రాజనీతి | Special Story By Gangihetti Sivakumar In Funday On 2/01/2020 | Sakshi
Sakshi News home page

రాజనీతి

Published Sun, Jan 12 2020 5:08 AM | Last Updated on Sun, Jan 12 2020 5:08 AM

Special Story By Gangihetti Sivakumar In Funday On 2/01/2020 - Sakshi

పూర్వం చంద్రగిరిని జయవర్ధనుడనే రాజు పాలించేవాడు. ఆయన పాలనలో సమర్థుడు. తన కాలంలో రాజ్యాన్ని బాగా విస్తరించడమే కాక ప్రజలను కన్నబిడ్డల వలే చూసేవాడు.
రాజ్యం మధ్యన వున్న నది ఒడ్డున పెద్దకోట కట్టాడు. అది శత్రుదుర్భేద్యమైన కోట. ఆయనకు చెట్లంటే వల్లమాలిన అభిమానం. కోట లోపల వున్న అంతఃపురం చుట్టూ గొప్ప ఉద్యనవనాన్ని  పెంచాడు. వాటిని చూడడానికి అనేకమంది పనివాళ్లను నియమించాడు.
యుద్ధాలు లేని, రాజకీయంగా సమస్యలు లేని సమయాల్లో ఆయన సాయంత్రం ఉద్యానవనంలో సేదదీరేవాడు. ఆ సమయంలో అక్కడికి పండితులను రప్పించుకుని, వారి చేత రామాయణ, భారత, భాగవతాలను చదివింపజేసుకొని వినేవాడు. అందులోని ధర్మసూక్ష్మాలను వారితో చర్చించేవాడు.
అయితే ఆయనకు పెద్ద కొరత ఉండేది, అదేమంటే సంతానం లేకపోవడం. ఎవరైనా ఆ విషయాన్ని ఆయన ముందు ఎత్తితే, ‘‘ఎందుకు బిడ్డలు లేరని బాధ పడటం? నా ప్రజలందరూ నా బిడ్డలే కదా! ఇందుకు నేను సంతోషపడాలిగాని, విచారించడం దేనికి? అది సరయింది కాదు’’ అనేవాడు.
‘‘అది కాదు ప్రభూ! తమ తర్వాత ఈ రాజ్యానికి వారసుడెవరా?’’  అని అంటే ‘‘అది భగవంతుడు నిర్ణయిస్తాడు, దానికి మనం బాధ పడటం దేనికి?’’ అనేవాడు మహారాజు.
కాలం గడిచింది. రాజుగారు వృద్ధులయ్యారు. కాలం చేశారు. తరవాత వారసుడి గురించి సేనాధిపతి, మంత్రిని అడిగాడు. అప్పుడు మంత్రి, ‘‘మన రాజ్యానికి అనాదిగా ఒక ఆచారం వుంది. వారసుడు లేనప్పుడు మన పట్టపుటేనుగుకు ఒక దండ ఇచ్చి, అది ఎవరి మెడలో వేస్తే వారే రాజు! ఆ ఆచారాన్నే మనం ఇప్పుడు కూడా కొనసాగనిద్దాం’’ అన్నాడు.
‘‘ఏనుగుకు ఎవరు సమర్థుడో, ఎవడు కాదో ఎలా తెలుస్తుంది? ఒకవేళ ఒక అనర్హుడు అదృష్టవంతుడయితే మన రాజ్యం పరిస్థితి ఏమిటి? అధోగతే  కదా?’’ అని సేనాధిపతి అన్నాడు. దానికి మంత్రి, ‘‘మన ప్రభువు గొప్ప దైవభక్తుడు, ఆయన ఆశీస్సులు మనకెప్పుడూ వుంటాయి. మన పట్టపుటేనుగు మనకు మంచి రాజును నిర్ణయిస్తుందని నాకు నమ్మకం వుంది’’ అన్నాడు.
మంచి ముహూర్తం చూసి, మంత్రి పట్టపుటేనుగుకు మాల ఇచ్చి, రాజవీధుల గుండా నడిపించే ఏర్పాటు చేశాడు. హుందాగా పూలదండను తొండంతో పట్టుకుని రాజవీధుల గుండా నడుస్తూ చివరకు పట్టపుటేనుగు ఒక బలిష్ఠుడైన సామాన్యుడి మెడలో వేసింది. ఆశ్చర్యం! విచారిస్తే, వాడు కోటలో వున్న తోటమాలి కొడుకు, వీరభద్రుడు. మంత్రి అతణ్ణి రాజుగా ప్రకటించి, పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయసాగాడు. సేనాధిపతి, మంత్రితో ‘‘ఒక తోటమాలి కొడుకు ఇంత పెద్దరాజ్యాన్ని సమర్థంగా పరిపాలించగలడా? శత్రువుల బారి నుండి రాజ్యాన్ని కాపాడగలడా?’’ అంటూ సందేహం బయటపెట్టాడు.
ఇదంతా వీరభద్రుడు విననే విన్నాడు. ‘‘అయ్యా! నేను తోటమాలి కొడుకునే. అయినంత మాత్రాన రాజ్యాన్ని పాలించలేనని ఎలా అనుకుంటున్నారు? ఎవరైనా అవకాశం రానంతవరకే సామాన్యులు. అవకాశం లభిస్తే వారిలోని శక్తిసామర్థ్యాలు వాటంతట అవే వెలుపలికి వస్తాయి’’ అంటూ ఈ శ్లోకం చెప్పాడు.
యధా మధు సమాదత్తే
రక్షాన్‌ పుష్పాణి షట్పదః
తద్వ దర్థాన్మనుష్యే భ్య
ఆద ద్యాద విహింసయా–అంటే ‘‘తుమ్మెదలు ఏ విధంగానయితే, తమకున్న శక్తియుక్తులతో పూలను పాడు చేయకుండా, వాని నుండి మహత్తరమైన తేనెను పొందుతాయో...అట్లే ప్రజారంజకుడైన రాజు తన ప్రజలను అన్ని విధాలైన ఆపదల నుండి కాపాడుతూనే రాజ్య  క్షేమం కోసం వాని నుండి తగిన మేరకు శిస్తు మొదలైన వాటిద్వారా ధనాన్ని, ఏ విధమైన హింసకు తావు లేకుండా సన్మార్గాన గ్రహిస్తాడు’’ అని అర్థం చెప్పాడు.
మంత్రి, సేనాధిసతి ఆశ్చర్యపోతుండగా వీరభద్రుడు ఇలా ఇలా అన్నాడు...
పుష్పం పుష్పం విచిన్వీత మూలచ్ఛేదం నకారయేత్‌
మూలాకార ఇవారమే న యధా జ్ఞా ర క కారకః  అంటూ అర్థం కూడా ఇలా చెప్పాడు వీరభద్రుడు.
‘‘తోటలో మాలి ఏ విధంగా ఒక్కొక్క పువ్వును ఎంతో జాగ్రత్తగా పువ్వు యొక్క మూలానికి హాని కలగకుండా పుష్పాలను కోస్తాడో, అదే విధంగా ప్రజారంజకుడైన రాజు తన ప్రజల జీవన మూలానికి ఎటువంటి కీడు కలిగించకుండా పన్నులు గ్రహిస్తాడు. అంతేగాని బొగ్గును తయారు చేసే వాడిలాగా మూలానికి హాని చేయడు’’
ఆశ్చర్యం నుంచి తేరుకొని మంత్రి ‘‘ఇవన్నీ భారతంలోని విదురనీతిలోనివి. నీకెలా తెలుసు? చూస్తే నీకు మంచి ధారణశక్తి వున్నట్టుంది’’ అన్నాడు. దానికి వీరభద్రుడు–
‘‘అయ్యా! నేను చిన్ననాటి నుండి రాజుగారి ఉద్యానవనంలో నా తండ్రితో పాటు కలిసి పనిచేస్తుండేవాణ్ణి! రాజుగారు సాయం సమయాల్లో జరిపే పండితగోష్ఠులను శ్రద్ధగా వినేవాడ్ని. పెద్దయితే నేను రాజుగారి కొలువులో ఏదైనా ఉద్యోగం చేయాలనుకునేవాణ్ణి, కాని అదృష్టం నన్ను రాజును చేసింది. నాకున్న జ్ఞానంతో నేను రాజ్యాన్ని సుభిక్షం చేయగలనన్న ఆత్మవిశ్వాసం నాకుంది’’ అన్నాడు.
మంత్రికి ఎంతో తృప్తి కలిగింది. ఆయన సేనాధిపతి వైపు చూస్తూ ‘‘రాజుగారన్నట్లే భగవంతుడు మనకు మంచి రాజునే ఇచ్చాడు. ఇతనికి రాజనీతి తెలుసు. మన సహాయసహాకారాలు ఎలాగూ వుంటాయి గనక ఇబ్బంది ఏమి లేదు’’ అన్నాడు. సేనాపధిపతి సంతృప్తి పడ్డాడు.
వారు ఊహించినట్టే వీరభద్రుడు అతి తక్కువ కాలంలోనే మంచిరాజుగా పేరు ప్రఖ్యాతలు పొందాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement