సెమీ కలెక్టెడ్ వేవ్స్
సిగ సింగారం
ఇది ‘సెమీ కలెక్టెడ్ వేవ్స్’ హెయిర్ స్టయిల్. పేరులోనే ఉంది కదా.. వేవ్స్ అని. అవును, ఈ స్టయిల్‌లో హెయిర్‌వేవ్స్ ఉండటమే విశేషం. సముద్రపు అలలు కాకపోయినా... ఈ వేవ్స్ కాస్తై ఆ వేవ్స్‌ను తలపించక మానవు. ఈ సెమీ కలెక్టెడ్ వేవ్స్ ఎలాంటి ఫ్యాన్సీ డ్రెస్సుల మీదికైనా నప్పుతాయి. ఫ్రాక్స్, స్కర్ట్స్, గాగ్రా, జీన్స్... ఇలా వేటికైనా సూట్ అవుతాయి. అంతేకాదు, ఈ హెయిర్ స్టయిల్ ఫ్యాన్సీ శారీస్ మీదకు కూడా భలే సెట్ అవుతుంది. దీన్ని వేసుకోవడం కూడా చాలా సులువు. కాబట్టి అందరూ ఈ హెయిర్ స్టయిల్‌ను ట్రై చేయొచ్చు.
1. ముందుగా జుత్తునంతా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. తర్వాత జుత్తును కొద్దికొద్దిగా తీసుకొని వేవ్స్‌గా మార్చుకోవాలి (అంటే జుత్తు స్ట్రెయిట్‌గా లేకుండా కర్లీగా చేసుకోవాలి)
2. ముందువైపు జుత్తును కాస్త వదిలేస్తే... ఆ అందమే వేరు. తర్వాత నడినెత్తి మీద ఓ పెద్ద పాయను తీసుకోవాలి. ఇప్పుడు ఆ పెద్ద పాయను మూడు భాగాలుగా చేసి కొద్దిగా అల్లుకోవాలి.
3. జడ కాస్త అల్లిన తర్వాత ఇరువైపుల నుంచి సన్నని పాయలను తీసుకొని, జడలో కలుపుకుంటూ అల్లుకోవాలి.
4. ఇప్పుడు ఫొటోలో కనిపిస్తున్న విధంగా... నడినెత్తి కంటే కాస్త కింద వరకు జడను అల్లి స్లైడ్స్ పెట్టేయాలి. ఇరువైపుల నుంచి సన్నని పాయలు వదులుగా వేలాడకుండా కూడా స్లైడ్స్ పెట్టుకోవాలి.
5. తర్వాత ఎడమ చెవి వైపు నుంచి ఒక సన్నని పాయను తీసి, దాన్ని అవతలి వైపుకు తీసుకెళ్లి స్లైడ్ పెట్టాలి. అలాగే కుడి చెవి వైపు నుంచి తీసిన పాయను, ఎడమ వైపుకు తీసుకెళ్లి స్లైడ్ పెట్టాలి.
6. చివరగా జుత్తునంతటికీ హెయిర్ స్ప్రే చేసుకోవాలి. అలాగే మిగిలిన వేవ్స్ (జుత్తు)ను చిక్కులు లేకుండా స్ప్రే చేసుకుంటూ దువ్వుకోవాలి. అంతే ఎంతో అందమైన వేవ్స్ మీ తలపై తారాడతాయి.