దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ..! | Sri Krishnavataram Story Line | Sakshi
Sakshi News home page

దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ..!

Published Sun, Aug 18 2019 12:09 PM | Last Updated on Sun, Aug 18 2019 12:09 PM

Sri Krishnavataram Story Line - Sakshi

తారకరామ పిక్చర్స్‌ వారి సినిమాలో ఎన్టీఆర్‌ శ్రీకృష్ణుడిగా, శోభన్‌బాబు నారదుడిగా నటించిన సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం..
‘‘నారద మునీంద్రా! దేవగణం మహర్షి మండలంతో పాటు భూదేవి కూడా మా సన్నిధానానికి వచ్చింది. ఏమిటి విశేషం?’’ ఆరా తీశాడు శ్రీమహావిష్ణువు.
‘‘సర్వజ్ఞడవు. నీకు తెలియనిది ఏముంది స్వామి! దానవుల బాధలను భరించలేకే మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చారు’’ అని చెప్పాడు నారదుడు.
‘‘యజ్ఞయాగాదులు సాగడం లేదు. నానా హింసలకు లోనవుతున్నాం. భూలోకం నరకమైపోతున్నది. సర్వలోక శరణ్యుడైన మీరు అడ్డుపడకపోతే ధర్మానికి నిలువ నీడ ఉండదు’’ అని వాపోయారు మునులు.
‘‘ధర్మానికి అంత హాని సంభవించిందా!’’ అని అడిగింది లక్ష్మీదేవి.
‘‘దానవాంశసంభూతులైన కంస,నరకాసుర, జరాసంధుల అక్రమాలు పెచ్చుమీరిపోతున్నాయి. ఆ పాపభారం భరించలేకుండా ఉన్నాను తల్లీ’’ అన్నది బాధగా భూమాత.
‘‘దేవీ భూమాతా! కలవరపడకు. ఆచిరకాలంలోనే దేవకి గర్భవాసాన శ్రీకృష్ణుడనై జన్మించి పాప భారాన్ని నిర్మూలిస్తాను. దుష్టశిక్షణ, శిష్టరక్షణ శ్రీకృష్ణావతార పరమార్థం’’ అని హమీ ఇచ్చాడు శ్రీమహావిష్ణువు.

భూలోకంలో....
చెల్లి. బావలను కూర్చొబెట్టుకొని రథం నడుపుతున్నాడు కంసుడు.
ఆ దృశ్యం చూడముచ్చటగా ఉంది.
ఇంతలో ఆకాశవాణి గర్జించింది...
‘‘కంస రాజేంద్రా! మూర్ఖుడవై ముందున్న ముప్పు తెలుసుకోలేకుండా ఉన్నావు. ఆమె అష్టమగర్భమే నీ పాలిట మృత్యువై నిన్ను అంతరింపజేస్తుంది’’
అప్పటి వరకు ఆనందోత్సాహాలతో ఉన్న కంసుడికి చెమటలు పట్టాయి.
అప్పటి వరకు చెల్లితో ఎంతో ప్రేమగా మాట్లాడిన కంసుడు ఆకాశవాణి హెచ్చరికతో ఒంటికాలి మీద లేచి...
‘‘ఆమె అష్టమగర్భమే నా పాలిట మృత్యువా? ఏమిటి ఈ వైపరీత్యం?’’ అని చెల్లి మీది కత్తి దూయబోయాడు.
‘‘అన్నా.. నన్ను ప్రేమతో పెంచి పెళ్లి చేసింది నీ చేతులారా వధించడానికేనా? నీ భయంకర కరవాలానికి నన్ను బలి చేస్తావా?’’ రోదిస్తూ అన్నను అడిగింది దేవకి.
చెల్లెలి రోదన విని కూడా ఆ అన్న మనసు కరగడం లేదు.
కోపంతో బుసలు కొడుతూనే ఉన్నాడు కంసుడు.

అప్పుడు వసుదేవుడు కంసుడి భుజం మీద చేయి వేసి...
‘‘బావా తొందరపడకు! ఎట్టి పాపం ఎరుగని అమాయకురాలు. ఈమెను వధించుట ధర్మమేనా? నీ మృత్యుకారణం ఈమె సంతానమేగానీ ఈమె కాదు కదా బావా’’ అన్నాడు.
‘‘కాని ఈమె జనించే ప్రతి శిశువును పుట్టగానే మాకు అప్పగించాలి’’ అని షరతు విధించాడు కంసుడు.
‘‘తప్పకుండా అప్పగిస్తాను బావా’’ ఒప్పుకున్నాడు వసుదేవుడు.
‘‘నేటి నుంచి కారాగారమే మీ నివాసమందిరం’’ అంటూ చెల్లి బావలను కనికరం లేకుండా కారాగారంలో వేశాడు కంసుడు.
కొంతకాలం తరువాత...
‘‘బావా! ఇదిగో దేవకి ప్రథమగర్భం. నా మాట నిలబెట్టుకున్నా! ఆపై నీ దయ!’’ అంటూ శిశువును కంసుడికి అప్పగించాడు వసుదేవుడు. ‘‘విధికి నా మీద లేని దయ నాకు ఈ శిశువు మీదనా!’’ అంటూ ఆ శిశువును ఆకాశంలోకి విసిరేసి కత్తి వేటుకు బలి చేశాడు కంసుడు.

చేదిరాజు శిశుపాలుడు మందువిందులో తేలియాడుతున్నాడు.
‘‘ఆనందానికి అంతరాయం కలుగలేదు కదా’’ అంటూ అప్పుడే అక్కడకు వచ్చాడు నారదుడు.
‘‘ఇది నిరంతరం సాగే నిత్యానందం’’ అన్నాడు దంతవక్త్రుడు.
‘‘ఈ ఆనందం తాత్కాలికమే కాని శాశ్వతం కాదు దంతవక్త్రా’’ వేదాంత ధోరణిలో అన్నాడు నారదుడు.
‘‘శాశ్వత ఆనందమార్గం?’’ అడిగాడు చేదిరాజు.
‘‘సంసారత్యాగం చేసి సన్యాసులం కావడమే’’ కాస్త వ్యంగ్యంగా అన్నాడు దంతవక్త్రుడు.
‘‘నారాయణ నారాయణ... ఆ  యోగం అందరికీ లభ్యం కాదయ్యా. తగిన రాచకన్యను పెళ్లాడి సాటి రాజుల్లో కీర్తిని సంపాదించండి’’ అని సలహా ఇచ్చాడు నారదుడు.
‘‘మా ఘనతకు తగ్గ కన్య తారసిల్లాలి కదా మహర్షి’’ అన్నాడు చేదిరాజు.
‘‘మీ ప్రాణస్నేహితుడు విదర్భరాకుమారుడు... ఆమె చెల్లెలు రుక్మిణీ...’’ గుర్తు చేశాడు నారదుడు.
‘‘చక్కగా గుర్తు చేశారు మహర్షి. ఆ బాలామణి అత్యంత సుందరీమణే’’ కళ్లలో సంతోషం ఉట్టిపడుతుండగా అన్నాడు చేదిరాజు.

‘‘దూరంగా ఉన్నవారని నిన్నే నమ్ముకున్నవారిని నిరాదరిస్తావా?’’ కాస్త ఆలకబూని అడిగాడు నారదుడు.
‘‘నిరాదరణా! అది నేను ఎన్నడూ చేయలేదే’’ అన్నాడు కృష్ణుడు.
‘‘సాక్షాత్తు ఆదిలక్ష్మి అవతారమైన రుక్మిణిదేవిని ఆ శిశుపాలునికి అంటగట్టబోతున్నారు. అహోరాత్రాలు నిన్నే కలవరించే ఆ రుక్మిణీదేవికి ఈ అవమానం జరగాల్సిందేనా!’’ విచారపడ్డాడు నారదుడు.

రుక్మిణీదేవి కన్నీరుమున్నీరవుతోంది.
‘‘స్వామీ! ఎందుకు ఈ మౌనం. ఎంతకాలం ఈ ఏకాంతధ్యానం. నా మనసును ఎందుకు అపహరించావు?’’ తనలో తాను గొణుక్కుంటోంది రుక్మిణీదేవి.
ఈలోపు చెలికత్తె పరుగెత్తుకు వచ్చి...
‘‘అమ్మా... అంతా అయిపోయిందమ్మా... పెళ్లి నిశ్చయమైపోయింది’’ అని ఆందోళనగా చెప్పింది.
‘‘నాకు తెలియకుండా ఎవరు వరుడు?’’ అని అడిగింది రుక్మిణి
‘‘ఆ శిశుపాలుడే’’ అని చెప్పింది  చెలికత్తె.
కృష్ణుడిని బొమ్మను చేతిలోకి తీసుకొని...
‘‘కృష్ణా! కృష్ణా!! ఈ సంబంధం నీకు ఇష్టం లేదని చెప్పు...’’ అంటూ కన్నీళ్లపర్యంతం అయింది రుక్మిణీదేవి.
‘‘ఈ వివాహం నాకు ఇష్టం లేదు అని చెప్పండి’’ అని చెప్పింది చెలికత్తె.
‘‘ఎలా చెప్పేది? ఇంతవరకు ఎన్నడూ అన్నయ్య మాటకు ఎదురాడలేదు’’ సంశయంగా అన్నది రుక్మిణీదేవి.
‘‘అలా అని మీ పచ్చని జీవితం పాడు చేసుకుంటారా. మీ ఆశయాలు, అనురాగాలు నాశనం చేసుకుంటారా!’’ అడిగింది చెలికత్తె.
‘‘అన్నయ్య తన పట్టేగానీ మన గోడు ఆలకించడు. ఈ కళ్యాణాన్ని ఆపగల సమర్థుడు ఆ వాసుదేవుడొక్కడే’’ కృష్ణుడిపై  భారం వేస్తూ అన్నది రుక్మిణి.

సమాధానం : శ్రీ కృష్ణావతారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement