పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు... | sakshi health counseling | Sakshi
Sakshi News home page

పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు...

Published Sun, Mar 5 2017 1:18 AM | Last Updated on Wed, Apr 3 2019 3:50 PM

పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు... - Sakshi

పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు...

నేను మేనమామ కొడుకును పెళ్లి చేసుకోబోతున్నాను. మేనరికపు పెళ్లిళ్ల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని పెద్దలతో వాదించాను. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు అంటూ మేనరికపు పెళ్లి చేసుకున్న ఇద్దరు ముగ్గురిని ఉదాహరణగా చూపి ‘వాళ్ల పిల్లలు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో నీకు తెలుసు కదా!’ అని చెప్పారు. దీంతో నేను పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు. పెళ్లికి ముందు ఏమైనా పరీక్షలు చేయించుకుంటే మంచిదా? తెలియజేయగలరు.
–సి.ఆర్, ఒంగోలు

మేనరికపు పెళ్లిళ్ల వల్ల, అంటే దగ్గరి రక్తసంబంధీకులు పెళ్లి చేసుకున్నప్పుడు వారి జన్యువులలో ఏ చిన్న సమస్య ఉన్నా, ఇద్దరి జన్యువులు బిడ్డకు సంక్రమించడం జరుగుతుంది కాబట్టి పుట్టే బిడ్డలో అది బయట పడుతుంది. ముందు తరాల వాళ్లవి కూడా మేనరికపు పెళ్లిళ్లే అయితే పుట్టే బిడ్డకు సమస్యలు తలెత్తే అవకాశం ఇంకా పెరుగుతుంది. మామూలుగా పెళ్లి చేసుకునేవారి పిల్లల్లో జన్యు సమస్యలు, అవయవ లోపాలు, ఇతర సమస్యలు 2–3 శాతం ఉంటే, మేనరికపు పెళ్లిళ్ల వల్ల పుట్టే పిల్లల్లో ఈ సమస్యలు 4–6 శాతం వరకు ఉండవచ్చు. అంటే రెట్టింపు అన్నమాట. అంతేకాని మేనరికపు పెళ్లిళ్ల వల్ల పుట్టే పిల్లలందరికీ సమస్యలు ఉంటాయనేమీ లేదు. పెళ్లికి ముందుగా మీరిద్దరూ ఒకసారి జెనెటిక్‌ కౌన్సెలర్‌ను సంప్రదించండి.

మీ కుటుంబంలోని అందరి వివరాలు, వారిలో ఉండే సమస్యలు వంటివి అన్నీ అడిగి తెలుసుకుని, వివరాలన్నింటినీ విశ్లేషించి మీకు పుట్టబోయే బిడ్డలకు సమస్యలు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయో తెలిపే ప్రయత్నం చేస్తారు. అవసరమైతే మీరిద్దరికీ రక్తపరీక్ష చేసి చూస్తారు. జెనెటిక్‌ కౌన్సెలర్లు కూడా మీకు పుట్టబోయే బిడ్డలకు జన్యు సమస్యలు వస్తాయని గాని, లేదని గాని నూటి నూరు శాతం ముందుగానే చెప్పలేరు. అయితే, వీలైనంత వరకు మేనరికపు పెళ్లిళ్లను నివారించడమే క్షేమం. తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకున్నా, పుట్టబోయే బిడ్డలకు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే, వాటిని నివారించడానికి ఎలాంటి మందులు, ఇంజెక్షన్లు లేవు. కాకపోతే బిడ్డ కడుపులో ఉన్నప్పుడే కొన్ని రకాల జన్యు సమస్యలు, అవయవ లోపాలు గుర్తించడానికి మూడో నెల చివరలో ఎన్‌టీ స్కాన్, డబుల్‌ మార్కర్‌ టెస్ట్‌ లేదా క్వాడ్రుపుల్‌ టెస్ట్‌ చేయించుకోవడం మంచిది.

ఐదో నెల చివరలో 2డీ ఎకో స్కాన్‌ చేయించుకుంటే గుండెలో రంధ్రాలు వంటివి ఉన్నట్లయితే ముందుగానే తెలుసుకోవచ్చు. కొన్ని రకాల జన్యు సమస్యలు, అవయవ లోపాలు బయటపడినప్పుడు, వాటికి చికిత్స లేనప్పుడు పుట్టిన తర్వాత జీవితాంతం బాధపడే కంటే ముందుగా తెలుసుకోవడం వల్ల వద్దు అనుకుంటే ఐదో నెల లోపల అబార్షన్‌ చేయించుకునే అవకాశాలు ఉంటాయి. కాకపోతే, కొన్ని రకాల పరీక్షలు చేయించుకున్నా, పుట్టబోయే బిడ్డలో ఎటువంటి సమస్యలూ ఉండవని నూటికి నూరు శాతం చెప్పలేము. మూగ, చెవుడు, బుద్ధిమాంద్యం, మెటబాలిక్‌ డిజార్డర్, హార్మోన్ల లోపాలు వంటివి బిడ్డ పెరిగే కొద్దీ బయటపడతాయి. గర్భం కోసం ప్రయత్నం చేసే మూడు నెలల ముందు నుంచే ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు రోజుకొకటి వాడటం మంచిది.

నాకు ఒకప్పుడు క్యాన్సర్‌ వచ్చి కీమోథెరపీ చేయించుకున్నాను. ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు. అయితే పిల్లలు కావాలనుకుంటున్నాను. కీమోథెరపీ ప్రభావం అండాలపై పడి, అండాలు తరిగిపోతాయని, ఉన్నవి ఆరోగ్యంగా ఉండవనే విషయం తెలిసింది. ఇది ఎంత వరకు నిజం? కీమోథెరపీ చేయించుకున్న నేను పిల్లల్ని కనవచ్చా? కంటే ఎలాంటి సమస్యలు ఏర్పడతాయి?
– బి.ఆర్‌., హైదరాబాద్‌

మీ వయస్సు ఎంతో రాయలేదు. కీమోథెరపీ తీసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుందో రాయలేదు. కీమోథెరపీలో వాడే చాలా మందుల ప్రభావం వల్ల అండాశయంలోకి అండాలు పెరిగే ఫాలికల్స్‌ ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, వయస్సును బట్టి, మందుల మోతాదును బట్టి నశించిపోవటం, వాటి నాణ్యత తగ్గిపోవటం జరుగుతుంది. కీమోథెరపీ పూర్తయి కొన్ని సంవత్సరాలకి, దాని ప్రభావం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత  అండాశయాల సామర్ధ్యతను బట్టి, కొందరిలో కొన్ని ఫాలికల్స్‌ మెల్లగా పెరిగి అండాలను విడుదల చేయడం జరుగుతుంది. కీమోథెరపీ సమయంలో కొన్ని సంవత్సరాల పాటు, పీరియడ్స్‌ ఆగిపోవటం జరుగుతుంది.

వాటి ప్రభావం తగ్గిన కొన్ని సంవత్సరాలకు, కొందరిలో వయస్సును బట్టి, మళ్లీ పీరియడ్స్‌ మొదలవుతాయి. మీకు ఇప్పుడు పీరియడ్స్‌ వస్తున్నాయా లేదా అనేది రాయలేదు. పీరియడ్స్‌ వస్తుంటే, గర్భం రావటానికి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. కీమోథెరపీ తర్వాత పుట్టే పిల్లలకు తప్పనిసరిగా సమస్యలు ఉండాలని ఏమీలేదు. ఒకసారి మీకు చికిత్స ఇచ్చిన డాక్టర్‌ను సంప్రదించి, క్యాన్సర్‌ పూర్తిగా తగ్గిపోయిందా, తిరగబెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని, అవసరమైన పరీక్షలు చేయించుకుని, అండాలు తయారవుతున్నాయా లేదా వంటి పరీక్షలు చేయించుకుని, వారి సలహా మేరకు నిర్ణయం తీసుకోవటం మంచిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement