్షకులు సొంత మనిషిలా భావించేంత ఆప్తురాలైపోయింది. మహారాష్ట్రలో పుట్టిన రేణు... మితిబాయి కాలేజిలో ఆర్ట్స్ స్టూడెంట్. మరాఠీ సినిమాతో కెరీర్‌కు శ్రీకారం చుట్టిన సహాని... ఆ తర్వాతా ఎన్నో మరాఠీ సినిమాలు చేసింది. ఆమె తల్లి శాంతా గోఖలే రాసిన రిటా వెలింగ్కర్లోని రిటా అనే పాత్రతో తన తొలి మరాఠీ సినిమా చేసిందామె. సర్కస్ అనే తొలి దశపు భారతీయ సీరియల్లోనూ ఆమె మెరిసింది. ఆ తర్వాత సురభి టీవీ షో చేసింది. మరాఠీ సినిమాల ద్వారా రాని పేరు ప్రఖ్యాతులు సురభి ద్వారా వచ్చాయి. అవే ఆమెను హమ్ ఆప్ కే హై కౌన్ వంటి సూపర్‌హిట్ సినిమాలో ప్రాధాన్యమున్న క్యారెక్టర్ వరించేలా చేశాయి. హిందీలో జాకీష్రాఫ్, పల్లవి జోషి తదితరులతో నటించింది. ఇంతిహాన్ అనే టివీ సీరియల్లో పోషించిన బలమైన ఆత్మవిశ్వాసం కలిగిన యువతి పాత్ర ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. రామూ స్కూల్ ద్వారా టాలీవుడ్లోకి... ప్రతిభను వెతికిపట్టుకోవడంలో మంచి పట్టున్న రామ్‌గోపాల్‌వర్మ నిర్మాణంలో తెలుగులో... మనీ సినిమాలో చిన్నాకు జోడీగా నటించింది. కొన్నేళ్ల తర్వాత దానికి సీక్వెల్‌గా తీసిన మనీమనీలోనూ నటించింది. అటు నటిగా జన్మనిచ్చిన చిన్నితెరని వదలకుండానే వెండితెర మీదా రాణించిన రేణూ... తెరమీద తళుక్కుమన్నది తక్కువే అయినా ఎక్కువగా గుర్తుండిపోయే పాత్రలు పోషించింది. 1998 వరకూ వరుసగా నటిస్తూ వచ్చినా... ఆ తర్వాత అరకొరగా అదీ 2010 దాకా కనిపించి గత ఐదారేళ్ల నుంచి పూర్తిగా మాయమైంది. ఏమైపోయిందీ నవ్వుల జల్లు? విలన్‌తో జోడీకట్టి... అత్యంత క్రూరంగా నవ్వే అశుతోష్‌రాణా తెలుసా? బాలీవుడ్‌కు మాత్రమే కాదు బంగారం లాంటి సినిమాల ద్వారా టాలీవుడ్‌లోనూ పాప్యులర్ అయిన నటుడు. నవ్వితే మన చావుకొచ్చినట్టే అనిపించే అంతటి విలన్ రూపుడ్ని నవ్వితే మన ముందు మల్లెలు విరిసినట్టుండే రేణూ 2001లో ప్రేమించి పెళ్లాడింది. శౌర్యమన్, సత్యేంద్ర అనే ఇద్దరు కొడుకులకు తల్లయింది. ఫుడ్ ఫుడ్ ఛానెల్లో చివరిసారిగా కనిపించిన రేణూ... ‘‘మహిళా వీక్షకులతో కనెక్ట్ అయి ఉండడం చాలా ఆనందం ఇస్తుంది. సీరియల్స్‌నూ, సినిమాలనూ, షోలనూ ఒకేలా ఎంజాయ్ చేశాను. అయినప్పటికీ ఇందులో దేని ఇంపార్టెన్స్ దానిదే’’ అంటున్నారు. దాదాపు ఏభై ఏళ్ల వయసులో నటుడిగా ఇంకా బిజీగానే ఉన్న భర్త, ఇద్దరు కొడుకుల బాగోగులు చూసుకుంటూ ఆమె హాయిగా కాలం గడిపేస్తున్నారు. మంచి పాత్రలు వస్తే నటించడానికి అభ్యంతరం లేదంటూనే... దర్శకత్వం వహించాలనే కోరికను వ్యక్త పరుస్తున్నారు. రెండు స్క్రీన్‌ప్లేలు కూడా రాసిన రేణూ... త్వరలో హిందీ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉందంటున్నారు. హాయిగా నవ్వే వాళ్లని చూస్తే అంత హయిగా ఎలా నవ్వగలరా అనిపిస్తుంది. రేణుకా సహానీ జీవితాన్ని గమనిస్తే నవ్వుని తోడు చేసుకున్న వారి జీవనయానం కూడా అంతే హాయిగా కొనసాగుతుందని అనిపిస్తుంది. - ఎస్.సత్యబాబు -
హ్యాట్రిక్ వీరులు
కొనసాగిన హవా..! టంగుటూరి అంజయ్య, సలావుద్దీన్ ఒవైసీల వరుస విజయూలు హైదరాబాద్‌లో ఐదోసారి సార్వత్రిక ఎన్నికలు 1972లో జరిగాయి. నగరంలో నాడు నియోజకవర్గాల సంఖ్య 11. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ హవా కొనసాగింది. 8 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సత్తా చాటారు. మిగిలిన మూడు స్థానాల్లో స్వతంత్రుల హవా కొనసాగింది. గరీబోళ్ల బిడ్డ అంజయ్య, సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీలు ఈ ఎన్నికల్లో కూడా విజయదుందుభి మోగించారు. చాలా నియోజకవర్గాల్లో సంపూర్ణ తెలంగాణా ప్రజా సమితి(ఎస్టీపీఎస్) ద్వితీయ స్థానాల్లో నిలిచింది. ఈ ఎన్నికల్లో అత్యధికంగా యాకుత్‌పురా నియోజకవర్గంలో 63.44 శాతం ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో 33.48 శాతం పోలింగ్ జరిగింది. - సాక్షి,సిటీబ్యూరో ముషీరాబాద్ ఈ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కార్మికోద్యమ నేత టి.అంజయ్య 29,198 ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు. ద్వితీయ స్థానంలో నిలిచిన సీపీఐ అభ్యర్థి ఎం.ఏ. రజాక్ 8,834 ఓట్లు మాత్రమే సాధించారు. సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థి బి.పుల్లారెడ్డికి 6,091 ఓట్లు మాత్రమే దక్కాయి. స్వతంత్ర అభ్యర్థి ఎం.నరసింహకు 740, మరో స్వతంత్ర అభ్యర్థివెంకట నర్సింగరావుకు 302 ఓట్లు లభించాయి. నమోదైన పోలింగ్ 48.56 శాతం. గగన్‌మహల్ ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శాంతాబాయ్ తాల్పాలికర్ 14,721 ఓట్లు సాధించి గెలుపొందారు. సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థి జి.నారాయణరావు 9,028 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. భారతీయ జనసంఘ్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్‌రావు 4,983 ఓట్లతో తృతీయస్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి మీర్జా జమీల్ అహ్మద్ బేగ్‌కు 2,720 ఓట్లు లభించాయి. పోలింగ్ శాతం 50.82. మహరాజ్‌గంజ్ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్.లక్ష్మీనారాయణ 16,562 ఓట్లు సాధించి గెలుపొందారు. సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి పార్టీ అభ్యర్థి బద్రీ విశాల్ పిట్టి 15,424 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి పి.రామస్వామికి 4,235 ఓట్లు లభించాయి. మరో స్వతంత్ర అభ్యర్థి కె.ఎం.అన్సారీకి 1182 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 52.88 శాతం ఓట్లు పోలయ్యాయి. సీతారాంబాగ్ ఈ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి షాఫియూర్ రహమాన్ 16,844 ఓట్లు సాధించి గెలుపొందారు. సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి పార్టీ అభ్యర్థి సోమ యాదవరెడ్డి 14,898 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి బిదా బిల్ గ్రామి 10,059 ఓట్లతో తృతీయస్థానానికి పరిమితమయ్యారు. స్వతంత్ర అభ్యర్థి అహ్మద్ హుస్సేన్ 3554 ఓట్లు సాధించారు. ఈ నియోజకవర్గంలో 50.34 శాతం పోలింగ్ జరిగింది. మలక్‌పేట్ కాంగ్రెస్ అభ్యర్థిని బి.సరోజినీ పుల్లారెడ్డి 23,164 ఓట్లు సాధించి గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి గురులింగం సత్తయ్య 11,230 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. మరో స్వతంత్ర అభ్యర్థి ఖాజా అబు సయిద్ 8,355 ఓట్లతో తృతీయస్థానంలో నిలిచారు. పోలింగ్ శాతం 60.68. యాకుత్‌పురా ఎంఐఎం అభ్యర్థి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ 26,621 ఓట్లు సాధించి గెలుపొందారు. భారతీయ జనసంఘ్ పార్టీ అభ్యర్థి ఆర్. అంజయ్య 10,082 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి కె.ఎం.ఖాన్ 8,667 ఓట్లతో తృతీయ స్థానానికే పరిమితమయ్యారు. మొత్తంగా 63.44 శాతం ఓట్లు పోలయ్యాయి. చార్మినార్ ఎంఐఎం బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి సయిద్ హసన్ 15,341 ఓట్లు సాధించి విజయం సొంతం చేసుకున్నారు. సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థి ఎస్.రఘువీర్‌రావు 5,591 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి నవాబ్ తాహర్ అలీఖాన్ 5,368 ఓట్లతో తృతీయస్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి లాయక్ అలీఖాన్ 5,169 ఓట్లు సాధించారు. పోలింగ్ శాతం 52.41. సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎల్.నారాయణ 17,856 ఓట్లు సాధించి గెలుపొందారు. సంపూర్ణ తెలంగాణా ప్రజా సమితి అభ్యర్థి జి.ఎం. అంజయ్య 8,885 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి సుదర్శనరావుకు 2,492 ఓట్లు దక్కాయి. నమోదైన పోలింగ్ శాతం 48.12. ఖైరతాబాద్ ఈ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగం కృష్ణారావు 18,392 ఓట్లతో గెలుపొందారు. సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థి ఇ.వి.పద్మనాభన్ 10,970 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. సీపీఐ అభ్యర్థి పి.నాగేశ్వరరావు 3,260 ఓట్లతో తృతీయస్థానంలో నిలిచారు. మొత్తంగా 45.49 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆసిఫ్‌నగర్ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సయ్యద్ రహ్మత్ అలీ 15,074 ఓట్లతో గెలుపొందారు. ఎంఐఎం బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి ఇస్మాయిల్ జరీ 12,364 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి పార్టీ అభ్యర్థి జి.సత్యనారాయణకు 5,566 ఓట్లు దక్కాయి. పోలింగ్ శాతం 50.34. కంటోన్మెంట్ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని వి.మంకమ్మ 18,891 ఓట్లు సాధించి గెలుపొందారు. సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థి బి.ఎం.నర్సింహ 11,187 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి ఎస్.జగన్నాథ ం 1,976 ఓట్లు సాధించి మూడోస్థానంలో నిలిచారు. 33.48 శాతం పోలింగ్ జరిగింది. నిత్య వార్త సత్యవాక్కు ముస్లింలకు మేలు చేసింది వైఎస్సే: అసదుద్దీన్ తపనంతా ప్రజాశ్రేయస్సు తన పర భేదం లేని మనస్సు అందరికీ ఆప్తుడైన మేరునగధీరుడాయన... అండగా ఉండే పాలనకు ‘మేలు’కొలుపాయన... రాజన్నంటే... యుగానికొక్కడు... రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు... తను లేడంటే నమ్మలేం... తలవకుండా ఉండలేం... చంద్రబాబు అభివృద్ధి చేసింది జూబ్లీహిల్స్ మాత్రమే... చిరంజీవి అన్నపూర్ణ వగైరా స్టూడియోలు... అపోలో వంటి ఆసుపత్రులు... సింగారాల కొండలు... సినీ ప్రపంచపు సందళ్లు... చిన్నబోతాయి... చిరాకుపడతాయి... గుట్టల్ని చదును చేసి కొండల్ని పిండి చేసి రూపమిచ్చి... ఊపునిస్తే... ఎవరయ్యా ఆ బాబు... ఏమిటాయన తెచ్చిన డాబు? అంటూ కళ్లెర్రజేస్తాయి... 18 మురికివాడల ఫిలింనగరి... పత్తాలేని అభివృద్ధికి ఏ బాబు... జవాబుదారి? - ఎస్. సత్యబాబు -
హృదయం: మళ్లీ పెళ్లి..!
పెళ్లి ప్రాధాన్యత గురించి చెప్పే సమయంలో ‘‘వయసులో ఉన్నప్పుడు పర్లేదు కాని వయసైపోయాక, ఒక తోడు అవసరం తెలుస్తుంది’’ అంటారు. ఈ మాట అక్షరాలా నిజం అంటున్నారు సీనియర్ సిటిజన్స్. వేర్వేరు కారణాల వల్ల జీవిత భాగస్వామి దూరమై, బిజీ బిజీగా గడిపే పిల్లలకు చేరువ కాలేక... తోడొకరుండిన అదే భాగ్యమూ అనుకుంటున్న పెద్దలు... తలపండిన వయసులో పెళ్లిళ్లకు సై అంటున్నారు. ఆ భాగ్యం కోసం అవసరమైతే కంటికిరెప్పల్లా పెంచుకున్న పిల్లలను సైతం ఎదిరిస్తున్నారు. ఈ రెండు కధనాలే దీనికి నిదర్శనం... తోడొకరుండిన అదే భాగ్యమూ.... ఆరోగ్యమూ... ‘‘ఆయనకున్న ఆస్తిపాస్తులు ఏంటో నాకు, నా ఆర్థిక పరిస్థితి ఏంటో ఆయనకు తెలియదు’ అన్నారు రాజేశ్వరి. విజయవాడ, స్టెల్లా కాలేజీ దగ్గర తన ప్రస్తుత భర్త కోటేశ్వరరావుతో కలిసి నివసిస్తున్నారామె. వ్యవసాయ నేపథ్యం గల కోటేశ్వరరావు(75) ఆరేళ్ల క్రితం భార్యను కోల్పోయారు. మరోవైపు పిల్లలు కూడా లేకపోవడంతో మరింత ఒంటరి అయ్యారు. ఈ పరిస్థితిలో ఆయనకు రాజేశ్వరి (61) పరిచయం అయ్యారు. ఇరువురి అంగీకారంతో గత ఏడాది కనకదుర్గ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ముగ్గురు పిల్లలున్న రాజేశ్వరి 30 ఏళ్ల క్రితం భర్తను పోగొట్టుకున్నా పిల్లలను చక్కగా పెంచి జీవితంలో స్థిరపడేలా చేశారు. అనంతరం అకస్మాత్తుగా ఆవరించిన ఒంటరితనాన్ని ఆమె కోటేశ్వరరావు పరిచయంతో దూరం చేసుకోగలిగారు. ‘‘నా బాగోగులు చూసుకునేందుకు నా కంట్లో ఐ డ్రాప్ వేసేందుకు ఓ సహచరి ఉంది’ అని కోటేశ్వరరావు ఆనందం వ్యక్తం చేస్తుంటే, ‘‘నేను ఏ గుడికి వెళ్లాలన్నా, పేరంటానికి వెళ్లాలన్నా ఓ తోడున్నార’’ని రాజేశ్వరి సంబరంగా చెబుతున్నారు. మన సమాజంలోకి అనూహ్యంగా చొచ్చుకుపోతూ... ‘మలి దశలో మనువు’ అనే సరికొత్త పంథా... రాన్రానూ ఓ సంప్రదాయంలా స్థిరపడుతోంది. జన్మనిచ్చి, పెంచి పెద్ద చేసి... ఓ చిన్న ఓదార్పు కోసం, ఓ మనసైన తోడు కోసం పరితపిస్తున్న పెద్దల చివరి మజిలీలోని ‘చిన్ని చిన్ని’ఆశల్ని తీర్చాల్సిన బాధ్యత ఇప్పుడు నవతరం మీద ఉందనేది నిజం. మనకు తోడు అత్యవసరమైన వయసులో జీవితభాగస్వామి దూరం కావడం చాలా క్షోభకు గురిచేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకటి కావడం ద్వారా ఒంటరి తనాన్ని దూరం చేసుకోవడం ఇరు జీవితాలకే కాదు వారి కుటుంబాలకు కూడా మేలు చేస్తుంది. అందుకే పెద్ద వయసు పెళ్ళిళ్లను ప్రోత్సహించడానికి మేం ప్రయత్నిస్తున్నాం. మరిన్ని వివరాలు కావల్సిన వారు ఫోన్: 8106367014లో సంప్రదించండి లేదా... తోడునీడ వెబ్సైట్లో చూడవచ్చు. - రాజేశ్వరి, తోడునీడ పెళ్లాడదామా? పిల్లల్ని అడిగి చెబుతా... ఒకప్పుడు ఇది పెద్ద జోక్. అయితే ఇప్పుడు ‘నిఖా’ర్సయిన నిజం. మలిదశలో మనువు కోరుకుంటున్న వారికి పిల్లల అంగీకారం అత్యవసరంగా మారుతోంది. చాలా మంది పిల్లల అభీష్టానికి విరుద్ధంగా నిర్ణయం తీసుకోలేక తమ ఇష్టాలను చంపుకుంటుంటే... ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్న ఈశ్వరరావు (65), కుమారి (60) (పేర్లు మార్చాం) మాత్రం ‘పిల్లల్ని’ ఎదిరించారు. అదెలా అంటే... ఎనిమిదేళ్ల క్రితం భార్యను కోల్పోయిన ఈశ్వరరావు, భర్త మరణంతో ముగ్గురు పిల్లల్ని పోషించలేక తంటాలు పడుతున్న కుమారి తోడు నీడ అనే వృద్ధుల సేవా సంస్థ ద్వారా తొలిసారి కలిశారు. మొదటిచూపులోనే ఈశ్వరరావుకు కుమారి నచ్చేశారు. ‘‘నిన్నే పెళ్లాడుతా’’నన్నారు. అందుకామె ‘‘పిల్లల్నడిగి చెబుతా’’ అన్నారు. ఇక్కడి వరకూ బానే ఉంది. దీనికి ఈశ్వరరావు కుటుంబం నుంచి ఏ అభ్యంతరం రాలేదు కాని కుమారి పిల్లలు ఒప్పుకోం అన్నారు. నిరుద్యోగిగా ఉన్న ఓ కొడుకైతే... ఇకపై అలాంటి సంస్థల దగ్గరకు వెళితే ఊరుకోనంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయితే కుమారిని మనసా వాచా ఇష్టపడిన ఈశ్వరరావు... ఆమెని ఇంట్లో నుంచి తీసుకువచ్చి గుడిలో పెళ్లి చేసేసుకున్నారు. తన ఇంటికి తెచ్చేసుకున్నారు. ఇది తెలుసుకున్న ఆమె కొడుకు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈశ్వరరావును కొట్టి, తల్లిని తనతో పాటు తన ఇంటికి తీసుకుపోయాడు. అంతే కాదు తను బయటకు వెళ్లేటప్పుడు చెల్లిని తల్లికి కాపలా పెట్టాడు. అయితే ఈశ్వరరావు, కుమారి ఈసారి ఎవరికీ తెలీని మారుమూల ప్రాంతంలో సంసారం మొదలెట్టారు. తల్లి జాడ తెలియకపోవడంతో... కాస్త దిగొచ్చిన ఆ కొడుకు ‘తోడు నీడ’ సహాయంతో రాజీకి సిద్ధమయ్యాడు. చివరకు...కుమారి కొడుకు జీవితంలో స్థిరపడేలా చూస్తాననీ, ఆమె కూతురి పెళ్లి చేస్తానని ఈశ్వరరావు మాట ఇచ్చి ఆమె కొడుకును ఒప్పించారు. ఆ తర్వాత ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు కూడా. నాలుగేళ్ల వయసున్న వీరి కాపురం ఇప్పుడు ఆనందంగా సాగిపోతోంది. - ఎస్.సత్యబాబు, ఫొటో: కోటేశ్వరరావు