ఉత్తరం: హృదయం పదిలంగా ఉండాలి
మారుతున్న జీవన శైలి స్త్రీలను గుండె సంబంధిత వ్యాధులకు బాగా దగ్గర చేస్తున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. స్త్రీలోని అత్యంత ముఖ్యమైన ఈస్ట్రోజన్ హార్మోన్‌పై ఆధునిక జీవన శైలి దుష్ర్పభావాలు చూపడమే దీనికి కారణం. హైపర్ టెన్షన్, ఒబెసిటీ తగ్గించుకోకపోతే వీటి ప్రభావం మరింత ప్రమాదకరమైన ఫలితాలను ఇస్తుంది. మన పిల్లలు బాగుండాలంటే వాళ్లకోసం మనం ఆరోగ్యంగా ఉండాలనే చిన్న లాజిక్‌ను ఇల్లాలు మరిచిపోవడం వల్లే ఈ సమస్యలు.
అందుకే పిల్లలను బాగా చూసుకోవడం, కుటుంబాన్ని బాగా చూసుకోవడం అన్న ఆలోచనలో పడి... తమకు సంబంధించిన టైమింగ్‌ను స్త్రీలు నిర్లక్ష్యం చేయడం వల్ల ఒక సమస్యకు పరిష్కారం కనుక్కోబోయి రెండు మూడు సమస్యలను సృష్టించుకోవడం అవుతోంది. ఇపుడు మనం తీసుకుంటున్న ఆహారం గాని, పళ్లు గాని, ఇతర ఏ ఆహార పదార్థాలైనా మునుపటిలా స్వచ్ఛమైనవి కావు. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఆధునిక జీవన శైలి పుండు మీద కారంలా మారుతోంది. కాబట్టి... జాగ్రత్తకు మించిన మందు లేదు. వీలైనంత వరకు ఆరోగ్యకరమైన జీవన శైలిని గడపండి. హృదయాన్ని పదిలంగా ఉంచుకోండి. లక్షల్లో ఒకరికే అసాధ్యమైన కష్టాలు సమస్యలు వస్తాయి. కాబట్టి... మనలో చాలా మందికి వచ్చే సమస్యలు పరిష్కారం ఉన్నవే.
ఇలా చేసి చూడండి...
- పాల మీద మీగడ మందంగా కట్టాలంటే, గిన్నె మీద చిల్లుల మూత పెట్టాలి!
- గారెలు నూనె పీల్చకుండా ఉండాలంటే... పిండి రుబ్బాక నాలుగైదు గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి!
- స్టౌ మీదున్న జిడ్డు ఓ పట్టాన వదలనపుడు ఉల్లిపాయను మధ్యకు కోసి, ఆ బద్దలతో రుద్దండి. స్టౌ తళతళలాడుతుంది!
- పిల్లల బట్టలపై ఇంకు మరకలు పడితే... వాటిని పుల్లటి పెరుగులో నానబెట్టి ఉతకండి. మరక మాయం!
- ఇంట్లో చీమలు ఎక్కువ చేరుతుంటే... ఉప్పు నీటిలో ముంచిన గుడ్డతో ఓసారి తుడవండి. ఇక రానే రావు!
- అగరొత్తుల బూడిదతో తోమితే వెండి వస్తువులు మిలమిలా మెరుస్తాయి!
- ఉడకబెట్టిన గుడ్లు నిల్వ ఉండాలంటే... నీరు పోసిన గిన్నెలో గుడ్లు వేసి ఫ్రిజ్‌లో పెట్టండి!
- చెప్పులు, బూట్లు బట్టతో తుడిస్తే షైనింగ్ పోతుంది. అందుకే స్పాంజితోనే తుడవాలి!
- అన్నం మెత్తగా ఉడికిపోతే... అందులో కాస్త క్యారెట్ కోరును కలిపితే పొడిగా అవుతుంది!
- నిమ్మకాయ కాస్త వడలి మెత్తబడిపోతే, దాన్ని కాసేపు గోరువెచ్చని నీటిలో వేయండి. మళ్లీ గట్టిబడిపోతుంది!