పని ప్రదేశాల్లో పురుషులతో సమానంగా వేతనం పొందే హక్కు మహిళలకు చట్టబద్ధంగా ఉంది. చాలాచోట్ల పని ప్రదేశాలలో మహిళలకు ఇప్పటికీ తక్కువ వేతనాలు చెల్లిస్తున్న సందర్భాలు ఉన్నాయి. అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలు దీనివల్ల చాలా నష్టపోతున్నారు. సమాన వేతన చట్టం ప్రకారం సమానమైన పనికి సమానమైన వేతనం పొందే హక్కు ప్రతి మహిళకూ ఉంది.
►గౌరవ మర్యాదలు పొందే హక్కు ప్రతి మహిళకూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా కేసులో మహిళ నిందితురాలైనప్పటికీ, కోర్టుకు అప్పగించడానికి ముందు ఆమెకు నిర్వహించే వైద్యపరీక్షలను మరో మహిళ సమక్షంలోనే నిర్వహించాలి.
►ఉద్యోగాలు చేసుకునే మహిళలకు కార్యాలయాలు, కర్మాగారాలు వంటి పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నుంచి రక్షణ పొందే హక్కు ఉంది. తోటి ఉద్యోగుల నుంచి లేదా పై అధికారుల నుంచి వేధింపులు ఎదురైతే, వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై పని చేస్తున్న సంస్థకు చెందిన అంతర్గత ఫిర్యాదుల కమిటీకి మూడు నెలల్లోగా ఫిర్యాదు చేయవచ్చు.
►గృహహింస నుంచి రక్షణ పొందే హక్కు ప్రతి మహిళకూ ఉంది. భార్య, సహజీవన భాగస్వామి, తల్లి, సోదరి.. ఇలా కుటుంబంలో ఉండే ఏ మహిళ అయినా గృహహింసకు గురైతే, తమ పట్ల హింసకు పాల్పడే వారిపై గృహహింస నిరోధక చట్టం కింద ఫిర్యాదు చేయవచ్చు. గృహహింస ఫిర్యాదులు రుజువైతే నిందితునికి మూడేళ్ల వరకు కారాగార శిక్ష, జరిమానా పడే అవకాశాలు ఉంటాయి.
►అత్యాచార బాధితులైన మహిళలకు, బాలికలకు తమ పేరును గోప్యంగా ఉంచుకునే హక్కు ఉంది. తన పట్ల జరిగిన నేరానికి సంబంధించి బాధితురాలు నేరుగా మేజిస్ట్రేట్ ఎదుట గాని లేదా ఒక మహిళా పోలీసు అధికారి ఎదుట గాని తన వాంగ్మూలాన్ని ఇవ్వవచ్చు.
►న్యాయ సేవల ప్రాధికార చట్టం ప్రకారం మహిళలకు ఉచితంగా న్యాయ సేవలను పొందే హక్కు ఉంది. ఉచిత న్యాయ సేవలను కోరే మహిళల తరఫున కోర్టులో వాదనలను వినిపించడానికి న్యాయ సేవల ప్రాధికార సంస్థ ప్రత్యేకంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తుంది.
►మహిళలకు రాత్రివేళ అరెస్టు కాకుండా ఉండే హక్కు ఉంది. ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఆదేశాలు లేకుండా మహిళలను సూర్యాస్తమయం తర్వాతి నుంచి సూర్యోదయం లోపు అరెస్టు చేయరాదు. ఒకవేళ ప్రత్యేకమైన కేసుల్లో అరెస్టు చేయాల్సి వస్తే, పోలీసులు తప్పనిసరిగా ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఆదేశాలను పొందాల్సి ఉంటుంది.
►పోలీస్ స్టేషన్‌కు నేరుగా వెళ్లలేని పరిస్థితుల్లో ఈ–మెయిల్ ద్వారా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా కూడా మహిళలు తమ ఫిర్యాదులను దాఖలు చేసుకోవచ్చు. అలాంటి ఫిర్యాదులు అందిన తర్వాత సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారి ఒక కానిస్టేబుల్‌ను ఫిర్యాదు చేసిన మహిళ వద్దకు పంపి, నేరుగా ఫిర్యాదు నమోదు చేసుకుంటారు.
►మహిళలకు అశ్లీల ప్రదర్శనలకు వ్యతిరేకంగా న్యాయం పొందే హక్కు ఉంది. మహిళల ఫొటోలను అశ్లీలంగా చిత్రించడం, వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా ప్రదర్శించడం శిక్షార్హమైన నేరాలు. తమ పట్ల ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై ఫిర్యాదు చేసి రక్షణ, న్యాయం పొందే హక్కు మహిళలందరికీ ఉంది.
►వెంటాడి వేధించడం, ఈ–మెయిల్స్, స్మార్ట్‌ఫోన్‌లపై నిఘా వేయడం వంటి చర్యలకు పాల్పడే వారి నుంచి రక్షణ పొందే హక్కు మహిళలకు ఉంది. ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి జైలు శిక్ష, జరిమానా పడే అవకాశాలు ఉంటాయి.
►మహిళలకు జీరో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసుకునే హక్కు ఉంది. బాధితురాలైన మహిళ పట్ల నేరం ఎక్కడ జరిగినా, ఆమె తన ఫిర్యాదును తనకు అందుబాటులో ఉన్న చోట దాఖలు చేసుకోవచ్చు. ఆమె ఏ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా, నేరస్థలం ఆ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి రాకున్నా, పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకోవాల్సిందే.
అత్యాచారాలపై ప్రభుత్వ గణాంకాలు
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించిన లెక్కల ప్రకారం 2001 నుంచి 2017 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా అత్యాచారాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ పదిహేడేళ్ల కాలంలో కొద్ది రాష్ట్రాల్లో మాత్రమే అత్యాచారాల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది. 2001–17 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 4,15,786 అత్యాచార సంఘటనలపై కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సగటున 67 అత్యాచారాలు జరుగుతున్నాయి. అంటే దేశంలో సగటున ప్రతి గంటకూ ముగ్గురు మహిళలు అత్యాచారాల బారిన పడుతున్నారు. ఎన్‌సీఆర్‌బీ తాజా నివేదిక ప్రకారం 2017లో నమోదైన నేరాల సంఖ్య 3,59,849.
మహిళలపై అఘాయిత్యాల నిరోధానికి చట్టాలు
మహిళలపై అఘాయిత్యాల నిరోధానికి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సహా చాలా చట్టాలు ఉన్నాయి. పిల్లలపై లైంగిక అఘాయిత్యాలను అరికట్టడానికి లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ చట్టం (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఎగైనెస్ట్ సెక్సువల్ అఫెన్సెస్–పోక్సో యాక్ట్), గృహహింస నిరోధక చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం, సతి నిషేధ చట్టం, ‘నిర్భయ’ చట్టం, ఆంధ్రప్రదేశ్‌లో ‘దిశ’ చట్టం మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ అమలులో ఉన్నా.. చాలామంది మహిళలకు చట్టపరంగా తమకున్న హక్కులపై అవగాహన లేదు. దీని కారణంగా ఎంతోమంది స్త్రీలు రకరకాల హింసను మౌనంగా భరిస్తూ వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment