
మబ్బులు లేని ఆకాశం కొంగలు వాలని నీలి తటాకంలా ఉంది. ఒకప్పుడు ఆకాశంలో మేఘాలు తెల్లగానో, నల్లగానో, బూడిద రంగులోనో ఉన్న పక్షుల గుంపుల్లా మెల్లగా కదుల్తూ కనువిందు చేసేవి. అద్దం మీద పడిన మరకల్ని ఎవరో తుడిచేసినట్టు అన్నీ మాయమైపోయాయి.
వాన పడి ఎన్ని నెలలయిందో...
ఎండా కాలం, చలికాలం తప్ప వానాకాలం లేని రోజులొచ్చాయి. నీటి కటకట...చుక్క నీటికోసం నేల తన పగళ్ళుబారిన వేనవేల నోళ్ళను తెరిచి ఆకాశం కేసి ఆశగా చూస్తోంది.
నీటి సమస్యను పరిష్కరించడమే జీవిత ధ్యేయంగా దివారాత్రులు తన ప్రయోగశాలలో శ్రమిస్తున్న జగదీష్చంద్ర బద్ధకంగా వొళ్ళువిరుచుకుని లేచి నిలబడ్డాడు. తనకు అడ్డుతగుల్తున్న సమస్య గురించి తీవ్రంగా ఆలోచిస్తూ కొద్దిసేపు పచార్లు చేశాడు.
ఎంత ఆలోచించినా అతనికి పరిష్కారం తోచడం లేదు. మళ్ళా తన కుర్చీలో కూచుని, కళ్ళద్దాలు సరిచేసుకుని, మైక్రోస్కోప్లోంచి చూశాడు. అతని ప్రయత్నమంతా మొక్కల జీన్స్‌లో అవసరమైన మార్పులు చేసి నీటిచెట్లను తయారుచేయడమే.
నీటిని భూమి పొరల్లోంచి పీల్చుకునే చెట్లు కాదు.. నీటిని స్వయంగా తయారుచేసుకునే చెట్లు!
గత ముప్పయ్ యేళ్ళుగా అతని జీవితం ఈ పరిశోధనకే అంకితమైపోయింది. అతనికిప్పుడు అరవై యేళ్ళు. అతని బాల్యంలోనే నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. నీళ్ళతో స్నానాలకు బదులుగా ప్రత్యేకమైన టిష్యూ పేపర్ల వాడకం పెరిగింది.
చెరువులు, బావులు ఎప్పుడో ఎండిపోయాయి. నీళ్ళు లేనందువల్ల మొక్కలు పెరగడం లేదు. పచ్చటి చెట్లు ప్రాణాలు విడుస్తున్నాయి. చెట్లు తగ్గిపోవడం వల్ల వర్షాలు మొహం చాటేస్తున్నాయి. ఇదంతా ఒక విషవలయంలా మారి నీటి చుక్కల గొంతుల్ని నులిమేయసాగింది.
జగదీష్‌చంద్ర వాళ్ళ నాన్న విశ్వవిద్యాలయంలో బోటనీ ప్రొఫెసర్‌గా పనిచేసేవాడు. నీటి సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని మొదట కలగన్నది అతనే. ఎన్నో ప్రయోగాలు చేసి విఫలమై, చివరికి తను సాధించలేనిది తన కొడుకు సాధించి తీరుతాడన్న నమ్మకంతోనే కొడుక్కి జగదీష్ చంద్రబోస్ అని పేరు పెట్టాడు. ఎప్పటికైనా ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యకు పరిష్కారం కనుక్కోవటమే అతని జీవితధ్యేయం కావాలని చిన్నప్పటినుంచీ నూరిపోసేవాడు. దానికి తగ్గట్టే జగదీష్ బోటనీలో రీసెర్చ్ చేశాక ఐదారేళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసి, ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి సమయం తన పరిశోధనలకే వినియోగించసాగాడు.
అతను ప్రయోగాలు మొదలు పెట్టిన ఈ ముప్పయ్ యేళ్ళలో నీరు బంగారం కన్నా ప్రియమైపోయింది. భూగర్భజలాలు ఎప్పుడో అడుగంటాయి. భూమి పొరల్లో మిగిలిన ఆ కొద్ది నీటిమీద మూడు మల్టీనేషనల్ కంపెనీలు గుత్తాధిపత్యాన్ని సంపాయించి నీళ్ళవ్యాపారంతో కోట్లు గడిస్తున్నాయి. లీటర్ నీరు వెయ్యి రూపాయలు. కేవలం గొంతులు తడుపుకోవడం కోసమే మనుషులు నీటిని కొని, భద్రంగా దాచుకుంటు న్నారు. ఈ మల్టీనేషనల్ కంపెనీల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలన్న కోరిక జగదీష్‌లో బలంగా నాటుకుపోయింది. మనుషులకు నీరు ఉచితంగా దొరికేలా చేయాలనే ప్రయత్నంలోనే అతను నీటి చెట్టు తయారు చేసే ప్రయోగాలు ముమ్మరం చేశాడు.
చెట్లు కిరణజన్య సంయోగక్రియ అనే క్లిష్టమైన ప్రక్రియద్వారా ఆహారాన్ని తయారుచేసుకుంటాయి. వ్రేళ్ళు భూమిలోంచి సంగ్రహించిన నీటిని ఆకుల్లోకి పంపిస్తాయి. గాలిలోని కార్బన్డయాక్సైడ్ని ఆకులు తమలోని స్టొమాటోలనే రంధ్రాల సాయంతో పీల్చుకుంటాయి. సూర్యరశ్మి సాయంతో పత్రహరితం నీటిని, కార్బన్ డయాక్సైడ్ని వాడుకుని గ్లూకోజ్ని తయారు చేసుకుని, ఆక్సిజన్ని విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియలో నీటిని ఆక్సిజన్ అయాన్లుగా, హైడ్రోజన్ అయాన్లుగా, నాలుగు ఫ్రీ ఎలక్ట్రాన్లుగా విడగొడ్తుంది.
జగదీష్ చంద్ర దృష్టి మొత్తం దీనిమీదే కేంద్రీకృతమై ఉంది. నీటిని ఆక్సిజన్‌గా, హైడ్రోజన్‌గా విడగొట్టి, గాలిలోంచి కార్బన్ డయాక్సైడ్ని గ్రహించి, గ్లూకోజ్ తయారుచేసుకునే సామర్థ్యం ఉన్నప్పుడు వాటి జీన్స్‌లో కొన్ని మార్పులు చేయడంద్వారా గాలిలోంచి ఆక్సిజన్ని, హైడ్రోజన్ని గ్రహించి సూర్యరశ్మి సాయంతో వాటి సంయోగంద్వారా నీటిని తయారుచేసుకునేలా చేయవచ్చని అతని నమ్మకం. అందుకే ఎన్నిసార్లు తన ప్రయోగాలు విఫలమైనా మొక్కవోని ధైర్యంతో వాటిని కొనసాగిస్తున్నాడు.
ఈమధ్యనే అతని ప్రయోగాలు ఓ కొలిక్కి వస్తున్నాయి. తను ఎంచుకున్న విత్తనంలోని జీన్స్‌లో మరి కొన్ని మార్పులు చేసి, దాన్ని పెరట్లో నాటాడు. దానికి నీళ్ళు పోయనవసరం లేదు. తన ప్రయోగం విజయవంతమైతే అదే నీటిని తయారుచేసుకుని, అవసరమైనన్ని నీళ్ళని వాడుకుని, మిగిలిన నీళ్ళని కొమ్మల్లో దాచుకుంటుంది.
మొక్క మొలిచింది. నీటి తడి లేకుండా మొక్క మొలవడమే ఓ అద్భుతం. తన ప్రయోగంలో మొదటి దశ విజయవంతమైనట్లే అనుకున్నాడు జగదీష్. ప్రజల నీటి అవసరాలు తీర్చాలంటే ప్రయోగంలోని రెండో దశ చాలా ముఖ్యం. మిగిలిన నీటిని మొక్క ఎక్కడో దాచుకోవాలి. ఆ నీళ్ళు మనుషులకు అందుబాటులో ఉండాలి.
నరాలు తెగిపోయేంత ఉత్కంఠతో ఎదురుచూశాడు. తక్కువ సమయంలోనే మొక్క పూర్తిగా చెట్టుగాఎదిగేలా దాని జీన్స్‌లో మార్పులు చేయడం వల్ల రెణ్ణెల్లకే అది ఏడడుగుల ఎత్తుగా కొమ్మలూ రెమ్మల్తో విస్తరించిన చెట్టుగా మారింది.
కానీ వారం రోజులు ఎదురుచూసినా రెండో దశ విజయవంతమయ్యే సూచనలేమీ కన్పించలేదు. జగదీష్ నిరాశలో కుంగిపోయాడు. ఎక్కడో తను తప్పు చేశాడు. ఎందుకని చెట్టు నీటిని నిల్వ చేసుకోవడం లేదూ? తనకు అవసరమైనంత మేరకే నీటిని తయారుచేసుకుంటోందా? యింకెలాంటి మార్పులు చేస్తే తను అనుకున్న ఫలితాన్నిసాధించగలడు?
రాత్రంతా నిద్ర పోకుండా ఇవే ఆలోచనల్తో గడిపాడు. ఉదయం లేచి చెట్టుని సమీపించి, కళ్ళముందు కన్పిస్తున్న దృశ్యానికి ఆనందాశ్చర్యాలకు లోనయ్యాడు. కొమ్మల్లో అక్కడక్కడా నీటిబుగ్గలు వేలాడుతూ కన్పించాయి. ఒక్కో నీటిబుగ్గ సొరకాయంత సైజులో పల్చటి ఆకుపచ్చటి పొరలోపల నీటిని నిల్వ ఉంచుకుని, కనువిందు చేస్తోంది.
జగదీష్ ఆత్రుతగా ఓ నీటిబుగ్గను తెంపి, నీళ్ళు తాగాడు. తియ్యగా ఉన్నాయి. నీటి బుగ్గల సైజుని బట్టి ఒక్కోదాంట్లో రెండు లీటర్లకు తక్కువ కాకుండా నీరుంటుందనుకున్నాడు.
ఆ చెట్టు విత్తనాల్ని సేకరించి మరో పది చోట్ల నాటాడు. రెణ్ణెల్లలో మరో పది చెట్లు మొలిచాయి. అతనికిప్పుడు నమ్మకం కుదిరింది. ఈ చెట్ల విత్తనాల్ని నాటి నీటిచెట్లతో అడవుల్నే పెంచవచ్చు. ప్రతి యింట్లో ఓ చెట్టు నాటుకుంటే చాలు, ఆ కుటుంబానికవసరమైన నీరు లభ్యమౌతుంది. తన తండ్రి కోరుకున్నట్లే ప్రజల నీటికొరత తీరుతుంది. నీళ్ళతోవ్యాపారం చేస్తున్న మల్టీనేషనల్ కంపెనీలు మూత పడ్తాయి.
తన ఆవిష్కరణని ప్రభుత్వపరం చేయాలన్న నిర్ణయానికొచ్చినపుడు అతని పిల్లలు తీవ్రంగా వ్యతిరేకించారు.
‘‘నీ ప్రయోగాలకు ఆర్థిక సాయం చేయమని నువ్వు ప్రభుత్వాన్ని కోరినప్పుడు ఎదురైన అనుభవాల్నిమర్చిపోయావా? ప్రభుత్వానికి ఎందుకివ్వాలి? మేమొప్పుకోం’’ అన్నారు.
ప్రభుత్వసాయం కోరుతూ తన ప్రాజెక్ట్ని సంబంధిత మంత్రిత్వశాఖకు పంపినపుడు ఎదుర్కొన్నఅవమానాలూ, అవహేళనలూ జగదీష్‌కి గుర్తొచ్చాయి. తన ఆలోచనని పిచ్చివాడి ప్రేలాపనలా జమకట్టారు. తను వ్యక్తిగతంగా వెళ్ళి మంత్రిగార్ని కల్సుకున్నప్పుడు ‘నీటి చెట్టా..గాల్లోంచి ఆక్సిజన్ని, హైడ్రోజన్ని గ్రహించి దానికదే నీళ్ళు తయారుచేసుకుంటుందా? సైన్స్ అంటే మాయలూ మంత్రాలు అనుకుంటున్నావా? హాంఫట్ అని మంత్రదండం తిప్పగానే నీటి చెట్టు కావడానికి’ అంటూ అపహాస్యం చేసి తిప్పి పంపించారు.
అప్పుడతనికి భూమి సూర్యునిచుట్టూ తిరుగుతోందని హీలియోసెంట్రిక్ థియరీని మొదటిసారి ప్రతిపాదించిన కోపర్నికస్ గుర్తొచ్చాడు. అతన్ని అందరూ పిచ్చివాడికింద జమకట్టారు. ఆ థియరీని సమర్థించిన బ్రూనో అనే శాస్త్రవేత్త నక్షత్రాలన్నీ సూర్యగోళాలేనని, వాటి చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉండొచ్చని, విశ్వం అనంతమైందని, దానికి కేంద్రకం అంటూ ఏదీ లేదని ప్రతిపాదించినందుకు మతాధికార్లు అతన్ని స్తంభానికి కట్టేసి, చుట్టూ మంట పెట్టి నిలువునా కాల్చి చంపారు. కానీ తర్వాతి కాలంలో అతని ప్రతిపాదనలన్నీ నిజాలేనని తేలాయి.
‘‘మనం నీటి వ్యాపారం చేద్దాం నాన్నా’’ అన్నాడు పెద్ద కొడుకు.
‘‘వద్దు. ప్రజలకు ఉచితంగా ఈ విత్తనాలు పంచి పెడ్దాం’’ అన్నాడు జగదీష్.
‘‘ముప్పయ్యేళ్ళుగా శ్రమపడ్డావుగా నాన్నా.. ఉచితంగా పంచితే మనకేమొస్తుంది? లీటర్ వంద రూపాయలకే అమ్ముదాం. అంత తక్కువ ధరకు నీటిని అందించడం కూడా ఓ రకంగా ప్రజలకు సేవ చేయడమే కదా నాన్నా’’ అన్నాడు రెండో కొడుకు.
జగదీష్‌కి నీటితోవ్యాపారం చేయడం ఇష్టం లేదు.
మొదట తన అద్భుత ఆవిష్కరణ అయిన నీటి చెట్టుకి పేటెంట్ హక్కులు తీసుకున్నాడు. ఆ తర్వాత సైన్స్ జర్నల్స్‌లో తన ప్రయోగాలు, వాటి ఫలితాల గురించి వ్యాసం రాశాడు. వెంటనే నీళ్ళతో వ్యాపారం చేస్తున్న మూడు మల్టీ నేషనల్ కంపెనీలు నీటిచెట్ల మీద ఆధిపత్యాన్ని స్వంతం చేసుకోడానికి పోటీపడ్డాయి. అప్పటికే వాళ్ళ వ్యాపారం మూతపడే పరిస్థితికి చేరువగా ఉంది. వాళ్ళ ఆధీనంలో ఉన్న నీటి నిల్వలు కూడా ఐపోవచ్చాయి. మూడు కంపెనీల ప్రతినిధులు డేగల్లా జగదీష్ వాళ్ళ యింటి మీద వాలిపోయారు.
‘‘నీకెంత కావాలో చెప్పు. ఇస్తాం. నీటి చెట్టు మీద పేటెంట్ రైట్స్ మాకు అమ్ము’’ అన్నారు.
‘‘నేను వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో ప్రయోగాలు మొదలెట్టలేదు. సకల మానవాళికి ఉపయోగపడే ఆవిష్కరణ యిది. ప్రజలకు ఉచితంగా దీని విత్తనాల్ని పంచిపెడ్తాను. ప్రపంచ జనాభా ఎదుర్కొంటున్న నీళ్ళ సమస్య తీరుతుంది. ప్రకృతి ప్రసాదించిన నీటిని కొనుక్కోవాల్సిన దుస్థితి తప్పుతుంది’’ అన్నాడు జగదీష్.
‘‘ఇప్పుడు ప్రతిదీ వ్యాపారమే. చివరికి ప్రేమలూ అనుబంధాలు కూడా వ్యాపారాత్మకమైపోయిన ఈ రోజుల్లో కాళ్ళ దగ్గరకు వస్తానంటున్న డబ్బుని కాలదన్నుకోవడం విజ్ఞత అన్పించుకోదు.ఉచితంగా పంచితే నీకెమొస్తుంది?’’ మూడు ఎమ్.ఎన్.సీలలో ఆర్థికంగా బలంగా ఉన్న కంపెనీ ప్రతినిధి అడిగాడు.
‘‘మంచి పేరొస్తుంది. ప్రజల దాహర్తి తీర్చినందుకు పుణ్యం దక్కుతుంది’’
అతను పెద్దగా నవ్వాడు.
‘‘మంచి పేరు రావడం వల్ల నీకు ఒరిగేదేమిటి? ధనమో, బంగారమో, భవంతులో.. వీటిలో ఏమైనా దక్కుతాయా? లేదుగా. ప్రభుత్వం నీ సేవల్ని గుర్తించి పద్మశ్రీ ప్రకటిస్తుందేమో.. అంతే. యిక పుణ్యం అంటావా.. ఏం చేస్కుంటావు దాన్ని పోగేసుకుని? స్వర్గప్రాప్తి కోసమా? ఉందో లేదో తెలియని ఆ స్వర్గం కోసం యిహలోకంలో దొరికే సుఖాల్ని వదులుకోవటం మూర్ఖత్వం అన్పించడం లేదా? ఆలోచించు’’ అన్నాడు ప్రతినిధి.
‘‘మనిషిగా పుట్టినందుకు సాటి మనుషులకు ఉపకారం చేయడం నా బాధ్యత కాదా?’’
‘‘మొదట నీ కుటుంబానికి నువ్వు చేయాల్సిన మేలు గురించి ఆలోచించు. ముప్పయ్ యేళ్ళుగా నీ ప్రయోగాల్లో మునిగిపోయి పిల్లల్ని పట్టించుకున్నావా? వాళ్ళకోసం ఆస్తులు కూడబెట్టావా? నీ కూతురికి, కోడళ్ళకి నగలు చేయించావా? ఖరీదైన వాహనాలు కొనిపెట్టావా? ఏం చేశావు?’’
‘‘నా పిల్లలు సంతృప్తిగా ఉన్నారు. వాళ్ళు నానుంచి అవేవీ ఆశించడం లేదు’’
ప్రతినిధి ఎగతాళిగా నవ్వాడు.
‘‘ఏ కాలంలో ఉన్నావు? భ్రమల్లో బ్రతుకుతున్నావు. వెయ్యికోట్లు నా ఆఫర్. కొన్ని తరాల వరకు ఐశ్వర్యంలో బతకొచ్చు. ఆలోచించు. నీ పిల్లల్ని అడిగి చూడు’’ అన్నాడు.
జగదీష్ తన యిద్దరు కొడుకులూ కూతురి వైపు చూశాడు.
‘‘మీరు మాకేమీ ఇవ్వలేదు నాన్నా. చివరికి తాతగారు సంపాయించిన ఆస్తిని కూడా మీ ప్రయోగాల కోసం ఖర్చు చేసి, మాకంటూ ఏమీ మిగల్చకుండా చేశారు. వెయ్యికోట్లు నాన్నా.. ఇది సువర్ణావకాశం. జారిపోతే మళ్ళా రాదు. నీటి చెట్టుని అమ్మేయండి. మాకు డబ్బులు కావాలి. మాకు ఆస్తులు కావాలి. వాటిద్వారా లభించే సుఖాలు కావాలి’’ అన్నారు.
ముగ్గురిదీ ఒకటే మాట..
వెయ్యికోట్లు అనగానే జగదీష్ కూడా చలించాడు. వెయ్యికోట్లు.. చాలా పెద్ద మొత్తం.. అతను కలలో కూడా వూహించనంత డబ్బు..అతన్లోని మనిషి ఓడిపోయి తండ్రి జయించాడు. స్వార్థం జయించింది. వెయ్యికోట్లకు పేటెంట్ హక్కుల్ని ఆ కంపెనీకి అమ్మేశాడు. కొన్ని రోజుల్లోనే మిగతా రెండు కంపెనీలు మూతపడ్డాయి. పేటెంట్ హక్కుల్ని కైవసం చేసుకున్న కంపెనీ ప్రపంచ ప్రజలకు తాగునీటిని అధిక ధరలకు అందించడంలో ఏకఛత్రాధిపత్యాన్ని సాధించింది.
జగదీష్ కుటుంబం చాలా సంతోషంగా ఉంది. రాజభవనం లాంటి యిల్లు.. ఖరీదైన కార్లు.. ఆడ వాళ్ళ వొంటి నిండా బంగారం..బీరువాల నిండా నోట్ల కట్టలు..యింట్లో ఎటుచూసినా ధనలక్ష్మి గజ్జెల చప్పుడు విన్పిస్తోంది.
‘ఏ’ అనే దేశాన్ని ఓ నియంత పరిపాలిస్తున్నాడు. అతనికి రాజ్య కాంక్ష ఎక్కువ. ప్రపంచం మొత్తాన్ని తన పాదాక్రాంతం చేసుకోవాలని కలలు కంటుంటాడు. తనవద్ద ఉన్న అపారమైన ఆయుధసంపత్తిని చూసుకుని మితిమీరిన గర్వం అతనికి. చీటికి మాటికి ఇతరదేశాల్ని రెచ్చగొట్టి వాటిమీద బాంబులు కురిపించి భయభ్రాంతుల్ని చేసి, తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలని చూస్తుంటాడు.
అతని కన్ను జగదీష్ నివశిస్తున్న దేశంమీద పడింది. వెంటనే త్రిదళాధిపతుల్ని సమావేశపరిచి ‘‘ఆ దేశం నా హస్తగతం కావాలి. మీకు ఎంతమంది సైనికులు, ఎన్ని బాంబర్లు, ఎన్ని నూక్లియర్ హెడ్స్ కావాలి?’’ అని అడిగాడు.
‘‘ఆ దేశాన్ని జయించడానికి సైనికులూ ఆయుధాలూ ఆటం బాంబులూ ఏవీ అక్కరలేదు. నీటిబాంబు చాలు’’ అన్నాడు సైనిక దళాధిపతి.
‘‘అదేమిటో వివరంగా చెప్పండి’’ అన్నాడు నియంత.
‘‘ఆ దేశానికి తాగునీటిని సరఫరా చేసే కంపెనీ మన దేశంలోనేగా ఉంది. దాని సీఈవోని పిలిపించండి. ఆ దేశానికి నీటి సరఫరాని నిలిపివేయమని ఆజ్ఞాపించండి. ప్రజలు తాగడానికి గుక్కెడు నీళ్ళు లేక ప్రాణాలు విడుస్తారు. మరో గత్యంతరంలేక ప్రభుత్వం మనకు లొంగిపోతుంది’’ అంటూ సలహా ఇచ్చాడు.
తనదేశ సైనికులకు ప్రాణనష్టం జరక్కుండా, ఆయుధాలేవీ వాడకుండా మరో దేశాన్ని ఆక్రమించుకోవచ్చనే వూహకే నియంత రక్తనాళాల్లో కొకైన్లాంటి మత్తేదో ప్రవహించింది.
హుటాహుటిన కంపెనీ సీఈవో పిలిపించబడ్డాడు. నియంత ఆదేశాల మేరకు ఆ దేశానికి నీటి సరఫరా నిలిపివేయబడింది. దేశంలో ప్రజలు నీటి చుక్క కోసం అల్లాడిపోతున్నారు. నీటి సరఫరా బంద్ కావడానికి ముందు ఎక్కువ మోతాదులో బాటిళ్ళను కొనుక్కుని బీరువాల్లో భద్రంగా దాచుకున్న ధనవంతుల యిళ్ళమీద దాడులు జరుగుతున్నాయి.
ఎవరి చేతిలోనైనా నీళ్ళ బాటిల్ కన్పించడం ఆలస్యం దానికోసం వందమంది ఎగబడ్తున్నారు. కొట్టుకుని చస్తున్నారు. నీళ్ళ కోసం రక్తం ధారలుగా ప్రవహిస్తోంది. ప్రభుత్వం గత్యంతరం లేక ‘ఏ’ ప్రభుత్వంతో మంతనాలు జరుపుతోంది.
సంధి ప్రయత్నాలు కుదరడం లేదు. నియంతకు పూర్తిగా లొంగిపోవడానికి మాత్రం ఆ దేశం సిద్ధంగా లేదు.
జగదీష్‌కి విపరీతమైన దాహంగా ఉంది. నీటిచుక్క కోసం గొంతు అల్లాడిపోతోంది. దాచుకున్న నీళ్ళన్నీ ఐపోయాయి. దాహార్తిని తట్టుకోలేక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. తనక్కూడా చావు దగ్గరగా ఉందేమోననిపిస్తోంది. అంత బాధలోనూ అతనికి తన పరిస్థితిని తల్చుకుని నవ్వొచ్చింది.
నీటిచెట్టుని సృష్టించిన వ్యక్తే నీటిబొట్టుకోసం తపించిపోవడం విధివిలాసం కాక మరేమిటి?
‘‘నువ్వు ఒక్క విత్తనాన్నయినా వాళ్ళకు తెలియకుండా దాచుకోవాల్సింది నాన్నా’’ అన్నాడు పెద్ద కొడుకు. అతనూ చావుకి దగ్గరగా ఉన్నాడు.
‘‘పేటెంట్ హక్కుల్ని ఆ కంపెనీకి ధారాదత్తం చేశాక మన దగ్గర విత్తనాలు ఉంచుకోవడం న్యాయసమ్మతం కాదు. ధర్మసమ్మతం కూడా కాదు. అలా చేయడానికి నా మనస్సాక్షి ఒప్పుకోదు’’అన్నాడు జగదీష్.
‘‘ఇప్పుడు మనల్ని అవేవీ కాపాడలేవుగా నాన్నా. ఐనా ఒక దేశం మొత్తానికి నీళ్ళు అందకుండా దిగ్భంధనం చేయడం న్యాయమా? ఈ రోజుల్లో ధర్మమెక్కడుంది నాన్నా? ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోవడమేగా ఇప్పటి లోకరీతి’’ అన్నాడు రెండో కొడుకు.
‘‘ఒకప్పుడు రెండు దేశాల మధ్య న్యాయాన్ని కాపాడటానికి అంతర్జాతీయ సంస్థలుండేవి. ఇప్పుడలాంటి సంస్థలేవీ లేవు. అంతా ఆటవిక రాజ్యం. బలవంతుడు బలహీనుడ్ని దోచుకుంటున్నా అడిగే నాథుడే లేడు’’ అన్నాడు నిస్పృహగా జగదీష్.
‘‘నీటిచెట్టుని సృష్టించిన శాస్త్రవేత్తగా నీకు ఆ నీటిమీద ఉన్న అధికారాన్ని ఎవ్వరూ కాదనలేరు. నువ్వు ఆ కంపెనీ ప్రతినిధితో మాట్లాడు. మనకు ప్రత్యేకంగా నీళ్ళ బాటిళ్ళను అందించే ఏర్పాటు చేయమని చెప్పు’’అన్నాడు పెద్ద కొడుకు.
‘‘డబ్బుకి ఆశపడి నీటి చెట్టుని అమ్ముకున్నాక ఏ మొహం పెట్టుకుని అడగమంటావురా? అది అడగడం కాదు అడుక్కోవడమే’’
‘‘ఇప్పుడు తప్పదు నాన్నా..మరో ఇరవై నాలుగు గంటలు నీళ్ళు లేకపోతే మనందరం చచ్చిపోవడం ఖాయం’’ అంది కూతురు.
అయిష్టంగానే జగదీష్ ఫోన్ చేశాడు.
‘‘ఇది మీకూ మాకూ మాత్రమే సంబంధించిన విషయం కాదు. రెండు దేశాలకు సంబంధించిన విషయం. మేమేమీ చేయలేం. సారీ’’ అని ఫోన్ పెట్టేశాడు.
‘‘నువ్వు మరో నీటి చెట్టుని తయారుచేయవచ్చు కదా నాన్నా’’ అంది కూతురు.
‘‘నేను తయారుచేయగలనని తెలిసే అకస్మాత్తుగా నీటి సరఫరాని ఆపేశారు. విత్తనంలోని జీన్స్‌లో మార్పులు చేయడానికీ, అది చెట్టుగా ఎదిగి నీటిబుగ్గలు రావడానికి రెణ్ణెల్ల పైగానే పడ్తుంది. నీళ్ళు లేకుండా అన్ని రోజులు బతకడం కష్టం కదమ్మా’’ అన్నాడు జగదీష్.
‘‘అంటే మనందరం చావక తప్పదా నాన్నా’’ అంది కూతురు.
‘‘స్వయంకృతాపరాధానికి మూల్యం చెల్లించక తప్పదమ్మా. మనం ప్రలోభాలకు లొంగిపోయాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ అధునాతమైన బంగళాలు, కేజీల కొద్దీ బంగారం, వెండి, నోట్ల కట్టలు..ఇవే చాలా విలువైనవని భ్రమపడ్డాం. వీటన్నిటికన్నా ఓ నీటి బొట్టు విలువైందన్న విషయాన్ని విస్మరించాం. మనందరం శిక్షార్హులమే. నీరు ప్రాణాధారమని తెలిసీ, దాన్ని తృణీకరించినందుకు ఇప్పుడది మన ప్రాణాల్నే హరిస్తోంది’’ జగదీష్ గొంతులో బాధ సుళ్ళు తిరిగింది.
అతనికి మెల్లగా స్పృహ తప్పసాగింది.
Comments
Please login to add a commentAdd a comment