మెరుపు
‘‘ఈ రోజు నీ బర్త్‌డే కదా. ఆఫీసుకు సెలవ్ పెట్టేద్దాం. ఈరోజంతా జాలీగా గడిపేద్దాం. ఏమంటావు?’’‘‘అంతకంటేనా!’’ఎప్పుడూ ఆఫీసు తప్ప మరో విషయం పట్టని భర్త...ఇలా మాట్లాడడం కీర్తిని ఆశ్చర్యపరిచింది.‘‘మాట్లాడింది మీరేనా? ఎందుకో నేను ఒక పట్టాన నమ్మలేకపోతున్నాను’’ అంది సరదాగా.‘‘అవును. నేనే. నీ పుట్టిన రోజుకు కూడా నేను ఆఫీసుకు వెళితే ఇంకేమైనా ఉందా? నువ్వు తప్పించి నాకు ఎవరు ఉన్నారు చెప్పు?’’ అన్నాడు ప్రభాకర్. ఈమాట అంటున్నప్పుడు అతని కళ్లలో సన్నటి కన్నీటి పొర.
అవును.
ప్రభాకర్‌కు ఆమె తప్ప ఎవరూ లేరు.తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారు. ఉన్న... ఒక్కగానొక్క అన్న తనని ఎప్పుడో మరిచిపోయాడు.ఒంటరితనం భారమై, అది డిప్రెషన్‌గా మారి, ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు చుట్టుముడుతున్న రోజుల్లో పరిచయమైంది కీర్తి. ప్రభాకర్ ఎవరితోనూ పెద్దగా మాట్లాడే రకం కాదు.ఇతరులతో అంత త్వరగా కలిసిపోయే రకం కూడా కాదు.అలాంటి ప్రభాకర్‌ను తన స్నేహంతో మార్చేసింది కీర్తి.ఆమె స్నేహంలో ప్రభాకర్‌లో కొత్త కళ తొంగి చూసింది.‘ఆఫీసు కోసం కాదు... ఆఫీసుకొచ్చే కీర్తి కోసం’ అన్నట్లుగా... ఎప్పుడు ఆఫీసుకు వెళదామా అని ఎదురుచూసేవాడు.
తనకు వేరే సెక్షన్‌కు బదిలీ అయినట్లు చెప్పింది కీర్తి.ప్రభాకర్ తల్లడిల్లిపోయాడు. సెక్షన్ బదిలీ కావడం అంటే... ఎక్కడికో దూరంగా వెళ్లిపోవడం కాదు. జస్ట్... ఫ్లోర్ మారడం అంతే!ఈమాత్రానికే... ప్రభాకర్ విరహ వేదనతో తల్లడిల్లిపోయాడు.ఒకరోజు కీర్తితో ఏకాంతంగా మాట్లాడాడు...‘‘నువ్వు సెక్షన్ మారిపోతేనే... చాలా దూరమైనట్లు ఫీలైపోతున్నాను. రేపు... నువ్వు పెళ్లి చేసుకొని ఎక్కడికైనా వెళ్లిపోతే నేను బతకలేను. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’’ అన్నాడు.
ప్రభాకర్ మాటలకు కీర్తి కరిగిపోయింది.పెళ్లికి పచ్చజెండా ఊపింది. ఆమె ఇంట్లో వాళ్లు కూడా పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. పెళ్లైన ఆరు నెలల తరువాత....కీర్తి తన కొలిగ్ అశోక్‌తో క్లోజ్‌గా ఉంటున్నట్లు ప్రభాకర్ చెవిలో వేశారెవరో. ఆ తరువాత కూడా... కీర్తి, అశోక్‌లపై ఆఫీసులో చిలవలు పలవలుగా ప్రచారం జరిగింది. అది ప్రభాకర్ వరకు వచ్చింది.
ఇక ఆగలేకపోయాడు.ఒకరోజు భార్యను నిలదీశాడు.‘‘నువ్వేనా ఇలా మాట్లాడుతుంది. ఎవరో ఏదో అన్నారని నన్ను అనుమానిస్తావా?’’ అంటూ బాగా ఏడ్చింది కీర్తి.‘‘నిన్ను బాధ పెట్టి ఉంటే... క్షమించు’’ అన్నాడు ప్రభాకర్. అయితే ఆ మాట మనసులో నుంచి రాలేదు.అతడి కళ్లలో అనుమాన బీజం... పెద్ద చెట్టై కూర్చుంది.
ప్రభాకర్ ఏడుస్తూ చెబుతున్నాడు...
‘‘ఈరోజు నా భార్య పుట్టిన రోజు. సరదాగా దుర్గంచెరువుకు వెళ్లాం. మేము ఇంటికి తిరిగివచ్చే సమయానికి రాత్రి అయింది... ఆ చీకట్లో పెద్దగా ఉరుము ఉరిమింది. వెంటనే... మెరుపు మెరిసింది. ఆ వెలుగులో... నాకు కనిపించిన దృశ్యం... కిందపడిపోయి ఉన్న కీర్తి. అక్కడ తడిగా ఉండడంతో... ఉరుము శబ్దం విన్న వెంటనే ఉలిక్కిపడి జారి పడింది. ఆమె తల అక్కడ ఉన్న బండరాయిని తాకడంతో.... చనిపోయింది...’’
‘‘నువ్వు చెప్పింది అబద్ధం’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్ నరసింహ.ఆతరువాత... రకరకాల పద్ధతుల్లో ప్రభాకర్‌ని విచారించగా... కీర్తిని తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు ప్రభాకర్.ఏ విషయం వల్ల... ప్రభాకర్ అబద్ధం చెబుతున్నాడని ఇన్‌స్పెక్టర్ గ్రహించాడు?