
మతం లేని.. మమతల బంధం!
రాజవ్వను దత్తత తీసుకున్న షేక్ చాంద్
నిజామాబాద్, న్యూస్‌లైన్ : వికృత పోకడలు పోతున్న సమాజంలో మానవీయ విలువలు, బంధాలు ఇంకా పదిలంగానే ఉన్నాయని చాటి చెప్పిన గొప్ప సందర్భం ఇది. నిజామాబాద్‌లోని చంద్రశేఖర్ కాలనీకి చెందిన షేక్ చాంద్ కొడుకు షేక్ జావిద్ (8) కాలేయ వ్యాధితో బాధపడుతుండగా చలించిపోయిన అదే కాలనీకి చెందిన 70 ఏళ్ల రాజవ్వ తాను అంత్యక్రియల కోసం దాచుకున్న రూ.10 వేలు వారికిచ్చి మతం కన్నా.. మానవత్వమే మిన్న అని చాటింది. దీనిపై ‘అవ్వ మనసు బంగారం’ శీర్షికన ‘సాక్షి’లో అక్టోబర్ 27న ఓ కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. అయితే, సాయం పొందిన షేక్ చాంద్ ఆ అనాథ అవ్వకు అండగా నిలిచి కొడుకయ్యాడు. నా అనే వారెవరూ లేని ఆ పండుటాకుకు తానే అన్నీ అయి అండగా ఉంటానని గురువారం దత్తత తీసుకొని, రుణం తీర్చుకున్నాడు.
తాను పుట్టిన నెల రోజులకే తల్లి చనిపోయిందనీ, చిన్నతనంలోనే తండ్రి కూడా మరణించాడని చాంద్ చెప్పాడు. కూలీనాలీ చేసుకునైనా సరే.. బతికినంతకాలం తల్లిలా చూసుకుంటానని మసీదు ఎదుట ప్రమాణం చేసి రాజవ్వను తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. కులం, మతంతో తమకు సంబంధం లేదని, ఆపదలో ఆదుకున్నవారే తమ ఆత్మీయులంటున్న చాంద్‌ను అందరూ అభినందించారు. కాగా, హిందూ మతానికి చెందిన రాజవ్వను తల్లిగా స్వీకరించినందుకు ఇక నుంచి తాను కూడా తన మతంతోపాటు, హిందూ సంప్రదాయాన్ని పాటిస్తానని షేక్ చాంద్ చెప్పారు. ‘నా కొడుకు చికిత్స కోసం ఎంతోమంది నుంచి సహాయాన్ని అర్థించాను. అవ్వ మాత్రం సాయం చేసింది. ‘అవ్వ మనసు అంత బంగారమైతే, వయసులో ఉండి సహాయం పొందిన నేను పెద్ద మనుసుతో అవ్వను తల్లిగా స్వీకరించాలని మనసారా నిర్ణయించుకున్నాను’ అని ఆర్ధ్రత నిండిన కళ్లతో పేర్కొన్నారు షేక్ చాంద్.