అది 1979 సంవత్సరం. నాకు హైదరాబాద్ నేరేడ్‌మెట్‌లోని గవర్నమెంట్ టీచర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు వచ్చింది. ఇన్‌స్టిట్యూట్‌కు దగ్గరలో ఒక రూమ్ అద్దెకు తీసుకున్నాను. మిగిలిన రెండు గదుల్లో తెలంగాణ ప్రాంత విద్యార్థులు ఉన్నారు.ప్రతిరోజూ ఉదయం బావి దగ్గర అంట్ల గిన్నెలు కడుక్కోవడానికి వెళ్లినప్పుడు మిగిలిన అన్నం ఒక కుక్కకు వేసేవాడిని. అన్నం తిన్న తర్వాత కిందకు వెళ్లకుండా ఆ కుక్క గడప దగ్గరే పడుకునేది.‘ఛాయ్.... ఛాయ్’ అని దాన్ని తోలేవాడిని.నేను ‘ఛాయ్... ఛాయ్’ అని అరిచినప్పుడల్లా పక్క రూమ్ మిత్రులు నవ్వేవాళ్లు.ఎందుకంటే వాళ్లు ‘హడీ.... హడీ’ అని కుక్కను తోలేవాళ్లు.నేను ఆ కుక్కకు ప్రతిరోజూ అన్నం వేయడాన్ని గమనించిన పక్కరూమ్ మిత్రులు కుక్క పైకి రాగానే ‘నీ డార్లింగ్ వచ్చింది’ అనేవాళ్లు.కొన్ని నెలల తర్వాత కుక్క కడుపు లావుగా కనిపించింది.అది గర్భవతని, పిల్లల్నికంటుందని చెప్పాడు ఫ్రెండ్. అప్పటి నుండి నేను దానికి ఎక్కువ అన్నం పెట్టేవాడిని. ఒకసారి కాలేజీకి వారం రోజులు సెలవులు ఇచ్చారు. అప్పుడు నేను మా ఇంటికి వచ్చేశాను. నేనుఇంటికి వచ్చేసిన మరుసటి రోజే కుక్కకు నాలుగు పిల్లలు పుట్టాయి.ఈలోపు మిత్రులు ఒక లెటర్ రాశారు. అందులో ఇలా ఉంది...‘మీ డార్లింగ్ ప్రసవించింది.తల్లీ పిల్లలూ బాగున్నారు.
డార్లింగ్ మీ కోసం ఎదురుచూస్తుంది’వాళ్లు లెటర్ రాసిన సంగతి, అది మా ఇంట్లో వాళ్లు చదివిన సంగతి నాకు తెలియదు. ఎందుకంటే ఆ లెటర్ అందిన రోజు నేను∙ఇంటి దగ్గర లేను.లెటర్ చదివి మా ఇంట్లో వాళ్లు ఏవేవో ఊహించుకున్నారు.‘డార్లింగ్ ఎవరు?’ ‘ఆమె నీకు ఎలా పరిచయం?’‘మాకు తెలియకుండా పెళ్లి ఏమైనా చేసుకున్నావా?’‘ఈ ఉత్తరం రాసింది ఎవరు? ఆ అమ్మాయి వైపు వాళ్లా?’‘చదువుకోవడానికి వెళ్లావా? సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకొని పిల్లల్ని కనడానికి వెళ్లావా?’ఇలా ఒకటా రెండా...ఎన్ని ప్రశ్నలు. ఎన్ని డౌట్లు. ఎన్ని ఎత్తి పొడుపులు!వీళ్లేమంటున్నారో కొద్దిసేపటి వరకు నాకు అర్థం కాలేదు. ఆ తరువాత అనుకున్నాను...‘అసలు విషయం చెప్పకుండా కొద్దిసేపు సస్పెన్స్‌లో ఉంచాలి’ అని.‘ఆమె సంగతి మీకెలా తెలుసు! ఎవరు చెప్పారు?’ అన్నాను.‘‘ఏదో ఒక విధంగా తెలిసిందిలేగాని అసలు సంగతి చెప్పు’’ అన్నారు.‘‘ఆమె నీతో పాటే చదువుతుందా?’’ అని అడిగారు.నాకేమో నవ్వు వస్తుంది.బలవంతంగా నవ్వు ఆపుకొని...‘‘అవును’’ అన్నాను.‘‘నీ రూమ్‌లో ఉంటుందా?’’ అని అడిగితే...‘‘ఉండదు. రోజూ వచ్చిపోతుంది’’ అన్నాను.‘‘పెళ్లి చేసుకున్నావా?’’ అని కోపంగా అడిగితే...‘లేదు’’ అని కూల్‌గా చెప్పాను.‘‘పెళ్లికాని పిల్ల రోజూ నీ రూమ్‌కు వచ్చిపోవడం ఏమిటి? పిల్లల్ని కనడం ఏమిటి?’’ అన్నారు సీరియస్‌గా.ఇలా కొద్దిసేపు ప్రశ్నలు–జవాబులు కార్యక్రమం తరువాత అసలు విషయం చెప్పాను. అంతే.... అందరూ ఒకటే నవ్వడం!!
నవ్వుల కెమిస్ట్రీ!
అవి మేము నాగార్జున యూనివర్శిటీలో పీజీ చేస్తున్న రోజులు. ఒకసారి కెమిస్ట్రీ ల్యాబ్‌లో ఎక్స్‌పెరిమెంట్ విడివిడిగా చేయాల్సి వచ్చింది. బర్నరు వెలిగించి ఎక్స్‌పెరిమెంట్ మొదలు పెట్టాం. ఆరుగంటలు నిల్చొని ఎక్స్‌పెరిమెంట్ చేయడం కష్టమే కదా... శ్రమను మరిచిపోవడానికన్నట్లు పిచ్చాపాటి మొదలుపెట్టాం. ఎక్స్‌పెరిమెంట్ మాటేమిటోగానీ...ఒకటే జోక్‌లు... నవ్వులు! ప్రయోగం కంటే ముచ్చట్లే ప్రధానమయ్యాయి.ఎవరో తలుపు దబదబమని బాదుతున్నారు.నవ్వుల శబ్దానికి ఆ చప్పుడు వినిపించలేదు.తరువాత ఆ చప్పుడు విని తలుపు కొద్దిగా తీసి ‘కమ్ ఇన్’ అన్నది మా ఫ్రెండ్.అంతే, మా మాష్టారు బాణంలా దూసుకొచ్చారు. అందరం బిక్కచచ్చిపోయాం!‘‘తలుపులు వేసి ఎక్స్‌పెరిమెంట్ చేస్తే.... ఏదైనా అంటుకుంటే చస్తారు ’’ అని పెద్దగా అరిచారు. కొన్ని నిమిషాల పాటు అందరం భయంగా, సీరియస్‌గా ముఖాలు పెట్టాం. ఆయన అటు వెళ్లాడో లేదో షరామామూలుగా ముచ్చట్లే ముచ్చట్లు, నవ్వులే నవ్వులు!
– డి.వి.తులసి, విజయవాడ
– నక్కా రాజశేఖర్, కఠెవరం,
తెనాలి మండలం, గుంటూరు జిల్లా.
Comments
Please login to add a commentAdd a comment