మరో బిడ్డ కావాలి... మార్గం ఉందా? | sex problems to Leila Hospital | Sakshi
Sakshi News home page

మరో బిడ్డ కావాలి... మార్గం ఉందా?

Published Sun, Feb 7 2016 12:04 AM | Last Updated on Sun, Sep 3 2017 5:04 PM

మరో బిడ్డ కావాలి... మార్గం ఉందా?

మరో బిడ్డ కావాలి... మార్గం ఉందా?

  నా వయసు 28. నాలుగేళ్ల క్రితం పెళ్లయ్యింది. తర్వాత ఆరు నెలలకే గర్భం దాల్చాను. ఎప్పుడూ ఏ ఆరోగ్య సమస్యా తలెత్తలేదు. కానీ డెలివరీ సమయంలో మాత్రం బిడ్డ అడ్డం తిరిగిందన్నారు. ఆపరేషన్ చేసి చనిపోయిన బిడ్డను బయటికి తీశారు. మళ్లీ పోయినేడు గర్భం దాల్చాను. అప్పుడు కూడా ఇలానే జరిగింది. ఎందుకిలా జరుగుతోంది అంటే డాక్టర్ సరిగ్గా చెప్పడం లేదు. తొమ్మిదో నెల ప్రారంభంలో కూడా ఏ సమస్యా ఉండనప్పుడు సరిగ్గా డెలివరీ సమయంలోనే సమస్య ఎందుకు వస్తోంది? నేనిది తట్టుకో లేకపోతున్నాను. పరిష్కారం చెప్పండి.
 - పి.మీనాక్షి, రాజమండ్రి

 కాన్పు సమయంలో నొప్పులు తీసే క్రమంలో బిడ్డకి తల్లి నుంచి రక్తప్రసరణ సరిగ్గా వెళ్లకపోయినా, ఆక్సిజన్ సరిగ్గా అందకపోయినా... ఊపిరి ఆడక, బిడ్డ కడుపులోనే చనిపోయే అవకాశాలు ఉంటాయి. కొందరిలో గర్భంతో ఉన్నప్పుడు ఏడో నెల తర్వాత షుగర్ లెవెల్స్ పెరగడం మొదలయ్యి, జెస్టేషనల్ డయాబెటిస్ రావచ్చు. దీన్ని అశ్రద్ధ చేయడం లేదా గమనించకపోవడం వల్ల తల్లిలో షుగర్స్ లెవెల్స్ బాగా పెరిగి, కొన్నిసార్లు తొమ్మిదో నెలలోనే బిడ్డ కడుపులో చనిపోయే ప్రమాదం ఉంటుంది. మరికొందరిలో బీపీ పెరగడం, ఉమ్మనీరు తగ్గడం వంటివాటి వల్ల, బిడ్డకి తల్లి నుంచి రక్తప్రసరణ సరిగ్గా అందక పోవడం వల్ల కూడా తొమ్మిదో నెలలో కడుపులో బిడ్డ చనిపోతుంది. కొన్ని రకాల యాంటి బయొటిక్స్ వల్ల కొందరి రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టుకునే అవకాశాలుంటాయి. గర్భం చివర్లో కనుక అలా రక్తం గడ్డ కట్టుకుంటే... బిడ్డకు ఆహారం, ఆక్సిజన్ సరిగ్గా అందక కూడా చనిపోవచ్చు. మీకు ఇప్పటికి రెండుసార్లు ఇలాగే అయ్యింది కాబట్టి, మళ్లీ గర్భం దాల్చకముందే సీబీపీ, బ్లడ్‌గ్రూప్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, Sr.APTT, Anti Phospholipid antibodies వంటి పరీక్షలు చేయించుకుని, సమస్యను బట్టి ముందు నుంచే చికిత్స తీసుకోవడం మంచిది. లేదంటే గర్భం దాల్చిన తర్వాత అవసరాన్ని బట్టి... రక్తం గడ్డ కట్టకుండా ఉండేందుకు, రక్తప్రసరణ సరిగ్గా ఉండేందుకు Ecosprin మాత్రలు, Heparin ఇంజెక్షన్లు వంటివి వాడవలసి ఉంటుంది. థైరాయిడ్ సమస్య ఉంటే వాటికి మాత్రలు వాడాలి. ఐదు, ఏడు, ఎనిమిది నెలల్లో షుగర్ టెస్ట్ చేయించు కోవాలి. ఎనిమిదో నెల నుంచీ ఉమ్మనీరు ఎలా ఉందో తెలుసుకోడానికి ఈౌఞఞ్ఛట టఛ్చి చెయ్యించుకోవాలి. ఇవి తగ్గుతుంటే... తొమ్మిదో నెల చివరి వరకూ ఆగకుండా, ముందుగానే కాన్పు చేయించేసుకోవడం మంచిది.
 
  నా వయసు 24. ఎత్తు ఐదడుగుల రెండంగుళాలు. బరువు 52 కిలోలు. నాకు సంవత్సరం వయసున్న బాబు ఉన్నాడు. వాడు పుట్టినప్పట్నుంచీ, అంటే డెలివరీ అయినప్పట్నుంచీ నాకు పొట్ట బాగా పెరిగిపోతోంది. నిజానికి నాకు వ్యాయామం బాగానే ఉంటుంది. ఇంట్లో పనంతా నేనే చేసుకుంటాను. పిల్లాడి పనులూ ఎక్కువే. అయినా ఎందుకిలా పొట్ట పెరిగిపోతోంది?
 - వందన, రాజేంద్రనగర్

 మీది మామూలు కాన్పా లేక సిజేరియన్ ద్వారా అయ్యిందా అన్నది రాయలేదు. బిడ్డ పుట్టినప్పుడు మీరు ఎంత బరువున్నారో కూడా రాయలేదు. తొమ్మిది నెలలపాటు బిడ్డ కడుపులో పెరిగేటప్పుడు... పొట్టమీద ఉండే కండరాలు, చర్మం బాగా సాగుతాయి. అలాగే పొట్టలో కొవ్వు కూడా చేరుతుంది. బిడ్డ బరువు బాగా ఉన్నప్పుడు కండరాలు వాటి శక్తికి మించి సాగడం జరుగుతుంది. దాంతో కాన్పు తర్వాత పొట్ట వదులయ్యి, ముందుకు వచ్చి, పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. ఆడవారు బరువు పెరిగే క్రమంలో మొదట కొవ్వు కడుపులోనే పేరుకుంటుంది. తర్వాత చేతులు, మిగతా భాగాలు లావవుతాయి. మీరు మిగతా పనులు, ఇంట్లో పనులు ఎన్ని చేసినా... సాగిన పొట్ట పూర్తిగా తగ్గిపోదు. కాబట్టి దాన్ని తగ్గించడానికి ప్రత్యేక పొట్ట వ్యాయామాలు, యోగా వంటివి చేయాలి. ఓసారి అవి ప్రయత్నించి చూడండి.
 
  నా వయసు 30. మావారికి 32. నాకు మొదట పెళ్లయ్యింది. భర్త చనిపోయారు. ఆరేళ్ల తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాను. రెండేళ్లవుతోంది. కానీ ఇంతవరకూ పిల్లలు పుట్టలేదు. దాంతో డాక్టర్ దగ్గరకు వెళ్తే స్కాన్ చేశారు. గర్భసంచిలో చిన్న గడ్డ ఉందని, నీరు కూడా ఉందని, చికిత్స తీసుకోవాలని చెప్పారు. అసలు గర్భసంచిలో నీరు ఎందుకు వస్తుంది? నేనేం ట్రీట్‌మెంట్ తీసుకోవాలి?
 - రామలక్ష్మి, కాకినాడ

  గర్భసంచిలో గడ్డ అంటే ఫైబ్రాయిడ్ కావచ్చు. అది చిన్నదే కాబట్టి దాని గురించి పట్టించుకోనవసరం లేదు. నీరు ఉందంటున్నారు. అది గర్భసంచిలో ఉందా లేక గర్భసంచి పక్కన ఉండే అండాశయాల్లో ఉందా అనేది సరిగ్గా తెలియాలి. కొంతమందికి గర్భసంచిలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే నీరు రావచ్చు. ఇన్ఫెక్షన్‌కి సంబంధించిన మందులు వాడి చూడండి. తర్వాత కూడా నీరు తగ్గకపోతే, ఆ నీటిని తీసి సైటాలజీ పరీక్షకు పంపించాల్సి ఉంటుంది. తద్వారా కారణం తెలుస్తుంది. దానికి తగ్గ చికిత్స చెయ్యించుకోవచ్చు.  
 
  నా వయసు 33. ఒక బాబు పుట్టిన తర్వాత నేను కుట్లు లేని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాను. కానీ ఇటీవలే మా బాబు ప్రమాదవశాత్తూ మరణించాడు. మేం ఒంటరివాళ్లం అయిపోయాం. నాకు మరో బిడ్డ కావాలని అనిపిస్తోంది. నేను మళ్లీ ఆపరేషన్ చేయించుకుంటే బిడ్డను కనవచ్చా? దానికి ఎంత ఖర్చవుతుంది? ఎక్కడ చేస్తారు? సలహా ఇవ్వండి.
 - ఉమా మహేశ్వరి, విశాఖపట్నం
  మీరు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ల్యాపరోస్కోపి లేదా బటన్ హోల్ ద్వారా చేయించుకున్నారు. ఇందులో ట్యూబ్స్‌ని మూసివేస్తారు. దీనివల్ల గర్భం దాల్చలేరు. కొందరికి ఈ పద్ధతిలో కూడా ట్యూబ్ మధ్యలో కాటరీ ద్వారా ట్యూబ్‌ను కొద్దిగా కాల్చి, అక్కడ కత్తిరించడం జరుగుతుంది. ఒకవేళ మీకు చేసిన ఆపరేషన్‌లో రింగ్స్ వేసివుంటే... ఆ రింగ్స్‌ను తొలగించి, ట్యూబ్‌ను తిరిగి అతికించి, అది తిరిగి తెరచుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. దీనినే రీక్యానలైజేషన్ అంటారు. దీనిలో గర్భం దాల్చే అవకాశాలు... సాధారణంగా పొట్ట కోసి చేసే ట్యూబెక్టమీ ఆపరేషన్‌లో కంటే 70 శాతం ఎక్కువగానే ఉంటాయి. డాక్టర్‌ని బట్టి, హాస్పిటల్‌ని బట్టి ఖర్చు ఉంటుంది. మీరు ఓసారి మంచి గైనకాలజిస్టును కలిస్తే, వారు మీకు వివరంగా చెప్తారు. కొందరిలో రీక్యానలైజేషన్ ఆపరేషన్ తర్వాత ట్యూబ్స్ పాక్షికంగా తెరచుకున్నా, పనితీరు సరిగ్గా లేకపోయినా గర్భం ట్యూబ్‌లోనే ఆగిపోయే అవకాశం ఉంటుంది (ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ). ఇవన్నీ ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ రిస్క్ ఎందుకు అనుకుంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా ప్రయత్నించవచ్చు.
 
  నా వయసు 23. మరో మూడు నెలల్లో నాకు పెళ్లి. అయితే నాకో చిన్న సందేహం ఉంది. నా వక్షోజాల్లో ఒకటి చిన్నగాను, ఒకటి పెద్దగాను ఉన్నాయి. ఆ విషయం నేను ఈ మధ్యనే గమనించాను. ఇదేమైనా సమస్యా? రేపు పెళ్లయ్యాక ఈ విషయం తెలిస్తే నా భర్త ఎలా రియాక్టవుతారో అని భయంగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి?
 - కె.లావణ్య, వినుకొండ

 కొంతమందిలో పెరుగుదలలో తేడా వల్ల ఒక రొమ్ము చిన్నదిగా, ఇంకొకటి పెద్దదిగా ఉండటం జరుగుతుంది. కొవ్వు ఒకదానిలో ఎక్కువగా ఉండటం వల్ల అది పెద్దగా అనిపిస్తుంది. కొవ్వు తక్కువగా ఉన్నది చిన్నగా ఉంటుంది. దానివల్ల సమస్య ఏమీ ఉండదు. అంత భయ పడాల్సిన అవసరమూ లేదు. అదేం ప్రమాదం కాదు కాబట్టి దీని గురించి మీవారికి తెలిసినా నష్టం లేదు. కనుక మీరు అనవసరంగా భయపడి మనసు పాడు చేసుకోకుండా ప్రశాంతంగా ఉండండి. ఎవరైనా కానీ, శరీరాకృతి ఎలా ఉంటే అలా స్వీకరించాలి. దానికి ఎవరూ ఏమీ చేయలేరు.
 
  నా వయసు 34. నేనో ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాను. పెళ్లయింది కానీ భర్తతో విడిపోయాను. తర్వాత రెండో పెళ్లి చేసు కున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల పెళ్లి అయ్యిందని బయటకు చెప్పుకోలేని పరిస్థితి. అందుకే ఈ మధ్య గర్భం దాల్చినా అబార్షన్ చేయించుకున్నాను. కానీ ఆ తర్వాతి నుంచి నాకు కడుపులో విపరీతమైన నొప్పి వస్తోంది. అబార్షన్ చేసేటప్పుడు ఏమైనా పొరపాటు జరిగిందేమోనని డాక్టర్‌ని సంప్రదించాను. ఆవిడ స్కాన్ చేసి చూసి ఏ తేడా లేదు, అంతా బానేవుంది, మరేదైనా నొప్పేమో అన్నారు. అన్ని రకాల పరీక్షలూ చేయించేశాను. ఎక్కడా ఏ తేడా లేదు. ఏం జరిగిందో అర్థం కావడం లేదు. ఏం చేయమంటారు?
- ప్రేమజ్యోతి, కాకినాడ

 అబార్షన్ చేయించుకున్న తర్వాత కొంతమందిలో ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల పొత్తి కడుపులో నొప్పి రావొచ్చు. మీరు డాక్టర్ దగ్గర అన్ని పరీక్షలూ చేయించుకున్నా ఏ సమస్యా లేదని అంటున్నారు. కడుపులో గర్భసంచితో పాటు చిన్నపేగులు, పెద్ద పేగులు, మూత్రాశయం వంటి ఇంకా ఎన్నో అవయవాలు ఉంటాయి. వాటిలో దేనిలోనైనా ఇన్ఫెక్షన్, వాపు తదితర సమస్యలు ఉన్నా కూడా పొత్తి కడుపులో నొప్పి రావొచ్చు. అన్ని సమస్యలూ స్కానింగ్‌లో తెలియాలని లేదు. కొంత మందికి పేగుల్లో పుండ్లు, అజీర్తి, మూత్రంలో ఇన్ఫెక్షన్, కిడ్నీలో రాళ్లు ఉండటం వల్ల కూడా మాటిమాటికీ నొప్పి వస్తూ ఉంటుంది. కాబట్టి మళ్లీ ఒకసారి డాక్టర్‌ని సంప్రదించి, కొన్ని రోజుల పాటు యాంటీ బయొటిక్స్ వాడి చూడండి. రోజుకు రెండు లీటర్ల నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోండి. ఆహారంలో మసాలాలు, కారం, నూనె తగ్గించండి.

డా వేనాటి శోభ
లీలా హాస్పిటల్
మోతీనగర్, హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement