సలుపుతున్న గాయం | story as dog jimmy and rajavva | Sakshi
Sakshi News home page

సలుపుతున్న గాయం

Published Sun, Oct 12 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM

సలుపుతున్న గాయం

సలుపుతున్న గాయం

కథ:  
ఓ రోజు రాజవ్వకు బాగా జ్వరం వచ్చింది. అప్పుడామె చిన్న కూతురు లక్ష్మి ఇంట్లో ఉంది. చలితో వణుకుతూ మూల్గుతూ ఓ మూలన మంచంలో పడుకుంది. మా జిమ్మికి జ్వరం వస్తే మేము నోట్లె మంచినీళ్లు పొయ్యలేదు వదినె. అదంటే మాకు పంచప్రాణం. ఒక్క రోజు మేం తినకున్నా సరే, దానికి మాత్రం వంట చేసి పెడుత’’ అని పక్కింటి సుగుణతో గొప్పగా చెప్పింది బాలవ్వ. అసలే ఆమె వయసు డెబ్బై ఏళ్లు. సాయంత్రం ఐదవుతోంది. భయపడుతూనే గేటు తీశాను. మేము మేడమీద అద్దెకుంటాం. పైకి వెళ్లాలంటే జిమ్మిని దాటుకుని వెళ్లాల్సిందే. జిమ్మి అంటే మా ఇంటి ఓనర్ కుక్కపేరు. అది నన్ను రోజూ చూస్తూనే ఉంటుంది. అయినా కొత్తగా చూసినట్లు మొరుగుతుంటుంది. జిమ్మిని మా ఓనర్ కంటికి రెప్పలా చూసుకుంటాడు. దానికి రోజూ ఓట్స్, హార్లిక్స్, బిస్కట్లు ఇస్తాడు. ఆదివారం వస్తే నాన్‌వెజ్ తప్పదు.
 
మెల్లగా దాన్ని దాటుకుని మెట్లెక్కాను. ఎందుకో నన్ను చూసి ఈ రోజు మొరగలేదు. దాని రాజసం చూస్తుంటే నాకెప్పుడూ అసూయనే. మా ఇంటి ఓనర్ దానికి చేస్తున్న సేవలు చూస్తుంటే నా గుండె కలుక్కు మంటుంది. వారం కిందట జరిగిన ఆ సంఘటన నన్నింకా వెంటాడుతూనే ఉంది.
    
మా ఇంటి యజమాని రాజయ్యది ఓ పల్లెటూరు. కొంచెం చదువుకున్న ఆయనే. ఫైనాన్స్‌ల్లో పెట్టుబడులు పెట్టి బాగానే సంపాదించాడు. రియల్‌ఎస్టేట్ వ్యాపారంలోనూ ఆర్థికంగా కలిసి రావడంతో ఐదారు కోట్లకు ఆస్తులు చేరాయి. ఆయన తండ్రి ఏనాడో మరణించాడు. తల్లి రాజవ్వ, అన్నయ్య, ఇద్దరు చెల్లెళ్లు ఉండేవారు. ఈ మధ్యే అన్నయ్య చనిపోయాడు. చెల్లెళ్లు ఎవరి అత్తవారింట్లో వారు ఉంటున్నారు. తల్లి రాజవ్వ ఆమెకు చేతనైనంత కాలం సొంత ఊరిలోనే వ్యవసాయం పనులు చేస్తూ బతికింది.
 
ఓ రోజు రాజవ్వకు బాగా జ్వరం వచ్చింది. అప్పుడామె చిన్న కూతురు లక్ష్మి ఇంట్లో ఉంది. చలితో వణుకుతూ మూల్గుతూ ఓ మూలన మంచంలో పడుకుంది రాజవ్వ. అసలే ఆమె వయసు డెబ్బై ఏళ్లు. డాక్టర్ ఏవో మందులిచ్చాడుగానీ ఎంతకూ జ్వరం తగ్గలేదు. అంతకుమించి వెళ్లడానికి డాక్టర్ లేడు.  అది అసలే పల్లెటూరు. అందుబాటులో ఆర్‌ఎంపీ వైద్యం మాత్రమే ఉంటుంది. అందుకే లక్ష్మి తన అన్న రాజయ్యకు ఫోన్ చేసింది.
‘‘అన్నా, అవ్వకు బాగా జరమచ్చింది. పెయ్యంత రొట్టెపెంక లెక్క కాలుతంది. గులుకోసు పెట్టిచ్చిన. సూదులిప్పిచ్చిన. అయినా జరం జారుతలేదు. అవ్వ ఎట్లనో చేస్తంది. ముసల్ది ఉంటదో పోతదో తెలుత్తలేదు’’ అంటూ గాభరాగా చెప్పింది. ‘‘ఆటోల అవ్వను సిరిసిల్లకు తోలుకరా. నేను పెద్ద దవాఖానలో చూపిత్త’’ అని భరోసా ఇచ్చాడు రాజయ్య.
    
ఆ రోజే తల్లి రాజవ్వను తీసుకుని లక్ష్మి సిరిసిల్లకు వచ్చింది. అయితే ఫోన్ చేస్తే రాజయ్య ఎంతకూ ఫోన్ ఎత్తలేదు. దవాఖానలో లైను ఎక్కువగా ఉంది. తల్లి జ్వరంతో వణుకుతోంది. ఏం చేయాలో అర్థంకాక తల్లిని కుర్చీలో కూర్చోబెట్టి, అన్న ఇంటికి వచ్చింది లక్ష్మి.
 అప్పటికే పగటిపూట భోజనం చేసిన రాజయ్య ఫోన్ సెలైన్స్‌లో పెట్టి పడుకున్నాడు. లక్ష్మి ఇంట్లోకి వస్తూనే, ‘వదినె.. వదినె.. అన్న ఉన్నడా? అవ్వకు ఒక్కటే జ్వరం. దావఖానకు వచ్చినం. లైను బాగుంది. అన్నకు ఫోన్ చేస్తే ఎత్తుత లేడు’ అంది.
 
ఆడబిడ్డను కనీసం కూర్చోమని కూడా అనకుండా, ‘‘అయ్యో.. వదినే. ఇప్పుడే తిని పండుకున్నడు. నాలుగ్గొట్టేదాకా లేవడు. ముసలామెను డాక్టర్‌కు నువ్వే జూపించి తీసుకపోరాదు’’ అంటూ ఉచిత సలహా ఇచ్చింది రాజయ్య భార్య బాలవ్వ.
 ‘‘అది కాదు వదినె, కాలం అయిత లేదు. వరినారు ముదిరిపోతంది. పొలం పొతమైతలేదు. ఇంటికాడ శెమ శెమోలే ఉంది. కరెంట్ కూడా సక్కగ అత్తలేదు. మీ అన్న రాత్రంత పొలం కాడనే ఉంటుండు. దొంగోలే వచ్చే కరెంట్‌కు కావలి కాసుడైతుంది. అదట్లుంటే, గిండ్లనే ముసల్ది మంచంల వడె’’ అంటూ నిట్టూర్చింది లక్ష్మి.
  ‘‘ఓ దొరా, లేస్తవా...  మీ చెల్లెలు మీ అవ్వను తోలుకచ్చిందట...’’ అంటూ కూలర్ గాలికి చల్లగా పడుకున్న రాజయ్యను కేకేసింది బాలవ్వ.
 
‘‘గిప్పుడచ్చిందా? డాక్టర్ గిప్పుడు ఉంటడ’’ ఒకింత అసహనంతో లేచాడు రాజయ్య.
 ‘‘అన్నా.. పదింటికే తయారై కూసున్నం. ఆటోలు పాడుగానూ ఒక్కటీ దొరకలేదు. బావనేమో పొలం కాడి నుంచి రాపాయే. నేనే మండెపల్లి ఆటోను ఆపి అవ్వను ఎక్కించుకుని వచ్చిన’’ అంది లక్ష్మి.
 ‘‘సరే గని దావఖానలో ఎవ్వలున్నరు’’ అన్నడు రాజయ్య.
 ‘‘ఎవ్వల్లేరు... కుర్చీల అవ్వనొక్కదాన్నే కూసోవెట్టి అచ్చిన’’ అంది లక్ష్మి.
 ‘‘అయ్యో గట్ల ఒక్క దాన్ని ఇడిసిపెట్టి వత్తవ. నేను రాకపోదునా. నడువు నడువు’’ ‘గెదుముతున్నట్లు’ అన్నాడు రాజయ్య.
    
 అటో ఇటో తల్లిని దవాఖానాలో చూపించారు. డాక్టర్ రక్తం, మూత్ర పరీక్షలు చేశాడు.
 ‘‘ఇది డెంగీ జ్వరం. రక్తకణాలు తగ్గినయి. రోజుకు రెండు ఇంజెక్షన్లు ఇయ్యాలే. పండ్ల రసాలు తాగియ్యాలే. లేకుంటే పరేషానుంటది’’  అని చెప్పాడు డాక్టర్.
 రాజవ్వను వెంటబెట్టుకొని, ఇంటికి వచ్చాడు రాజయ్య. ‘‘అవ్వను మా ఇంట్లోనే ఉంచుకుంట. నువ్వు పో’’ అన్నాడు చెల్లెలితో.
 
రాజవ్వ మూల్గుతూనే ఇంటికి చేరింది. బక్కపల్చని ప్రాణం. ‘నూకేత్తె నూరు జాగల్ల పడుతుంది’. జ్వరం రావడంతో మరింత బక్కచిక్కింది. గువ్వపిల్లలా గుంజకపోయింది. గేటు తీసుకుని, తల్లిని రెక్కపట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చాడు రాజయ్య. అత్తను చూస్తూనే ముఖం మాడ్చుకుంది బాలవ్వ.
 
‘‘ఆ.. గిప్పుడు కొడుకు యాదికచ్చినాడు. మంచి గున్నన్ని రోజులు బిడ్డలకు పని చేసి పెట్టి, పానం బాగలేకుంటే కొడుకు దగ్గరికచ్చుడా?’’ రాజయ్య ముందే పటమేసింది బాలవ్వ.
 ‘‘ఏయ్.. నువ్వు ఒర్రకే. దానికి జరమచ్చింది. రెండు రోజులుండి జ్వరం తగ్గినంక పోతది’’ భార్యను సముదాయించాడు రాజయ్య.
 ‘‘ఏం రెండు రోజులు మీ చెల్లెలు తోల్కపోనందా. మంచిగుంటే పని చేత్తదని తీస్కపోతరు. జెరమత్తె మనమీద నూకుతరు. అవ్వో మంచిగనే ఉంది కత...’’అంటూ దీర్ఘాలు తీసింది బాలవ్వ.
 
బాలవ్వ మాటలు విన్న రాజవ్వకు గుండెలో గుద్దినట్టయింది. దుఃఖంతో కళ్లల్ల నీళ్లు తిరిగినాయి.
 ‘చూసినవా.. ఇది పసిద్దయినపుడు ఏడు దినాలు దాని అవ్వ రాకపోయినా నేనే తానం చేయించిన. యాపాకు, వాయిలాకు తెచ్చి నీళ్లు కాగవెట్టి పోసిన. దీనికి అర్వసాకిరి చేసిన. అప్పటి మందం ‘అత్తా నువ్వెంత మంచిదానివి, మా అవ్వరాకనే పాయే’ అంటూ నన్ను ఆకాశానికి ఎత్తుకునే. ఇప్పుడుజూడు... పాన బాగలేక అత్తె గిట్ల అనవట్టె. తొలుసూరు కాన్పుకు తల్లిగారే ఖర్సులు పెట్టుకోవాల్నని అడిగినందుకే దానవ్వ మా ఇంటికి రాకనే పాయే’ అంటూ పాత ముచ్చట్లను యాది చేసుకుంది రాజవ్వ.
    
 రాజవ్వకు ఇంట్ల ఓ మూలకు కుక్కి మంచమేశారు. వెన్నుపూసలోంచి చలి తన్నుకొస్తోంది.
 ‘‘నాయిన్నా.. రాజాలు.. దుప్పటి ఉంటే కప్పు బిడ్డా. సలి బాగా పెడుతోంది’’ రాజవ్వ మూల్గుతూ అంది.
 ‘‘ఆ.. ఉన్నయి దుప్పట్లు. నువ్వు సంపాయించి పెట్టినయి...’’ అంటూ బాలవ్వ బెడ్ రూంలోకి వెళ్లి లెంకి లెంకి పాత దుప్పటి తెచ్చి కప్పింది.
 ‘‘చలి ఆగుతలేదు బిడ్డ. ఇంకోటి ఉంటే కప్పు’’ మూల్గుతూనే అంది రాజవ్వ.
 ‘‘ఇంకెన్ని కప్పాలే. యాడున్నయి. సలట సలి... ఎవ్వలకు లేని సలి నీకే వెట్టవట్టె’’ గులుగుతూ ఇంకో దుప్పటిని తెచ్చి కప్పింది.
 
‘గరీబుదాన్ని చేసుకుంటే చెప్పినట్టు ఇంటదని, దాని అవ్వగారు ఏం పెట్టకపోయినా నాకొడుక్కు చేసుకుంటి. ఇప్పుడు జూడు... ఇది ఎట్ల మాట్లాడుతుందో! నడమంత్రపు సిరి రాంగనే కండ్లు నెత్తికెక్కినయి. దీని నోరుకు భయపడే గదా, నేను నా బిడ్డల ఇండ్లల్ల బతకవడితిని. పెద్దోడు కాలం జేసే. ఉన్న ఒక్కోడు ఇట్ల జెయ్యవట్టె. రేపు నా గతెట్ల?’ అనుకుంటూ తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ, గుడ్ల నీళ్లు గుడ్లళ్లనే కుక్కుకుంది రాజవ్వ.
 రాజయ్యకు ఎందుకో బాధ అనిపించింది. కానీ భార్యకు గట్టిగా చెప్పలేక పోయాడు. బుదరకిచ్చినట్టు దగ్గరికి పిలిచి, ‘‘రెండు రోజులు ఉండి పోతది. జెర లొల్లివెట్టకే.. అరె మా అవ్వ మన ఇంటికి రాక ఎటు పోతది. ఒక్క నాల్గు రోజులు ఆగు.. మా పెద్ద చెల్లెల్ని రమ్మంట. అది తోలుక పోతది. అప్పటి దాకా నువ్వు ఓర్సుకో’’ అంటూ ప్రాధేయపడ్డాడు రాజయ్య.
 
‘‘ఓ సారి రెండు అంటున్నవు... ఓ సారి నాలుగు అంటున్నవు... రెండద్దు నాల్గద్దు రేపే రమ్మను. ఇప్పుడు ముసల్ది ఇరగవడ్డది. ఎవ్వలు చేసి పెట్టాలే. నేను మాత్రం గుర్రం లెక్కున్ననా, నాకు శాతనైత లేదు’’ కోపంగా అంది బాలవ్వ.     
 అంతట్లకే వచ్చాడు రాజయ్య కొడుకు రమేశ్. ‘‘అరె.. గీ నాన మ్మేంది. మనింటికచ్చింది. ముసల్ది యాడవడితే ఆడ కండలు కండలు ఉంచుతది. ఇంటి గోడలన్నీ పాడయితయి. అత్తమ్మల ఇంటికే పంపుండ్రి’’ ఏవగింపుగా అన్నాడు రమేశ్.
 
‘‘ఆ గట్ల చెప్పు బిడ్డ. నువ్వు జెప్పుతెనన్న ఇంటడు. నేను చెప్పితే నన్నే తిడుతుండు’’ కొడుక్కు వత్తాసు పలికింది తల్లి. బిడ్డ కూడా బాలవ్వకు సపోర్టుగా మాట్లాడింది. రాజయ్య ఒంటరివాడైపోయాడు.
 మనసులో తల్లిని పంపాలనే ఉన్నా... లోకం ఏమనుకుంటుందోనని ఇంట్లో ఉంచుకోడానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఇంట్లో అందరూ వద్దంటున్నారన్న నెపం మీద తల్లిని చెల్లెళ్ల దగ్గరికి పంపాలని నిర్ణయించుకున్నాడు.
    
 రాజవ్వను తిన్నవా అనేటోళ్లు లేరు, పన్నవా అనేటోళ్లు లేరు. ఏదో మొక్కుబడికి బుక్కెడు బువ్వను పెడుతున్నారు. ఇదంతా చూస్తూనే ఉంది రాజవ్వ. ఏమనాలన్నా నోరు వస్తలేదు.
 ‘‘చూసినవా.. వీడు చిన్నగున్నపుడు ఆకలయితుందని ఏడ్తే దొరగారి ఇంటికెళ్లి చలిబువ్వ తెచ్చి సాదుకున్న.
మా ఇంట్లో అప్పుడు బువ్వెక్కడిది? మక్క గట్కనే ఉండె. అది గూడ కడుపునిండా దొరకకనే పాయే. నా కడుపు సంపుకుని వీని కడుపు నింపిన.

ఓసారి వీనికి పోచమ్మ జరమచ్చి పెయ్యంతా పుండ్లు పుడితే పది రోజులు బట్టలల్ల ఏసుకుని పనికిపోకుంట పెయ్యికి పసుపు రాసి తీరొక్క దేవుళ్లకు మొక్కుకున్న. మా ముసలోడు గూడ గొర్ల కాడికి పోకుంట కల్లుదెచ్చి తాగిచ్చే. ఇప్పుడు జూడు కొడుకు పెద్దోడయి ‘అవ్వా ఏం తిన్న’వని అడుగకపాయే. గింత ఛాయ్ అన్నా పొయ్యక పాయే’’ అంటూ రాజవ్వ పాత రోజుల్ని గుర్తు చేసుకుంది. కండ్ల పొంట నీళ్లు రాలినయి. మెత్త సగం నానింది. ‘‘ఏం చేస్తం.. ఇయ్యాల ఇంట్ల, రేపు మంట్లే. భగవంత.. నారాయణ.. వీని కొడుకులు వీన్ని గిట్లనే జెయ్యని’’ అనుకుంట కళ్లు మూసుకుంది రాజవ్వ.
    
కోట్లు సంపాదించిన రాజయ్య మాట ఇంట్లో నడుస్తలేదు. చేసేది లేక అవ్వను తీసుకపొమ్మని పెద్ద చెల్లెలికి ఫోన్ చేస్తున్నాడు.అప్పుడే జిమ్మి భౌభౌ మంటూ అరిచింది. అందరూ గేటు వైపు చూశారు. ఎవరూ రాలేదు కానీ జిమ్మి అదే పనిగా అరుస్తుంది. ‘‘అరేయ్.. జిమ్మిని బయటకు తీసుకుపోరా’’ అంటూ రమేశ్‌ను పురమాయించాడు రాజయ్య. జిమ్మి బోను తీయగానే గేటు ముందు ఆగి మూత్రం పోసింది. దొడ్డికి పోయింది. తరువాత భౌ మంటూ అరుస్తూ బోనులోకి వచ్చింది.
 
గేటు ముందున్న కుక్క దొడ్డిని పేపర్‌తో తీసి బయట మోరిలో వేసింది బాలవ్వ. కుక్కకు బిస్కట్లు వేశారు. కూలర్ పెట్టారు. పదిహేను రోజుల కిందట జిమ్మికి జ్వరం వస్తే బైక్‌పై కూర్చో బెట్టుకుని పాత బస్టాండు దగ్గర ఉండే వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. మందులు వాడారు. ఇంజక్షన్లు వేయిస్తూ, మంచి తిండి పెట్టారు. జిమ్మి జ్వరం తగ్గేదాకా ఇంట్లో ఎవరికీ మనసున పట్టలేదు. మూడు రోజుల్లో జిమ్మికి జ్వరం తగ్గింది. ‘‘మా జిమ్మికి జ్వరం వస్తే మేము నోట్లె మంచినీళ్లు పొయ్యలేదు వదినె. అదంటే మాకు పంచప్రాణం. ఒక్క రోజు మేం తినకున్నా సరే, దానికి మాత్రం వంట చేసి పెడుత’’ అని పక్కింటి సుగుణతో గొప్పగా చెప్పింది బాలవ్వ.అలాంటిది ఇప్పుడు సొంత అత్త ఇంట్లో జ్వరంతో బాధపడుతుంటే అటు బాలవ్వగానీ, ఇటు పిల్లలు గానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇంట్లో నుంచి ఆమె ఎప్పుడు పోతుందా అన్నట్టుగా కంటిచూపులతోనే రాజయ్యపై ప్రశ్నలు సంధిస్తున్నారు.
    
తెల్లారి వస్తనన్న పెద్దచెల్లె రాలేదు. ఇంట్ల భార్య పోరు పడలేక రాజయ్య  ఆటోను పిలిచాడు. అడ్రస్ చెప్పి, ముసలమ్మను ఆటోలో ఎక్కించి పెద్ద బిడ్డ ఇంటికి పంపాడు. ఆటో ముందుకు కదులుతున్న కొద్దీ రాజవ్వకు కన్నీళ్లు ఉబికివస్తున్నాయి. మానేరు వంతెన దాటుతుండగా ఆమె కడుపు చెరువైంది. మొఖానికి కొంగుపెట్టుకుని బోరుమంది. ‘‘ఏమైందమ్మా.. ఏడుత్తున్నవ్..’’ ఆటోను ఆపి అడిగాడు డ్రైవర్. ‘‘ఏం లేదు బిడ్డా. నేను అందరికి బరువైన. బతుకబుద్దయితలేదు.

నేను ఎవల కోసం బతుకాలే బిడ్డా’’ అంటూ కంటికేడు ధారలు ఏడ్చింది రాజవ్వ. ఏమీ కానీ జిమ్మి... మమ్మీకంటే ఎక్కువైంది. మనసున్న తల్లికి కన్నీరు దిక్కయింది. ముసలితనంలో ఉన్న కన్నవాళ్లెందరికో బతుకు సలుపుతున్న గాయం అయింది. నేను ఇంట్లోకి అడుగుపెడుతూ కిందికి చూశాను. బాలవ్వ, రమేశ్... జిమ్మికి షాంపూతో స్నానం చేయిస్తున్నారు.
 - వూరడి మల్లికార్జున్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement