తెలుగులో సూపర్‌హిట్ కామెడీ సినిమాల లిస్ట్‌లో ఎప్పటికీ స్థానం సంపాదించుకునే సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. మొదటి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకూ ఆద్యంతం నవ్వించే ఈ సినిమాలో, ఉన్న కొన్ని సెంటిమెంట్ సీన్లను కూడా ఎప్పటికీ మరచిపోలేం. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం..
నందు ఇల్లంతా సందడిగా ఉంది. ఆమె జీవితం ఒక్కసారే ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇదంతా కాస్తంత భయంగా కూడా ఉందామెకు. ఎవరితోనో ఏదో చెప్పాలని మాత్రం అనుకుంటోంది. కానీ ఎవరు వింటారు? ఎవరికి చెప్పుకుంటుంది? నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి. పెళ్లవ్వగానే భర్తతో అమెరికా వెళ్లిపోతుంది. ఇన్ని కొత్త కొత్త సవాళ్లన్నీ ఒక్కసారే మీదపడటంతో ఆలోచనల్లో పడిపోయింది. నందు ఆలోచనలను బ్రేక్ చేస్తూ.. ‘‘ఏంటి నందూ!! ఏంటి అమెరికా కబుర్లూ..?’’ అడిగింది నందు అత్త సుజాత, నిశ్చితార్థం జరిగిన వారానికి ఇంటికి వచ్చిందామె. నందు అత్తపై కోపంగా ఉంది, నిశ్చితార్థానికి రాలేదని. ‘‘నేన్నీతో మాట్లాడను పో!’’ అంది నందు, కోపంగా.
అదేరోజు రాత్రి. నందు తన గదిలో పుస్తకం చదువుతూ కూర్చుంది. సుజాత అప్పుడే నందు గదికి వచ్చింది. ‘‘ఏంటి నందూ! ఏం చదువుతున్నావ్?’’ అడిగింది సుజాత. నందు ముఖం తిప్పుకొని మళ్లీ పుస్తకం చదవడంలో పడిపోయింది. ‘‘నాకంటే ఈ పుస్తకం ఎక్కువా నీకు?’’ సుజాత. ‘‘నా ఎంగేజ్‌మెంట్ కంటే మీ అత్తగారెక్కువా నీకు?’’ ‘‘అది కాదు నందూ..’’ ‘‘నాకు నీ మీద ఇక్కడ దాకా కోపం ఉంది..’’ పీకమీద చెయ్యి పెట్టుకొని చెప్పింది నందు. ‘‘ఆరోజు నేనెంత డిజప్పాయింట్ అయ్యానో తెల్సా! ఇప్పుడొచ్చి మళ్లీ నాతో మాట్లాడవా అని అడుగుతోంది చూడు.. చిన్నప్పట్నుంచీ అత్తా అత్తా అని నీ వెనకే తిరిగేదాన్నిగా.. అందుకే నేనంటే లెక్కే లేదు నీకు..’’ నందు మాట్లాడుతూ పోతోంది. సుజాత ఏం మాట్లాడకుండా అలాగే కూర్చొని చూస్తోంది. కళ్లలో నీళ్లు. నందు, సుజాతకు దగ్గరగా వచ్చి, ‘‘అత్తా! నేను నిన్ను హర్ట్ చేశానా?’’ అడిగింది. ‘‘ఊహూ.. నేనే మిమ్మల్నందర్నీ బాధ పెట్టాను. నీకు తెలీదు నందూ.. పెళ్లయితే చాలా మారతాయి. నీకు తెలీదు. పుట్టింటికి వెళ్లాలంటే ఎన్నో పర్మిషన్లు, కారణాలు, సంజాయిషీలు. ఒక్కోసారి అనిపిస్తుంది.. నా వాళ్లను చూడటానికి నాకిన్ని ఆంక్షలా అని!’’ సుజాత మాటలను మధ్యలోనే ఆపేస్తూ.. ‘‘అత్తయ్యా! మావయ్య నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదా?’’ అనడిగింది నందు.
‘‘అలాంటిదేమీ లేదు. మీ మావయ్య చెడ్డవాడు కాదు. అలా అని మంచివాడూ కాదు. మొగుడు. అంతే!’’ అత్తమాటలు నందుకి అర్థమైకానట్లు ఉన్నాయి. ఆలోచనల్లో పడింది. ‘‘నా పెళ్లైన ఇన్నేళ్లలో ఆయన ఒక్కసారైనా నన్ను భోంచేశావా అని అడగలేదంటే నువ్వు నమ్ముతావా?’’ ‘‘ఇదంతా మాకు ఎప్పుడూ ఎందుకు చెప్పలేదు నువ్వు..’’ ‘‘నా బాధలు చెప్పుకునేంత పెద్దవి కావు. మర్చిపోయేంత చిన్నవీ కావు..’’ సుజాత మాట్లాడుతూ ఉంటే నందు వింటూ, ఆలోచిస్తూ నిలబడింది. చాలా మాట్లాడింది సుజాత. నందుకి ఇవన్నీ కొత్తగానే ఉన్నాయి. పెళ్లంటే తనకున్న భయాన్ని పెంచలేదు, తగ్గించలేదు ఆ మాటలు. పెళ్లంటే అర్థమయ్యేలా చేశాయి అంతే. ‘‘ఈ పెళ్లిళ్లు ఎందుకు అవ్వాలి? మనం ఆడపిల్లలుగా ఎందుకు పుట్టాలి?’’ గట్టిగా ఏడుస్తూ మాట్లాడుతోంది సుజాత. నందు ఆవిడను గట్టిగా హత్తుకొని తనూ ఏడ్చేసింది.
నందు, సుజాత పెరట్లో పూలు కోస్తున్నారు. నందు అప్పటికే సుజాతను ఒక ప్రశ్న అడగాలని, అందుకు ఒక మంచి సమయం దొరకాలని చూస్తూంది. ఇదే సరైన సమయం అనుకొని అడిగేసింది.. ‘‘అత్తయ్యా! నువ్వెవ్వరినైనా లవ్ చేశావా?’’ అని. ‘‘పొద్దున్నే నేనే దొరికానా నీకు?’’ సుజాత వెటకారంగా అడిగింది. ‘‘నేను సీరియస్‌గా అడుగుతున్నాను..’’ అంది నందు. సుజాత సిగ్గుపడుతూ, తల పక్కకు తిప్పింది. ‘‘ఆ! చేశావ్‌లే!!’’ నందు సుజాతను ఆటపట్టించడం మొదలుపెట్టింది. సుజాత నవ్వింది. ‘‘ఎవరు?’’ నందు. ‘‘పేరు తెలియదు. రోజూ నేను కాలేజ్‌కి వెళుతూంటే, సందు చివర ఉండేవాడు.’’ ‘‘ఏం చేసేవాడు?’’ ‘‘చూసి నవ్వేవాడు!’’ ఇద్దరూ నవ్వుకున్నారు. ‘‘అంతేనా?’’ అడిగింది నందు. ‘‘ఏంటి అంతేనా అంటావ్? ఆ మాత్రం నవ్వడానికి సంవత్సరం పట్టింది తెల్సా?’’ నవ్వుతూ సమాధానమిచ్చింది సుజాత. ‘‘తర్వాతా?’’ ‘‘నాకు పెళ్లి కుదిరింది. అతనికి ఆ విషయం తెలిసింది. తర్వాతెప్పుడూ సందు చివర అతను కనబడలేదు.. పాపం మంచోడు!’’ ‘‘పిరికోడు.. అందుకే నీ గురించి డాడీకి చెప్పడానికి భయపడి పారిపోయాడు..’’ ‘‘ఆ విషయం ఇంట్లో తెలిస్తే, చాలా గొడవై ఉండేది తెల్సా?’’ ‘‘అసలు చెప్తే కదా! గొడవయ్యేదో లేదో తెలిసేది!!’’ ‘‘నేను చెప్పలేదని ఎగతాళి చేస్తున్నావా?’’ కాదన్నట్టు తలూపి, ‘‘నేనెవర్నైనా ఇష్టపడితే, ధైర్యంగా ఆ విషయం డాడీతో చెప్పేదాన్నీ అంటున్నా..’’ అంది నందు. ‘‘ఇంక నీకు ఆ చాన్స్ లేదులే!’’ అంది సుజాత గట్టిగా నవ్వుతూ. ఒకర్ని ఇష్టపడే అలాంటి రోజు ఒకటి ముందు రోజుల్లో నిజంగానే వస్తుందని తెలియని నందు, సుజాతతో పాటే నవ్వింది.
ఇంక నీకు ఆ చాన్స్ లేదులే!
Published Sun, Dec 24 2017 12:12 AM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment