తిరుపతికొండ మెట్టు | Story Written By Adavi Bapiraju In Sakshi Funday | Sakshi
Sakshi News home page

తిరుపతికొండ మెట్టు

Published Sun, Sep 8 2019 9:28 AM | Last Updated on Sun, Sep 8 2019 9:29 AM

Story Written By Adavi Bapiraju In Sakshi Funday

శ్రీ తిరుమల మహాపుణ్యక్షేత్రంలో గాలిగోపురానికి పోయే మొదటిమెట్ల వరసలో సగము దాటిన పైన ఏకాకి, కుంటి బిచ్చగాడు పున్నెడి నివాసం. ఏ బిచ్చగాళ్ళ రుషి కులానికి చెందకుండా పున్నెడు ఆశ్రయం ఏర్పరుచుకున్నాడు. 
రెండు కాళ్ళూ మొండే. కానీ వాడికున్న బలం విపరీతం.
వాడు చేసే దొమ్మరి విద్యల సాహసం ఏ ఇసాకో గ్రాండ్‌ రషియన్‌ సర్కసు జట్టులో ఉండే పరమ సాహసికిన్నీ లేదు.
చేతులతో మెట్టెక్కుతాడు.
కోతిలా కొమ్మ నుంచి కొమ్మకు ఎగిరి ఛంగున పోతాడు.
వేలాడుతూ చక్రంలా గిరగిర తిరుగుతాడు.

దేహమంతా వాలఖిల్య మునిలా పైకెత్తి వేళ్ళ మీద తలక్రిందులా నిలబడి నడుస్తాడు.
మెట్టు మీద నుంచి పై మెట్టుకి బంతిలా ఎగురుతాడు.
ఒంటి చేతి మీద నిలుస్తూ, చేతుల్లోంచి దేహమంతా దూరుస్తూ చూపించే విచిత్రపు ఆసనాలా, మొగ్గలా ముందర హఠయోగి విరూపానందస్వామి యోగవిద్య గాని, జపాను మాంత్రికుడు మసుకాకో కనబరచే ‘ఫీట్లు’గాని, నూరు వోల్టుల ఎలక్ట్రిక్‌ దీపం ముందర పడకగది దీపంబుడ్డిలా  తెలతెలపోవాలసినదే!
యాత్రికుల తండాల మేఘాలు పున్నెడు ముందర ఆగి, అతని అద్భుత చర్యలను చూసి విస్తుపోయి దమ్మిడీలు, కాసులు, అణాల వర్షం కురిపిస్తే, రాత్రి తొమ్మిది అయ్యేటప్పటికి అయిదూ, ఆరు రూపాయల చిల్లర చెరువులు కడుతుంది.

ఏ బ్రహ్మోత్సవమో అయితే పది పదిహేను రూపాయలు పోగుచేశాడన్నమాటే. తిరుపతి కొండల ఎక్కు దిగుడుల ఏడు మైళ్ళలో ఉన్న మూడువందల ఏబదియారు బిచ్చగాళ్ళలో పున్నెడికి వచ్చే రాబడి ఇంక ఎవరికీ లేదు.
వికలాంగులు ఉన్నారు. ముక్కునోరు అంతా ఏకరంధ్రమైనవారు, కుష్టురోగులు, మాంత్రికులు, సన్యాసులు, ముళ్ళ మీద  హంసతూలికా తల్పం మీదలా పడుకునే యోగీశ్వరులు, గుడ్డివారు, కోకిలకంఠంతో పాడే గాయకుడు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, బిడ్డలు, భయం కలుగచేసేవి, కళాసౌందర్యం వెల్లి విరియజేసేవి విగ్రహాలను ముందుంచుకొని పూజారిపని చేసేవారు ఎన్ని రకాలున్నారో తిరుమలేశ్వరుని కొలువు చేసే అయ్యంగార్లు, అయ్యరులు, అయ్యలు, రెడ్లు, మొదలియారులు, సెట్లతో పాటు, కోతులతో పాటు, ఈ బిచ్చకుల బృందాలు!
ఈ విచిత్ర ప్రపంచంలో  ఉన్న బిచ్చగాళ్ళంతా పున్నెణ్ణి చూసి అసహ్యించుకునేవారు.

పున్నెడు ముష్టివాళ్ళందరికీ విరోధి అయిపోయినాడు. వాడి సంపాదన వాళ్ళ కడుపు మండజేసింది. వాడికి ఉడుకుబోతుతనం కాశ్మీర దేశాన్ని సహారా ఎడారి చేయగల శక్తితో విజృంభించింది. ధర్మప్రవాహాలు వాడి దగ్గర  ఆనకట్టలా కట్టబడి నిర్జల వాహినులు కొండంతా ప్రవహిస్తున్నవి. 
పున్నెణ్ణి త్వరగా కొండ మీద నుంచి జపాను వారు చీనాను తరిమినట్లుగా నెట్టివేయవలెనని బిచ్చగాళ్ళ సంఘంలో సంచలనం కలిగింది. వారిలో ఏ కబురున్నూ తీగలేని వార్తలా నిమిషంలో ఆ కొండలోయల మోకాళ్ళ పర్వతం చుక్కల పర్వతం ఏడుమైళ్ళూ వ్యాపిస్తుంది.

పున్నెణ్ణి శ్రీ వేంకటేశ్వర సన్నిహిత భక్త బృందంలోంచి రెండువేల మైళ్ళన్నా విసిరివేసేటందుకు ఒక మాఘ శుద్ధ ఏకాదశినాడు బిచ్చకుల ఆశ్రమాలన్నీ తీర్మానించుకున్నవి.
ఆ తీర్మానం ప్రకారం బిచ్చగాళ్ళకు అన్నం, సాంబరు అమ్మేవాళ్ళు అమ్మడం మానేశారు. నీరు తెచ్చేవాళ్ళు నీరు తేవడం మానివేశారు. సరుకులు ఏడుమైళ్ళ దారి పొడుగున్నా విక్రయించేవాళ్ళు విక్రయించడం మానివేశారు.

పున్నెడు మొదట వేళాకోళం అనుకున్నాడు.
క్రింద ఆశ్రమంలో ఉన్న దిగుడు బావిలో నుంచి నీళ్ళు పై ఆశ్రమాల వాళ్ళకి విడి బిచ్చగాళ్ళకి అమ్మే నీళ్ళ మనిషి పున్నెణ్ని వెక్కిరించి, ‘‘నీళ్ళు నీళ్ళు’’ అని పున్నెడు గోల పెడుతున్నా నడుం ఆడించుకుంటూ వెళ్ళిపోయింది. 
పున్నెడికి కళ్ళు పచ్చబడ్డాయి.
చెట్టునీడనే కూలబడి తల మొండి కాళ్ళ మీద ఆన్చి ఉన్నాడు. ఆలోచనలో మునిగిపోయాడు. తన జీవితమంతా ఒక్కసారిగా ఫిల్ము తిరిగినట్లు పొడచూపింది.
పున్నెడు అనంతపురం జిల్లాలోని ఒక గ్రామంలో నివసించే అభిమానవంతులైన ఒక రెడ్డి కులంలో పుట్టాడు. ఆ ఊరి రెడ్డి వారికి పక్క గ్రామం రెడ్డివారికి ఒక గ్రామం విషయమై తగాదా వచ్చి కురుపాండవ యుద్ధమైపోయింది.

అప్పుడు పున్నెడి పేరు పుణ్యంరెడ్డి.
పుణ్యంరెడ్డి తండ్రీ, ముగ్గురు అన్నదమ్ములు వీరస్వర్గం అలంకరించారు.
పుణ్యంరెడ్డి కాళ్ళు రెండూ విరిగినాయి. ఆస్పత్రిలో రెండు కాళ్ళూ ఛేదించి మొండిజగ్గణ్ణి చేసినారు.
కుటుంబం యావత్తు నశించి, వ్యాజ్యాలలో ఆస్తీ మాయమైంది.
కతిపయ ప్రయాణాలు చేసి రెండేళ్ళకు వెంకటాచల సోపాన పంక్తి రెండవ శేషాచలపతిలా అవతరించినాడు పుణ్యంరెడ్డి. ఇంక రెండేళ్ళలో పున్నెడయ్యాడు రెడ్డి.
పూర్వ చరిత్రలన్నీ మాయమై పున్నెడి కళ్ళ రెండు చుక్కలు రాలినవి. అతని గొంతుక ఎండినది. ఆకలితో మాడినాడు. కొండ మీద దుకాణాలకు సరుకు అందుబాటు చేసే వర్తకులు వచ్చినప్పుడు పున్నెడు కొంత డబ్బు వారికి  ఇచ్చి సాయంత్రానికి వంట సామాగ్రి తెప్పించుకున్నాడు.

డోలీల వాళ్ళకు ఒక అర్ధణా చేతిలో వేసి కుండెడు నీళ్ళు తెప్పించుకున్నాడు. ఆ సరుకుతో ఆ నీటితో మూడురోజులు గడిపినాడు.
నాలుగోరోజు తెల్లవారగట్ల మూడింటికే  లేచి ముష్టికి తయారైనాడు. తెల్లవారే వరకూ ఒక రూపాయిన్నర మూడు దమ్మిడీలు ప్రోగయినవి.
కొండ మీద దుకాణాలకు సరఫరాదారుడు కందసామి వంట సామాగ్రి తెచ్చి ఇచ్చే సమయమైందని కొండపైకి దిగువకు చూసి ఆ ›పక్కనే నాలుగు బారల దూరంలో తాను నిద్రపోవడానికి ఏర్పర్చుకున్న పొద కడకు పోయి ఒక పెద్దరాయి తీసి చూసినాడు.
అతడి కళ్ళు తిరిగి ‘అమ్మయో’ అని వెనక్కు వాలిపోయినాడు.
ఆ రాతి క్రింద పున్నడు దాచుకున్న అయిదువందల డెబ్బై అయిదు రూపాయల మూట మాయమైపోయింది.
పున్నెడి ప్రాణం మరిగిపోయింది.

రాతి మీద నుంచి కిందకు కూలబడిపోయాడు. కొంతసేపటికి అతనికి ముఖం జేవురించింది. ఈ పని చేసినది మామూలుగా బిచ్చగాళ్ళతో వర్తకం చేసే కుప్పుస్వామి పని అని అనుమానం తట్టింది.
వట్రువలు తిరిగి కండలు కట్టి, హునుమంతుని హస్తాల వంటి బలమైన అతనికి చేతులు భయంకరంగా వంకరలు తిరిగినవి. ఆ సమయంలో అతని చేతులకందిన ప్రాణి కబంధుని వాత బడినట్లే.
ఆరోజు దొరికిన డబ్బునిచ్చి వంటసామాగ్రి కొనుక్కున్నాడు పున్నెడు. 
ధనంతో పాటు అతని బలమూ నశించింది, జీవితేచ్ఛా పోయినది. ప్రపంచంలో యుద్ధక్రమంగా సంసారయాత్ర చేసే  ఆశ అడుగంటింది.
తన చర్యలు చూపించి ముష్టి ఎత్తడం మానివేసినాడు. డబ్బు లేకపోతే తిండి తిప్పలు పోయినవి. అయిదు రోజులయ్యేసరికి పున్నెడు అస్థిపంజరమై పోయాడు.
పున్నెడి దురదృష్టం వెంకటాచలాన రాళ్ళలా ఆశ్రయించి ఉన్న వర్తకులు మొదలగు యావన్మందికీ తెలిసిపోయింది.

శేషాచల బిచ్చకుల లోకానికంతా సంతోషమైనది. వదులుతాడురా పిశాచి అనుకున్నారు. అందరికీ ఇక కొంచెమో గొప్పో దొరుకుతుంది. ఇదివరకు పున్నెడున్నంత కాలము అదృష్టదేవత అతన్నే ఆవహించింది. ఇప్పటి నుంచి కొండమెట్ల దారి ఏడుమైళ్ళు కిందికీ పైకీ ఆమె తిరుగుతూ ఉంటుంది. 
మళ్ళీ మంచి దినాలు వచ్చినవి అనుకున్నారు.
నీరసించి పోయిన పున్నెడు ఆరో దినం రాత్రి స్పృహ తెచ్చుకొని  కొండ మీద నుంచి పక్కనున్న లోయలోనికి ఉరికి వెంకటేశపాద సన్నిధి చేరుదామనుకున్నాడు.
చేతులతో పాకి ఆరడుగుల దూరంలో ఉన్న ఎత్తుబండల మీదికి పోయినాడు.
‘‘గోవిందా! వెంకటరమణా, గోవిందా’’ అని ఉరకబోయినాడు.
కాని చల్లనిచేయి అతని చేతిని పట్టి వెనుక్కు లాగి వేసింది.

కళ్ళు మూసుకున్న పున్నెడు శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్షమైనాడనుకున్నాడు. అతని దేహము పులకరించింది. చల్లని గాలులు ప్రసరించినట్లయింది. వెన్నెలలు పిండి ఆరగా కాచినట్లయింది. అతడు కళ్ళు తెరిచేటప్పటికీ  ఎట్ట ఎదుట ఆ చుట్టుప్రక్కల బిచ్చగాళ్ళ ఆశ్రమాలకి నీళ్ళు పోసే బోయపిల్ల కనబడింది.
ఆమె తీరైన నల్లని ముఖమంతా నక్షత్రాల వెలుగులో కాంతిలో కళ్ళ నీళ్ళు మెరుస్తూ కనిపించింది. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ ‘‘పున్నెడు, నాను బహు పాపిని! నిండా దోసం చేసినా, ఆరుమాసాల క్రింద రోగం వచ్చి దుడ్డు లేక సబ్బరపడినప్పుడు సత్తు రూపాయి రహస్యంగా పంపిన నీ చల్లని గుండే నాను తలుచుకున్నా!
చచ్చిన శుక్లపర్వతం కుష్టు ముసలి దానికి నువ్వు చేసిన చాకిరి దా నా ఒడంబు తిప్పినది. ఓ సామి నీవు దేవుండు!
నీకు వీండ్లు పిశాచిలు, నిండా ద్రోగం తలపోసినారే!

నాను కూడా సరిదా అంటిని! ఓయ్‌! ఓయ్‌! నాను నరరక్కసి! నాకు పదునాలో కుంపిని నరకం!’’ అని అతి దీనంగా పొర్లి పొర్లి వచ్చే ఏడుపును  ఆపకుండా ఏడ్చింది.
‘‘పిల్లా, నాకు కల్గిన ఈ సెబ్బరకు నానుదా దుఃఖం పొందేది లేదు. నిండా ఇంతకు మించి కష్టాలు తీరినై ఈ పాణికి. కాని అతి మెత్తని నీకుదా ఏడ ఈ గెట్టిమణసు అని విచారింసినా! మొన్న నీ కళ్ళు మేఘాల రాత్రిలా ఉండినైదా. ఇంగ పెపంచికంలో మంచీ, పున్నెం లేదని తోసినదే. ఏల ఈ పాణి బతికేది! అంతదా!’’

‘‘ఓ సామి, నన్ను చెమించు! నాను రక్కసిని దా సెప్పుంటినే! నీ సొమ్మూ దుడ్డు ఏడ దాచేది నాకు దా తెలుసునే! వాండ్ల మాయలో చేరి వాండ్ల చెప్పినా! ఆ పాపి కుప్పుసామిదా తీసిండు అయ్యో!’’
పున్నెడి ముఖం నవ్వింది.
అతని హృదయం వెన్నెల్లు కాసింది.

‘‘పోయేలే! ఈ పాణికి ఈ చేతులిచ్చిన వెంకటసామి చల్లగా, పది అయిదు నూలు సంపాదించలేనా! నువ్వు నా దగ్గిరుండేది అంతదా!’’ అని ఆమెను తన చేతుల్లోకి తీసుకుని తల ముద్దు పెట్టుకున్నాడు.
మంగి తాను తెచ్చిన కూడు పున్నెడికి నెమ్మదిగా తినిపించింది.
చుక్కలు నవ్వినవి.
తమవైపు తిరిగి మోకరించిన ఆ నూతన స్త్రీ పురుషుల తలపై సేవలు చల్లినవి మంచుబిందువులు. శ్రీ వెంకటపతి తాను సలిపిన పెండ్లిళ్ళ కన్న ఇది మించినదనుకున్నాడా!

-అడివి బాపిరాజు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement