అనారోగ్యం మాటేమిటోగానీ అప్పుడయాన యుద్ధానికి వెళుతున్న చక్రవర్తిలా ఉన్నాడు. తెలియని ఉత్సాహం ఏదో అతని కండ్లలో వెలుగుతుంది.కళాకారులకు పెద్దగా ఏమీ అక్కర్లేదనుకుంటా.... చప్పట్లు చాలు, వన్స్‌మోరు కేకలు చాలు! ఈ మాత్రం దానికే ఆ కొద్దిసేపు వాళ్లు రాజ్యాలను జయించే చక్రవర్తులవుతారు. కుబేరుణ్ణి తలదన్నే అపరకుబేరులవుతారు.జీవితసార్థకతను ప్రేక్షకుల చప్పట్లలో కొలుచుకొని పదేపదే మురిసిపోతారు. అలాంటి ఒక కళాకారుడు సత్యవతి వాళ్ల నాన్న. ఆయన స్టేజీ ఎక్కితే, స్టేజీ మాయమై మరోలోకం కనిపిస్తుంది. ఆయన ప్రేక్షకులను ఎటో తీసుకువెళతాడు.ఈసారి మాత్రం అలా జరగలేదు. ఆయనే ఎక్కడికో వెళ్లిపోయాడు.సత్యహరిశ్చండ్రి వేషంలో ఒక చేతిలో కర్ర, ఒక చేతిలో కుండతో ఉత్సాహంగా స్టేజీ వైపు పరుగులాంటి నడకతో వెళుతున్నాడు ఆయన. కూతురు సత్యవతి ‘నాన్నా!’ అని అరుస్తూ ఆయన దగ్గరకు వచ్చింది.‘‘ఏమిటమ్మా?’’ అడిగాడు ఆయన.‘‘మాత్రలు వేసుకోవడం మరిచిపోయావు నాన్నా’’ అని గుర్తు చేసింది ఆమె.కూతురికి తన ఆరోగ్యం పట్ల ఉన్న శ్రద్ధకు ఒకవైపు మురిసిపోతూనే...‘‘ఆ డాక్టర్ చాదస్తం సగం నీకు వచ్చినట్లుందమ్మా’’ అంటూ చేతిలోని కుండను ఆమెకు ఇచ్చి మాత్రలు వేసుకొని గ్లాసులో నీళ్లుతాగి స్టేజీవైపు నడిచాడు. తండ్రి ఉత్సాహన్ని చూస్తూ తనలో తాను చిన్నగా నవ్వుకుంది సత్యవతి.నాటకం మొదలైంది.‘‘మాలిని... ఎవరైనసరే కాటి సుంకం చెల్లించిగానీ దానకార్యమునకు ఉపక్రమించను’’ అని తేల్చేశాడు హరిశ్చంద్రుడు.‘‘అయ్యా! కాటిసుంకంమును చెల్లించుటకు నా వద్ద ఏమియునూ లేదే’’ అని అసలు విషయం చెప్పింది చంద్రమతి.‘‘నేనిది బొత్తిగా నమ్మను. ఆలోచించు’’ అని కంఠంలో కాస్త కోపాన్ని కొని తెచ్చుకున్నాడు హరిశ్చంద్రుడు. ఇద్దరి మధ్య కాసేపు పదునైన పద్యాల యుద్ధం జరిగింది.
‘‘అయ్యా! నా వద్ద ఏమియు లేదన్నా నన్ను ఏల బాధించెదరు?’’ శోకతప్తహృదయంతో నిలదీసింది ఆమె.ఆమె శోకంతో తనకు బొత్తిగా పనిలేదన్నట్లు...‘‘అది మాంగల్యం కాబోలు. ఏ వెలకైనా దాన్ని తెగనమ్మి నీ సుతునికై వెచ్చించు... వెచ్చించు.. ఆ...ఆ...ఆ...’’ అంటూ రాగం తీశాడు హరిశ్చంద్రుడు.వినలేనిదేదో విన్నట్లు ‘అయ్యో! దైవమా’ చెవులకు చేతులు అడ్డం పెట్టుకుంది చంద్రమతి.తరువాత ఆలోచించింది.‘‘నా పతికి తక్క అన్యులకు గోచరించని నా దివ్యమాంగల్యం.... కాదు కాదు కాదు... ఇతడు ఛండాలుడు కాదు. నా మంగల్యం కనుగొన్న ఇతడు నా పతి హరిశ్చంద్రుడు. స్వామి... నేను స్వామి నీ చంద్రమతిని’’ అంటూ భర్త దగ్గరకు వచ్చింది.‘‘దేవీ నువ్వా! నా చంద్రమతివా? అటులైన వీడు?’’ అని కుర్రాడి శవాన్ని చూస్తూ అడిగాడు హరిశ్చంద్రుడు.‘‘మన కుమారుడు లోహితుడు’’ అంటూ ఆమె దీర్ఘమైన పద్యం ఒకటి పాడింది.హరిశ్చంద్ర– చంద్రమతులు కుమారుడి తలనిమురుతూ ‘హా లోహితా! లోహితా’ అని కంటికి మింటికి ధారగా ఏడుస్తున్నారు.ప్రేక్షకుల్లో ఏడ్వనివాడు పాపాత్ముడు!‘వన్స్‌మోర్’ అంటూ ఈలలు.పాత్రకు ప్రాణం పోస్తూ .... ఏడుస్తూ ఏడుస్తూ.... ఒక్కసారిగా స్టేజీపైనే కూలిపోయాడు సత్యవతివాళ్ల నాన్న. ‘నాన్న... నాన్న’ అంటూ ఆందోళనగా పరుగెత్తుకు వచ్చింది కూతురు.‘‘ఈసారి చాలా ఉధృతంగా వచ్చింది. వెంటనే బస్తీకి తీసుకెళ్లి పెద్ద డాక్టర్‌కు చూపించాలి’’ అని చెప్పాడు ఆ ఊరివైద్యుడు. ఆయన్ను ట్రాక్టర్‌లో ఎక్కించి తీసుకెళుతున్నారు.
‘‘ఏంకాదమ్మా’’ అంటూ పోస్ట్ మాస్టర్ బాబాయ్ సత్యవతికి ధైర్యం చెబుతున్నాడు.
ఏమైందో ఏమో ట్రాక్టర్ మధ్యలోనే ఆగింది.మెకానిక్‌ను తీసుకొస్తానంటూ డ్రైవరు కుర్రాడు పరుగెత్తుకు వెళ్లాడు. ఏడుపులు విని... అటుగా వెళుతున్న రమేష్ ‘‘ ఏమైంది?’’ అని అడిగాడు.‘‘మావాడు చావుబతుకుల మధ్య ఉన్నాడు... ట్రాక్టరేమో చెడిపోయింది. అర్జంటుగా పట్నానికి తీసుకెళ్లాలి’’ అని చెప్పాడు బాబాయ్.రమేష్ మెకానిక్ అవతారమెత్తి ట్రాక్టర్‌లో కదలిక తెచ్చాడు.‘‘ఆ డ్రైవర్ ఎప్పుడొస్తాడో ఏమో... నేను తీసుకెళ్తాను పదండి’’ అంటూ డ్రైవర్ సీట్లో కూరున్నాడు రమేష్. ట్రాక్టర్ పట్నం రోడ్డు మీద అడుగుపెట్టగానే ఊరేగింపు ఒకటి కనిపించింది. తెల్లటి పొడవాటి బ్యానర్లపై‘ప్రభుత్వ వైద్యుల సమ్మె’ అనే నీలిరంగు అక్షరాలు కనిపిస్తున్నాయి. ట్రాక్టర్ గవర్నమెంట్ ఆస్పత్రి ముందు ఆగింది. ‘‘సీరియస్ కేసు సార్. మీరు వెంటనే అడ్మిట్ చేసుకోవాలి’’ అని ఆస్పత్రి ఉద్యోగిని అభ్యర్థించాడు పోస్ట్‌మాస్టర్ బాబాయ్.‘‘ఏంలాభం లేదండీ. డాక్టర్లెవరూ లేరు. బోర్డ్ చూడలేదా!’’ అని చావుముందు కబురు చల్లగా చెప్పాడు ఆ ఉద్యోగి.‘‘ప్రజలకు ప్రాణం పోయాల్సిన డాక్టర్లు సమ్మె చేయడం ఏమిటి?’’ అని అంతెత్తు లేచాడు రమేష్. సమాధానం చెప్పేవారు లేరక్కడ.‘‘పోనీ... చుట్టుపక్కల వీధిలో ప్రైవేట్ డాక్టర్ ఎవరు లేరా?’’ ఆరా తీశాడు బాబోయ్.ఆ ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి పోయే సమయానికే సత్యవతి నాన్న ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు.స్టేజీపై ఆయన పాడిన పద్యం గాలిలో లీలగా వినిపిస్తుంది.‘నా ఇల్లాలని... నా కుమారుండని.... ఎంతో అల్లాడిన ఈ శరీరం... ఒంటరిగా కట్టెలలో కాలుచున్నది. ఆ ఇల్లాలు రాదు.... పుత్రుడు తోడై రాడు’
నావద్ద ఏమియునూ లేదు...
Published Sun, Oct 14 2018 12:13 AM | Last Updated on Tue, Oct 16 2018 3:04 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment