సారాంశం | Summary | Sakshi
Sakshi News home page

సారాంశం

Published Sun, May 1 2016 4:37 AM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM

సారాంశం

సారాంశం

రెండవ బహుమతి పొందిన కథ
అర్థం కావు. చాలా విషయాలు అర్థం కావు. మనిషికి కన్నీళ్లు అర్థం కావు. దుఃఖం అర్థం కాదు. చుట్టూ ఉన్న సమాజం అర్థం కాదు. మనుషులు అర్థం కారు. ప్రకృతి అర్థం కాదు. వర్షం ఎందుకు కురుస్తుందో... తుఫాన్లు ఎందుకొస్తాయో... రవ్వంత అగ్ని ఎక్కడో ఒక బిందువుగా పుట్టి అరణ్యాలకు అరణ్యాలనే ఎందుకు దహిస్తుందో అర్థం కాదు. తను చిన్నగా... పదేళ్ల వయస్సులో ఒళ్లో కూర్చుండబెట్టుకుని నాన్న ఆప్యాయంగా తల నిమిరినప్పుడు... బడికి వెళ్లొస్తుంటే చిటపట చినుకులు ఒంటిపై కురుస్తున్నప్పుడు... ఊరికే అలా ఖాళీ ఆకాశంలోకి చూస్తూ గంటలకు గంటలు కూర్చున్నప్పుడు... పిడికెడు గుండెలో పొంగిన ఆనంద మహాసముద్రాలు అర్థమయ్యాయా?
 
ఉహు... అస్సలేం అర్థం కాలేదు. వర్తమానంలోకి దూసుకొస్తున్నకొద్దీ గతం అర్థం కాలేదు. గతంలో నుండి భవిష్యత్తును అంచనా వేసుకోవాలంటే వర్తమానమూ అర్థం కావడం లేదు.
 నలభై అయిదేండ్ల అచల పొద్దుటి నుండి కారణాలను వెదికేందుకు ప్రయత్నిస్తోంది.
 భర్త. తనకూ ఆయనకూ నడుమ ఒక సముద్రమంత అంతరం. కారణం ఏమిటి?
 అభిరుచుల తేడా... వ్యక్తిత్వాల తేడా... తత్వాల తేడా. యినుము ఇత్తడితో అతకదు. కారణం ఏమిటి?
 
ఇక పిల్లలు. రెక్కలొచ్చి... ఎగిరి... ఆకాశం విశాలం... బతుకులు విశాలం... ఎవరి దారి వారిది. ఎవరి జీవితం వారిది. కుటుంబం, సమూహం... విచ్ఛిన్నమై... ఎవరికి వారే ఒంటరి. కారణం ఏమిటి?
 పైకి ఒక ఇల్లు. లోపల... మనుషులు ఎవరి అరలో వాళ్లు. మధ్యలో అభేద్యమైన గోడలు.
 బైటికెళ్తే... పెద్ద ప్రపంచంలో ఒక చిన్న తను. లోపలికొస్తే ఒక చిన్న తనలోనే ఒక పెద్ద ప్రపంచం.
 నిరంతరం... అంతరాగ్నితో ఘర్షించే ప్రపంచం.
 ‘కి... కి.. కిచ్...’ చప్పుడు.
 
ఉలిక్కిపడింది అచల. జ్ఞాపకాల తుఫానులో నుండి తెప్పరిల్లి కిందికి చూచింది.
 హాల్లో తను కూర్చున్న కుర్చీ ప్రక్కన... నేలమీద... చిన్న కోడిపిల్ల.
 పదిహేను రోజుల వయసున్న కోడిపిల్ల. నల్లనిది. అందమైంది. చురుకైంది. ప్రేమ గలది.
 తనవైపే చూస్తోంది. మిలమిల్లాడే చిన్న కళ్లతో... నిశ్శబ్దంగా, దీనంగా కూడా.
 కళ్లు చిన్నవే. చీమవి. పక్షివి. పామువి. ఏనుగువి. కాని చూపు మాత్రం చిన్నది కాదు.
 
చూపు నిశితమైంది. చూపు తీక్షణమైంది. చూపు సూటిగా హృదయాన్ని తాకేది. చూపు నిండా కరుణ, దయ, వాత్సల్యాన్ని నింపుకునేది.
 అచల కాళ్లపై రైటింగ్ ప్యాడ్ పెట్టుకుని రాసుకుంటున్నప్పుడల్లా రాయడం ఆపి... కోడిపిల్ల దిక్కు మరింత పరిశీలనగా చూచింది.
 కొద్ది దూరంలో ఒక అరగంట క్రితం తను దానికోసం నేలపై పోసిన పిడికెడు బియ్యపు గింజలు, చిన్న సత్తుగిన్నెలో పోసిపెట్టిన నీళ్లు. అలాగే ఉన్నాయి. వాటిని విడిచి, వచ్చి తన ముందర అలా నిలబడి... తన వైపే చూస్తూ.
 
దానికి తన ఆహారంపైనా, ఆకలి దప్పులపైనా ధ్యాస లేదు. తనపై... మనిషిపై... ఏదో అజ్ఞాతంగా అల్లుకుంటున్న మమకారం పైననే మక్కువ.
 దాన్ని ప్రేమ అంటారా? బంధం అంటారా? ఋణం అంటారా? ప్చ్... ఏమో!
 అచల మనసులో పదిహేను రోజుల కిందటి ఘటన కళ్లముందు కదిలింది.
 ఉదయం ఆరు గంటలు కూడా కాలేదు. ఆ రోజు ఒకటే వర్షం. మూడు రోజులుగా ఒకటే ముసురు.
 
లేచి కళ్లు నులుముకుంటూ ఇంటి వెనక ఉన్న నీళ్లగది దిక్కు నడుస్తూంటే... పక్కనే రేకుల షెడ్డు కింద పారేసిన పాత సామాన్ల కుప్పలో నుండి ఏదో శబ్దం వినబడింది అచలకు.
 దగ్గరికెళ్లి చూస్తే... విరిగిన కుర్చీల పక్కనున్న దళసరి అట్టపెట్టెలో ఒద్దికగా కూర్చుని ఒక కోడిపెట్ట కొక్కుబట్టి ఉంది. మత్తుగా... బద్ధకంగా... గురగురలాడ్తూ... ఒంటి పైనున్న ఈకలను రిక్కిస్తూ.
 దగ్గరగా వెళ్లినా... అది కదిలి... భయపడి పారిపోలేదు. సరికదా ఇంకా ముడుచుకుని కడుపు కింద ఏదో దాచుకున్నట్టు సర్దుకుని కూర్చుంది.
 
చేతితో తట్టి... లేబట్టి చూచింది తను. దాని కడుపు కింద ఐదారు గుడ్లు. వాటిపైన కూర్చుంది... వెచ్చగా.
 అంటే... యిది గుడ్లను పొదుగుతున్నట్టా? ఎప్పట్నుండి పొదుగుతోంది? అసలీ కోడి ఎక్కడిది? ఎవరిది? ఎలా వచ్చింది తమ యింటికి?
  ఊరి బయట... కొత్తగా ఏర్పడ్తున్న కాలనీలో... ఈ మధ్యనే కట్టుకున్న ఇల్లు తమది. అక్కడో ఇల్లు యిక్కడో ఇల్లు. కోళ్లు... కుక్కలు... ఎవరికెవరివో ఎక్కడెక్కడో తిరుగుతూండడం మామూలే.
 
కోడిపెట్ట భయం భయంగా... బెరుకుగా కూర్చుంది. అచల వైపు ఎంతో ప్రాధేయ పూర్వకంగా చూచింది... ‘ప్లీజ్... డిస్టర్‌‌బ చేయకు’ అన్నట్లు.
 అచల దాన్నక్కడే... అలాగే విడిచిపెట్టి... వాకిట్లోకి వచ్చి... బాత్‌రూమ్‌కు వెళ్లింది.
 కాని... ఆమెకు తెలియకుండానే ఆమె మనసు ఆ కోడిపెట్ట అట్టపెట్టెలో చిక్కుకు పోయింది. అప్పట్నుంచీ గంట రెండు గంటలకొకసారి అటు వెళ్లి... కోడిపెట్టను డిస్టర్‌‌బ చేయకుండానే గమనించేది. ఎన్ని రోజులైందో.. కోడిపెట్ట గుడ్లను పొదుగుతూ.
 
మర్నాడు ఉదయం లేవగానే ఉత్సుకతలో నిశ్శబ్దంగా వెళ్లి గమనిస్తే... చిన్న కోడిపిల్లల కిచకిచల చప్పుడు వినిపించింది.
 ఆశ్చర్యం! ధైర్యంగా కోడిపెట్టను చేత్తో పట్టుకుని పెకైత్తి చూస్తే నాల్గు పిల్లలు ఉన్నాయి. రెండు నల్లవి. ఒకటి గవ్వలది. ఒకటి బూడిద రంగు. అన్నీ ముద్దొస్తున్నాయి.
 అప్పుడూ వర్షమే.
 జాగ్రత్తగా తల్లి కోడినీ... నాల్గు పిల్లలనూ... ఇంట్లోకి తెచ్చింది. హాలులోకి తెచ్చి... బియ్యపు గింజలేసి... నీళ్లు పెట్టింది.
 ఒక కొత్త సందడి. ఐదు జీవులు. ఇంట్లో ఉన్న రెండు మానవ జీవాలకు అదనంగా.

 తామిద్దరు. భార్య, భర్త మాటలు ఉండని... హృదయాలు కలవని... సంబంధాలు లేని... లోకం దృష్టిలో ఏకస్తులే ఐనా ఒకరికొకరు ఏమీ కాని పూర్తి పరస్పర పరాయి మనుషులు.
 యిప్పుడు... ఈ ఐదు ప్రాణాలు.
 కొక్కొక్కొకో... కిచ్ కిచ్ కిచ్... ఇల్లంతా కోడిపిల్లలు, తల్లికోడి తిరుగుడు. సందడి. అటు ఇటు నడకలు... పరుగులు. చిన్న చిన్న రెక్కలు... తోక... సూది మొనలా ముక్కులు... చిన్ని చిన్ని కాళ్లు... ఎంత ముద్దో.
 భగవత్ సృష్టిలో జీవి ఏదైనా... దేని అందం దానిదే. దేని ఆకర్షణ దానిదే. చీమైనా... కోడిపిల్లయినా... ఖడ్గ మృగమైనా... శిశు సింహమైనా!
 
ఒకరోజు... రెండు రోజులు...
 అచల దాదాపు బైటికి పోవడం మానేసింది. తల్లికోడి... పిల్లలు... అవే తన లోకమై పోయాయి.
 పాలవాడు... పేపర్‌వాడు... పనిమనిషి లచ్చమ్మ... అందరూ... ఆసక్తిగా వాటిని గమనించి... ఉచిత సలహాలు ఇస్తున్నారు. ‘ఊర్కే యింట్లోనే ఉంటే ఎలాగమ్మా. బైటి గాలి తగలాలి గదా. అలా ఇంటెనక పెరట్లోకి తీసుకెళ్లండి. కాని జాగ్రత్తమ్మో. పిల్లి.. గ్రద్ద...’ ఇలా.
 
అచల రెండ్రోజుల తర్వాత... కోడిపెట్టనూ, పిల్లలనూ, జాగ్రత్తగా యింటి వెనుక పెరట్లో వదిలి... ప్రక్కనే ఓ కుర్చీ వేసుకుని, చేతిలో ఓ పొడుగాటి కర్ర పట్టుకుని వాటికి కాపలాగా కూర్చుంది.
 అచల పేపర్ చదువుకుంటూ... చుట్టూ అటూ ఇటూ తిరుగుతూ... పైకి ఆకాశంలోని గ్రద్దల దిక్కూ... యింటి ఫెన్సింగ్ వైపు పిల్లి జాడ దిక్కూ... చూస్త.
 ఐదవరోజు... దాహమేస్తే అచల వంటగదిలో కొచ్చి... మంచినీళ్లు తాగుతుండగా. బయట పెరట్లో గోల గోల వినబడింది. కోడి కొట్టుకుంటున్నట్టు... ఏదో పెనుగులాడు తున్నట్టు గలాటా... చప్పుడు... ఏదో దాడి.
 
తీరా ఒక్క అంగలో పరిగెత్తి చూస్తే... పెద్ద మగ ఊరకుక్క. ఎదురింటి ఇక్బాల్ వాళ్లది. తల్లి కోడిని నోట్లో కరుచుకుని... ఒకటే పరుగు.
 పాపం... కోడిపిల్లలు... నాల్గు... పరుగెత్తుకొచ్చినై యింట్లోకి భయంతో... వచ్చి నక్కి నక్కి దాక్కున్నాయి.
 వాటిని దగ్గరికి తీసుకుంది అచల. దోసిట్లోకి తీసుకుని ఎంతో ప్రేమగా నిమిరింది. నీళ్లు తాగించింది.
 ఎందుకో అచలకు దుఃఖం, బాధ... విలవిల్లాడ్తూ... కడుపులో ఎవరో దేవుతున్నట్టు.
 
మర్నాడు పెరటి దిక్కు దర్వాజకు... ఓ యినుప జాలీ అడ్డం పెట్టింది. పిల్లలు యింట్లోనే... మంచిగానే... సందడి సందడిగా అటూ ఇటూ ఎంతో హుషారుగా తిరుగుతున్నాయి.
 పదవరోజు... పదురుకున్నట్టు... రెండు గండు పిల్లులు వచ్చాయి. వరుసగా ఒకదాని వెంట ఒకటి... వీధి దర్వాజాలో నుండి విడిచిన బాణంలా ఉరికొచ్చి చెరో కోడిపిల్లనూ తన్నుకుపోయినై.
 మళ్లీ మనసంతా బోసిపోయి... విలవిల... దుఃఖం మౌనక్షోభ.
 యిక రెండు పిల్లలు మిగిలినై. ఒకటి నలుపు... మరొకటి బూడిద రంగు.
 చాలా జాగ్రత్తలు తీసుకుంది అచల ఆ రెండింటినీ ఎలాగైనా రక్షించాలని.

 ఆమెకు తెలియకుండానే ఆమె మనసు నిండా కోడిపిల్లలు... వాటిని ఎలా కాపాడాలి... పిల్లి, కుక్క దాడి నుండి ఎలా వాటిని రక్షించాలి. ఇవే ఆలోచనలు.
 పాపం... రెండు కోడిపిల్లలూ ఆమె వెంటనే తిరిగేవి కిచకిచలాడ్తూ. ఎటు పోతే అటు... కిచెన్‌లోకి, బెడ్రూంలోకి, హాల్‌లోకి అన్నిట్లోకీ పోతుండేవి.
 భాషకందని ఏదో బంధం ఏర్పడినట్టు అర్థమైంది అచలకు... తనకూ వాటికీ.
 రెండ్రోజుల క్రితం... ఏమైందో ఏమో... గంప కింద కమ్మిన కోడిపిల్లలను పొద్దున లేవగానే ఆతురతగా చూస్తే... బూడిద
రంగు పిల్ల చచ్చిపోయి బిగుసుకుని ఉంది. చచ్చిన దాని శరీరం నిండా గుంపులు గుంపులుగా చీమలు పట్టేశాయి.
 
తీసుకెళ్లి బైటపడేసింది కాలువలో... చచ్చిన కోడిప్లిలను బరువెక్కిన హృదయంతో.
 అచల భర్త... ఈ కోడిపిల్లల తతంగాన్నీ, వాటి క్రమానుగత మరణాలనూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా గమనిస్తూ... సంతోషపడ్తూ... వెకిలిగా దేహ భాషను ప్రదర్శిస్తున్నాడు.
 అతని పైశాచికానందం అచలకు చిర్రెత్తించింది.
 బహుశా... అందువల్లనేనేమో. మిగిలిన ఒక్క నల్లరంగు కోడిపిల్లపై అచలకు అచంచలమైన ప్రేమ ఇనుమడించింది.
   
 ‘‘బుజ్జిముండా.. నీకు నేనున్నానుగదే’’ అంది అచల ఆ రోజు.
 దోసిట్లోకి కోడిపిల్లను తీసుకుని ప్రేమగా నిమిరింది అచల. చేతుల్లో... వెచ్చగా... మెత్తగా పట్టు వలె బూరు. ఎత్తుకుంటే అవది దోసిలి నిండా ఉంది. పదిహేను రోజుల్లో కాస్త సైజు పెరిగి... చక్కగా ఎదిగిందిది.
 అలవాటైంది అచలక్కూడా. యింట్లో అటు ఇటూ తిరుగుతూ... పక్కనే వెంట నడిచి వచ్చే కోడిపిల్లను గమనిస్తూ ఆనందించడం... ముచ్చటపడ్డం.
 సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్నా...

వంటగదిలో స్టౌ ముందు నిలబడి ఏదైనా వండుతున్నా, బాత్‌రూమ్‌కు వెళ్తే, బయటికి రాగానే డోర్ దగ్గరే... వెంట నీడలా వచ్చేది కోడిపిల్ల.
 వైరి భర్త... అర్థంలో నెరిసిన జుట్టును దువ్వుకుంటూ... ‘కోళ్లమీదున్న ప్రేమ మనుషుల మీదుంటే ఎంత బాగుండునో’ అని బిగ్గరగా గొణుగుతూ... పిచ్చి ఆనందంతో ఈల వేసుకుంటూ... ఓ వెటకారపు చూపును... కోడిపిల్లపై అచలమై విసుర్తూ తిరుగుతున్నాడతను.
 ఆ రోజు... అతను వీధి గుమ్మం తెరిచి... బైటికి కదుల్తూండగా...
 
ఎప్పటినుండి పొంచి చూస్తోందో పిల్లి మాటేసి... మెరుపులా ఉరికొచ్చి కోడిపిల్లను నోట కరుచుకుని లిప్తలో పరుగుతీస్తూ మాయమైంది. కోడిపిల్ల చావుకేక... అరుపు... దాని నల్లని బూరు... ఈకలు.
 క్షణంలో... ఏదో బీభత్సం... నేలపై... ఐదారు రక్తపు బొట్లు.
 దూరమౌతున్న కోడిపిల్ల ఆర్తనాదపు... అరుపు... సన్నగా.
 అచల దిగ్గున లేచి... పిల్లి పరుగెత్తిన దిక్కు ఉరికింది. కాని లిప్తకాలంలో అంతా అయిపోయింది.
 ‘‘వెల్‌డన్. మంచి పనైంది. డర్టీ చిక్...’’ అతనంటున్నాడు... గుమ్మంలో నిలబడి సంతోషంగా నవ్వుతూ అన్నాడు భర్త.
 పిచ్చి ఆనందం అతనిలో.
 
అచల తలలో ఎందుకో చటుక్కున ఏదో బాంబు పేలినట్టయింది.
 ఒళ్లూ... మనసూ... హృదయం... కంపించి బ్రద్దలైనట్టుగా ఉంది.
 అతని వంక... పరమ అసహ్యంగా చూచి... పిచ్చిదానివలె చిర్రెత్తి... పక్కన టీపాయ్ పైనున్న గాజు ఫ్లవర్‌వేజ్‌ను తీసి కోపంతో నేలకేసి కొట్టింది.
 ఫ్లవర్‌వాజ్ భళ్లున చిట్లి... ముక్కలు ముక్కలై ఎగిసింది. హాలు నిండా గాజు పెంకులే.
 
క్షణకాలం... తల్లికోడి... పిల్లలు నాలుగూ ఒక్కొక్కటి... వరుసగా... కుక్కకు... పిల్లులకు.. బలైపోయాయి.
  దాడి... నిస్సహాయ జీవులపై బలమైన జంతువుల దాడి. నిర్విరామ దాడి. అన్నీ మనసులో మెదుల్తూండగా... ఎందుకో దుఃఖం ముంచుకొచ్చింది అచలకు. ముఖాన్ని దోసిట్లో దాచుకుని చిన్నపిల్లలా భోరున ఏడ్చింది.
 మనిషికి దుఃఖం అర్థం కాదు.
- పి.అమరజ్యోతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement