వివరం: 2050లో... ఆకాశమే హైవే! | Space travelers likely to be established in 2050 years | Sakshi
Sakshi News home page

వివరం: 2050లో... ఆకాశమే హైవే!

Published Sun, Jul 20 2014 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 AM

వివరం: 2050లో... ఆకాశమే హైవే!

వివరం: 2050లో... ఆకాశమే హైవే!

క్రీస్తుశకం 2050. న్యూయార్క్‌లో ఓ రహదారి.
విలాసవంతమైన కార్లు వరుసగా దూసుకెళుతున్నాయి.
ఒక్కరూ స్టీరింగ్ పట్టుకుని తిప్పడం లేదు.
అయినా కార్లు చక్కగా పరుగులు పెడుతున్నాయి!
లండన్‌లో ఓ కేబుల్ కార్ స్టేషన్.
ఓ అంధుడు వచ్చి ‘జేమ్స్ స్ట్రీట్’ అన్నాడు.
కారు అతడిని ఎక్కించుకుని చిటికెలో అక్కడికి చేర్చేసింది!
ఢిల్లీలో ఓ బహుళ అంతస్తుల భవనం.
గాలిలోంచి ఎగురుకుంటూ వచ్చి ఓ ఫ్లాట్ ముందు ద్రోన్ వాలింది.
పిజ్జా డెలివరీ చేసి వెళ్లిపోయింది!
ఈసారి ముంబై. ఆకాశంలో డజన్ల కొద్దీ ఫ్లయింగ్ కార్లు.
ఓ పద్ధతి పకారం అటూఇటూ ఎగురుతున్నాయి.
యాక్సిడెంట్లు, శబ్దాలు లేకుండానే రివ్వున గమ్యస్థానాలకు చేరిపోయాయి!

 
 ప్రస్తుతానికి ఇవన్నీ ఊహలే. కానీ 2050 నాటికి నిజం కాబోతున్నాయి. అవును. ఇవి మాత్రమే కాదు.. ‘చుక్కల మధ్య నిద్రించండి’ అంటూ కంపెనీలు పర్యాటక ప్యాకేజీలు ప్రకటిస్తాయి. అంతరిక్ష యాత్రికుల కోసం రోదసిలో హోటళ్లు వెలుస్తాయి. ఏటా లక్షలాది మంది చంద్రుడిని పలకరించి వస్తారు. జీవితంలో ఒక్కసారైనా అమెరికాకు వెళ్లాలి, అమరనాథ్ యాత్రకు వెళ్లాలి, అక్కడికి వెళ్లాలి, ఇక్కడికి వెళ్లాలి అని ఇప్పుడు చాలామంది అనుకుంటున్నట్లే.. భవిష్యత్తులో ఒక్కసారైనా చంద్రుడిని సందర్శించాలి, రోదసిలో చక్కర్లు కొట్టి రావాలని చాలామంది లక్ష్యంగా పెట్టుకుంటారు!  
 
 ముందుంది.. కొత్త సాంకేతిక లోకం
 మోటారు వాహనాన్ని మొట్టమొదట చూసి కేరింతలు కొట్టిన మనిషి.. గాలిలో ఎగురుతున్న విమానాన్ని చూసి విస్తుపోయాడు. తెరపై కదిలే బొమ్మల్ని చూసి ఔరా! అని ముక్కున వేలేస్కున్నాడు. అసలు దూరంగా ఉన్న మనుషులతో తీగల ద్వారా మాట్లాడవచ్చన్న ఊహే ఉండేది కాదు. చందమామపై కాలుమోపుతారనీ అనుకోలేదు. కానీ అన్నీ సాధ్యమయ్యాయి. సాధారణ సంగతులు అయిపోయాయి. శాస్త్ర, సాంకేతిక రంగంలో శతాబ్దాల కృషి వల్లే ఇదంతా సాకారం అయింది.
 
 అయితే ఈ సాంకేతిక విప్లవం మరింత వేగం పుంజుకుంది. రోజుకో ప్రతిపాదన. వారానికో ఆవిష్కరణ.  మనిషి జీవితం మరింత సుఖప్రదం చేసుకునేందుకు, మానవ కల్యాణం కోసం విశ్వ రహస్యాల అన్వేషణకు ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక యజ్ఞాలు ఊపందుకున్నాయి. వీటిలో కొన్ని సఫలమవ్వొచ్చు. మరికొన్ని విఫలమవ్వొచ్చు. కానీ.. గతంలోంచి వర్తమానం మీదుగా భవిష్యత్తులోకి చూస్తే మాత్రం.. మనిషి భవిత దేదీప్యమానం అవుతుందని నిపుణులు జోస్యం చెబుతున్నారు. మరో మూడు దశాబ్దాల్లోనే ఈ లోకం అడుగడుగునా సాంకేతిక మాయతో నిండిపోతుందని అంటున్నారు.  
 
 స్టీరింగ్ పట్టాల్సిన పనే లేదు!

 మనుషుల ప్రమేయం లేకుండా ఆటోమేటిక్‌గా నడిచే కార్లను మరో దశాబ్దంలోపే మార్కెట్లోకి విడుదల చేసేందుకు కార్ల తయారీ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. స్టీరింగ్ పట్టుకోవాల్సిన పని లేకపోవడమే కాదు.. పార్కింగ్, గేర్లు మార్చడం, బ్రేకులు వేయడం వంటివీ కార్లే ఆటోమేటిక్‌గా చేసుకుంటాయని మిల్కెన్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు అంటున్నారు. 2035 నాటికే ఈ కార్ల్లు మార్కెట్లోకి వస్తాయని చెబుతున్నారు. మనిషి పరధ్యానం, తొందరపాటుతో చేసే తప్పులను డ్రైవర్‌లెస్ కార్లు చేయవనీ, అందువల్ల 90 శాతం కారు ప్రమాదాలు తగ్గిపోతాయనీ వారు అంటున్నారు.  
 
 వైర్‌లెస్ కరెంటు!
 ఇంట్లో పైకప్పుకు ఓ బాక్స్‌ను అమర్చుకుంటే చాలు.. గదిలోని అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలకూ వైర్‌లెస్ కరెంట్ సరఫరా అవుతుంది. చిన్నపెట్టెలో అమర్చే అయస్కాంతపు చుట్టకు మెయిన్ నుంచి విద్యుత్ అందుతుంది. అక్కడి నుంచి విద్యుదయస్కాంత తరంగాలు ప్రసారమై ల్యాప్‌టాప్, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉండే అయస్కాంత చుట్టలను చేరతాయి. అంటే.. మనుషులకు షాక్ కొట్టకుండానే కరెంటు అందుతుందన్నమాట. 2020 నాటికే ఈ టెక్నాలజీ వాడకంలోకి వస్తుందట. వైర్‌లెస్ విద్యుత్ వల్ల ఆఫీసుల్లో కేబుల్స్, ఇతర పరికరాల అవసరమూ తగ్గిపోతుంది.
 
 ఫ్లయింగ్ కార్లు, ద్రోన్‌లదే హవా
ఆకాశంలో పక్షుల్లా, రకరకాల రూపాల్లో విహరిస్తూ వాలిపోయే ద్రోన్‌ల వాడకం ఇప్పటికే మొదలైంది. ఒకప్పుడు అమెరికా సేనలు అఫ్తాన్‌లో తాలిబన్లపై బాంబులు కురిపించేందుకు, నిఘాకు ఉపయోగపడిన మానవరహిత గగన వాహనాలు (యూఏవీలు).. క్రమంగా సైజు కుదించుకుని సాధారణ ప్రజలకూ ఉపయోగపడే ద్రోన్‌లుగా సిద్ధమయ్యాయి. పెళ్లిళ్లు, బహిరంగ సభల్లో వీడియోల చిత్రీకరణకు ద్రోన్‌లను ఉపయోగించడం ఇప్పుడిప్పుడే మొదలైంది. కొరియర్‌లు, మందుల పార్శిళ్లు, పిజ్జాలు అందించేందుకు ప్రయోగాలూ జరిగాయి. ప్రస్తుత ద్రోన్ టెక్నాలజీయే సమీప భవిష్యత్తులో ఫ్లయింగ్ కార్ల శకానికీ నాంది పలకనుంది. రోడ్డుపై కారులా నడుపుకుంటూ వెళ్లి, అవసరమైనప్పుడు విమానంలా గాలిలో ఎగురుకుంటూ వెళ్లే రోజు త్వరలోనే వస్తుంది. భవిష్యత్తులో మహానగరాలపై ఆకాశంలో ఎటుచూసినా ఫ్లయింగ్ కార్లే కనిపించడం సాధారణమే కావొచ్చు.
 
 రోబోలూ జీవిత భాగస్వాములే!
 భవిష్యత్తు రోబోలు మేధోపరంగానూ మనుషులకు దీటుగా పనిచేస్తాయని అంటున్నారు కార్నెగీ మెలన్ యూనివర్సిటీ రోబోటిక్స్ ఇన్‌స్టిట్యూట్  పరిశోధకులు. నిత్యజీవితంలోకి రోబోల రాకతో మనుషుల జీవనశైలి కూడా మారిపోతుందని, దినచర్యలు, సామాజిక, వినోద కార్యక్రమాలు కూడా ప్రత్యేక దారిపడతాయని అంటున్నారు. అలాగే రోబోలు మనుషులకు కొత్త నేస్తాలుగా మారతాయి. మాట్లాడతాయి. చమత్కారాలు చేస్తాయి. ఆడతాయి. పాడతాయి. ఫ్యాక్టరీల్లో కార్మికులవుతాయి. ఇంట్లో పనిమనుషులవుతాయి. రోబో పిల్లులు, రోబో కుక్కలూ వస్తాయి. యుద్ధాల్లో సైతం కిల్లర్ రోబోల రూపంలో విరుచుకుపడతాయి. అంతరిక్షంలో పరిశోధనలకు సాయం చేస్తాయి. చంద్రుడు, మార్స్‌పై కాలనీల నిర్మాణాలకు కూలీలూ అవుతాయి. చివరికి జీవిత భాగస్వాములు కూడా అవుతాయి. అంటే ‘అన్ని’రకాలుగా భార్య లేదా భర్తలా మసలుకుంటాయి!
 
 ఆలోచిస్తే.. పనైపోద్ది!   
1970లలో ల్యాండ్‌లైన్లు రాజ్యమేలాయి. 20 ఏళ్లు తిరిగేసరికి మొబైల్‌ఫోన్ల రాజ్యం వచ్చేసింది. సెల్‌ఫోన్లు రోజుకో రూపంలోకి మారిపోతున్నాయి. సైజును కుదించుకుంటూ నాజూగ్గా తయారవుతున్నాయి. సమీప భవిష్యత్తులో గ్రాఫీన్ ఫోన్లు వస్తాయి. కిందపడితే పగలవు. నీటిలో పడితే నానవు. కాగితంలా ఎలాపడితే అలా మడతపెట్టుకోవచ్చు కూడా. కానీ.. సెల్‌ఫోన్ల పరిణామం అంతటితో ఆగుతుందా? ఆ తర్వాత ఎలా మారతాయి? అంటే.. 2020 నాటికి అందుబాటులోకి వచ్చే 5జీ సేవలతో సెల్‌ఫోన్ల రూపురేఖలు వేగంగా మారిపోతాయి. మెదడులో అమర్చే ఎలక్ట్రోడ్లు, సెన్సర్లు, తలపై పెట్టుకునే చిన్న హెడ్‌సెట్ లేదా గూగుల్ గ్లాస్ వంటివే సెల్‌ఫోన్లు చేసే పనులు చేస్తాయి. మరో 40 ఏళ్లలో ప్రారంభమయ్యే ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీ.. తర్వాత ఎన్నెన్నో వింతలు చేస్తుంది. ఎవరికైనా సందేశం లేదా ఈ-మెయిల్ చేయాలంటే ఆలోచిస్తే చాలు.. కళ్లముందు అద్దంపై అక్షరాలు ప్రత్యక్షమైపోతాయి. ఫోన్‌కాల్స్ చేయాలన్నా.. అనుకున్నదే తడవుగా అవతలివారితో కనెక్షన్ ఏర్పడిపోతుంది.
 
 పసిమొగ్గలు వికసిస్తాయి
యూనిసెఫ్ గణాంకాల ప్రకారం... 1990-2012 మధ్య కాలంలో పుడమిపై జన్మించిన ప్రతి వెయ్యి మంది చిన్నారుల్లో కనీసం 90 మంది చనిపోయారు. కానీ 2013 నాటికి పరిస్థితి మారింది. ప్రతి వెయ్యిమందిలోనూ మృత్యువాత పడుతున్న శిశువుల సంఖ్య 48కి తగ్గింది. అయితే నిపుణుల అంచనా ప్రకారం.. 2050 నాటికి ప్రతి వెయ్యిమందిలో 31 మంది మాత్రమే మరణిస్తారు. అంటే శిశుమరణాలు గణనీయంగా తగ్గిపోతాయి. హెచ్‌ఐవీని తల్లి నుంచి బిడ్డకు సోకకుండా చేయడం, ఇంకా అనేక వ్యాధులకు టీకాలు అందుబాటులోకి రావడం, సూక్ష్మపోషకాలను అందించి అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడటం వంటి చర్యల వల్ల ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు బాగా తగ్గిపోతాయి.
 
 ఎయిడ్స్, మలేరియా పారిపోతాయి
 ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 లక్షల మందిని బలితీసుకుంటున్న హెచ్‌ఐవీ మహమ్మారి వ్యాప్తిని పూర్తిగా అడ్డుకునే టీకాను మరో 20 ఏళ్లలోగా ఆవిష్కరిస్తామని పరిశోధకులు ధీమాగా చెబుతున్నారు. అలాగే మెనింజైటిస్ వంటి వ్యాధులకు టీకాలు, కేన్సర్, రుమటాయిడ్ ఆర్థ్రైటిస్, ల్యుకేమియాలకు సమర్థమైన మందులూ అందుబాటులోకొస్తాయి. వీటితోపాటు దోమలను జన్యుమార్పిడి చేయడం ద్వారా మలేరియాను ఈ భూగోళం నుంచే తరిమేయాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. శరీరంలో ప్రయాణిస్తూ కేన్సర్‌ను హతమార్చే నానోపార్టికల్స్‌ను తయారు చేయడం, రోగనిరోధక వ్యవస్థే నేరుగా కేన్సర్ కణాల భరతం పట్టేలా శిక్షణనిచ్చేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి.  
 
 చిటికెలో ఎమ్మారై స్కానింగ్!  
 ఇప్పుడు ఎమ్మారై తీయాలంటే పెద్ద యంత్రంలో గంటపాటు కదలకుండా పడుకోవాల్సిందే. పైగా టుక్‌టుక్‌టుక్ అంటూ భీకరంగా శబ్దాలు. భయస్తులైతే వణికిపోవాల్సిందే. కానీ  2050 నాటికి కెమెరాతో ఫొటో తీసినంత సులభంగా పనైపోతుందట. చేతితో ఆపరేట్ చేసేంత చిన్నసైజుకు ఎమ్మారై స్కానర్లు కుంచించుకుపోతాయట. చిన్నచిన్న అయస్కాంత క్షేత్రాలను సైతం పసిగట్టగలిగేలా సూపర్‌సెన్సిటివ్ అటామిక్ మ్యాగ్నెటోమీటర్లతో ఇవి పనిచేస్తాయట.
 
 భవిష్యత్తు మైలురాళ్లు!
 2020: చీకటిలో మెరిసే హైవేలు సాధారణం అవుతాయి.
 2020: ‘5జీ టెక్నాలజీ’ సేవలు ప్రారంభమవుతాయి.
 2020: అమెరికా గగనతలంపై 30 వేల ద్రోన్‌లు గస్తీ కాస్తాయి.
 2020: వీడియోగేమ్‌లు, గ్రాఫిక్స్ స్పష్టంగా రియలిస్టిక్ ఫొటోల్లా ఉంటాయి
 2030: ఫ్లయింగ్ కార్లు మార్కెట్లోకి వస్తాయి.
 2032: భారత్ జనాభా చైనాను దాటి 150 కోట్లకు చేరుతుంది
 2033: మానవ సహిత అంగారక యాత్ర ప్రారంభమవుతుంది.
 2035: చంద్రుడిపై స్థావరాల ఏర్పాటు, అంతరిక్ష పర్యాటకానికి నాంది.
 2050: అంతరిక్షం నుంచి భూమికి విద్యుత్ సరఫరా అవుతుంది.
 2050: భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదుగుతుంది
 2050: ప్రపంచ జనాభా 930 కోట్లకు చేరుతుంది.
 2030: ప్రపంచంలో దాదాపు అందరూ అక్షరాస్యులు అవుతారు.
 2050: 800 కోట్ల మందికి పైగా ఇంటర్నెట్ వాడతారు
 2050: మనుషుల ఆయుర్దాయం 150 ఏళ్లకు పెరుగుతుంది
 2059: కొన్ని వారాల ప్రయాణంతోనే అరుణగ్రహంపై వాలిపోవచ్చు.
 
 భవిష్యత్తు ఉద్యోగాలు ఇలా...
 అల్టర్నేటివ్ వెహికల్ డెవలపర్ (పర్యావరణ హిత వాహనాలు తయారుచేస్తారు)
 బాడీ పార్ట్ మేకర్ (శరీర అవయవాలను ఉత్పత్తి చేస్తారు)  
 కై ్లమేట్ చేంజ్ రివ ర్సల్ స్పెషలిస్ట్ (వాతావరణ మార్పు ప్రభావాలు తగ్గిస్తారు)  
 మెమరీ ఆగ్‌మెంటేషన్ సర్జన్ (జ్ఞాపకశక్తి పెంచే శస్త్రచికిత్సలు చేస్తారు)
 న్యూ సైన్స్ ఎథిసిస్ట్ (శాస్త్రీయ పరిశోధనలు, నైతిక విలువలపై సలహాలిస్తారు)
 స్పేస్ పైలట్/ఆర్బిటల్ టూర్ గైడ్ (అంతరిక్ష విమానాలు నడుపుతారు)
 వర్చువల్ లాయర్ (ఆన్‌లైన్‌లో న్యాయ సేవలు అందిస్తారు)
 వర్చువల్ టీచర్ (ఆన్‌లైన్‌లో బోధిస్తారు)
 వేస్ట్ డాటా హ్యాండ్లర్ (పేరుకుపోయిన కంప్యూటర్ డాటాను భద్రం చేస్తారు)  
 
  ఏ దేశం వెళ్లినా.. ఒకే భాష
 స్టార్‌ట్రెక్ సినిమాలో మాదిరిగా.. ప్రపంచంలో ఏ భాషనైనా మనకు తెలియకుండానే మాట్లాడొచ్చు. జస్ట్ మనకు తెలిసిన భాషలో మాట్లాడితే చాలు.. అవతలివారికి వారి భాషలో మన మాటలను చెప్పడం, వారి మాటలను మన భాషలోకి అనువదించి చెప్పడం చేసే యూనివర్సల్ ట్రాన్స్‌లేటర్ తయారు కానుంది. ఈ పరికరంతోపాటు ఓ కళ్లజోడు లేదా మొబైల్ యాప్‌ను వాడటం ద్వారానే.. ఏ దేశానికి వెళ్లినా అక్కడి భాషను అనర్ఘళంగా మాట్లాడేయొచ్చు.
 
 పురుషులకూ గర్భనిరోధక మాత్రలు!
 ఇప్పటిదాకా స్త్రీలకే గర్భనిరోధక మాత్రలు ఉన్నాయి. 2021 నాటికి పురుషులకూ గర్భనిరోధక మాత్రలు అందుబాటులోకి వస్తాయట. తక్కువ శుక్రకణాలు, సరిగ్గా ఈదలేని శుక్రకణాలుండే వీర్యం ఉత్పత్తి అయ్యేలా చేసే  మందులతో ఈ మాత్రలు తయారు చేస్తారు. అవసరమైనప్పుడు వాటిని ఆపేస్తే.. తిరిగి యథావిథిగా సంతానం పొందొచ్చు. పురుషులకు గర్భనిరోధక మాత్రలుగా హర్మోన్ మందులు ఇదివరకే వచ్చినా.. వాటివల్ల హానికర ఫలితాలు రావడంతో నిషేధించారు.
 
 స్వలింగ సంపర్కులకూ సంతానభాగ్యం!
 1978లో మొదలైన కత్రిమ గర్భధారణ పద్ధతి(ఐవీఎఫ్) వచ్చే 35 ఏళ్లలో కొత్త పుంతలు తొక్కనుందనీ, అండాలు, వీర్యకణాలను సైతం మూలకణాలతో తయారు చేసేందుకు వీలుకానుందనీ ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  ఇన్‌విట్రో గామిటోజెనిసిస్ (ఐవీజీ) అనే ఈ కొత్త సాంకేతికత  వల్ల గేలు, లెస్బియన్లు సైతం త మ మూలకణాలతో అండాలు, శుక్రకణాలను తయారు చేయించుకుని, అద్దెగర్భం(సరోగేట్) పద్ధతిలో సొంత బిడ్డలను కనేందుకూ వీలు కానుందట.
 
 అవయవాలను ముద్రించుకోవచ్చు!
రోగుల మూలకణాలతోనే వారికి కావలిసిన అవయవాలను ప్రయోగశాలలో తయారు చే స్తారు.  మూలకణాలతో కణజాలం, ఎముకలు, కండరాలను తయారు చేయడం ఇదివరకే సాధ్యమైంది. భవిష్యత్తులో ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, రక్తనాళాలు, ముక్కు, చెవులు, గుండె వంటి అవయవాలను తయారు చేసి అమర్చడం కూడా సాధారణం అవుతుంది. డబ్బుంటే చాలు.. అవయవదాతల కోసం ఎదురుచూస్తూ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సిన అవసరమే 2050 నాటికి ఉండకపోవచ్చు.

పుట్టబోయే బిడ్డలను డిజైన్ చేసుకోవచ్చు!
 వాట్సన్, క్రిక్‌లు 1953లోనే డీఎన్‌ఏను కనుగొన్నా.. దానిని అవగాహన చేసుకోవడం అంత త్వరగా సాధ్యం కాలేదు.  అయితే 2050 నాటికి మనకు నచ్చినట్లుగా పిల్లలను డిజైన్ చేసుకునేలా జెనిటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. పుట్టబోయే బిడ్డ లింగం, ఎత్తు, చర్మం రంగు, వెంట్రుకలు, కంటి రంగును సైతం నిర్ణయించుకోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. శిశువుల మెదడును ప్రభావితం చేసి వారి ఐక్యూను సైతం 10 పాయింట్లు ఎక్కువగా పెంచుకోవచ్చట.  జన్యువులను నియంత్రించడం లేదా తొలగించడం ద్వారా జన్యుపరమైన వ్యాధులకూ చెక్ పెట్టవచ్చట. అలాగే ‘పీ21’ అనే జన్యువును స్విచ్‌ఆఫ్ చేస్తే చాలు.. పెద్దవారిలో కూడా ఆయా భాగాల కణాలు పెరిగేలా చేసి అయవాలను పునరుత్పత్తి చేసే అవకాశం ఉందట. ఉదాహరణకు.. చేతివేళ్లు కోల్పోయినవారిలో వేళ్లను తిరిగి మొలిపించవచ్చన్నమాట!  
 
 పోయిన జ్ఞాపకాలు తిరిగొస్తాయ్!
 అల్జీమర్స్, పక్షవాతం వల్ల దెబ్బతిన్న మెదడును తిరిగి బాగుచేసే న్యూరల్ ప్రోస్థెసిస్ పరికరాలు 2030ల నాటికి  అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా కోల్పోయిన జ్ఞాపకాలను తిరిగి పునరుద్ధరించడం సాధ్యం అవుతుంది. మెదడులో జ్ఞాపకశక్తికి సంబంధించిన హిప్పోకాంపస్ భాగం నుంచి విడుదలయ్యే విద్యుదయస్కాంత తరహా సంకేతాలను ప్రసారం చేయడం ద్వారా ఇవి మెదడు, నాడీవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి.
 
 కృత్రిమ మాంసానికి భలే గిరాకీ..!
 కేవలం ఒకే ఒక్క జంతు కణంతో ప్రయోగశాలలో కొద్దిమొత్తంలో కృత్రిమ కణజాలం తయారీ ఇప్పటికే సాధ్యమైంది. 2020 నాటికే కృత్రిమ మాంసం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. 2036 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇదో పెద్ద పరిశ్రమగా ఎదగనుంది. ఈ పద్ధతిలో జంతువులను హింసించకుండానే మాంసం ఉత్పత్తి చేసుకోవచ్చు. రంగు, రుచిలో సహజంగా ఉండటమే కాదు.. చాలా పరిశుభ్రం, ఆరరోగ్యకరంగా కూడా ఉంటుందట. జంతువుల పోషణకు కావలిసిన ఖర్చుతో పోలిస్తే.. ఇది చాలా చవకగా తయారవుతుందట.
 
  అంతరిక్షం నుంచి విద్యుత్తు!
1970ల నుంచీ ప్రతిపాదనల్లో, పరిశోధనల్లో ఉన్న రోదసి విద్యుత్తు 2041 నాటికి అందుబాటులోకి వస్తుంది. భూస్థిర కక్ష్యలో భారీ ఉపగ్రహాలను మోహరించి, వాటిపై 1-3 కిలోమీటర్ల వెడలై ్పన సౌరవిద్యుత్ పలకలను అమరుస్తారు. వాటి నుంచి సౌరవిద్యుత్‌ను సూక్ష్మతరంగాలు లేదా లేజర్ల రూపంలో భూమికి ప్రసారం చేస్తారు. ఆ విద్యుత్‌ను భూమిపై ఉండే భారీ డిష్‌లు స్వీక రిస్తాయి. అంతరిక్షం నుంచి లేజర్ ద్వారా సమాచార ప్రసారం అనేది ఇదివరకే సాధ్యం అయింది కూడా. రోదసిలో సౌరవిద్యుత్‌ను భూమి మీదకన్నా 144% ఎక్కువగా తయారు చేయొచ్చట. అవసరమైతే 24 గంటలూ విద్యుత్ తయారుచేయొచ్చు. వాతావరణ కాలుష్యం అసలే ఉండదు.  
 
 యుద్ధాలంటే హడల్!
 ప్రజలు కాదు, దేశాలు యుద్ధాలంటే వణికిపోతాయి. ఇప్పుడు పరస్పరం కత్తులు దూసుకుంటున్న శత్రుదేశాలు కూడా 2050 నాటికి యుద్ధానికి దిగే పరిస్థితే వస్తే.. ఎందుకొచ్చిన గొడవలే అని తప్పుకుంటాయి. ఎందుకంటే.. అప్పటికి యుద్ధం అనేది అంత మితిమీరిన ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోతుంది. ఫలితంగా చాలా దేశాల మధ్య సమస్యలు సమసిపోతాయి. ఇంటర్నేషనల్ స్టడీస్ క్వార్టర్లీ ప్రకారం.. మరో 40 ఏళ్ల నాటికి యుద్ధానికి దిగి శత్రుదేశాల జనాలను చంపడమనేది తలకుమించిన భారం అయిపోతుంది.  
 
 భారత్.. అగ్రదేశం!
ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకు హెచ్‌ఎస్‌బీసీ అంచనా ప్రకారం.. 2050 నాటికి  24.62 లక్షల కోట్ల డాలర్ల ఆర్థికవ్యవస్థతో చైనా అగ్రదేశంగా వె లుగొందుతుంది. 22.27 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థతో ప్రస్తుత అగ్రరాజ్యం అమెరికా రెండో స్థానంలో ఉంటుంది. ఇక అప్పటికి మూడో స్థానంలోకి వచ్చే దేశం మనదే! 8.17 లక్షల కోట్ల డాలర్ల ఆర్థికవ్యవస్థతో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరిస్తుంది. అప్పటికి మనదేశంలో పనిచేసేవారు ఎక్కువగా, రిటైర్ అయ్యేవారు తక్కువగా ఉండటం వల్ల ఆర్థిక వ్యవస్థ మరింత పరిపుష్టం అవుతుంది. అలాగే ప్రస్తుతం అభివృద్ధి చెందిన, చెందుతున్న, పేద దేశాలున్నాయి. కానీ 2035 నాటికి దాదాపుగా అన్ని దేశాలూ సంపన్నం అయిపోతాయి.
 
 మార్స్‌పై మన జెండా!
 సౌరకుటుంబంలో భూమి తర్వాత కాస్త అనుకూలంగా ఉన్న గ్రహం ఒక్క అంగారకుడే. అందుకే అగ్రదేశాలు, ప్రై వేటు కంపెనీల కన్ను ఇప్పుడు అరుణగ్రహంపై పడింది. అన్నీ సవ్యంగా సాగితే 2050 నాటికి అంగారకుడిపై మనిషి దాదాపుగా స్థిరపడతాడట. అప్పటికి భారత్ కూడా ఆర్థికంగా, సాంకేతికంగా సంపన్నదేశం అవుతుంది కాబట్టి.. మార్స్‌పై భారత కాలనీ ఏర్పాటుకు ప్రయత్నాలూ జరుగుతాయేమో!  
 - హన్మిరెడ్డి యెద్దుల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement