అనగనగా ఒక అడవి. అడవి ప్రక్కన ఒక గ్రామం. ఆ గ్రామంలో మూడు పంది పిల్లలు వాళ్ళ అమ్మనాన్నలతో హాయిగా జీవించేవి. అవి పెద్దవయ్యాక వాళ్ళ ఇల్లు సరిపోకపోవడంతో తల్లిదండ్రులు వాటిని వేరేగా మంచి ఇల్లు కట్టుకుని ఉండమన్నాయి. అప్పుడవి మంచి ప్రదేశం కోసం వెతుకుతూ అడవిలోకి వెళ్ళాయి. ఒక రావి చెట్టు దగ్గర మంచి ప్రదేశం చూసుకున్నాయి. అక్కడ ఇల్లు ఎలా కట్టుకోవాలా అనుకుంటుండగా ఆ దారినే పోతున్న ఒక ఒంటె ఈ పంది పిల్లలని చూసి సంగతేంటని అడిగింది. ‘‘మేము ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాము. అయితే ఇల్లు దేనితో కట్టుకోవాలో తెలియడంలేదు’’ అన్నాయవి. అప్పుడా ఒంటె ‘‘ఏమీ దిగులు పడకండి. నాకు ఇటుకల బట్టీ ఉంది. బాగా కాల్చిన ఇటుకలు ఇస్తాను. వాటితో కట్టుకోండి’’ అంది. అవి ఒంటెకి ధన్యవాదాలు చెప్పుకుని ఇంటికి కావలసినన్ని ఇటుకలు తెచ్చుకుని, ఇల్లు కట్టుకుని అక్కడ ఉండసాగాయి. ఒకరోజు ఈ మూడు పందులని గమనించిన ఒక తోడేలు ఎలాగైనా వాటిని పట్టి తినాలనుకుంది. అది పందులున్న ఇంటి దగ్గరకొచ్చి ‘‘ఏయ్, మురికి పందులూ, నన్ను లోపలకి రానివ్వండి’’ అంది. ‘‘నిన్ను మేము రానివ్వం. రానిస్తే మమ్మల్ని తింటావని మాకు తెలుసు’’ అన్నాయి పందులు.
‘‘మీరు రానివ్వకపోతే మీ ఇల్లు ఊదేస్తాను, ఇంటిని పీకేస్తాను, మిమ్మల్ని పట్టి తినేస్తాను’’ అంది తోడేలు. ‘‘వద్దు, వద్దు’‘ అని అరిచాయి లోపల నుండి పందులు. తోడేలు ‘హఫ్, హుఫ్, హఫ్, హుఫ్’ అని ఊదింది. ఇటుకలని పీకడానికి ప్రయత్నించింది. ‘‘అబ్బ! ఈ ఇల్లుగట్టిగా ఉందే’’ అని, ‘‘సరే ఇçప్పుడు చీకటి పడింది కాబట్టి వెళ్ళిపోతున్నాను. రేపు సాయంత్రం సుత్తితో వస్తాను. తలుపు పగలగొట్టి లోపలకి వస్తాను’’ అంటూ వెళ్ళిపోయింది. ‘‘వద్దు, వద్దు. మా ఇంటినేం చేయొద్దు’’ అరిచాయి పందులు. తెల్లవారింది. మూడు పందులకి ఏం చేయాలో పాలుపోక ఏడుçస్తూ కూర్చున్నాయి. అప్పుడు ఆ దారిలో పోతున్న నిప్పు కోడి విషయం తెలుసుకుని.. ‘‘ఏడవకండి, నా దగ్గర పట్టుకుంటే షాక్కొట్టే తాళాలు ఉన్నాయి. వాటిని బిగించండి. ఆ తోడేలు వచ్చినప్పుడు స్విచ్ వేయండి. పట్టుకుంటే షాక్కొట్టి అల్లంత దూరాన పడుతుంది. ఇక మీ జోలికిరాదు’’ అంది. మూడు పందులూ నిప్పుకోడికి కృతజ్ఞతలు చెప్పుకుని కరెంటు తాళాలు తెచ్చి తలుపులకు బిగించాయి. సాయంత్రమైంది. సుత్తితో తోడేలు వచ్చింది. ‘‘ఏయ్, మురికి పందులూ.. మీ తాళాన్ని పీకేస్తాను, తలుపులని పగలగొట్టి, లోపలకొచ్చి మిమ్మల్ని పట్టి తినేస్తాను’’ అంది తోడేలు.
‘‘వద్దు, వద్దు’’ అని అరిచి గబగబా స్విచ్చి వేశాయి. స్విచ్చి వేయగానే తాళాలన్నీ ఎర్రగా మండసాగాయి. తోడేలు సుత్తి తీసుకుని తాళం పగలగొట్టబోయింది. షాక్కొట్టి ఎగిరి అవతలపడింది. ‘‘ఓ, కరెంటు తాళాలు వేశారా, సరే రేపు వస్తాను, డ్రిల్లింగ్ మిషిన్ తెస్తాను, తాళాలు పగలగొట్టి లోపలకి వస్తాను’’ అంది కోపంగా. ‘‘వద్దు, వద్దు.’’ అరిచాయి పందులు. తెల్లవారింది. ఏం చేయాలో తెలియక ఏడుస్తూ కూర్చున్నాయి పందులు. అప్పుడా దారిలో పోతున్న సీతాకోకచిలుకల గుంపు ఈ పందుల దగ్గర వాలి ‘‘ఎందుకేడుస్తున్నారు?’’ అని అడిగాయి. విషయం చెప్పగానే ‘‘మేము చెప్పినట్లు చేయండి. ముందుగా అదిగో ఆ ప్రక్కనున్న చెరువులో స్నానం చేసిరండి’’ అంది ఒక తెల్లని సీతాకోకచిలుక. అవి స్నానం చేసి వచ్చాయి. ‘‘ఇంటి ముందు పూల చెట్లతో అలంకరించండి’’ అన్నాయి ఎరుపు, నలుపు, నీలం రంగు సీతాకోక చిలుకలు. మూడు పందులూ గబగబా రకరకాల రంగుల పూల చెట్లను తెచ్చి నాటాయి. ‘‘ఇంటిపైకి పాకేలా పూల తీగలని నాటండి’’ అన్నాయి పసుపు సీతాకోక చిలుకలు. పందులు పూల తీగలను తెచ్చి ఇంటి పైకి పాకించాయి. ఇల్లు అందంగా తయారయింది.
‘‘ఆహా! మీ ఇల్లు ఎంత బాగుంది?’’ అంటూ సీతాకోక చిలుకలన్నీ ఇంటి ముందు పుప్పొడితో రంగవల్లులు వేసి వెళ్ళిపోయాయి. పందులు సీతాకోక చిలుకలకి వీడ్కోలు పలికాయి. ‘‘ఆహా! మన ఇల్లు ఎంత బాగుంది?’’ అనుకున్నాయవి. అలిసిపోయిన అవి హాయిగా పడుకుని నిద్రపోయాయి. సాయంత్రమయింది. తోడేలు డ్రిల్లింగ్ మిషెన్‌తో వచ్చింది. ‘‘పందులుండే ఇల్లు ఇది కాదే, దారితప్పానా?’’ అనుకుంది. సరిగ్గా చూసింది. ‘‘ఆహా! ఇదే కాని ఈ ఇల్లు ఎంత బాగుంది?’’ అనుకుంటూ వచ్చి ‘‘పందులూ, శుభ్రంగా ఉన్న పందులూ మీ ఇల్లు ఎంత బాగుంది, ఎంత సువాసనగా ఉంది? నన్ను లోపలకి రానివ్వండి’’ అని చిన్నగా అడిగింది. ‘‘రానిస్తాం, కాని నువ్వు మమ్మల్ని ఎందుకు తినాలనుకుంటున్నావ్? మా దగ్గర బోలెడన్ని దుంపలు, తేనె ఉంది. నీకు అవి ఇస్తాం. నువ్వు మాతో స్నేహం చేస్తే నీకు చాలా ఆటలు కూడా నేర్పుతాం!’’ అన్నాయవి. ‘‘ఓ! అలాగే, నేను మీతో స్నేహం చేస్తాను. మీరు పెట్టినవే తింటాను, మీతో ఆటలాడతాను, లోపలకి రానివ్వండి. మీ ఇంటిని చూస్తుంటే నాకు హాయిగా ఉంది. ఇంతకు ముందు మిమ్మల్ని తింటానని బెదిరించినందుకు క్షమించండి’’ అంది తోడేలు. ‘‘ఇప్పుడు మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము’’ అంటూ పందులు తలుపు తీశాయి. తోడేలు లోపలకి వెళ్ళింది. శుభ్రంగా ఉన్న పందులనీ, ఇంటినీ చూసి చాలా ఆనందపడింది. అన్నీ చక్కగా చేతులు కడుక్కుని దుంపలుతిని, తేనెని తాగాయి.ఇంటి వెనుకనున్న తోటలో అవన్నీ కలసిమెలసి సంతోషంగా ఆటలాడుకున్నాయి. రావిచెట్టు మీద వాలి ఇదంతా చూస్తున్న సీతాకోక చిలుకలు కిలకిలా నవ్వాయి.
– రాధ మండువ
మూడు పంది పిల్లలు – తోడేలు
Published Sat, Oct 14 2017 11:52 PM | Last Updated on Sat, Oct 14 2017 11:52 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment