నా కంటిపాప
సెలబ్రిటీలనగానే.. రంగుల లోకంలో విహరిస్తారనుకుంటారు. ఏ బాదరబందీ లేని వీరికి.. పక్కవాడి బాధ గురించి ఆలోచించే తీరిక ఉండదని నిష్టూరాలాడుతుంటారు. కానీ.. తమకూ మనసుందని సెలబ్రిటీలు నిరూపిస్తున్నారు. టాలీవుడ్ వర్ధమాన నటుడు హర్షవర్ధన్ రాణె ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆ అమ్మాయి ఆలనాపాలన ఆన్నీ ఆయనే. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
- ప్రజెంటేషన్: ఎస్.సత్యబాబు
రెండేళ్ల క్రితం.. హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్ సమీపంలోని చీర్స్ ఫౌండేషన్ హోమ్‌కి వెళ్లినప్పుడు కలిసింది నాలుగేళ్ల స్వాతి. ఆ చిన్నారి తల్లిదండ్రులు కొన్నేళ్ల కిందట హెచ్‌ఐవీతో చనిపోయారు. అనాథలా మిగిలిన స్వాతి ఆ హోమ్‌లో ఆశ్రయం పొందుతోంది. అమాయకపు చూపులతో ఉన్న ఆ అమ్మాయిని చూసినప్పుడు చాలా బాధనిపించింది. పాప భవిష్యత్తు ఏమిటా అని హృదయం బరువెక్కింది. లాలనగా దగ్గరకు తీసుకుని పెద్దయ్యాక ఏమవుతావ్ అంటే.. ‘డాక్టర్’ అని ముద్దుగా పలికింది. ఆ చిట్టితల్లి తన కల నిజం చేసుకోవడంలో తండ్రిలా తోడుండాలనిపించింది. హోమ్ నిర్వాహకుడు అశోక్ ని కలిసి స్వాతిని దత్తత తీసుకుంటానని, చదువుతో సహా తనకు అయ్యే ఖర్చంతా నేనే భరిస్తానని చెప్పాను.
గ్యారేజ్ సేల్..
చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాను. కెరీర్ ఇంకా ప్రారంభంలోనే ఉంది. చారిటీ ఈవెంట్‌కి గెస్ట్‌గా వెళ్లిన నాకు.. ఓ పాపను దత్తత తీసుకుందామనేంత ఉద్వేగం ఏమిటి ? ఏమో.. ఆ చిన్నారి అమాయకపు చూపులు నన్ను ఇవేమీ ఆలోచించనీయలేదు. మాటయితే ఇచ్చాను.. స్వాతికి సాయం చేయడమెలా..? అని ఆలోచించినప్పుడు.. ఓ విషయం గుర్తొచ్చింది. వెస్ట్రన్ కంట్రీస్‌లో వాడని వస్తువులు, దుస్తులు, పుస్తకాలు.. పోగుచేసి కారు గ్యారేజ్‌లో పెట్టి విక్రయిస్తారు. ఆ సొమ్మును చారిటీకి స్తారు. దీన్ని గ్యారేజ్ సేల్ అంటారు. అదేరకంగా నేను కూడా తకిట తకిట, నా ఇష్టం, అవును, ప్రేమ ఇష్క్ కాదల్.. సినిమాల్లో వాడిన టీ షర్ట్‌లను షర్ట్ ఆఫ్ పేరుతో వేలం వేశాను. నాకు కారూ లేదు గ్యారేజ్ కూడా లేదు. అందుకని దుర్గం చెరవు దగ్గర ఫ్రెండ్ రాము నిర్వహిస్తున్న ప్రొటెన్స్ జిమ్‌నే గ్యారేజ్‌గా మార్చాను. ఆ వేలం ద్వారా రూ.48 వేలు వచ్చాయి. దానికి కొంత మొత్తం కలిపి స్వాతి ఖర్చులకు అందజేశాను.
పుత్రికోత్సాహం..
ఏదో అన్నందుకు ఇంతని ఇచ్చేశాం అని ఊరుకోకుండా తరచూ స్వాతిని కలసి వస్తున్నాను. మనిషికి ‘నా’ అన్నవారు లేరే అనే ఫీలింగ్ జీవితంపై నిరాసక్తతని కలిగిస్తుంది. నాకంటూ ఒక్కరైనా ఉన్నారనే ఆనందం పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. ఆర్థికంగా ఆదుకోవడం ఎంత అవసరమో ఆ భరోసా ఇవ్వడం కూడా అంతే ముఖ్యం అనే ఉద్దేశంతో స్వాతిని కలవడం, కొన్ని గంటల పాటు తనతో కబుర్లు చెప్పడం, ఆడుకోవడం చేస్తున్నాను. స్వాతి చాలా బాగా చదువుతోందని, చాలా చురుకుగా ఉంటోందని నిర్వాహకులు చెబుతుంటే పుత్రికోత్సాహం కలుగుతోంది. తన కల నెరవేరే వరకూ వెన్నంటి ఉండాలనే ఆలోచనకు అది మరింత బలమిస్తోంది.
సూపర్‌స్టార్ ఫీలింగ్..
వర్తమానంలో మనం ఎన్నో సాధించవచ్చు.. కాని ఫ్యూచర్ జనరేషన్‌కి మంచి మార్గం చూపలేనిది విజయమే కాదు. నిరుపేద చిన్నారులకు ఉపకరించేలా వలంటరీ యాక్టివిటీస్ చేస్తున్న వారికి వీలున్నంత సహకరిస్తున్నాను. వచ్చే మార్చి 8న మహిళాదినోత్సవం సందర్భంగా గ్యారేజ్ సేల్ లాంటిదే మరేదైనా ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఇలా ఏటా.. ఒక ఈవెంట్ చేసి ‘స్వాతి’లాంటి కొందరి చిన్నారుల జీవితాల్లోనైనా వెలుగులు నింపగలిగితే.. అది నన్ను నేను సూపర్‌స్టార్‌లా భావించుకునేంత గర్వాన్నిస్తుంది.