ఇల్లు మారుతున్నారా?
వాయనం:
అసౌకర్యాలు కలిగినప్పుడు ఇల్లు మారడం సహజమే. అయితే అది అంత సులభమైన విషయం మాత్రం కాదు. అందుకే చాలామంది ఎంత ఇబ్బందిగా ఉన్నా సర్దుకుపోతుంటారు తప్ప, ఇల్లు మారడానికి మాత్రం ఇష్టపడరు. అయితే కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఇల్లు షిఫ్టింగ్ అంత కష్టమనిపించదు. మీకు కనుక ఇల్లు మారే ఆలోచన ఉంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి చాలు...
* ఇల్లు మారాలనుకున్నప్పుడు ముందుగా చేయాల్సింది... ఇప్పుడు ఉంటున్న ఇంటికి, కొత్తగా తీసుకున్న ఇంటికి మధ్య పోలికలు, వైరుధ్యాలు అంచనా వేసుకోవడం. అలా చేస్తే సామాన్లు సర్దుకోవడంలో ఇబ్బంది ఉండదు!
* ఇప్పుడున్న ఇంట్లో ఉన్న ఒక వస్తువును, కొత్త ఇంట్లో ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని ముందుగానే అంచనా వేసుకోండి. ప్రతి వస్తువు స్థానాన్నీ ముందే నిర్దేశించుకోండి!
* ఒకవేళ వెళ్లబోతున్న ఇల్లు ఇప్పటి ఇంటి కన్నా చిన్నది అయితే, అనవసరమైన వస్తువులు ఏవైనా ఉంటే ఇక్కడే తీసి పారేయండి, లేదంటే అమ్మేసుకోండి. అనవసరంగా మోసుకెళ్లడమెందుకు!
* ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్లు వస్తే ఓకే. లేదంటే వస్తువులన్నింటినీ ఓ పద్ధతి ప్రకారం ప్యాక్ చేసుకోండి. సామాన్లను ఎప్పుడూ గదుల వారీగా ప్యాక్ చేసుకోవాలి తప్ప, అందులో ఒకటి ఇందులో ఒకటి ప్యాక్ చేసి అన్నిటినీ కలిపి ఒకచోట పారేయవద్దు!
* ప్రతి ప్యాకెట్‌మీదా అందులో ఏమున్నాయో తప్పక రాసుకోండి. అలాగే ఏ గదిలోని వస్తువుల ప్యాకెట్లు ఆ గదిలోనే ఉంచుకోండి. లారీలో సర్దేటప్పుడు కూడా అదే పద్ధతి ప్రకారం ఎక్కిస్తే... దింపుకునేటప్పుడు కూడా ఆయా వస్తువుల్ని అవి పెట్టాల్సిన గదుల్లోకి చేరవేసుకోవడం తేలిక అవుతుంది!
మొక్కలు కనుక ఉంటే... వాటన్నిటినీ కుండీలతో తీసుకెళ్లవద్దు. పొరపాటున కుండీలు పగిలితే, మట్టి అంతా రాలిపోయి, వేళ్లు బయటపడి, మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే మట్టితో సహా మొక్కను కుండీలోంచి జాగ్రత్తగా తీసి, వేళ్లను ఓ పాలిథీన్ కవర్లో గట్టిగా బిగించి కట్టండి. సామాన్లతో పాటు ఇష్టమొచ్చినట్టు లారీలో ఎక్కించకుండా, మొక్కలన్నిటినీ ఓ పక్కగా, వాటి మీద బరువు పడకుండా ఉండేలా సర్దండి. కొత్త ఇంటికి వెళ్లీ వెళ్లగానే ముందుగా మొక్కల్ని తీసి కుండీల్లో పెట్టి, నీళ్లు పోయడం మర్చిపోకండి!
ఇంత ప్లాన్డ్‌గా ఉంటే ఇల్లు షిఫ్టింగ్ అనేది సమస్య ఎందుకవుతుంది! చక్కగా కొత్త ఇంటికెళ్లగానే ఏ గదిలో ప్యాకెట్లు ఆ గదిలో పెట్టేసుకుని, వాటి మీద రాసుకున్న వివరాలను బట్టి ఒక్కోటీ సర్దేసుకున్నారనుకోండి... రెండు మూడు రోజుల్లో అన్నీ సెట్ అయిపోతాయి. ఇక మీరు హ్యాపీగా ఉండవచ్చు!