ఆ నగరానికి ఏమయ్యింది? | Strasbourg Cathedral millennium | Sakshi
Sakshi News home page

ఆ నగరానికి ఏమయ్యింది?

Published Sun, Jun 28 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM

ఆ నగరానికి ఏమయ్యింది?

ఆ నగరానికి ఏమయ్యింది?

మిస్టరీ
ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్... 1518వ సంవత్సరంలో ఓ వేసవి.... ఉదయం పదిన్నర కావస్తోంది. మగవాళ్లు పనులకు పయనమయ్యారు. మహిళలు ఇంటి పనుల్లో తల మునకలై ఉన్నారు. బడికి సెలవులు కావడంతో పిల్లలు వీధుల్లో చేరి ఆటలాడుతున్నారు. అంతలో ఓ పిల్లాడు ‘అమ్మా’ అంటూ గట్టిగా అరిచాడు. ఆ అరుపు వీధి అంతా ప్రతిధ్వనించింది. ఆ పిల్లాడి తల్లి చెవులనూ సోకింది. వెంటనే ఆ తల్లి గబగబా బయటకు వచ్చింది.

శిలలా నిలబడిపోయిన పిల్లాడి దగ్గరకు పరుగు తీసింది. ‘‘ఏంటి నాన్నా... ఏమైంది? ఎందుకలా అరిచావ్?’’ అంది కంగారుగా. ఆ బాబు మాట్లాడలేదు. అటు చూడు అన్నట్టుగా తన కుడిచేతిని చాచాడు. వెంటనే తల్లి అటువైపు చూసింది. ఆశ్చర్యంతో ఆమె కనుబొమలు ముడిపడ్డాయి. ఓ స్త్రీ... నలభయ్యేళ్ల పైనే ఉంటాయేమో... వీధిలో పిచ్చిపిచ్చిగా పరుగులు తీస్తోంది. మధ్యమధ్యన ఆగి డ్యాన్స్ చేస్తోంది. మాసిన బట్టలు, చింపిరి జుత్తు... చూడ్డానికి కాస్త భయంకరంగానే ఉంది. ఆమెను చూసి పిల్లలు హడలిపోతున్నారు. పరిగెత్తుకుపోయి అమ్మల మాటున దాగుతున్నారు.
 
ఆమె ఎవరో అక్కడ ఎవరికీ తెలియదు. దాంతో ఎవరో పిచ్చిదై ఉంటుంది అనుకున్నారు. ఎవరి మానాన వాళ్లు వెళ్లిపోదామనుకున్నారు. కానీ కాళ్లకు బ్రేకులు వేసినట్టుగా ఠక్కున ఆగిపోయారు. ఎందుకంటే ఉన్నట్టుండి ఓ వ్యక్తి దూసుకొచ్చాడు. ఆ మహిళతో కలసి తాను కూడా పిచ్చిగా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఇంకొకరు... ఆపైన మరొకరు... ఒకరి తర్వాత ఒకరుగా వస్తూనే ఉన్నారు. ఒళ్లు మరిచి నృత్యం చేస్తున్నారు.
 
ఆ ఒక్క వీధిలోనే కాదు. ఆ ప్రాంతం మొత్తంలో ఇదే పరిస్థితి. వీధుల్లో ఎక్కడ చూసినా పిచ్చి పట్టినవారిలా డ్యాన్స్ చేస్తున్నవారే. వారు కాసేపు చేసి ఆగిపోలేదు. మూడు రోజులు... నాలుగు రోజులు... ఆరు రోజులు... అలా చేస్తూనే ఉన్నారు. తిండీ తిప్పలూ లేకుండా రోడ్లమీద చిందులు వేస్తూనే ఉన్నారు. చివరికి సత్తువ అంతా అయిపోయి కూలబడిపోయారు. పడినవాళ్లు మళ్లీ లేవలేదు. అలాగే ప్రాణాలు వదిలేశారు.
 
వారం రోజుల పాటు సాగిన ఈ ఘోరకలి ఫ్రాన్స్ మొత్తాన్నీ వణికించింది. అసలేం జరిగిందో, వాళ్లంతా అలా ఎందుకు ప్రవర్తించారో, ఎందుకు ప్రాణాలు కోల్పోయారో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడే కాదు... ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు. వ్యాధి ఫలితమా? ఆత్మల శాపమా? అప్పట్లో ఫ్రాన్స్‌లో తీవ్రమైన కరువు వచ్చింది. దాని బారిన పడి అల్లాడిన కొందరు మానసికంగా దెబ్బతిన్నారని, అందుకే అలా ప్రవర్తించారని కొందరు వివరణ ఇచ్చారు.

నాలుగువందల మందిని బలి తీసుకున్న  అలాంటి దారుణం జరక్కుండా పూజలు, హోమాలు, ప్రార్థనలు చేశారు మతపెద్దలు. అదేమీ నిజం కాదు, ఏదో అంతుపట్టని వ్యాధి వచ్చిందన్నారు వైద్యులు. కాదు కాదు, పితరుల ఆత్మలేవో శపించి ఉంటాయన్నారు ఛాందసులు. వైద్య నిపుణుల్ని రంగంలోకి దించింది ప్రభుత్వం. వాళ్లు ఆ పరిస్థితికి డ్యాన్సింగ్ ప్లేగ్ అని పేరు పెట్టారు. రోజులు, వారాలు, సంవత్సరాల తరబడి పరిశోధనలు చేశారు. కానీ కారణాన్ని మాత్రం కనుక్కోలేకపోయారు. నేటికీ ఆ ర హస్యాన్ని ఛేదించినవాళ్లు లేరు. అందుకే డ్యాన్సింగ్ ప్లేగ్ చరిత్రలో ఓ మిస్టరీగా మిగిలిపోయింది.
 
 
డ్యాన్సింగ్ ప్లేగ్ గురించి జాన్ వాలర్ అనే చరిత్రకారుడు ఎంతో పరిశోధించాడు. తన అనుభవాలన్నింటినీ రంగరించి ‘ఎ టైమ్ టు డ్యాన్స్, ఎ టైమ్ టు డై’ అనే పుస్తకాన్ని  రచించాడు. ఆయన అందులో నాటి పరిస్థితిని స్పష్టంగా వివరించాడు. చాలా పరిశోధనలకు ఈ పుస్తకం ఆధారమయ్యింది. కానీ మిస్టరీ మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement