Packers and Movers
-
హలో.. ఆర్టీసీ!
సాక్షి, హైదరాబాద్: మీకు మరో చోటకు బదిలీ అయిందా.. అయితే మీ ఇంటి సామగ్రి తరలించేందుకు ఆర్టీసీకి ఫోన్ చేస్తే చాలు. ప్యాకర్స్ అండ్ మూవర్స్ తరహాలో సేవలకు మీ ఇంటి ముంగిటకు ‘ఎర్ర బస్సు’వచ్చి ఆగుతుంది. వింటుంటే కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఆర్టీసీ కొత్తగా ప్రారంభించబోతున్న కార్గో సేవల్లో ఇదీ ఓ భాగమే. ఒక పట్టణం నుంచి మరో పట్టణం, దూర ప్రాంతాలకు ఇంటి సామగ్రి తరలించేందుకు కూడా ఆర్టీసీ సై అంటోంది. డీజిల్, సిబ్బంది ఖర్చు వచ్చేలా.. దూర ప్రాంతాలకే ఈ సేవలు ఉండనున్నాయి. ఇక ప్రభుత్వ మద్యం డిపోల నుంచి మద్యం తరలింపు కూడా ఆర్టీసీ కార్గో సర్వీసుల్లోనే సాగనుంది. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు, రేషన్ సరుకులు, ఎఫ్‌సీఐ గోదాములకు ధాన్యం, కూరగాయల తరలింపు.. ఇలా అన్నీ వీటిల్లోనే. ఇవే కాకుండా ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల నుంచి కూడా వస్తువుల తరలింపునకు బుకింగ్స్ తీసుకోబోతోంది. ఈ నెలాఖరుకు కార్గో సేవలను ప్రారంభించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. తొలుత రాష్ట్రం పరిధిలోనే వీటి సేవలు ఉండనుండగా, వీలైనంత త్వరలో ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించాలని నిర్ణయించారు. అక్టోబర్ నాటికి 822 బస్సులు.. తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకునేందుకు కార్గో సర్వీసులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలో 822 ప్రయాణికుల బస్సులను ఉపసంహరించుకుని వాటిని సరుకు రవాణా వాహనాలుగా మార్చాలని నిర్ణయించింది. ఆర్టీసీ మియాపూర్ బస్ బాడీ బిల్డింగ్ వర్క్‌షాపులో ఇప్పటికే 8 బస్సులను సిద్ధం చేసింది. ప్రతినెలా 50 చొప్పున బస్సులను ఇక్కడ మోడిఫై చేయనున్నారు. అక్టోబర్ నాటికి 822 బస్సులు సిద్ధం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పట్లోగా వాటిని సిద్ధం చేసే సామర్థ్యం ఆర్టీసీ యూనిట్‌కు లేకపోవటంతో మిగతావాటిని ప్రైవేటు వర్క్‌షాపుల్లో సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ నెలాఖరుకు 50 బస్సులతో కార్గో విభాగం ప్రారంభించి, కొత్తగా సిద్ధమయ్యే బస్సులను దానికి చేరుస్తూ పోవాలని నిర్ణయించారు. వీటి ద్వారా సాలీనా రూ.400 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. రేషన్ సరుకులు, ప్రభుత్వ గోదాములకు ధాన్యం, కూరగాయలు, ఇతర వస్తువుల తరలింపు, ప్రభుత్వ ముద్రణాలయం నుంచి పాఠ్యపుస్తకాల తరలింపు, విద్యార్థులకు యూనిఫామ్స్ తరలింపు, సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు మందుల సరఫరా, ప్రభుత్వ హాస్టల్స్‌కు బియ్యం ఇతర వస్తువుల తరలింపు.. ఇలా ప్రభుత్వ పరంగా ఉండే సరుకు రవాణా అంతా ఆర్టీసీ కార్గో బస్సులే చేయనున్నాయి. ఈమేరకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వటంతో వాటి నుంచి ఆర్టీసీ ఆర్డర్స్ కోసం దరఖాస్తు చేసింది. 1,210 మందితో వ్యవస్థ ఆర్టీసీలో ప్రస్తుతం సాధారణ బస్సుల్లోనే కొన్ని పార్శిళ్లను రవాణా చేస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా కార్గో పేరుతో సరుకు రవాణా బస్సు లు ప్రారంభిస్తున్నందున, ఈ విభాగానికి ప్రత్యేకంగా సిబ్బంది అవసరం కూడా వచ్చింది. 822 కార్గో బస్సుల నిర్వహణకు 1,210 మంది సిబ్బం ది అవసరమవుతారని లెక్కలు తేల్చింది. ఇటీవల రద్దయిన బస్సుల వల్ల మిగిలిపోయే సిబ్బందిని ఇటు బదలాయిస్తున్నారు. వీరే కాకుండా జోనల్ స్థాయిలో ఓ డీవీఎం స్థాయి అధికారి, రీజియన్ స్థాయిలో డిపో మేనేజర్ స్థాయి అధికారిని పర్యవేక్షకులుగా నియమిస్తున్నారు. ప్రతి డిపోలో ఓ కండక్టర్‌ను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమిస్తున్నా రు. వీరు నిత్యం ప్రభుత్వ విభాగాలు, ప్రైవేటు సంస్థల నుంచి ఆర్డర్లు తెచ్చే పనిలో ఉంటారు. వెనక వైపు క్రీమ్ కలర్ స్ట్రిప్‌తో పూర్తి ఎరుపు రంగు లో ఈ బస్సులు ఉండబోతున్నాయి. వీటిని ఆయా డిపోల్లోనే అందుబాటులో ఉంచుతారు. సిబ్బంది కూడా అక్కడి నుంచే విధులు నిర్వర్తిస్తారు. సమీక్షించిన ఇన్చార్జి ఎండీ.. ఈ నెలాఖరుకల్లా కార్గో పార్శిల్ సర్వీసులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన బస్‌భవన్‌లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో దీనిపై సమీక్ష నిర్వహించారు. నష్టాల్లో ఉన్న సంస్థకు బాసటగా నిలిచేలా ఈ విభాగాన్ని తీర్చిదిద్దాలన్నారు. రెవెన్యూ, ఐటీ విభాగం ఈడీ పురుషోత్తం కార్గో పార్శిల్ విభాగం డీపీఆర్‌ను సునీల్‌శర్మకు అందజేశారు. ఈడీలు వినోద్‌కుమా ర్, యాదగిరి, టీవీరావు తదితరులు పాల్గొన్నారు. -
టెకీకి చుక్కలు చూపించిన మూవర్స్ అండ్ ప్యాకర్స్
లక్నో : ఉత్తర ప్రదేశ్‌కి చెందిన ఓ టెకీకి మూవర్స్ అండ్ ప్యాకర్స్ కంపెనీ ఒకటి చుక్కలు చూపించింది. పది రోజుల పాటు ఆ టెకీ కుటుంబాన్ని ముప్పతిప్పలు పెట్టింది. వివరాలు.. నోయిడాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి పూణెకు ట్రాన్స్ఫర్ అయ్యింది. ఈ క్రమంలో ఇంటిలోని వస్తువులను నోయిడా నుంచి పూణెకి తరలించడం కోసం ఓ మూవర్స్ అండ్ ప్యాకర్స్‌కి కంపెనీతో మాట్లాడి రూ. 61 వేలకి బేరం కుదుర్చుకున్నాడు. అనంతరం గత నెల 24న ఇంటిలోని సామగ్రి, బట్టలు, ఇతర వస్తువులతో పాటు సర్టిఫికెట్లను కూడా ప్యాక్ చేసి ట్రక్‌లో ఎక్కించారు. ఈ సామగ్రి విలువ దాదాపు రూ. 12 లక్షల రూపాయలు ఉటుందని అంచాన. ఈ వస్తువులు నోయిడా నుంచి పూణెకి చేరడానికి దాదాపు నాలుగు రోజుల సమయం పడుతుందని సదరు మూవర్స్ కంపెనీ యజమాని చెప్పాడు. సామగ్రిని అంతా ప్యాక్ చేసిన తరువాత.. సాఫ్ట్వేర్ ఉద్యోగి తన కుటుంబంతో కలిసి ముందుగానే పూణె చేరుకున్నాడు. అనంతరం సామగ్రి కోసం ఎదురు చూడసాగాడు. చెప్పిన ప్రకారం నాలుగు రోజుల సమయం దాటిపోయింది. కానీ తమ సమాను మాత్రం పూణె చేరలేదు. దాంతో మూవర్స్ కంపెనీకి ఫోన్ చేస్తే వారు లిఫ్ట్ చేయలేదు. ఇలా దాదాపు పది రోజులు గడిచిపోయాయి. ఈ లోపు ట్రక్ డ్రైవర్ సదరు ఉద్యోగికి ఫోన్ చేసి ‘మా ఓనర్ మీ వస్తువులను నాశనం చేయమని చెప్పాడు. కానీ నేను అలా చేయలేదు. మీ సామాగ్రి అంతా మీకు క్షేమంగా చేరాలంటే నాకు మరో 30 వేల రూపాయలు అదనంగా ఇవ్వాలం’టూ డిమాండ్ చేశాడు. సహనం కోల్పొయిన సదరు ఉద్యోగి చివరకు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు పలు ఆసక్తికర అంశాలు తెలిశాయి. సదరు మూవర్స్ అండ్ ప్యాకర్స్ కంపెనీ ఓనర్, డ్రైవర్ ఇద్దరు ఒక్కరేనని తెలిసింది. అంతేకాక సదరు వ్యక్తి గతంలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు సదరు ఉద్యోగిని అరెస్ట్ చేసి.. టెకీ సామగ్రిని అతనికి అందజేశారు. -
పింఛన్ ‘చాటన్’!
ఆసరా పింఛన్లలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం బీడీ ప్యాకర్లు, చాటన్ దారులకు అందిస్తున్న జీవన భృతి ఈనెల నుంచి నిలిచిపోయింది. బీడీలు చుట్టే మహిళా కార్మికులకే పింఛన్లు అందించాలని ఉందని, ప్యాకర్లు, చాటన్‌దారులకు అందించాలనే నిబంధన ఏమీ లేదని సెర్ప్ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో 750 మందికి పింఛన్లు రద్దు చేస్తూ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. సెర్ప్ అధికారుల నిర్ణయంపై బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మోర్తాడ్(బాల్కొండ)/నవీపేట(బోధన్): కుదేలవుతున్న బీడీ పరిశ్రమకు అండగా నిలిచేందుకు రాష్ట్రప్రభుత్వం మూడేళ్ల కింద బీడీ కార్మికులకు జీవనభృతి పథకాన్ని అమలు చేసింది. 2014 ఏప్రిల్‌కు ముందు పీఎఫ్ కలిగిన బీడీ కార్మికులకు రూ.1000 పింఛన్ అందజేస్తూ వస్తోంది. పనిదినాలు తగ్గడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కార్మికులకు ఈ పింఛన్ పథకం కొద్దిమేర ఆసరాగా నిలిచింది. మొదట్లో ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే భృతి అన్న కొర్రీ విధించడంతో కార్మిక సంఘాలు ఉద్యమాలు చేపట్టాయి. దీంతో కుటుంబంలోని అర్హులైన బీడీ కార్మికులందరికీ జీవనభృతిని అందిస్తున్నారు. జిల్లాలో 50 పైగా బీడీ కంపెనీలు ఉండగా వీటిలో దాదాపు లక్షన్నర వరకు కార్మికులు పని చేస్తున్నారు. బీడీలు చుట్టడం, చాటన్, ప్యాకింగ్, బట్టీ పెట్టడం వంటి పనులు చేస్తూ జీవనం గడుపుతున్నారు. ప్యాకర్లు, చాటన్‌దారులకు నిలిచిన పింఛన్లు.. తెలంగాణ ప్రభుత్వం బీడీలు చుట్టే మహిళలతో పాటు బీడీ ప్యాకర్లకు, చాటన్‌దారులకు నెలనెలా జీవనభృతి అందిస్తోంది. కాగా ఈనెల నుంచి ప్యాకర్లు, చాటన్‌దారులకు జీవనభృతి నిలిపివేస్తు న్నట్లు సెర్ప్ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. బీడీలు చుట్టే మహిళా కార్మికులకు మాత్రమే జీవనభృతి అందించాల్సి ఉందని, చాటన్‌దారులు, ప్యాకర్లకు అందించే నిబంధన ఏమీ లేదని సె ర్ప్ అధికారులు స్పష్టం చేస్తూ.. ఈనెల నుంచి వారికి పింఛన్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో దాదాపు 750 మంది చాటన్‌దారులు, ప్యాకర్లకు జీవన్ భృతి నిలిచిపోయింది. అమలు కాని కనీస వేతనం.. జిల్లాలోని ఆయా బీడీ పరిశ్రమల్లో దాదాపు లక్షన్నర మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో 97,010 మంది కార్మికులు జీవనభృతి పొందుతున్నారు. బీడీ కార్మికులు అంటే బీడీలు చుట్టేవారు కాకుండా ప్యాకర్లు, చాటన్‌దారులు కూడా ఉన్నారు. కాగా బీడీ కార్మికుల్లో అన్ని వర్గాల వారికి ఇప్పటికీ కనీస వేతన చట్టం అమలు కావడం లేదు. ఈ చట్టం ప్రకారం వేతనాలు అందిస్తే ఒక్కో కార్మికుడికి కనీసం రూ.12వేల నుంచి రూ.15వేల వరకు వేతనం ప్రతినెలా అందించాల్సి ఉంటుంది. ప్యాకర్లు, చాటన్‌దారులకు కూడా పని ఆధారంగా నే వేతనం లభిస్తోంది. కనీస వేతన చట్టం ప్రకారం తమకు వేతనాలు అం దించాలని ప్యాకర్లు, చాటన్‌దారులు ఎ న్నో ఏళ్ల నుంచి కోరుతున్నా బీడీ కంపెనీల యాజమాన్యాలు స్పందించడం లే దు. వీరికి నెలకు రూ.5వేల నుంచి రూ. 6వేలకు మించి వేతనం అందడం లేదు. రద్దు నిర్ణయంతో ఆందోళన.. ఎప్పటిలాగే జీవనభృతి కోసం పోస్టా ఫీస్ కార్యాలయాలకు వెళ్లిన ప్యాకర్లు, చాటన్వాలాలు, బట్టీవాలాలకు పోసా ్టఫీస్ సిబ్బంది మొండిచేయి చూపించారు. జీవనభృతిని రద్దు చేశారని తెలిసి ఆందోళనకు గురయ్యారు. చాలీచాలని పని దినాలతో దుర్భర జీవనం గడుపుతున్న తమకు జీవనభృతి ఆసరాగా నిలిచిందని, ఇప్పుడు దానినీ రద్దు చేయడంతో ఆందోళన చెందుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతుండడం, వేతనంలో మార్పు లేకపోవడంతో తమ జీవితంలో వృద్ధి లేకుండా పోయిందని కార్మికులు వాపోతున్నారు. తమకు పింఛన్ వర్తించదని జీవనభృతి నిలిపివేతకు తీసుకున్న నిర్ణయంతో నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. జీవనభృతి నిలిపివేయడం సరికాదు.. చాటన్‌దారులు, ప్యాకర్లకు జీవన భృతిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం సరికాదు. ఇప్పటివరకు పింఛన్ ఇచ్చి ఇప్పుడు నిలిపివేస్తే ఎవరికి చెప్పుకోవాలి. చాలీచాలని వేతనాలతో ఎలా బతకాలి. జీవనభృతితో ఉన్న కాస్త ఊరట ఇప్పుడు తొలగిపోయింది. – శాకీర్, బీడీ చాటన్దారు, మోర్తాడ్ ఆందోళనలు చేస్తాం.. బీడీ పరిశ్రమలోని కార్మికులందరూ ఒకటే. పనిదినాలు తక్కువగా ఉండడంతో తక్కువ కమీషన్లను వేతనం రూపంలో పొందుతున్నారు. తాజాగా పింఛన్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని కార్మికులకు జీవనభృతి పునరుద్ధరించాలి. బాధితుల పక్షాన ఆందోళనలను ఉధృతం చేస్తాం. – నాయక్వాడీ శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు, నవీపేట బీడీలు చుట్టే కార్మికులకే.. బీడీ పరిశ్రమలోని బీడీలు చుట్టే కార్మికులకే జీవనభృతిని అందించాలని తాజా జీవో వెలువడింది. దాని ప్రకారమే గత డిసెంబర్లో జీవనభృతిని అందించాం. ఈ నిబంధనతో జిల్లాలోని 404 మంది జీవన భృతి రద్దయింది. – రవి, పెన్షన్ ఏపీఓ(డీఆర్డీఓ), నిజామాబాద్ -
ఇల్లు మారుతున్నారా?
వాయనం: అసౌకర్యాలు కలిగినప్పుడు ఇల్లు మారడం సహజమే. అయితే అది అంత సులభమైన విషయం మాత్రం కాదు. అందుకే చాలామంది ఎంత ఇబ్బందిగా ఉన్నా సర్దుకుపోతుంటారు తప్ప, ఇల్లు మారడానికి మాత్రం ఇష్టపడరు. అయితే కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఇల్లు షిఫ్టింగ్ అంత కష్టమనిపించదు. మీకు కనుక ఇల్లు మారే ఆలోచన ఉంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి చాలు... * ఇల్లు మారాలనుకున్నప్పుడు ముందుగా చేయాల్సింది... ఇప్పుడు ఉంటున్న ఇంటికి, కొత్తగా తీసుకున్న ఇంటికి మధ్య పోలికలు, వైరుధ్యాలు అంచనా వేసుకోవడం. అలా చేస్తే సామాన్లు సర్దుకోవడంలో ఇబ్బంది ఉండదు! * ఇప్పుడున్న ఇంట్లో ఉన్న ఒక వస్తువును, కొత్త ఇంట్లో ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని ముందుగానే అంచనా వేసుకోండి. ప్రతి వస్తువు స్థానాన్నీ ముందే నిర్దేశించుకోండి! * ఒకవేళ వెళ్లబోతున్న ఇల్లు ఇప్పటి ఇంటి కన్నా చిన్నది అయితే, అనవసరమైన వస్తువులు ఏవైనా ఉంటే ఇక్కడే తీసి పారేయండి, లేదంటే అమ్మేసుకోండి. అనవసరంగా మోసుకెళ్లడమెందుకు! * ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్లు వస్తే ఓకే. లేదంటే వస్తువులన్నింటినీ ఓ పద్ధతి ప్రకారం ప్యాక్ చేసుకోండి. సామాన్లను ఎప్పుడూ గదుల వారీగా ప్యాక్ చేసుకోవాలి తప్ప, అందులో ఒకటి ఇందులో ఒకటి ప్యాక్ చేసి అన్నిటినీ కలిపి ఒకచోట పారేయవద్దు! * ప్రతి ప్యాకెట్మీదా అందులో ఏమున్నాయో తప్పక రాసుకోండి. అలాగే ఏ గదిలోని వస్తువుల ప్యాకెట్లు ఆ గదిలోనే ఉంచుకోండి. లారీలో సర్దేటప్పుడు కూడా అదే పద్ధతి ప్రకారం ఎక్కిస్తే... దింపుకునేటప్పుడు కూడా ఆయా వస్తువుల్ని అవి పెట్టాల్సిన గదుల్లోకి చేరవేసుకోవడం తేలిక అవుతుంది! మొక్కలు కనుక ఉంటే... వాటన్నిటినీ కుండీలతో తీసుకెళ్లవద్దు. పొరపాటున కుండీలు పగిలితే, మట్టి అంతా రాలిపోయి, వేళ్లు బయటపడి, మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే మట్టితో సహా మొక్కను కుండీలోంచి జాగ్రత్తగా తీసి, వేళ్లను ఓ పాలిథీన్ కవర్లో గట్టిగా బిగించి కట్టండి. సామాన్లతో పాటు ఇష్టమొచ్చినట్టు లారీలో ఎక్కించకుండా, మొక్కలన్నిటినీ ఓ పక్కగా, వాటి మీద బరువు పడకుండా ఉండేలా సర్దండి. కొత్త ఇంటికి వెళ్లీ వెళ్లగానే ముందుగా మొక్కల్ని తీసి కుండీల్లో పెట్టి, నీళ్లు పోయడం మర్చిపోకండి! ఇంత ప్లాన్డ్గా ఉంటే ఇల్లు షిఫ్టింగ్ అనేది సమస్య ఎందుకవుతుంది! చక్కగా కొత్త ఇంటికెళ్లగానే ఏ గదిలో ప్యాకెట్లు ఆ గదిలో పెట్టేసుకుని, వాటి మీద రాసుకున్న వివరాలను బట్టి ఒక్కోటీ సర్దేసుకున్నారనుకోండి... రెండు మూడు రోజుల్లో అన్నీ సెట్ అయిపోతాయి. ఇక మీరు హ్యాపీగా ఉండవచ్చు!