డ్రైవ్‌–ఇన్‌ | special story to drive in | Sakshi
Sakshi News home page

డ్రైవ్‌–ఇన్‌

Published Sun, Jan 7 2018 12:49 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

special story to  drive in - Sakshi

ఆఫీస్‌ నుంచి ఇంటికి వచ్చిన నేను డ్రెస్‌ చేంజ్‌ చేసి, కాళ్లు ముఖం కడుక్కుని సోఫాపై కూలబడ్డాను. మా ఆవిడ కాఫీకప్పును నా చేతి కందించింది. ఆమె ఇచ్చిన కాఫీని సిప్‌ చేస్తూ టీపాయ్‌ మీదున్న ఉత్తరాలని ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ వచ్చా. అందులో గృహ ప్రవేశ ఆహ్వాన పత్రిక ఒకటి కంటబడింది. అడ్రస్‌ వ్రాసిన అక్షరాలని గమనించగానే తెల్సిపోయింది. ఇది నా బాల్యస్నేహితుడు నారాయణ ఉరఫ్‌ నానిగాడి నుంచేనని. చాల్రోజుల్నుంచి వీడి నుంచి ఓ ఫోన్‌ కాల్, లేదా ఓ మెసేజ్‌గాని లేదు. నేనే కాల్‌ చేస్తే ‘‘బిజీగా ఉన్నా, ఆ తర్వాత కాల్‌ చేస్తా’’నని కాల్‌ కట్‌ చేసేవాడు. ఇప్పుడు నేను ఇంట్లో లేని సమయంలో, ఇంటికొచ్చి ఇన్విటేషన్‌ ఇచ్చివెళ్లాడు వెధవ అనుకుంటూ.. ‘‘సుమా.. నానిగాడు వచ్చివెళ్లాడా.. సుమా.. సుమా..’’‘‘ఏంటండి అది.. కాఫీతోటి కొరుకుడికి ఈవేళ ఏం లేదు. కాఫీతో సరిపెట్టుకోండి. త్వరగా ముగించేస్తా వంట. భోంచేద్దురు గానీ; ఏదైనా కావాల్సివస్తే ఆ ఫ్రిజ్‌లో పళ్లున్నాయి. తీస్కోండి.’’ అంటూ వంటింట్లో నుంచే సమాధానమిచ్చింది మా ఆవిడ.

‘‘అందుక్కాదే నిన్ను పిల్చింది. మా నానిగాడి గృహప్రవేశ పత్రికని ఎవరిచ్చివెళ్లారు? వాడే స్వయంగా వచ్చాడా అని అడుగుతున్నా...’’‘‘అదా.. మీ స్నేహితుడికి తీరికెక్కడుంది పాపం? ఆయనగారి భార్య శ్రీమతి లత.. మా కిట్టీ పార్టీలో వుంది కదా.. నాకు చిక్కుతూనే వుంటారు అప్పుడప్పుడు. ఆయనగారు పూర్తిగా బిజీనట. ఇన్విటేషన్ల పంపకం కార్యక్రమాలన్నీ పెళ్లానికే అప్పగించారట. తానే వచ్చి ఇచ్చి వెళ్లింది. తప్పకుండా రావాలని మరీ మరీ చెప్పి వెళ్లింది. అందులో మీ స్నేహితుడుగారు రాసిన ఉత్తరం వున్నట్లుంది చూడండి. ప్యూర్లీ పర్సనల్‌ అని వుంది దానిపైన. అందుకే నే దాన్ని చదవలేదు’’ అంది.
‘‘ఊ.. ఏం బిజీనో ఏంటో.. నాకు తెలీని పనులా వాడికి? కాలేజీ చదివే రోజుల్లో వాళ్ల నాన్నగారు వాడికి ప్యాకెట్‌ మనీ ఇచ్చేవారు. కష్టాల్లో వున్న వాళ్లకి బదులిచ్చి ఆదుకునేవాడు. అయితే వాళ్లు వాపస్‌ ఇచ్చేటప్పుడు తప్పకుండా వడ్డీ వసూలు చేసేవాడు వెధవ. అందుకే మేం వాణ్ణి కాబూలీవాలా అని పిల్చేవాళ్లం. అలాంటి బిజినెస్‌మైండ్‌ వాడిది. చదువైపోయిన తరువాత ఒకే ఊళ్లోవున్నా వృత్తిపరంగా వేరైపోయాం. నానిగాడు తన ఉద్యోగంతో పాటూ... తన వడ్డీవ్యవహారాలని కొనసాగిస్తూనే వుండేవాడు. అడిగితే.. ఒరే, ఇది మా కులవృత్తిరా, దీన్ని విడిచిపెట్టడం సాధ్యమా? అని అనేవాడు. వాడి వ్యవహారాలు, లావాదేవీలు ఎక్కువయ్యాయి. దాంతో మేం పరస్పరం కలవటం తక్కువైపోయింది.

ఉత్తరంలో ఇలా వుంది..‘ప్రియమైన సుబ్బూ.. వచ్చే ఆదివారం నా నూతన గృహప్రవేశం. నేనే స్వయంగా వచ్చి పిలవాలనుకున్నా కానీ కుదరలేదు. బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ పన్లు కొద్దిగా నిల్చిపోవటం వల్ల రాలేకపోతున్నాను. అంతే కాకుండా ఇందులో చేరిపోవడానికి అడ్వాన్స్‌ ఇవ్వటానికి జనం పోటీ పడుతున్నారు. అల్లాంటప్పుడు నేనిక్కడ లేకుంటే ఎలా? విరామమే లేదనుకో. అందుకే ఈ లేఖ. నీవు కుటుంబ సమేతంగా వచ్చితీరాలి. నీకోసం ఎదురు చూస్తూ వుంటాను. అన్యధాభావించక. ఇట్లు నీ నాని.’ఆహ్వాన పత్రికని చదివా. ఇంటిపేరు చాలా చిత్రంగా వుండటం నాకు నవ్వొచ్చింది. ‘డ్రైవ్‌–ఇన్‌’ అట. ఈ మహానుభావుడికి ఇంకో పేరే దొరకలేదు కాబోలు. వేరే పేరే తట్టలేదా వీడికి.? లేదా దీంట్లో కూడా ఏదో పరమార్థం వుందా? ఎందుకంటే మా వాడు సామాన్యుడు కాడే. ఏదో తిరకాసు వుండనే వుంటుంది. ఎలాగూ వెళుతున్నా కదా.. వాణ్ణే అడిగి తెల్సుకుంటే పోలా.. అని సరిపెట్టుకున్నా.ఆదివారం వచ్చేసింది. మా ఆవిడతో సహా వాడి కొత్త ఇంటి ముందు నిలబడ్డా. పేద్ద పందిరి. పచ్చతోరణాలు అడుగడుగునా అతిథులు. చూసి ఆశ్చర్యపోయా. లోనికెళ్లడానికే వీల్లేకుండా కిక్కిరిసిపోయారు. మా ఆవిడకి చిక్కింది సందు నన్ను దెప్పిపొయ్యడానికి.. ‘‘చూశారా? మీ ఫ్రెండ్‌ నారాయణ ఎంతమందితో కాంటాక్ట్‌ పెట్టుకున్నాడో.. మీరూ ఉన్నారు ఎందుకూ? పక్కింటివాళ్లని కూడా హలో అని పిలవరాయే..’’ అంది.

దాని మాటలు చెవిని పడలేదన్నట్లుగా నటిస్తూ నానిగాడు ఎక్కడైనా కనిపిస్తాడేమోనని, అటూ.. ఇటూ.. తల తిప్పి చూస్తున్నా. ‘‘ఒరేయ్‌ సుబ్బూ.. ఎందుకురా అక్కడే నిలబడిపోయావ్‌? ఇటురా లోపలికి..’’ అంటూ ఎక్కణ్ణుంచో ఊడిపడి నా చెయ్యి దొరకబుచ్చుకుని లోనికి లాక్కెళ్లాడు. ‘‘రామ్మా, బిల్డింగ్‌ చూద్దువుగానీ,’’ అని మా ఆవిడ్ని ఆహ్వానించాడు. ఈయనెవరో నారాయణకి చాలా కావాల్సిన వాడు కాబోలు అనుకుని చుట్టూ వున్న వాళ్లు దారి ఇచ్చారు.మూడంతస్తుల బిల్డింగ్‌. ముఖద్వారానికి పూజ చేసి అలంకరించిన ఓ పెద్ద బూడిద గుమ్మడికాయ వేలాడుతోంది. అంతటా పూలతోటి అలంకరణ. చుట్టూతా కాంక్రీట్‌ స్తంభాలు సుభద్రంగా ఉన్నాయి. క్రింది అంతస్థు పార్కింగ్‌ కోసం కేటాయించాడనుకుని పైకి ఎక్కా. మెట్లకి బదులుగా ఓ కారే వెళ్లగలిగినంత వెడల్పాటి ర్యాంప్‌. ఎక్కడానికి సులువుగా వుంటుందని ఈ ఏర్పాటు అయివుంటుంది. పై అంతస్థులోనూ అంతే. క్రింది అంతçస్తులాగే స్తంభాలతోటి ఉన్న ర్యాంప్‌వే కన్పించాయి. ఆశ్చర్యమేసి, ‘‘ఒరే నానీ.. హాల్‌ లేదు, రూంలు లేవు.. రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్‌లా కన్పించడం లేదు కదరా.. ఏంట్రా ఈ కట్టడం? దీనికోసం అడ్వాన్సులివ్వడానికి పోటీపడుతున్నారా?’’ అన్నా ఆశ్చర్యం అణుచుకోలేక.

‘‘అవన్నీ లేవురా.. ఓన్లీ పిల్లర్స్‌.. అంతే.. ఇక్కడెవరుంటార్రా.. దీన్నంతట్నీ చూసుకోవడానికని ఇద్దరు సెక్యూరిటీలుంటారు. వాళ్ల కోసం దీని వెనకాల రెండు రూంలు కట్టించా వాళ్లుండటానికి. కావాల్సిన వసతులన్నీ కల్పించా. ఈ బిల్డింగ్‌ ముందువైపు రెండు పెద్ద గేట్లున్నాయి. రాత్రిళ్లు వాటిని మూసివుంచుతారు సెక్యూరిటీ వాళ్లు. ఏ వెహికల్‌ వచ్చిందీ.. వెళ్లిందీ.. అనే వివరాలు, వాటి సమయాలు నోట్‌ చేసి వుంచటమే వాళ్లపని. కార్లు, స్కూటర్స్, మోటారుసైకిళ్లు దొంగతనాలకి గురి అవుతున్నాయి ఇటీవల. చాలా మంది ఇళ్లలో వెహికల్స్‌ని పార్క్‌ చేయటానికి కావాల్సిన స్థలమంటూ ఉండట్లేదు. అదీకాక ఒక్కోరింట్లో మూడు నాల్గేసి వెహికల్స్‌. వాటిని ఇంటిముందు రోడ్డు మీద పార్క్‌ చేయడం కుదరదు కదా. అందుకని ఇలాంటి పార్కింగ్‌ ప్లేస్‌ ఎంతైనా అవసరం ఏమంటావ్‌? ఇది తెలిసే నేను ‘పే అండ్‌ పార్కింగ్‌’ లాగా ఈ భవనాన్ని కట్టించా..’’ అన్నాడు.‘‘ఇంతపెద్ద బిల్డింగ్‌కి కావాల్సిన స్థలం ఎప్పుడు కొన్నావురా నాకు తెలీకుండా?’’ అడిగా వాడ్ని నా ఆశ్చర్యం తాలూకా చిహ్నాలు నాలో ఇంకా మాసిపోలేదు.‘‘ఒరే.. ఇది మా తాతగారి ఇల్లు కదట్రా.. చిన్నప్పుడు నీవూ నేను ఆట్లాడుకుంది ఈ ఇంట్లోనే కదరా? గుర్తు లేదా? మా తాతగారి తర్వాత ఇది మా నాన్నగారికి సంక్రమించింది. ఇది నా హస్తగతమయ్యింది. అప్పుడొచ్చింది ఈ ఐడియా. 50/80 సైటు. ఇళ్లు కట్టుకుంటే మూడంతస్తుల్లో ఆరిళ్లు కట్టడానికి చాలా డబ్బు కావాలి. ఒకవేళ కట్టినా ఆ ఆరిళ్లకి వచ్చే అద్దె ఎంత? నెలకి అరవై లేదా డెబ్బై వేలు. బ్యాంక్‌ నుంచి తెచ్చిన అప్పుకు కట్టే వడ్డీ, కంతులకే సరిపోతుందా అద్దె. అప్పు తీరి, ఇల్లు మన సొంతం కావటానికి కనీసం పదిహేను ఏళ్లయినా కావాలి. ఈ మధ్యకాలంలో, రిపేర్లకని.. అదనీ.. ఇదనీ.. సవాలక్ష ఖర్చులు. ఇప్పుడు చూడు.. ప్రతి అంతస్తులోనూ ఇరవై విశాలమైన పార్కింగ్‌ స్పేస్‌లు, ప్రతి పార్కింగ్‌ ప్లేస్‌లో ఓ కారు, రెండు టూ వీలర్స్‌ని పార్క్‌ చేయవచ్చు. అంతమాత్రానికే నెలకి ఎంత అద్దె ఇస్తారనుకున్నావ్‌? అన్ని పార్కింగ్‌ ప్లేస్‌లు అప్పుడే బుక్‌ అయిపోయాయి. అడ్వాన్స్‌లు కూడా ఇచ్చేశారు. బ్యాంక్‌లోన్‌ తోటి, నా దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతోటి దీన్ని ప్రారంభించా. మొత్తం అన్నింటి నుంచి నెలకి ఓ లక్షా ఎనభైవేలకేమీ ఢోకా లేదు.  సెక్యూరిటీలకని, దానికనీ, దీనికనీ నెలకి 30 వేలు పోయినా.. ఓ లక్షా యాభైవేలు మిగులు. ఈ ఆదాయంతో ఓ రెండేళ్లలో బ్యాంక్‌లోన్‌ తీరుతుంది. ఉండటానికి సొంత ఇల్లు వేరే ఉంది కనుక.. మరో ఇల్లు కట్టుకోవాల్సిన పనిలేదు. ఎలా ఉందంటావ్‌ నా ప్లాన్‌??’’అని ముగించాడు.

వాడి బిజినెస్‌ బుర్రకు జోహార్లు. అప్పుడు తట్టింది వీడు దీనికి ‘డ్రైవ్‌ ఇన్‌’  అని నామకరణం ఎందుకు చేశాడోనని. డొక్కలో ఎవరో పొడిచినట్టయ్యింది. ఎవరోననుకున్నా మా ఆవిడే. చూశారా మీ ఫ్రెండ్‌ బుర్ర. మీరు వున్నారు ఎందుకని? అన్నట్టుంది ఆ చూపు.మా కాబూలీవాలా నానిగాడి తెలివికి సంతోషిస్తూ వాడికి శుభం కావాలని ఆశిస్తూ.. విందు భోజనం ఆరగించి ఇంటికి చేరాం.
కన్నడ మూలం: బి. ఆర్‌. నాగరత్న
అనువాదం: కల్లూరి జానకిరామరావు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement