నిన్ననే చూడండి | special story to telugu films | Sakshi
Sakshi News home page

నిన్ననే చూడండి

Published Sun, Apr 29 2018 12:15 AM | Last Updated on Sun, Apr 29 2018 12:15 AM

special story to telugu films - Sakshi

సరిగ్గా నిన్నటి తేదీ (అంటే ఏప్రిల్‌ 28). నలభై రెండేళ్ల క్రితం, పన్నెండేళ్ల క్రితం, ఏడాది క్రితం.. సినిమా ఫ్యాన్స్‌ పండుగ చేసుకున్నారు. అలాంటి ఇలాంటి పండుగ కాదది. థియేటర్ల ముందు జనాలను బారులు తీరేలా చేసి, టిక్కెట్టు చింపి లోపలికెళ్లి కూర్చుంటే ఎంత ప్రయత్నించినా ఈలలు వేయకుండా ఉండలేని, అరిచి గోల చేయకుండా కూర్చోలేని పరిస్థితిని తెచ్చిపెట్టిన పండుగ. ‘ఇండస్ట్రీ హిట్‌ సినిమా’ ఆ పండుగ పేరు. ఇండస్ట్రీ హిట్‌ అంటే అప్పటివరకూ ఉన్న రికార్డులన్నీ బ్రేక్‌ చేయడం. బాక్సాఫీస్‌ దుమ్ము దులపడం, రోజులకు రోజులు థియేటర్లలోనే సినిమా మకాం వేసేయడం.. అవన్నీ చేస్తేనే అది ఇండస్ట్రీ హిట్‌. ఏప్రిల్‌ 28వ తేదీకి, తెలుగు సినిమాకు ఓ మంచి కనెక్షన్‌ ఉంది. ఈరోజునే అడవి రాముడు (1977), పోకిరి (2006), బాహుబలి 2 (2017) రిలీజ్‌ అయ్యాయి. ఈ మూడూ తెలుగు సినిమా బాక్సాఫీస్‌ను తిరగరాసిన ఇండస్ట్రీ హిట్స్‌. ‘నేడే చూడండి’ అంటూ అదరగొట్టిన ఆ నిన్నటి సినిమాలను ఇవ్వాళ తలుచుకుంటూ నిన్ననే చూసొద్దాం...

ఫార్ములా కథకు పుట్టుక 
ఒక పక్కా మాస్‌ సినిమా ఎలా ఉండాలి? ఏమేం ఉంటే అది మాస్‌ సినిమా అవుతుంది? సరిగ్గా కొలతలు వేస్కొని, హీరో ఇమేజ్‌కు తగ్గట్టు సన్నివేశాలు రాస్కొని ఒక కథ అల్లుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడైతే ఇలా ఉన్న సినిమాను ఫార్ములా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ అంటున్నాం. అలాంటి ఫార్ములాను పుట్టించిన సినిమా ‘అడవి రాముడు’. 1977 ఏప్రిల్‌ 28న విడుదలైందీ సినిమా. ‘అడవి రాముడు’కి ముందు కె. రాఘవేంద్రరావుకు దర్శకుడిగా పెద్ద పేరు కూడా లేదు. నిర్మాతలు సత్యనారాయణ, సూర్యనారాయణలు ఒక కంప్లీట్‌ మాస్‌ సినిమా తీయాలనుకున్నారు. అదీ ఎన్టీఆర్‌తో. జయప్రద హీరోయిన్‌. ఎన్టీఆర్‌ ఇమేజ్‌కు తగ్గట్టు, ఆయన్ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపిస్తూ ఒక కథ వండుకున్నారు. అందుకే కథ క్రెడిట్‌ కూడా ‘సత్య చిత్రా యూనిట్‌’ అని బ్యానర్‌ పేరు ఉంటుంది. హీరో అడవిలో జరిగే అన్యాయాలు, అక్రమాలను గుర్తిస్తాడు. స్మగ్లింగ్‌ ముఠాను అడ్డుకొని వారి ఆగడాలను అరికడుతుంటాడు. అడవిలో జనాలందరిలోనూ ధైర్యాన్ని నింపి స్మగ్లింగ్‌పై వాళ్లే పోరాడేలా చేస్తాడు. ఫస్టాఫ్‌ అంతా సరదా సరదాగా సాగిపోయే ఈ కథలో సెకండాఫ్‌కి వచ్చాక ఒక ట్విస్ట్‌. ఆ ట్విస్ట్‌ ఏంటంటే హీరోనే ఫారెస్ట్‌ ఆఫీసర్‌. నాలుగు భారీ ఫైట్లు, అదిరిపోయే డైలాగులు, చిన్న రొమాన్స్‌ ట్రాక్, అక్కడక్కడా కామెడీ బిట్లు, ఒక ఆరు పాటలు.. ఇలా లెక్కలేస్కొని మరీ ఈ ఈ అంశాలను జతచేరుస్తూ కథ పూర్తిచేశారు. ‘అడవి రాముడు’ కథ రెడీ అయిపోయింది. 

ఎన్టీఆర్, జయప్రద హీరో, హీరోయిన్లు. రాము అనే ఆ హీరో పాత్రతో ఆద్యంతం సినిమాను తన భుజాల మీద మోసేశాడు ఎన్టీఆర్‌. ఏప్రిల్‌ 28న సమ్మర్‌ హాలీడేస్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. అప్పటికి తెలుగు సినిమా ఊహకు కూడా అందని రీతిలో 4 కోట్ల రూపాయల షేర్‌ వసూలు చేసింది. 32 సెంటర్లలో వంద రోజులు ఆడింది. ఎన్టీఆర్‌ చరిష్మా, రాఘవేంద్రరావు మేకింగ్, మాస్‌ అంశాలు మెండుగా ఉండటంతో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌ అనే స్టేటస్‌ను సొంతం చేసుకుంది. ఎన్టీఆర్‌ ఏనుగుపైకెక్కి కూర్చోవడం ఒక ట్రెండ్‌సెట్టింగ్‌ సీన్‌. డైలాగులు చాలాకాలం పాటు జనాల నోళ్లలో నానాయి. కె.వి.మహదేవన్‌ అందించిన పాటలైతే ఇక చెప్పక్కర్లేదు. ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను..’ అనే పాట ఈరోజుకీ పాపులరే! ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు..’ అనే పాటలో ఎన్టీఆర్‌ను అభిమానులు చూడాలనుకున్న అన్ని చారిత్రక పాత్రల్లో చూపించాడు రాఘవేంద్రరావు. ఈ సినిమా తర్వాతే ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్లో ‘సర్దార్‌ పాపారాయుడు’, ‘కొండవీటి సింహం’, ‘జస్టిస్‌ చౌదరి’ లాంటి సూపర్‌హిట్‌ సినిమాలు వచ్చాయి.  ఈ సినిమా తర్వాతే తెలుగులో కమర్షియల్‌ సినిమా ఫార్ములా అనేది ఒకటి తయారైంది. ఆ ఫార్ములా ఈరోజుకీ బ్లాక్‌బస్టర్‌ సినిమాలను ప్రొడ్యూస్‌ చేస్తూ ఉండటాన్ని విశేషంగా చెప్పుకోవాలి. 

టూ హండ్రెడ్‌ సెంటర్స్‌.. హండ్రెడ్‌ డేస్‌ 
2006 ఏప్రిల్‌ 28న విడుదలైన ‘పోకిరి’, 75 సంవత్సరాల (అప్పటికి) తెలుగు సినీ పరిశ్రమ రికార్డులను తిరగరాసిన ఇండస్ట్రీ హిట్‌. ఈ సినిమాలో ఒక పోలీసాఫీసర్‌ కామెడీగా చెప్పిన డైలాగ్‌ ఒకటి ఉంది. ‘ఇండియాలో గాంధీ సినిమా వంద రోజులు ఆడదు. కడప కింగ్‌ అని తీయ్‌! టూ హండ్రెడ్‌ సెంటర్స్‌.. హండ్రెడ్‌ డేస్‌’ అని. రెండు వందల కేంద్రాల్లో ఒక సినిమా వంద రోజులు ఆడడం అనేది ఎవ్వరూ అందుకోలేని ఒక గొప్ప అచీవ్‌మెంట్‌ అన్న ఉద్దేశంలో ఆ డైలాగ్‌ పెట్టి ఉండొచ్చు. అయితే ‘పోకిరి’ కూడా ఎవ్వరి ఊహకీ అందని హిట్‌. ఆ డైలాగ్‌లో చెప్పినట్టే సరిగ్గా టూ హండ్రెడ్‌ సెంటర్స్‌లో పోకిరి హండ్రెడ్‌ డేస్‌ ఆడింది. దర్శకుడు పూరీ జగన్నాథ్‌ మహేశ్‌ బాబుతో చేసిన ఈ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్, ఈ జానర్‌లో ఎవర్‌గ్రీన్‌ బ్లాక్‌బస్టర్‌.  ఆలీభాయ్‌ అనే ఓ మాఫియా లీడర్‌ దుబాయ్‌లో ఉంటూనే ఓ పెద్ద మాఫియాను నడిపిస్తుంటాడు. ల్యాండ్‌ మాఫియా అది. సిటీలో కొత్తగా ఎవరు ఏ కన్‌స్ట్రక్షన్‌ మొదలుపెట్టినా మాఫియాకు డబ్బులు అందాలి. హీరో పండు ఆ మాఫియా గ్యాంగ్‌లో చేరతాడు. డబ్బులిస్తే ఎవర్ని కొట్టమన్నా కొడుతూంటాడు పండు. పక్కా పోకిరీ. మాఫియా వరుసగా వేసే ఒక్కో ప్లాన్‌లో భాగమై వాళ్లతోనే ఉంటాడు. ప్రీ క్లైమాక్స్‌ దగ్గర పడేవరకూ అతన్నొక పోకిరీగానే చూపిస్తూ కథ నడుస్తుంది. అప్పుడొచ్చే ఒక ట్విస్టే సినిమాకు హైలైట్‌. ఆ ట్విస్టే తెలుగు సినిమా చరిత్రను తిరగరాసే కమర్షియల్‌ సినిమా పుట్టుకకు మూలం. ఐపీఎస్‌ ఆఫీసర్‌ కృష్ణ మనోహర్‌ ఓ క్రిమినల్‌లా నటిస్తూ పండు అనే పోకిరీగా మాఫియాలో చేరడమే ఆ ట్విస్ట్‌. మాఫియాను మట్టుపెట్టేందుకు కృష్ణ మనోహర్‌ పండుగా నటించాడన్న ట్విస్ట్‌ బయటపడగానే పోకిరీ కథంతా ఓ కొత్త మలుపు తీసుకుంటుంది. దాని ఫలితమే ఈరోజు మనల్ని ఈ సినిమాను గుర్తు చేసుకునేలా చేసింది. పది పన్నెండు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా నలభై కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టి తెలుగు సినిమా బాక్సాఫీస్‌ పొటెన్షియల్‌ను ఇండియన్‌ సినిమాకు పరిచయం చేసింది. పూరీ జగన్నాథ్‌ను టాప్‌ డైరెక్టర్‌ను చేసింది. ప్రిన్స్‌ మహేశ్‌ బాబును సూపర్‌స్టార్‌ స్థాయికి తీసుకెళ్లింది. 

‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ అయిపోద్దో ఆడే పండుగాడు’, ‘నేనెంత ఎదవనో నాకే తెలీదు,’ లాంటి పంచ్‌ డైలాగులు ఆ తర్వాత ఒక దశాబ్దం పాటు తెలుగు సినిమాల్లో ఏదో ఒకరకంగా వినిపించాయి. మణిశర్మ అందించిన పాటలన్నీ సూపర్‌హిట్‌. పోకిరీ తయారు చేసిన.. హీరో ఒక క్రిమినల్‌గా నటించడం అనే కాన్సెప్ట్‌ తెలుగు సినిమాల్లో కామన్‌గా మారిపోయింది. పోకిరీ తమిళంలోకి వెళ్లింది. హిందీలోకీ వెళ్లింది. హిందీలో ‘వాంటెడ్‌’ పేరుతో వచ్చిన ‘పోకిరీ’, బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌కు ప్రాణం పోసి నిలబెట్టింది. ఈతరం కమర్షియల్‌ సినిమాలకు పోకిరీ ఒక బ్రాండ్‌ నేమ్‌. తెలుగు సినిమా చరిత్రలో ఒక బ్లాక్‌బస్టర్‌ పేజీ. 

ఇండియన్‌ సినిమా ఐడెంటిటీ 
ఇండియాలో ఎన్ని సినీ పరిశ్రమలున్నా, ప్రపంచ దేశాలకు ఇండియన్‌ సినిమా అంటే బాలీవుడ్‌. బాలీవుడ్‌ తప్ప ఇక్కడ ఇంకే సినిమా లేదన్నట్టుగా ప్రపంచదేశాలు భావిస్తాయి. ఈ ఆలోచనను పక్కకు తోసి ‘తెలుగు సినిమా’ అన్నది ఒకటి ఉందని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా ‘బాహుబలి’. బాహుబలి రెండు భాగాలుగా వచ్చింది. రెండో భాగం ‘బాహుబలి – ది కంక్లూజన్‌’ 2017 ఏప్రిల్‌ 28న విడుదలైంది. ‘అడవి రాముడు’, ‘పోకిరి’ ఎలాగైతే ఏప్రిల్‌ 28న వచ్చి ఇండస్ట్రీ హిట్‌ అనిపించుకున్నాయో, ‘బాహుబలి 2’ కూడా అదే తేదీన వచ్చి ఇండస్ట్రీ హిట్‌కి మించిన పేరేదైనా ఉంటే ఆ స్థానాన్ని సొంతం చేసుకుంది. తెలుగు సినిమాకే కాదు, ‘బాహుబలి’ ఇండియన్‌ సినిమాకే ఒక ఐడెంటిటీ. 

2015లో విడుదలైన బాహుబలి మొదటి భాగం.. కట్టప్ప బాహుబలిని చంపాడన్న ట్విస్ట్‌తో ముగుస్తుంది. రాజవంశానికి అత్యంత నమ్మకస్తుడైన, ఆ కుటుంబాన్ని ప్రాణానికి ప్రాణంగా చూసుకునే  కట్టప్ప తనకెంతో ఇష్టమైన బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్న ఇండియన్‌ సినిమా అభిమానులందర్నీ  2017లో బాహుబలి రెండో భాగం వచ్చేవరకూ వెంటాడింది. దర్శకుడు రాజమౌళి ఈ సినిమాతో ఇండియన్‌ సినిమాకు ఒక ఐకాన్‌లా మారిపోయాడు. విజువల్‌ ఎఫెక్ట్స్‌ హాలీవుడ్‌ సినిమాల స్థాయిలో ఉన్నాయన్న పేరు ఒక ప్రత్యేక గుర్తింపు. బాహుబలి పాత్రలో అద్భుతంగా నటించిన ప్రభాస్, నేషనల్‌ లెవెల్‌ స్టార్‌గా మారిపోయాడు. బాక్సాఫీస్‌ వసూళ్లు చూసుకుంటే ఇండియన్‌ సినిమా స్టామినా ఇంత ఉందా అనేలా కలెక్షన్స్‌ వచ్చాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీల్లోనూ విడుదలైన ‘బాహుబలి2’ 1700 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో బాహుబలి చర్చకు వచ్చింది. నేషనల్‌ అవార్డ్స్‌లో బెస్ట్‌ పాపులర్‌ ఫిల్మ్‌ అవార్డు సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ డొమెస్టిక్‌ మార్కెట్లో ఉన్న రికార్డులన్నీ బ్రేక్‌ చేసింది. అవి ఎలాంటి రికార్డులంటే కొత్తగా ఏ సినిమా విడుదలైనా ఆ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులను ‘నాన్‌ బాహుబలి రికార్డు’ అని సరిపెట్టుకునేంత. చరిత్రలో పేజీలంత కథగా మాత్రమే మిగిలిపోలేదు బాహుబలి. దాని గురించి రాయడమే ఒక చరిత్ర.  యాదృచ్చికమో, విచిత్రమో, మరింకోటో కానీ నలభై రెండేళ్ల కిందట, పన్నెండేళ్ల కిందట, ఏడాది కిందట.. ఒకేరోజున (ఏప్రిల్‌ 28న) తెలుగు సినిమా రూపు రేఖల్ని మార్చిన సినిమాలు రావడం విశేషమే! ఆ డేట్‌లో ఏదో మ్యాజిక్‌ ఉండే ఉండాలి మరి!!

అడవి రాముడు స్టార్స్‌
ఎన్టీఆర్‌ అప్పట్లో ఎక్కడికెళ్లినా హారతులిచ్చి ఆరాధించేవారట. ఆయన స్టార్‌డమ్‌ను దగ్గరుండి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పట్నుంచే గమనించిన రాఘవేంద్ర అందుకు తగ్గట్టు అడవి రాముడులో ఎన్టీఆర్‌ పాత్రను రాసుకున్నాడట. ఎన్టీఆర్‌ ఏనుగుపైకెక్కి తిరగడమన్నది అలాగే పుట్టిందని చెబుతాడాయన. అడవి రాముడు రిలీజై హిట్టయ్యాక రాఘవేంద్రరావు తన మొదటి కారు (అంబాసిడర్‌) కొన్నాడు. అడవి రాముడు రిలీజైన ఐదేళ్లకు ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయ్యాడు. సీఎం అయ్యాక కూడా ఆయన అడవి రాముడు సిల్వర్‌ జూబ్లీ షీల్డ్‌ను తన ఆఫీసులో పెట్టుకున్నాడట. అందులో ఆ ఒక్క సినిమా షీల్డే ఉండటాన్ని రాఘవేంద్రరావు ఎప్పటికీ మరచిపోలేదు. రాఘవేంద్రరావుతో పాటు రైటర్‌ జంధ్యాల, హీరోయిన్‌ జయప్రద, సింగర్‌ బాలసుబ్రమణ్యం తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నారు. 

పోకిరి 
విడుదల తేదీ : ఏప్రిల్‌ 28, 2006
దర్శకుడు : పూరీ జగన్నాథ్‌ 
నటీనటులు : మహేశ్‌ బాబు, ఇలియానా 
నిర్మాతలు : పూరీ జగన్నాథ్, 
మంజుల ఘట్టమనేని 
సంగీతం : మణిశర్మ 

‘బాహుబలి’ బడ్జెట్‌.. 
ప్రభాస్, రానా ఇద్దరినీ నేషనల్‌ లెవెల్‌ స్టార్లను చేసింది బాహుబలి. వీళ్లిద్దరూ మూడు నాలుగేళ్లు కేవలం బాహుబలి కోసమే తమ సమయాన్ని కేటాయిం చారు. ఈ మూడేళ్లూ కఠోరమైన డైట్, వర్కవుట్లను ఫాలో అయ్యారు. ‘జురాసిక్‌ వరల్డ్‌’ లాంటి హాలీవుడ్‌ సినిమాలకు పనిచేసిన 30 దేశాలకు చెందిన విజువల్‌ ఎఫెక్ట్స్‌ సంస్థలు ‘బాహుబలి 2’ కోసం పనిచేశాయి. ఇండియన్‌ సినిమాలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాగా ‘బాహుబలి 2’ (దాదాపు 250 కోట్ల రూపాయలు) నిలిచింది.బాహుబలి పేరుమీద త్వరలోనే కామిక్స్, టీవీ సిరీస్‌ రానున్నాయి. 

బాహుబలి 2 
విడుదల తేదీ : ఏప్రిల్‌ 28, 2018
దర్శకుడు : ఎస్‌.ఎస్‌. రాజమౌళి 
నటీనటులు : ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్‌ 
నిర్మాతలు : శోభు యార్లగడ్డ, 
ప్రసాద్‌ దేవినేని 
సంగీతం :  ఎమ్‌.ఎమ్‌.కీరవాణి  
– వి. మల్లికార్జున్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement