అల్లాహ్‌ రామ్‌ ఔర్‌ కృష్ణ్‌ ఏక్‌ హై! | Sai Patham Interchange 14 | Sakshi
Sakshi News home page

అల్లాహ్‌ రామ్‌ ఔర్‌ కృష్ణ్‌ ఏక్‌ హై!

Published Sun, Aug 19 2018 12:57 AM | Last Updated on Sun, Aug 19 2018 12:57 AM

Sai Patham  Interchange 14 - Sakshi

ఎన్నిసార్లు కృతజ్ఞతానమస్కారాలని సాయికి సమర్పించినా, ఎన్నిమార్లు హృదయం నిండుగా ఆయనకి మన ఆనందాన్ని అర్పించినా, ఇంకా మనం రుణపడే ఉంటాం సాయికి. కారణం ఆయన మనకి చూపిన తోవ, దాంతోపాటు నడవవలసిన ఆ మార్గంలో మనం తడబడుతున్న వేళ చేతిని పట్టి నడిపించిన తీరూను. షిర్డీలో గోపాలరావు గుండ్‌ ఇతర భక్తులు కలిసి ఉరుసు ఉత్సవం రోజునే శ్రీరామనవమి ఉత్సవాన్ని జరుపదలిస్తే అడుగడుగునా వచ్చిన అడ్డంకుల్ని సాయి తొలగించాడనుకున్నాం కదా! ఈ సందర్భంలో గోపాలరావు గుండ్‌కి మిత్రుడైన కేస్కర్‌(అన్నాకేస్కర్‌) మరో శుభవార్తని తెచ్చాడు.కేస్కర్‌కి వివాహమైంది. సంతానం కలగలేదు. గోపాలరావు గుండ్‌ లాగానే భార్య ప్రోత్సాహం, అనుమతి మీద మరో వివాహాన్ని చేసుకున్నాడు. అయినా సంతానం కలుగలేదు. గోపాలరావు గుండ్‌ అనుభవాన్ని, ఇతరభక్తులకి సాయి చూపిన లీలల్ని విని సంపూర్ణమైన భక్తితో తన భార్యలిద్దరితో సాయిని దర్శించి, తన ఆవేదనని సాయికి, ఆయన కన్నుల్లోకి కళ్లు పెట్టి చూస్తూ విన్నవించుకున్నాడు.సాయి కన్నులు ఆకర్షణకి గనులు, అమృతకలశాలు కాబట్టి చాలా కొద్దికాలంలోనే కేస్కర్‌కి సంతానం కలిగింది. ఆ ఆనందానికి అవధుల్లేని కేస్కర్‌.. గోపాలరావు గుండ్‌ చేస్తున్న ఉత్సవంలో తనవంతుగా ‘ఏం చేయమంటావ్‌’ అని అడిగాడు. ‘అయితే ఉరుసు ఉత్సవానికి ఓ జెండాని మహమ్మదీయ పూజా చిహ్నంగా తేవలసింది’ అన్నాడు గుండ్‌. ఈ విషయం తెలిసిన వెంటనే ‘నిమోల్కర్‌’ అనే పేరున్న మరో భక్తుడు తానూ ఒక జెండాని తెస్తానని చెప్పాడు.

భగవంతుడు ప్రతివ్యక్తికీ చేతుల్ని ఇస్తూ ఒక్కో చేతికీ ఐదేసి చొప్పున వేళ్లుండేలా చేశాడు. ఏమిటి దీని అర్థం? చేతికున్న వేళ్లలో ఏ ఒక్కటీ మరొకదానితో బలంలో పొడవులో సమానం కానే కావు. అయినా ఐకమత్యంతోనే ఉంటాయి. అన్నీ కూడ మణికట్టు ఆజ్ఞకి లోబడే ఉంటాయి. ఆ చేతికి ఈ మణికట్టు తగిలించబడి ఉంటుంది కాబట్టి చేతిని బట్టి నడుస్తూ ఉంటుంది. సంఘంలో ఉన్న మనం కూడా అంతే. ఆర్థికంగానూ, కుటుంబపరంగానూ, ఉద్యోగపరంగానూ ఇలా అనేకవిధాలుగా మనం ఎన్నెన్నో తీరులుగా ఉంటున్నప్పటికీ ఒకే ధర్మమనే సూత్రానికి కట్టుబడి ఉండాలనే విషయాన్ని అర్థం చేసుకోగలగాలి ఈ మణికట్టు వేళ్ల అమరిక ద్వారా. ఎప్పుడైతే గుండ్‌ ప్రారంభించదలిచాడో.. దానికి పాటిల్‌ ద్వయం, మాధవరావులు సహక రించారో.. దానికి షిర్డీ గ్రామవాసులంతా బలాన్నిచ్చారో.. ఈ మొత్తానికి తానూ సహకరిస్తానని కేస్కర్‌ చెప్పాడు. దీన్నంతా గమనిస్తే హృదయపూర్వకంగా చేయదలిచిన పనైతే అందరూ సహకరించేలా దైవం చేసి తీరుతాడని అర్థమవుతుంది. ప్రజలనందర్నీ వాళ్లతో పాటు ఋషుల్నీ, దేవతల్నీ కూడా బాధిస్తున్న రావణవధ కోసం కేవలం రాముడు మాత్రమే ప్రయత్నించలేదు. వానరాలనీ, జటాయుపక్షినీ, జాంబవంతుడ్నీ.. ఇలా ఆయన సమీకరించుకోలేదు. ధర్మమనేది రామునివైపు ఉన్న కారణంగా రామునికే వీరందరూ ఎవరికివారు ఎదురెళ్లి సహాయం చేస్తామని ప్రార్థించి సహాయకులుగా చేరారు. అదే తీరుగా సాయి ఎప్పుడూ షిర్డీలో ఉత్సవం చేయవలసిందని కోరలేదు. ఎవరి ద్వారానూ చెప్పించలేదు. ఇది గొప్పదనమంటే! 

రామభజనలతో జెండాలా?
ఉరుసు పండుగ చేయాల్సిన రోజురానే వచ్చింది. నడబావి నిండుగా నీరుంది. ఎందరు తాగినా తరగని నీటితో కన్పించింది. సాయి తన చేత్తో పువ్వుల్ని వేయకముందు ఉప్పుబావిగా పేరుపడ్డ నేటి ఆ మంచినీటిబావిని చూసి నీరు తాగి ఆశ్చర్యపడనివారు వేరు. సాయికి మనసులో నమస్కరించని వారూ లేరు. ఉరుసు పండుగ అనేది నిజానికి మరణించిన మహమ్మదీయుల సమాధుల(దర్గాల) వద్ద వారికి నివాళ్లని భక్తిశ్రద్ధలతో అర్పించవలసిన పండుగే.  అయినా ఏ భేదం లేకుండా హిందువులు మహమ్మదీయుల జెండాలని చేత్తో పట్టుకుని రామభజనని ప్రారంభిస్తూ షిర్డీ గ్రామమంతటా తిరుగసాగారు. హిందువులంతా మహమ్మదీయ జెండాతో ముందు నడిచారు.మహమ్మదీయులంతా రామభజనలని చేస్తూ ఆ వెనుక నడిచారు. వీరి వెనుక కేస్కర్‌ తెచ్చిన జెండాతో హిందువులు, ‘నిమోల్కర్‌’ అనే ఆయన తెచ్చిన జెండాతోనూ హిందువులు ఊరేగింపులో కలిశారు. సాయి ఎప్పుడూ ఉండే మసీదు(ద్వారకామాయి) వద్దకి ఊరేగింపు రాగానే ఆ రెండు జెండాల్లో ఒకదాన్ని హిందువులు ద్వారకామాయి భవనానికి ఒకవైపునా, మహమ్మదీయులు ఆ రెండోజెండాని మరొకవైపునా పెట్టారు. ఇప్పటికీ ద్వారకామాయికి కన్పించే ఆ రెండు జెండాలూ హిందు – మహమ్మదీయ సమైక్యానికీ, వీటి స్థాపన జరిగిన ప్రాచీన కాలానికీ సంకేతంగా నిలుస్తాయి. సాధారణంగా మనుష్యులు మాట్లాడటం వరకే పరిమితమవుతూ అన్నిమతాలు ఒకటే అనడాన్ని వింటుంటాం. ఇక్కడ ప్రత్యక్షంగా దర్శిస్తాం నేటికీ.

హిందూ మహమ్మదీయ సమైక్యం
సాధారణంగా ఇలాంటి సున్నితమైన అంశాలకి సంబంధించిన సంఘటనలు,  హిందువుల ఊరేగింపులో మహమ్మదీయులు పాల్గోవడం, అలాగే మహమ్మదీయుల ఊరేగింపులో హిందువులు పాల్గోవడం వంటివి అరుదు. నడిపించేవారిని బట్టి నడిచేవారుంటారన్నట్లుగా.. సాయి నడిపించేవాడు కావడం వల్ల ఇలా జరిగింది. షిర్డీ వెళ్లినప్పుడు కేవలం సాయిని చూసేసి వచ్చేయడం కాకుండా ఈ జెండాలు ద్వారకామాయికి అటూ ఇటూ ఉండటాన్ని గమనించి వాటి వెనుక చరిత్రని చెప్పుకుంటూ ఉంటే చరిత్ర నిలిచిపోతుంది. ఇలా నెమరేసుకోవడం వల్ల పరస్పర మత సమైక్యభావం పెరుగుతుంది కూడా. కనీసం ఏ ఒక్క చిన్న వ్యతిరేక సంఘటన కూడా మచ్చుకి లేకపోవడాన్ని గమనించాలి. ఇంటికొక రక్షకభటుడ్ని నిలిపినా రాని శాంతి, సామరస్యమనేవి ఆధ్యాత్మికతతోనే సాధ్యమవుతాయని గ్రహించాలి. అందుకని దైవ దూషణ, దైవ వ్యతిరేకతని పరిపాలకులు ప్రోత్సహించ కూడదన్నమాట! సరే!


ఈ ఊరేగింపులని చూస్తున్న ఉత్సాహంతో స్ఫూర్తితో దలాల్‌ (అమీర్‌ షక్కర్‌ దలాల్‌) అనే సాయిభక్తుడు ఒక ప్రకటనని చేస్తూ, తాను ఇదే ఊరేగింపు రోజున చందనోత్సవాన్ని చేస్తానన్నాడు. ఫకీరులుగా (హిందూధర్మంలో సన్యాసులు, మఠాధిపతులు, పీఠాధిపతులు లాగా) జీవించిన మహమ్మదీయుల్ని గౌరవించడానికి గుర్తుగా మహమ్మదీయులు పెద్ద చందనపు ముద్దని, ఒక పెద్ద వెండి పళ్లెంలో పెట్టి దాన్ని తలమీద పెట్టుకుని సాంబ్రాణి ధూపాలతో ఇతర పరిమళద్రవ్యాలని వెదజల్లుతూ బాజాభజంత్రీలతో చేసే ఓ ఉత్సవం అది. ఆ ఊరేగింపు మొత్తం ఊరంతా సాగి మసీదుదగ్గరకొచ్చాక మహమ్మదీయసంప్రదాయం ప్రకారం మసీదులోకి తెచ్చి ఆ మసీదులో ఉండే గూడు (నించారు) లోపలా, అలాగే మసీదు గోడలలోపలా ఆ చందనాన్ని పూస్తారు. దాంతో మసీదంతా సువాసనలతో ఘుమఘమలాడుతూ ఉంటుంది. ఇలా చందనాన్ని నిజానికి మహమ్మదీయులు మాత్రమే పూయాల్సి ఉంటుంది వారి సంప్రదాయం ప్రకారం. అయితే దలాల్‌ మాత్రం హిందువులకు కూడా అవకాశం ఉంటుందని ఆ ఊరేగింపులోనే ప్రకటించాడు.సాయి ఉండే మసీదు హిందువులకి ద్వారక, మహమ్మదీయులకి మక్కా. సాయి ఆ మహమ్మదీయులందరికీ ‘అల్లా’. హిందువులందరికీ ఇష్టదైవమైన రాముడు.ఇటు నుండి గంగా, అటు నుండి యమున వచ్చి ప్రయాగలో కలిసినట్లు హిందూమహమ్మదీయ సంగమమైన ఆ షిర్డీ ఓ దివ్యధామం అన్పించింది చూసే అందరికీ.

మరో ఉత్సవం కూడా!
హిందూ – మహమ్మదీయ ఐక్యంతో 1897 నుండి 1912 వరకూ అంటే 15 సంవత్సరాల పాటు ఏ విధమైన మార్పు లేకుండా ఈ ఉత్సవాలు సాగుతూనే వచ్చాయి షిర్డీలో. ఈ క్రమంలో మరో రెండు జెండాలు సశాస్త్రీయంగా అంటే మేళతాళాలతో ప్రతిసంవత్సరం ఊరేగించి మసీదు శిఖరానికి కడతారు. అవి గాలికి రెపరెపలాడుతూ ఇప్పటికీ ఎగురుతూ కన్పిస్తాయి.ఇది ఇలా జరుగుతుంటే ‘సాయినాథ సగుణోపాసన’ అనే గ్రంథాన్ని సాయిని గురించి రచించిన భీష్మ (కృష్ణారావు జాగేశ్వర భీష్మ) అనే ఆయన ఈ ఉత్సవాన్ని చూడ్డం కోసం 1912లో వచ్చాడు. ఒక సమయంలో ‘కాకా’ (కాకామహాజని అనే పేరున్న లక్ష్మణరావు) అనే ఆయన పూజాద్రవ్యాలతో మసీదుకి వెళ్తూ కన్పించాడు. దాంతో భీష్మ ఆ కాకాని పిలిచి ‘ఎలాగూ ఉరుసు – శ్రీరామనవమీ సాగుతూనే ఉన్నాయి కాబట్టి వీటితో పాటు శ్రీరామజన్మదినోత్సవాన్ని కూడా జరుపుకుంటే మరింత బాగుంటుందేమో కదా! ఆ ఖర్చు ఏదైనా ఉంటే భరించడానికి నేను సిద్ధం’ అన్నాడు.వెంటనే కాకా.. ‘భీష్మా! ఏ పనినైనా మన ఆలోచనకి అనుగుణంగా మనం ప్రారంభించడం సరికాదు. అలా లోగడ ప్రారంభించాక అడ్డంకి వచ్చి, మళ్లీ సాయి ద్వారా సమస్య పరిష్కరింపబడి సాగాయి కొన్ని ఇక్కడ. అందుకని సాయికి విన్నవించుకుని ఆయన అనుమతిస్తే ముందుకెళ్దాం’ అని అన్నాడు.ఇది భక్తులందరికీ ఓ సూచన లాంటిది. ఏ పనిని చేయబోయినా సాయికి ముందుగా విన్నవించుకుంటే సాగనిదీ, ఆగిపోయేదీ ఉండనే ఉండదు. అలా ఏదో కారణాల వల్ల కానిపక్షంలో అడ్డంకి వస్తుంది. సాయికి విన్నవించుకుంటే పని సరైన తీరులో ముగిసి తీరుతుంది. సాయి ఏం చేస్తాడని వ్యతిరేకించి, విరోధించి పని చేయబోతే లోగడ కులకర్ణి (కరణం) లాగా నవ్వుల పాలు అయి తీరుతారు. ఇది భక్తుల్లో ఎందరికో జరిగే అనుభవం. దాంతో కాకా, భీష్మ ఇద్దరూ శ్రీరామజన్మదినోత్సవాన్ని చేయడానికి ఏం కావాలో, ఎవరెవరు అవసరమో.. ఆ తీరుగా మొత్తం ఆ జాబితాని సిద్ధపరిచారు ముందుగా. శ్రీరామజన్మదినోత్సవం నాడు రాముణ్ణి గురించిన కీర్తనలని గొంతెత్తి పాడటం అక్కడి వారి సంప్రదాయం. దానికి తోడుగా హార్మోనియం వాయిద్యాన్నే వాడటం అక్కడి రివాజు.ఆనందంగా కీర్తనలు వాయిద్యధ్వనీ సాగాక పాల్గొన్న అందరికీ ప్రసాదాన్ని పంచాల్సి ఉంటుంది. ఇదీ ప్రణాళిక.

మంచిపని చేయబోతే, అది కూడా హృదయపూర్వకంగా చేయదలిస్తే అది కచ్చితంగా అవుతుంది. అంతేకాక ఏ పనినైనా సాయి సామ్రాజ్యమైన షిర్డీలో సంకల్పిస్తే అసాధ్యమంటూ ఉండదు. ఇది అక్కడి భక్తుల సంపూర్ణ అనుభవం. ఆ కారణంగా ‘కీర్తన’లనగానే తానే ఆలపిస్తానన్నాడు భీష్మ. ‘కీర్తనలెక్కడ దొరుకుతాయి’ అనుకుంటూండగానే రామాఖ్యానమనే కీర్తనలగ్రంథం ఉందని ఆయనే బదులిచ్చాడు. సరే! మరి ‘హార్మోనియం ఎక్కడా? వాయించే వ్యక్తి ఎక్కడా?’ అంటూండగానే కాకా..  ‘తన వద్ద హార్మోనియం ఉందనీ.. వాయించడం తనకి వచ్చు’ అని అన్నాడు. మరి ప్రసాదాల విషయం అనగానే అమిత సాయి భక్తురాలైన రాధా కృష్ణమాయి తానుండగా మరొకరి ఆలోచనే వద్దంది. ‘ఇంక శ్రీరామజన్మదినోత్సవానికి ఏం కావల్సి ఉంది’ అని భీష్మ అనగానే ‘సాయి అనుమతి మాత్రమే’ అన్నాడు కాకా.ఇలాంటి చరిత్రలని చదివినా, చదివించినా, విన్నా, వినిపించినా ‘మనకంటూ అన్ని పరికరాలు సిద్ధంగా ఉన్నా, చేయగలశక్తి కూడ ఉన్నా తప్పనిసరిగా పరమేశ్వరుని అనుమతి అవసరమనే!’ అన్న ఆలోచన దృఢంగా వస్తుంది ఎవరికైనా. లేని పక్షంలో అన్నింటినీ తానే చేసుకోగలననే అహంకారంతో పాటు ఏదైనా కాలగమనంలో సమస్యగాని వస్తే తనకి దిక్కెవరూ లేరనే నిరాశానిస్పృహలతో జీవితం మీద విరక్తి కలిగి తనువు చాలించాలనేంత స్థితి కలగొచ్చు. నేటి కాలపు ఆత్మహత్యలకి కొంత కారణం ఇదే. అదే మరి దైవాన్ని అనుమతి అడిగి దాన్ని పొందినట్లైతే కష్టకాలంలో ఆయన్ని సేవించి తరించగలమనే ధైర్యం మనకి అండగా నిలబడుతుంది. మనల్ని నిలబెడుతుంది.

సాయి వద్దకి వీరందరూ వెళ్లగానే సాయి తనంత తానుగా.. ‘ఏం చర్చ జరుగుతోంది వాడలో?’ అని అడిగాడు. సాయి సర్వజ్ఞుడు కదా! మొత్తం జరిగిన కథని చెప్పగానే సాయి ఊదీ(విభూతి) ఇచ్చి (అంగీకారం అయినట్లయితే ఇచ్చేది ఊదీనే) ఆశీర్వదించాడు.ఈ ఆశీర్వచన వార్త షిర్డీ అంతా పాకిపోయింది. ఊరంతా పండుగ వాతావరణంతో ఆనందమయమైంది. శ్రీరామజన్మదినోత్సవం కదా! అనే ఉద్దేశంతో ప్రసాదాలని సిద్ధం చేసే బాధ్యతని తలకెత్తుకున్న రాధాకృష్ణమాయి.. సాయి ఆసనానికి ముందు ఊయల ఒకటి వేలాడదీసింది. సాయి మసీదుకొచ్చి ‘ఊయల ఏమిటి?’ అని అడిగాడు. సాయి చెప్పని ఊయలని కట్టడమనే పనిని చేయడం తప్పేమో? అనుకుంటూ ఉండగానే, సాయి మసీదులోని గూడు (భగవంతుని నివాసస్థానం – రూపంలేని స్వరూపం అని మహమ్మదీయుల విశ్వాసం) నుంచి (నింబారు అంటారుఈ గూటినే) రెండు పూలమాలల్ని తెప్పించి ఒక పూలమాలని కీర్తనలు పాడటానికి సిద్ధంగా ఉన్న కాకా మెడలో వేయవలసిందని ఆజ్ఞ చేశాడు.‘శ్రీరామచంద్రమూర్తికీ జై’ అనే నినాదాలు మిన్నుముట్టాయి. బాజాభజంత్రీల ధ్వనులు కోలాహలంగా విన్పించసాగాయి. ఆ ధ్వనులు సద్దు మణిగాక భీష్మ అమోఘ కంఠధ్వని కీర్తనలనాలపించసాగింది. కాకా హార్మోనియం వాయిద్యశ్రుతిని జత చేసింది.

సాయి కోపం – లో భావం
ఇంత కోలాహలంగా ఉత్సవం అనుకున్నదానికంటే అద్భుతంగా సాగుతుంటే భక్తులంతా గులాం చల్లుకోసాగారు ఆనంద పారవశ్యంతో. ఇంతలో పెద్ద గర్జనలాంటి ధ్వని విన్పించింది. సాయి తీవ్రకోపంతో ఊగిపోతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడసాగాడు. సాయి భక్తులకిది అలవాటులో ఉన్నవిషయమే. ఏదైనా నూతన కార్యక్రమమంటూ భక్తులు ప్రారంభిస్తే ఈ సాయి గర్జన వారికి తప్పదు. అందుకే అందరూ మౌనంగా ఉండిపోయారు. రాధాకృష్ణమాయి మాత్రం సాయి ఆసనం ముందున్న ఊయలని విప్పి తీసుకు రావలసిందని వణికిపోతూ కాకాకి చెప్పింది. కాకా అలా విప్పబోతుంటే సాయి వారించి.. ‘శ్రీరామనవమి – రామజన్మదినోత్సవం జరిగిన మరుసటి రోజున గోపాలకృష్ణుడి జన్మదినోత్సవాన్ని కూడా చేయాలి. విప్పకండి ఊయలని’ అన్నాడు. భక్తులంతా భయాన్ని వీడి ఆనందంతో నృత్యం చేశారు.గులాం పొడి బాబా కళ్లలో పడి ఆయన ఆ బాధతో తిట్టినట్లుగా అందరూ భావించారు. అయితే లో – రహస్యం అది మాత్రం కాదు. ఏదైనా ఓ కొత్త కార్యక్రమాన్ని శుభకార్యక్రమంగా ప్రారంభిస్తున్నప్పుడు అందరి దృష్టి ఒకేలా ఉండదు కాబట్టి, ఏదైనా విఘ్నమో, పొరపాటో, నష్టమో, అవమానమో జరిగితే బాగుండుననే ఆలోచనతో ఉంటారు కొందరు. ఆ కళ్ల దృష్టిదోషం(దిష్టి) పోవాలంటే ఇలా జరగడం, జరపడం మంచిది. అందుకే సాయి అలా ప్రవర్తిస్తాడు తప్ప ఉచితానుచితాలు తెలియనివాడు కాదు. (రావణ వధ అయ్యాక లంకాజనుల ఆగ్రహంగా భావించారు కొందరు.)మరునాడు గోపాలక ఉత్సవం జరిగింది. ‘కాలాహండి’ (ఉట్టిగొట్టడం) అనే ఉత్సవంలో నల్లనికుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారం, మిఠాయిలు కలిపి ఉంచుతారు. వినోదం చేస్తూ దాన్ని పగలగొట్టి ఆ అటుకులని, మిఠాయిల్నీ భక్తులకి పంచి పెడతారు. గోపబాలకులకి కృష్ణుడు ఎలా తినుబండారాలని పెట్టేవాడో ఆ దృశ్యాన్ని తలపింపజేసే ఘట్టం ఇదన్నమాట! ఉరుసు – శ్రీరామనవమి – శ్రీరామ జన్మదినోత్సవం – చందనోత్సవం – గోపాలకోత్సవం... ఇలా ఇన్నింటిని అరమరికలు లేకుండా నిర్వహించిన సాయిని ఏమనాలి? ఎవరనాలి? ఇక బాబా యోగశక్తులని గురించి తెలుసుకుందాం!
సశేషం.
∙డా. మైలవరపు శ్రీనివాసరావు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement