అందరివాడు  గోవిందుడు | Special story to krishna janmashtami | Sakshi
Sakshi News home page

అందరివాడు  గోవిందుడు

Published Sun, Sep 2 2018 1:11 AM | Last Updated on Sun, Sep 2 2018 1:11 AM

Special story to krishna janmashtami - Sakshi

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్‌దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్‌!ఆది శంకరాచార్యులు శ్రీకృష్ణుడిని జగద్గురువుగా కీర్తిస్తూ కృష్ణాష్టకాన్ని విరచించారు. కురుక్షేత్రంలో అర్జునుడికి కర్తవ్య బోధ చేస్తూ శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత సనాతన ధర్మంలోని సర్వమతాలకు ఆరాధ్య గ్రంథం. అద్వైతాన్ని స్థాపించిన ఆది శంకరాచార్యులు, విశిష్టాద్వైతాన్ని బోధించిన రామానుజాచార్యులు, ద్వైతాన్ని ప్రతిపాదించిన మధ్వాచార్యులు సహా ఎందరో ఆధ్యాత్మిక గురువులు గీతాచార్యుడైన శ్రీకృష్ణుడిని జగద్గురువుగా తలచి కొలిచి తరించారు. కృష్ణుడు బోధించిన భగవద్గీతకు అనేకమంది ఆధ్యాత్మిక గురువులు వ్యాఖ్యానాలు రాశారు. చైతన్య మహాప్రభువు కృష్ణభక్తికి విస్తృత ప్రచారం కల్పించారు. భక్త జయదేవుడు, మీరాబాయి, సూరదాసు, నామదేవ్‌ వంటి వారు కృష్ణలీలలను గానం చేశారు. జయదేవుడి అష్టపదులు, మీరబాయి, సూరదాసుల భజన గీతాలు, నామదేవ్‌ విరచిత అభంగ్‌లు భారతీయ సంగీత సాహిత్యాలను సుసంపన్నం చేశాయి. పండితులు, ఆధ్యాత్మికవేత్తలు మాత్రమే కాదు, బృందావనంలోని గోపికలు మొదలుకొని వ్రేపల్లెలోని ఆబాల గోపాలం సహా సామాన్యులు కూడా కృష్ణుని ఆరాధనలో తరించారు. అందుకే గోవిందుడు అందరివాడని ప్రతీతి పొందాడు. 

సంభవామి యుగే యుగే
లోకంలో అధర్మం ప్రబలినప్పుడు దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి ప్రతి యుగంలోనూ అవతరిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ద్వాపర యుగంలో లోకంలో అధర్మం పెచ్చుమీరిన కాలంలో బ్రహ్మదేవుడు, భూదేవి ప్రార్థించగా, శ్రీమహావిషువు దేవకీ, వసుదేవులకు జన్మించ సంకల్పించాడు. అప్పుడు మధురా నగరాన్ని శూరసేన మహారాజు పరిపాలించేవాడు.వసుదేవుడు ఆయన కొడుకు. వసుదేవుడికి యుక్తవయసు రావడంతో ఉగ్రసేన మహారాజు కూతురు దేవకీదేవితో వివాహం జరిపిస్తారు. చెల్లెలు దేవకీదేవిని అత్తవారింట దిగబెట్టేందుకు కంసుడు స్వయంగా రథం నడుపుతాడు. రథం తోవలో ఉండగానే ‘దేవకీదేవి అష్టమ గర్భాన పుట్టిన కొడుకు చేతిలో కంసుడి చావు తప్పదు’ అని అశరీరవాణి హెచ్చరిక వినిపిస్తుంది. ఆ హెచ్చరికతో ఆగ్రహించిన కంసుడు దేవకీదేవిని, వసుదేవుడిని, అడ్డు వచ్చిన తన తండ్రి ఉగ్రసేనుడిని కూడా చెరసాలలో పెడతాడు. చెరసాలలో దేవకీదేవికి జన్మించిన ఆరుగురు శిశువులను కంసుడు దారుణంగా చంపేస్తాడు. దేవకీదేవి ఏడవసారి గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశ పెడతాడు. ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు. చెరసాలలో దేవకికి గర్భస్రావం జరిగిందని అనుకుంటారు. కొన్నాళ్లకు దేవకీ దేవి ఎనిమిదోసారి గర్భం ధరిస్తుంది. శ్రావణ శుద్ధ అష్టమినాడు అర్ధరాత్రివేళ రోహిణీ నక్షత్రం ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు దేవకీ గర్భాన జన్మిస్తాడు. వసుదేవుడు కృష్ణుడిని పొత్తిళ్లలో పెట్టుకుని చెరసాల బయట నిద్రిస్తున్న కావలి భటులను తప్పించుకుని యమునానది వైపు బయలుదేరుతాడు. యమునానది రెండుగా చీలి వసుదేవుడికి దారి ఇస్తుంది. 

వ్రేపల్లెలోని నందనవనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళతాడు. నందుడి భార్య యశోద పక్కన కృష్ణుడిని విడిచి, ఆమె పక్క నిద్రిస్తున్న శిశువును ఎత్తుకుని తిరిగి చెరసాలకు చేరుకుంటాడు. చెరసాలకు రాగానే ఆ శిశువు ఏడుస్తుంది. దేవకికి శిశువు పుట్టిన సమాచారం తెలుసుకుని, కంసుడు హుటాహుటిన చెరసాలకు చేరుకుంటాడు. శిశువును చంపడానికి పైకి విసిరికొడతాడు. అయితే, ఆ శిశువు ఆకాశమార్గానికి ఎగసి, అష్టభుజాలతో, శంఖ చక్ర గదాది ఆయుధాలతో కనిపిస్తుంది. తాను యోగమాయనని, కంసుడిని చంపేవాడు వేరేచోట పెరుగుతున్నాడని చెప్పి అదృశ్యమవుతుంది. కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు వ్రేపల్లెలోని యశోదాదేవి, నందుల వద్ద పెరిగాడు.

ఆబాలగోపాలుడు
యోగమాయ హెచ్చరికతో ప్రాణభయం పట్టుకున్న కంసుడు దేవకీ గర్భాన పుట్టినవాడు ఎక్కడ ఉన్నా, వెతికి వాడిని చంపాలంటూ తన వద్దనున్న రాక్షసులను పురమాయిస్తాడు. కంసుడు పంపగా వచ్చిన పూతనను పాలుతాగే వయసులోనే సంహరించాడు బాలకృష్ణుడు. బుడిబుడి నడకల ప్రాయంలో శకటాసుడిని, ధేనుకాసురుడిని, బకాసురుడు తదితరులను వధించాడు. దోగాడే వయసులోనే చిన్నికృష్ణుడు తెగ అల్లరి చేసేవాడు. అతడి అల్లరిని అరికట్టడానికి నడుముకు తాడు చుట్టి, దానిని రోలుకు కట్టేస్తుంది యశోద. నడుముకు అంత పెద్ద రోలు ఉన్నా, దాంతోనే పాకుతూ పోయి రెండు మద్ది చెట్లను కూల్చి, వాటి రూపంలో ఉన్న గంధర్వులకు శాపవిమోచనం కలిగించాడు. ‘తమ్ముడు మట్టి తింటున్నాడు’ అంటూ బలరాముడు ఫిర్యాదు చేయడంతో, ‘ఏదీ నోరు తెరువు’ అని గద్దించిన యశోదకు తన నోటిలోనే పద్నాలుగు లోకాలనూ చూపి, ఆమెకు ఆనందాశ్చర్యాలను కలిగిస్తాడు. అన్న బలరాముడితో కలసి, వ్రేపల్లెలోని గోపబాలకులతో ఆవులను మేతకు తీసుకుపోయే వాడు. వారితో ఆటలాడుకునేవాడు. వెదురును వేణువుగా మలచి, అద్భుతమైన వేణుగానంతో ఆబాలగోపాలాన్నీ మైమరపించి వేణుగోపాలుడిగా, వంశీమోహనుడిగా ప్రఖ్యాతి పొందాడు. కాళిందినదిలో ఉంటూ గోపాలురను భయభ్రాంతులు చేస్తున్న కాళీయుని తలపై నృత్యం చేసి, కాళింది నుంచి దూరంగా తరిమికొట్టి తాండవ కృష్ణుడిగా పేరు పొందాడు. ఇంద్రుడు వర్షబీభత్సం సృష్టించినప్పుడు గోవర్ధనగిరిని తన చిటికెన వేలిపై నిలిపి, వ్రేపల్లె వాసులను ఆ కొండ నీడలోకి చేర్చి, వారిని కాపాడి, వారి మనసుల్లో భగవంతుని స్థాయికి ఎదిగాడు. అల్లరి పనులతో మురిపించి, ఆపత్సమయాల్లో ఆదుకుని వ్రేపల్లెలోని ఆబాలగోపాలాన్నీ అలరించాడు. కృష్ణుడిని ఎలాగైనా చంపాలనే పథకంలో ఉద్ధవుడిని దూతగా పంపి, కృష్ణ బలరాములను మధురకు రప్పిస్తాడు కంసుడు. చాణూర ముష్టికులనే మల్లులను బాలురైన కృష్ణబలరాముల మీదకు ఉసిగొల్పుతాడు. చాణూర ముష్టికులను వధించాక, కంసుడిని సంహరించి, తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను, తాత ఉగ్రసేనుడిని చెరసాల నుంచి విడిపిస్తాడు. ఉగ్రసేనుడికి రాజ్యాన్ని అప్పగించి, దేవకీ వసుదేవులతో కలసి ద్వారకకు చేరుకుంటాడు. తల్లిదండ్రుల కోరిక మేరకు విద్యాభ్యాసం కోసం సాందీపని మహాముని ఆశ్రమంలో చేరుతారు కృష్ణబలరాములు. బాల్యంలోనే మరణించిన గురుపుత్రుని బతికించి తెచ్చి, గురుదక్షిణ సమర్పించుకుంటారు. సాందీపని మహాముని గురుకులంలోనే విద్యాభ్యాసం చేసిన కుచేలుడు శ్రీకృష్ణుడికి ప్రాణస్నేహితుడవుతాడు. గురుకులం విడిచిపెట్టిన తర్వాత పేదరికంలో కూరుకుపోయిన కుచేలుడు అటుకుల మూటతో తన వద్దకు వచ్చినప్పుడు అతడికి ఘనమైన ఆతిథ్యం ఇచ్చి, అడగకపోయినా అతడి దారిద్య్రాన్ని తీర్చి, ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తాడు.

కృష్ణాష్టమి వేడుకలు
శ్రీకృష్ణాష్టమి వేడుకలు దేశ విదేశాల్లో ఘనంగా జరుగుతాయి. కృష్ణాష్టమినే గోకులాష్టమి అని, జన్మాష్టమి అని కూడా వ్యవహరిస్తారు. కృష్ణాలయాలలో మాత్రమే కాకుండా, అన్ని వైష్ణవాలయాల్లోనూ ప్రత్యేక పూజలు జరుగుతాయి. తిరుమలలోని శ్రీనివాసుని పక్కనే కొలువై ఉన్న శ్రీకృష్ణుని రజతమూర్తికి పూజలు చేస్తారు. శ్రీకృష్ణాష్టమి రోజున సాయంత్రంపూట శ్రీవారు ప్రత్యేకంగా కొలువుతీరుతారు. ఈ కొలువును ‘గోకులాష్టమి ఆస్థానం’గా వ్యవహరిస్తారు. స్వామివారు సర్వాలంకార భూషితుడై సర్వభూపాల వాహనంలో ఆస్థానానికి వేంచేస్తారు. పౌరాణికులు భాగవతంలోని శ్రీకృష్ణావతార ఘట్టాన్ని పఠిస్తారు. మరునాడు నాలుగు మాడ వీధుల్లో ఉట్టెల పండుగ ఘనంగా జరుగుతుంది. శ్రీకృష్ణుని బాల్యక్రీడా విశేషమైన ఈ వేడుకను తిరుమలలో తాళ్లపాక అన్నమాచార్యులు క్రీస్తుశకం 1545లో ప్రత్యేకంగా ప్రారంభించినట్లు శాసనాల ఆధారంగా తెలుస్తోంది. కృష్ణాష్టమి సందర్భంగా దేశంలోని చాలా చోట్ల ఉట్టెకొట్టే వేడుకలు కోలాహలంగా జరుగుతాయి. గుజరాత్‌లోని ద్వారకలోను, ఉత్తరప్రదేశ్‌లోని మథురలోను, బృందావనంలోను కృష్ణాష్టమి వేడుకలు వైభవోపేతంగా జరుగుతాయి. ద్వారకలోని ద్వారకాధీశ ఆలయంలోను, బృందావనంలోని రాధా మదనమోహన మందిరం, బంకె బిహారి మందిరం, జుగల్‌కిశోర్‌ మందిరం, ప్రేమ్‌ మందిరం, రాధారమణ ఆలయాలలో అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరుగుతాయి. ఒడిశాలోని పూరీ శ్రీజగన్నాథ ఆలయంలోను, కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణాలయంలోను, హంపి బాలకృష్ణాలయంలోను, మైసూరు వేణుగోపాల స్వామి ఆలయంలోను, కేరళ గురువాయూర్‌లోని గురువాయూరప్పన్‌ ఆలయంలోను, రాజస్థాన్‌లోని నాథ్‌వాడాలో ఉన్న శ్రీనాథ్‌జీ ఆలయంలోను, తమిళనాడులో దక్షిణ ద్వారకగా పేరుపొందిన తిరువారూరులోని రాజగోపాల ఆలయంలోను, చెన్నైలోని పార్థసారథి ఆలయంలోను కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. ప్రత్యేక అలంకరణలతో ఈ ఆలయాలు కనువిందు చేస్తాయి. ఇవే కాకుండా దేశ విదేశాల్లోని ‘ఇస్కాన్‌’ మందిరాలు సైతం కృష్ణాష్టమి నాడు భక్తులతో కిటకిటలాడతాయి. శ్రీకృష్ణ స్తోత్రాలు, భజన సంకీర్తనలతో మార్మోగుతాయి. కృష్ణాష్టమి రోజున భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి, సాయంత్రం శ్రీకృష్ణుడికి పూజలు జరుపుతారు. అటుకులు, వెన్న, పెరుగు, పాలు, మీగడ, బెల్లం, పండ్లు నైవేద్యంగా పెడతారు. ఊయలలు కట్టి, బాలకృష్ణుని విగ్రహాలను వాటిలో ఉంచి వాటిని ఊపుతూ పాటలు పాడతారు.

మహాభారత సారథి
కురుక్షేత్రంలో అర్జునుడి రథాన్ని నడిపించిన శ్రీకృష్ణుడు పార్థసారథిగా పేరుపొందాడు. కేవలం అర్జునుడి రథాన్ని మాత్రమే కాదు, యావత్‌ మహాభారతాన్ని నడిపించినది శ్రీకృష్ణుడే. మేనత్త కొడుకులైన పాండవులతో కృష్ణుడి అనుబంధం ప్రత్యేకమైనది. కృష్ణుడి చెల్లెలు సుభద్ర అర్జునుడిని వరించడంతో కృష్ణార్జునుల అనుబంధం విడదీయరానిదైంది. పాండవులందరూ ప్రతి పనిలోనూ కృష్ణుడి సలహా తీసుకునేవారు. ఇంద్రప్రస్థంలో రాజసూయ యాగం చేసిన ధర్మరాజు శ్రీకృష్ణుడికి అగ్రతాంబూలం ఇస్తాడు. ఆ సభకు వచ్చిన శిశుపాలుడు కృష్ణుడిని, ధర్మరాజును నానా మాటలంటాడు. శిశుపాలుడు కూడా కృష్ణుడి మేనత్త కొడుకే. మేనత్తకు ఇచ్చిన మాట మేరకు నూరు తప్పుల వరకు సహించి, ఆ తర్వాత చక్రాయుధంతో శిశుపాలుడిని తుదముట్టిస్తాడు. శకునితో జూదం ఆడేటప్పుడు మాత్రం ధర్మరాజు కృష్ణుడిని సంప్రదించలేదు. శకుని ఆడిన మాయజూదంలో ఓటమిపాలై పాండవులు అడవుల పాలయ్యారు. దుర్యోధనుడు పురిగొల్పడంతో దుశ్శాసనుడు ద్రౌపదీ వస్త్రాపహరణానికి తెగబడినప్పుడు ఆమె కృష్ణుడినే తలచుకుంటూ రోదిస్తుంది. దూరాన ఉన్నప్పటికీ ఆమె మొర విని తన మహిమతో ఆదుకుంటాడు. జూదంలో ఓడిన పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసం, ఆ తర్వాత విరాటరాజు కొలువులో ఏడాది అజ్ఞాతవాసం గడిపారు. అరణ్యవాసంతో పాండవులకు ఎదురైన అనేక సమస్యలను శ్రీకృష్ణుడే పరిష్కరించాడు. పాండవులు అరణ్య, అజ్ఞాతవాసాలను ముగించుకుని తిరిగి వచ్చాక, వారి రాజ్యాన్ని తిరిగి వారికి అప్పగించాలంటూ కృష్ణుడు స్వయంగా రాయబారానికి వెళతాడు. రాయబారానికి వచ్చిన కృష్ణుడిని దుర్యోధనుడు బంధించబోతే విశ్వరూప ప్రదర్శన చేసి, కౌరవులను హెచ్చరిస్తాడు. విశ్వరూపాన్ని తిలకించడం కోసం పుట్టు గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి చూపును ప్రసాదిస్తాడు. కురుక్షేత్రంలో ఆయుధాలు విడిచి, యుద్ధవిముఖుడైన అర్జునుడికి గీతోపదేశంతో కర్తవ్యబోధ చేసి, యుద్ధోన్ముఖుడిని చేస్తాడు. యుద్ధం ముగిసేంత వరకు పాండవులకు అండదండగా ఉంటాడు. యుద్ధం ముగిసిన తర్వాత అశ్వత్థామ సంధించిన బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రభావానికి ఉత్తర గర్భంలోని శిశువు మృత్యువును ఎదుర్కోగా, తన చక్రంతో రక్షణ కల్పిస్తాడు. ఆ శిశువే పరీక్షిత్తుగా జన్మించి, పాండవుల తర్వాత రాజ్యభారాన్ని వహిస్తాడు. 

కృష్ణుడి పరివారం
కృష్ణుడు అష్టమహిషులు ఉన్నారు. వారు రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, భద్ర, నాగ్నజితి, మిత్రవింద, లక్షణ. కృష్ణుడికి ఒక్కొక్క భార్యతోను పదేసి మంది పిల్లలు కలిగారు. సత్యభామతో కలసి వెళ్లి నరకాసురుడిని వధించాక, అతడి చెరలో ఉన్న పదహారువేల నూరుమంది గోపికలను కృష్ణుడు బంధవిముక్తులను చేశాడు. వారు శ్రీకృష్ణుని ఆశ్రయంలోనే ఉండేవారు. కురుక్షేత్ర సంగ్రామం తర్వాత కౌరవుల నాశనం చేసినందుకు ఫలితంగా యాదవకులం కూడా నశిస్తుందని గాంధారి శపిస్తుంది. శాపప్రభావం వల్ల కృష్ణుడి కొడుకుల్లో ఒకడైన సాంబుడికి ఆడవేషం వేసి, అతడికి పుట్టబోయేది మగబిడ్డో, ఆడబిడ్డో చెప్పాలంటూ యాదవ యువకులు మునులను ఆటపట్టిస్తారు. దానికి ఆగ్రహించిన మునులు యాదవకులాన్ని నాశనం చేసే ముసలం పుడుతుందని శపిస్తారు. సాంబుడి వేషం విప్పేస్తున్నప్పుడు అతడు కడుపు దగ్గర దాచుకున్న దుస్తుల నుంచి ముసలం పుడుతుంది. భయపడిన యాదవులు దానిని బాగా అరగదీస్తారు. ఎంత అరగదీసినా, చిన్న మొన మిగిలిపోతుంది. దానిని సముద్రతీరంలో పడేస్తారు. కొన్నాళ్లకు అదే ప్రదేశంలో తాగితందనాలాడి గొడవపడిన యాదవులు ఒకరినొకరు చంపుకుని నశించారు. ముసలం మొనతో బాణం తయారు చేసుకున్న ఒక నిషాదుడు జంతువులను వేటాడుతూ విడిచినప్పుడు అది చెట్టు కింద సేదదీరుతున్న కృష్ణుడి పాదానికి తాకుతుంది. బాణం దెబ్బ వల్ల కృష్ణుడు నిర్యాణం చెందినట్లు కొన్ని పురాణాలు చెబుతుంటే, రామానుజాచార్యులు వంటి వైష్ణవ గురువులు శ్రీకృష్ణుడిని జరామరణ రహితుడిగా అభివర్ణించారు. విశిష్టాద్వైతాన్ని పాటించే వైష్ణవులు, గౌడీయ వైష్ణవులు కృష్ణుడిని జరామరణ రహితుడిగానే విశ్వసిస్తారు.
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement