
భక్తి రక్తి కడుతోంది!
పురాణాలను సీరియళ్లుగా తీస్తే, వాటిని పెద్దలే చూస్తారు అంటుంటారు చాలామంది. అది చాలావరకూ నిజం కూడా. అయితే తీసేలా తీస్తే భక్తి సీరియళ్లు యూత్‌నీ కట్టి పారేస్తాయి అని నిరూపించింది... హరహర మహాదేవ్. ఇది అచ్చ తెలుగు సీరియల్ కాదు. ‘దేవోంకే దేవ్... మహాదేవ్’ అనే హిందీ సీరియల్‌కి డబ్బింగ్ వెర్షన్. శంకరుడి లీలలు, శివపార్వతుల ప్రేమానురాగాలు అత్యంత ఆకట్టుకునేలా తీయడంతో ఈ సీరియల్ సూపర్‌హిట్ అయ్యింది. ఏడు భాషల్లోకి అనువాదమై విజయం సాధించింది.
దానికి కారణం... కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్సవకుండా, భక్తి తత్పరత తక్కువ కాకుండా బ్యాలెన్స్‌డ్‌గా తీయడం. దానికి తోడు నటీనటుల ఎంపిక. శివుడిగా మోహిత్ రైనా నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏ అవతారమైనా అదరగొట్టేస్తాడు. ప్రతి అవతారానికీ అతడు అచ్చు గుద్దినట్టు సరిపోతాడు. అవతారానికి తగ్గట్టుగా హావభావాలు, బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటాడు. శివుడు నిజంగా మన కళ్లముందే ఉన్నాడా, ఇతడే నిజమైన శంకరుడా అని భ్రమపడేలా చేస్తాడు. అందుకే ఈ సీరియల్ విజయంలో సగం క్రెడిట్ అతనికి ఇచ్చేయాల్సిందే.