అప్పుడు రాత్రి
అప్పుడు రాత్రి
Published Sun, Nov 27 2016 12:39 AM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM
‘టక్..టక్...టక్’ తలుపు చప్పుడవుతుంది.
‘‘ఎవరు?’’ ‘టక్...టక్’
రాఘవరావు మనసు ప్రమాదాన్ని శంకించింది. మెల్లగా కిటికిలో నుంచి తొంగిచూశాడు. ఒక కుర్రాడు డోర్ దగ్గర నిల్చొని ఉన్నాడు. ఎవరో పిచ్చివాడై ఉంటాడని, తిడదామని తలుపు తీసి బయటికి వచ్చాడు రాఘవరావు. తలుపు తీశాడో లేదో... అమాంతం రాఘవరావు కాళ్ల మీద పడ్డాడు ఆ కుర్రాడు.‘‘లే...లే...నా కాళ్ల మీద ఎందుకు పడుతున్నావు? అసలు ఎవరు నువ్వు’’ అంటూ విసుగ్గా ఆ కుర్రాడిని రెండు చేతులతో పైకి లేపాడు.
‘‘అయ్యా... నా పేరు రవి. మా నాన్న శేఖరయ్య మీకు దగ్గరి బంధువు. మా అమ్మా, నాన్నలు సంవత్సరం క్రితమే చనిపోయారు. నా అనేవాళ్లు నాకు ఎవరూ లేరు. ఎవరో మీ పేరు చెబితే ఇలా వెదుక్కుంటూ వచ్చాను. నన్ను మీ దగ్గర పన్లో పెట్టుకోండి. మీ కాళ్ల దగ్గర కుక్కలా పడుంటాను’’ అన్నాడు రవి.‘శేఖరయ్య’ అనే పేరు తలుచుకోగానే రాఘవయ్యకు గతం కళ్ల ముందు కదలాడింది.ఒక వ్యాపారంలో అతడిని మోసం చేసిన విషయం, ఆ తరువాత అతను అప్పులపాలై కోలుకోకుండా పోయిన విషయం రాఘవయ్యకు ఒక్కటొక్కటిగా గుర్తుకు వస్తున్నాయి.
‘తెలిసో తెలియకో శేఖరయ్యకు ద్రోహం చేశాను. కనీసం వీడికి పని ఇస్తేనైనా... పాపంలో సగానికి సగం తగ్గుతుంది’ అని ఆశపడ్డాడు రాఘవయ్య.
‘‘నువ్వు మా శేఖరయ్య కొడుకువన్న మాట... ఎప్పుడో చిన్నప్పుడు చూశానురా నిన్ను. మీ అత్తమ్మ రెండు సంవత్సరాల క్రితం చనిపోయింది. నా ఒక్కగానొక్క కొడుకేమో అమెరికా విడిచి రానంటున్నాడు. నాకు వయసు మీద పడుతుంది. చిన్న చిన్న పనులు చేసుకోవడం కూడా కష్టంగా ఉంది. సరే, నువ్వు ఈ ఇంట్లోనే ఉండు’’ అంటూ రవిని ఇంట్లోకి తీసుకుపోయాడు రాఘవయ్య.రాఘవయ్య ఇల్లు రైల్వేస్టేషన్‌కు చాలా దగ్గరిలో ఉంటుంది. ఏ ట్రైను వచ్చినా, వెళ్లినా... ఆ శబ్దంతో ఇల్లంతా నిండిపోతుంది.
ఒకరోజు అర్ధరాత్రి రవి గట్టిగా అరుస్తున్నాడు.
‘‘ఏమైంది?’’ అంటూ రవి పడుకున్న చోటుకి పరుగెత్తుకు వచ్చి అడిగాడు రాఘవయ్య. అటువైపు ఉన్న పెద్ద కిటికీని చూపించాడు. కిటికీ అద్దం పగిలిపోయి ఉంది. ఊచలు రెండు కోసి వేయబడి ఉన్నాయి... అంటే ఇంట్లోకి దొంగలు దూరడానికి ప్రయత్నించారు. రవి అరుపులు విని దొంగలు పారిపోయారన్నమాట. ఇంట్లోకి దొంగలు దూరకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశాడు రాఘవయ్య. ఒక ఎమర్జెన్సీ హారన్ కూడా ఇంట్లో పెట్టించాడు.
సరిగ్గా రెండు రోజుల తరువాత రాఘవయ్య హత్యకు గురయ్యాడు. రాఘవయ్యకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఈ హత్య దొంగలు చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. రాఘవయ్యకు శత్రువులు ఎవరూ లేనట్లు తెలిసింది. అయితే... ఈ దర్యాప్తులో పోలీసులకు ఒక కొత్త విషయం తెలిసింది... రాఘవయ్య గతంలో శేఖరయ్యను మోసం చేశాడని... అతని కొడుకే రవి అని!తన తండ్రికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికే... రాఘవయ్య ఇంట్లో రవి పనివాడిగా చేరాడా?
పోలీసులు రవిని అనుమానించి అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు.‘‘నువ్వే రాఘవయ్యను చంపావు అనిపిస్తుంది’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్ నరసింహ రవి కళ్లలోకి చూస్తూ.
‘‘ఆరోజు రాత్రి పన్నెండు గంటల సమయంలో ఇంట్లో దొంగలు పడడానికి ప్రయత్నించారు. నేను వారితో చేతులు కలిపి ఉంటే ఆ రోజే రాఘవయ్యను చంపి ఉండేవాడిని కదా! నాకు నీడ ఇచ్చిన వ్యక్తిని నేనెందుకు చంపుతాను?’’ అన్నాడు కళ్లనీళ్లు పెట్టుకుంటూ రవి.‘‘నీకు ఏ సమయంలో మెలకువ వచ్చింది?’’ అడిగాడు ఇన్‌స్పెక్టర్ నరసింహ.
‘‘కిటికీ ఊచలు కోస్తున్న సౌండ్ వినబడి టక్కున లేచాను.
అప్పుడు టైం... పన్నెండు గంటలు. గోడ గడియారం మోగింది’’ అన్నాడు రవి.ఆ రోజు రాత్రి తాను సిటీ నుంచి గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన విషయం ఇన్‌స్పెక్టర్‌కు గుర్తుకువచ్చింది. తాను స్టేషన్‌లో దిగేసరికి... టైమ్ సరిగ్గా పన్నెండు గంటలవుతుంది.‘‘అనుమానం లేదు... నువ్వే హంతకుడివి’’ అరిచాడు ఇన్‌స్పెక్టర్. నేరాన్ని ఒప్పుకోక తప్పలేదు రవి.రవి హంతకుడనే విషయం అంత కచ్చితంగా ఇన్‌స్పెక్టర్ ఎలా చెప్పగలిగాడు?
Advertisement
Advertisement