
ఆ యాప్ ఉందా?
గర్భం వచ్చే అవకాశాలను అంచనా వేసే ‘నేచురల్ సైన్స్’ యాప్‌ను శాస్త్రవేత్తలు డెవలప్ చేశారని చదివాను. ఇది పరిశోధన దశలోనే ఉందా? మార్కెట్‌లోకి వచ్చిందా? ఈ యాప్ గర్భనిరోధక మాత్రలతో సమాన ఫలితాలను ఇస్తుందని, ఈ యాప్‌ను వాడితే గర్భనిరోధక మాత్రల అవసరం ఉండకపోవచ్చునని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజం?
– ఆర్.రమ్య, ఆదిలాబాద్
గర్భం రాకుండా ఆపడానికి ఎటువంటి యాప్‌లు పనిచేయవు. ఇంకా అటువంటి యాప్‌ను ఎవరూ డెవలప్ చేయలేదు. అవన్నీ పరిశోధన దశలోనే ఉన్నాయి. ఒకవేళ తయారుచేసినా, అది నూటికి నూరు శాతం పనిచేయదు. వాటి ద్వారా ఒకవేళ సేఫ్ పీరియడ్, అన్‌సేఫ్ పీరియడ్ వంటి వాటిమీద అవగాహన పెంచి, వాటిని పాటించడం వల్ల గర్భం రాకుండా ఉండే అవకాశాలను పెంచవచ్చు. అంతేకాని, అసలు రాకుండా ఉండటం జరగదు.
నాకు లేటుగా పెళ్లయింది. ఇప్పుడు నా వయసు 35 సంవత్సరాలు. ఈ వయసులో పిల్లల్ని కనడం మంచిదేనా? పిల్లల్ని కనడానికి ముందు ‘బేస్‌లైన్ టెస్ట్’ చేయించుకోవడం మంచిది అంటున్నారు. ఈ టెస్ట్ గురించి వివరించగలరు. ఈ టెస్ట్‌ను భార్యాభర్తలిద్దరూ చేయించుకోవాలా? ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల సమస్య ఏమిటి అనేది స్పష్టంగా తెలుస్తుందా?
– కె.సంధ్య, రాజోలు
సాధారణంగా ఆడవారిలో, అండాశయాలలో ఉండే అండాలు, వాటి సంఖ్య, నాణ్యత 30 సంవత్సరాలు దాటే కొద్దీ మెల్లగా తగ్గడం మొదలవుతుంది. 35 సంవత్సరాలు దాటే కొద్దీ అండాల సంఖ్య, నాణ్యత బాగా తగ్గుతుంది. దీనివల్ల సాధారణంగా గర్భం దాల్చడానికి ఇబ్బంది అవ్వవచ్చు. గర్భం దాల్చినా, కొంతమందిలో అండాల నాణ్యత సరిగా లేకపోవటం వల్ల, పిండంలో జన్యు లోపాలు ఏర్పడి, అబార్షన్లు అవ్వడం, పిండం సరిగా పెరగకపోవటం, బిడ్డలో అవయవ లోపాలు వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. అంతే కాకుండా 35 సంవత్సరాలు దాటే కొద్దీ, గర్భం దాల్చిన తర్వాత, బీపీ, షుగర్ వంటి సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. 35 సంవత్సరాలు దాటిన వారందరికీ ఈ సమస్యలు రావాలని ఏమీ లేదు. కాకపోతే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
గర్భం కోసం ప్రయత్నం చేసే ముందు, CBP, RBS, Sr.TSH, Sr.FSH, Sr.AMH , ఏ స్కానింగ్ ద్వారా ఒవేరియన్ రిజర్వ్, ఫాలిక్యులార్ కౌంట్, ఫాలికులార్ స్టడీస్ వంటి బేస్‌లైన్ పరీక్షలు చేయించు కోవడం వల్ల, హార్మోన్ల పనితీరు ఎలా ఉంది, అండాలు ఏర్పడే ఫాలికిల్స్ సంఖ్య ఎలా ఉంది, వాటి పనితీరు, అండం విడుదల ఎలా ఉంది అనే విషయాల మీద ఒక అంచనా వేయవచ్చు. ఇవి మామూలుగానే ఉంటే మొదటి ఆరు నెలలు గర్భం కోసం మామూలుగానే ప్రయత్నం చేయవచ్చు (రోజు ఫోలిక్ యాసిడ్ మాత్ర ఒకటి వేసుకుంటూ), ఆరు నెలలు దాటినా గర్భం రాకపోయినా, ఒకవేళ ఆడవారి పరీక్షలలో సమస్య ఉంటే, సమయం వృథా చేయకుండా, సమస్యకు తగ్గ చికిత్స తీసుకుంటూ గర్భం కోసం ప్రయత్నం చేయటం మంచిది.
మగవారిలో కూడా ముందుగానే వీర్య పరీక్ష, బీపీ, షుగర్ వంటివి చేయించుకుంటే, సమస్య ఏమీ లేకపోతే మంచిదే. ఒకవేళ వీర్య కణాలు తక్కువగా ఉంటే, సమయం వృథా కాకుండా ముందుగానే చికిత్స తీసుకోవచ్చు.ఈ పరీక్షలో సమస్య నూటికి నూరు శాతం స్పష్టంగా తెలియకపోయినా సమస్య వచ్చే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయో చికిత్స ఎంత అవసరం అనేది తెలుస్తుంది. గర్భం దాల్చిన తర్వాత రెండు నెలలలో పిండం ఏర్పడిందా లేదా, హార్ట్ బీట్ ఉందా లేదా అనే స్కానింగ్, మూడో నెల చివరిలో ఎన్‌టీ స్కానింగ్, 5వ నెలలో టిప్ఫా స్కానింగ్, 6వ నెలలో 2డి ఫీటల్ ఎకో వంటివి చేయించుకోవడం వల్ల, పిండంలో అవయవాలు ఎలా ఉన్నాయి, గుండె సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేవి, చాలావరకు ముందే తెలుసుకోవచ్చు.
మూడో నెలలో డబుల్ మార్కీ టెస్ట్ లేదా 5వ నెలలో ట్రిపుల్ మార్కర్ లేదా క్వాడ్రపుల్ టెస్ట్ వంటి రక్త పరీక్షలు చేయించుకోవడం వల్ల బిడ్డలో కొన్ని రకాల జన్యుపరమైన సమస్యలు ఉండే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయో తెలుసుకుని, దాంట్లో రిస్క్ ఎక్కువ అని వస్తే, బిడ్డ చుట్టూ ఉండే ఉమ్మనీరు తీసి క్యారియెటైపింగ్ పరీక్ష చేయించుకోవడం వల్ల క్రోమోజోమల్ (జన్యుపరమైన) సమస్యలు నిర్ధారణ చేసుకోవచ్చు. మీరు ముందే భయపడకుండా, క్రమంగా అవసరమైన పరీక్షలు చేయించుకుని, గర్భం కోసం ప్రయత్నించండి.