అసలు మా తాత  అలా చేసి ఉండకపోతే! | Seen is yours title is ours | Sakshi
Sakshi News home page

అసలు మా తాత  అలా చేసి ఉండకపోతే!

Published Sun, Sep 9 2018 12:08 AM | Last Updated on Wed, Apr 3 2019 4:37 PM

Seen is yours title is ours - Sakshi

ఒక మరాఠీ చిత్రానికి రిమేక్‌గా వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్, స్ట్రెస్‌బస్టర్‌ అనిపించుకుంది. ప్రతి డైలాగులో నవ్వుల పువ్వులు పూసే  ఈ సినిమాలో ప్రతి సీన్‌... నవ్వుల విందే! నవ్వుకు బ్రహ్మానందరథం పట్టిన  ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం...

వంటరూమ్‌లో కూర్చొని కూరల ఆరా తీస్తున్నాడు బ్రహ్మానందం. ఈలోపే భళ్లుమని పెద్దశబ్దం. వంటరూమ్‌ కిటికీలో నుంచి  ఎవరో దూకారు. ‘దొంగా దొంగా’ అని భయంతో కళ్లు మూసి కళ్లు తెరిచాడు బ్రహ్మానందం. కళ్లు తెరిచిన టైమ్‌లో వాస్తవం కళ్లకు కట్టింది. వచ్చిన వాడు దొంగకాదు... తన క్లోజ్‌ఫ్రెండ్‌ రాజా! స్వీట్‌షాక్‌!!‘‘ఎన్నాళ్లకు కనిపించావురా. మేమందరం కలిసే ఉన్నాం. నువ్వు లేక లైఫంతా డల్‌గా, డిమ్‌గా, చద్దన్నంలో పెరుగేసుకొని తిన్నట్లుగా ఉంది’’ అని ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని స్నేహితుడిని రూమ్‌మెట్స్‌ మరియు పాతస్నేహితుల దగ్గరికి తీసుకువెళ్లాడు బ్రహ్మానందం. దొరలా  కనిపిస్తున్న రాజా కిటికీలో నుంచి  దొంగోడిలా ఎందుకు వచ్చాడు? బామ్మతో కలిసి పల్లెటూళ్లో ఉండే రాజా ఉన్నపళంగా పట్టణానికి ఎందుకు వచ్చాడు?అసలు ఏం జరిగింది?ఇప్పుడు మనం ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళదాం:రాజా అంటే నాటకాలు పడి చస్తాయి. రాజా స్టేజి ఎక్కితే చప్పట్లే చప్పట్లు, ఈలలే ఈలలు. అలాంటి రాజా ఈసారి కూడా కప్పు కొట్టేశాడు.మండలాధ్యక్షుడు ఆ కప్పును రాజా చేతిలో పెడుతూ ఇలా స్పీచిచ్చాడు:‘‘ఈ కప్పును తన ఇంటి కప్పుగా భావించి చిరకాలం దీన్ని చూసుకుంటూ తుడుచుకుంటూ, తుడుచుకుంటూ చూసుకుంటూ ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇక మీ చప్పట్లకు చాన్సు ఇస్తున్నాను. కొట్టుకోండి...కొట్టుకోండి’’ చప్పట్లే చప్పట్లు!

ఆ చప్పట్ల వానలో తడిసి ముదై్దన రాజా మైక్‌ అందుకొని ముద్దు ముద్దుగా ఇలా మాట్లాడాడు:‘‘మండలాధ్యక్షుడన్న ఇచ్చిన ఈ వెండికప్పును బంగారుకప్పుగా భావిస్తున్నాను. ఇది జీవితాంతం అద్దాల బీరువాలో ఉండేట్లు చూసుకుంటాను. అది నా బాధ్యత. నా ధర్మం’’రాజా నోటి నుంచి ‘నా బాధ్యత, నా ధర్మం’ అనే మాటలు పూర్తయ్యాయో లేదో...రేయ్‌...’ అంటూ రాజా బామ్మ నార్త్‌కొరియా క్షిపణిలా స్టేజీ మీదికి దూసుకువచ్చింది. మనవడు రాజాను తప్పించుకుపోయిన దొంగలా ఇంటికి ఈడ్చుకొచ్చింది.అధ్యక్షా!రాజావారు చేసిన తప్పేమిటి?కళామతల్లి పాదల చెంత పడి ఉండటం తప్పా?నాటకాలు వేయడం తప్పా?చప్పట్లను ఆస్వాదించడం తప్పా?కప్పులు అందుకోవడం తప్పా?‘తప్పా! తప్పున్నరా’ అంటుంది బామ్మ. ఎందుకో ఆమె మాటల్లోనే విందాం:‘‘ఒరేయ్‌... ఒరేయ్‌... దొంగోడివైనా సంతోషిస్తానుగానీ ఇలా నాటకాల రాయుడివైతే మాత్రం భరించలేను... భరించలేను. నీకు తెలుసా? మీ తాత, నాన్న, అమ్మ అందరూ ఈ రంగుల పిచ్చిలో పడే నాశనమయ్యారు. ఈ నాటకాల కోసం ఎకరాలకెకరాలు హారతి కర్పూరంలా కరిగించేశారు. ఈవేళ పూటకు గతి లేని స్థితికి వచ్చాం. వద్దురా వద్దు. ఆ వేషాల మోజులో, ఆ చప్పట్ల మాయలో పడి నీ జీవితం కూడా బుగ్గిపాలు చేసుకోవద్దు. బాగా చదివించాను. ఏదో ఒక  ఉద్యోగం చూసుకోరా. అది నీ వల్ల కాకపోతే... నేను ఎక్కడైనా  బిచ్చమెత్తుకొనైనా సరే నిన్ను పోషిస్తా. అంతేకాని, బతకడానికి పనికిరాని  ఆ నాటకాల జోలికి వెళ్లకు. ఒరేయ్‌...ఇంకోసారి నువ్వు స్టేజీ ఎక్కి నాటకం ఆడావంటే ఆ స్టేజీ మీదే ఉరి పోసుకొని చస్తాను’’ మ్యాటర్‌ అర్థమైంది కదా...అదీ విషయం!

బామ్మ మాటలకు  మనవడు రాజా భోరుమన్నాడు. ఇలా కూడా అన్నాడు...‘‘గత్యంతరం లేక ఈ నాటకాలు ఆడుతున్నానే.  నన్ను ఇన్నాళ్లు పోషించిన నిన్ను పోషించాలనే బాధ్యత తప్ప రంగు పిచ్చి కాదే... ఆ...ఆ...అలాగే... రేపటి నుంచి నాటకాలు ఆడ్డాం మానేస్తా... హైదరాబాద్‌కు వెళ్లి ఏదో ఉద్యోగం ఎలాగో అలాగ వెదుక్కుంటా’’అలా వచ్చాడండీ రాజా హైదరాబాద్‌కి.ఇప్పుడు మళ్లీ ఫ్రెండ్స్‌రూమ్‌లోకి వెళదాం:రాజా అతని స్నేహితుడు రాఘవ హ్యాపీగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తరువాత రాఘవ రాజాను కుశలం అడిగాడు..‘‘ఆ ఏమిటి సంగతులు. బాగున్నావు కదా!’’‘‘బాగుంటే కిటికిలో నుంచి ఎందుకు దూకుతానురా? నా పరిస్థితంతా పాతాళభైరవి అయిపోయింది. ఉద్యోగప్రయత్నాలకు ఇక్కడొచ్చి పడ్డాను’’ తాను  ఎందుకు వచ్చింది సూటిగా  చెప్పాడు రాజా.‘ఉద్యోగప్రయత్నం’ అనే మాట వినగానే భల్లుమని నవ్వాడు బ్రహ్మానందం.‘‘ఉద్యోగప్రయత్నమా? ఈ సిటీలో  ఉద్యోగం కోసం చూసుకోవడం కంటే టికెట్‌ కొనుక్కొని లాటరీ కోసం ప్రయత్నించడం మంచిది’’ అని సలహా ఇచ్చి ‘హ్హా హ్హా హ్హా’ అని పెద్దగా నవ్వాడు బ్రహ్మానందం. ఈ నవ్వులు విని భయంగా పరుగెత్తుకు వచ్చిన మరో స్నేహితుడు సుధాకర్‌...‘‘కంకరరాళ్ల మీద రోడ్డు రోలర్‌లా ఏంట్రా ఆ నవ్వు? ఇంటి ఓనర్‌ పైకి వచ్చాడంటే కొంప మునుగుతుంది’’ అని హెచ్చరించాడు. ఈ వార్నింగ్‌ మాట ఎలా ఉన్నా...‘‘ఛ! వెధవ జీవితం. మనసారా నవ్వుకోవడానికి కూడా లేదు’’ అని మూతిముడిచి...‘‘తప్పు నీది కాదురా... అసలు మా తాత అలా చేసి ఉండకపోతేనాకీ ఖర్మ పట్టేది కాదు’’ విషాదం ఒలకబోస్తూ అన్నాడు బ్రహ్మానందం.‘మా తాత అలా చేసి ఉండకపోతే’ అనే మాట విని రూమ్‌లో పిడుగు పడ్డట్లు అదిరిపడ్డారు స్నేహితులు.‘‘మీ తాత ఏంచేశాడ్రా’’ ఆందోళనతో కూడిన ఆసక్తితో, ఆసక్తితో కూడిన ఆందోళనతో అడిగాడు రాజా.‘‘ఏం చేశాడా! ఏ బిర్లాలాగో బిజినెస్‌ చేసి ఉంటే నాకీ పరిస్థితి వచ్చేది కాదు. మైసూర్‌ మహారాజులా దర్జాగా ఉండేవాడిని. వాడేమో రేషన్‌ షాప్‌లో గుమస్తాగా చేసి చచ్చాడు. నేనేమో ఈ కొంపలో జీతం లేని సర్వరును అయ్యాను’’ అని దుఃఖంతో ముక్కుచీదాడు బ్రహ్మానందం.‘‘వార్నీ... మా తాత బాబరై ఉంటే నేను అక్బర్‌నై ఉండేవాడిని అని ఫీలయ్యేవాడిని నిన్నే చూస్తున్నాను’’ అని తెగ ఆశ్చర్యపోయాడు రాజా.
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement