vayanam
-
అట్లతద్దోయ్ ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్ మూడట్లోయ్..
రాయవరం: అట్లతద్దోయ్ ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్ మూడట్లోయ్.. అంటూ మహిళలు ఆటపాటలతో కోలాహలంగా జరుపుకునే పండగ అట్లతద్ది. ముఖ్యంగా వివాహమైన అనంతరం నవ వధువు అట్లతద్ది పండగను తప్పనిసరిగా చేసుకోవడం ఆనవాయితీ. మాంగళ్య బలం కోసం గౌరీదేవిని భక్తితో కొలిచే ఈ పర్వదినాన్ని ఆశ్వీ యుజ మాసం బహుళ తదియ నాడు నోయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. గ్రామీణ ప్రాంతాల్లో అట్లతద్దికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ నెల (అక్టోబర్) 12న అట్లతద్ది పర్వదినం సందర్భంగా పూజకు ఏర్పాట్లు చేసుకునే పనిలో మహిళలు నిమగ్నమై ఉన్నారు. ఇస్తినమ్మ వాయనం.. మహిళలు నోచే నోముల్లో అతి ముఖ్యమైనది అట్లతద్ది పండుగ. వేకువజామునే లేచి స్నానపానాదుల అనంతరం ఐదు గంటల లోపుగా భోజనం చేసి వ్రతాన్ని ప్రారంభిస్తారు. మజ్జిగ అన్నం, గోంగూర పచ్చడి, నువ్వులపొడి, ఉల్లిపాయల పులుసు, గడ్డపెరుగుతో భోజనం చేస్తారు. అనంతరం సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. కొత్తగా పెళ్లైన యువతులు తప్పనిసరిగా అట్లతో వాయనాలు ఇస్తారు. సాయంత్రం సమయంలో కాలువ వద్దకు వెళ్లి కాలువలో మట్టిని, వరిదుబ్బులను, నవధాన్యాలతో తయారుచేసిన జాజాల బుట్టలను గౌరీదేవిగా భావించి పూజలు చేస్తారు. నీళ్లలో గౌరమ్మ.. పాలల్లో గౌరమ్మ అంటూ పాటపాడుతూ పూజ అనంతరం వాటిని కాలువలో కలుపుతారు. అట్లతద్దికి ఐదురోజుల ముందుగా చిన్నచిన్న బుట్టల్లో మట్టి వేసి అందులో మెంతులు, పెసలు, కందులు, పత్తి తదితర నవధాన్యాలను వేస్తారు. అట్లతద్ది రోజున మొలకలు వచ్చే విధంగా చూస్తారు. వీటినే జాజాలు అంటారు. ఉయ్యాల ఊగుతూ.. గోరింటాకు పెట్టుకుంటూ.. అట్లతద్ది రోజున మహిళలు తప్పనిసరిగా ఉయ్యాల ఊగుతారు. అదేవిధంగా అట్లతద్దికి ముందురోజున మహిళలు గోరింటాకు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. కాలువల వద్దకు వెళ్లే సమయంలో పెళ్లిపీటలపై కట్టుకున్న పట్టుచీరను తప్పనిసరిగా ధరిస్తారు. ఉదయం నుంచి కటిక ఉపవాసం చేసే మహిళలు సాయంత్రం పూజ అనంతరం చంద్రదర్శనం కోసం వేచిచూస్తారు. చంద్రుడు కనిపించాక పూజ చేసుకున్న అనంతరం ఉపవాస దీక్షను విరమిస్తారు. రాయవరం, మండపేట, కపిలేశ్వరపురం, రామచంద్రపురం, కె.గంగవరం, కాజులూరు మండలాల పరిధిలోని 120 గ్రామాల్లో అట్లతద్ది నోముకు మహిళలు సిద్ధమవుతున్నారు. నోముకు అవసరమైన పూజా సామగ్రిని సిద్ధం చేసుకునే పనిలో మహిళలు ఉన్నారు. ఏటా నోచుకుంటాం ఏటా తప్పనిసరిగా అట్లతద్ది నోము నోచుకుంటాను. ఈ ఏడాది నోముకి ఇప్పటికే జాజాలు సిద్ధం చేసుకున్నాం. పూజకు అవసరమైన ఏర్పాట్లలో ఉన్నాం. – పులగం శివకుమారి, గృహిణి, రాయవరం సౌభాగ్యం కోసం సౌభాగ్యం కోసం గౌరీదేవిని భక్తిశ్రద్ధలతో కొలుస్తాం. అట్లతద్ది రోజు సంప్రదాయబద్ధంగా పూజలు చేసి అమ్మవారిని పూజించడం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ వేడుక మహిళలకు ప్రత్యేకం. – కొప్పిశెట్టి లక్ష్మి, గృహిణి, అద్దంపల్లి, కె.గంగవరం మండలం వాయనాలు ప్రధానం హిందూ సంప్రదాయంలో అట్టతద్దికి పెళ్లైన ఏడాది నవ వధువులు వాయనాలు తీర్చుకోవడం ఈ పర్వదినంలో ప్రధానమైన ప్రక్రియ. అట్లతద్దిని మన ప్రాంతంలో సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం అనాదిగా వస్తోంది. – విలపర్తి ఫణిధర్‌శర్మ, అర్చకులు, రాయవరం -
రెండు గంటల్లో పెరుగు రెడీ!
వాయనం పెరుగు లేకపోతే భోజనం పూర్తి కాదు మనకి. మాంచి కూరతో ఫుల్లుగా లాగించినా, చివర్లో రెండు ముద్దలు పెరుగన్నం తినకపోతే తృప్తి ఉండదు. ఆరోగ్యానికి కూడా పెరుగు ఎంతో మంచిది కావడంతో, దాన్ని తప్పక తింటారు అందరూ. అయితే పెరుగు అంత తేలికగా తయారవదు. పాలలో కాసింత పెరుగు వేసి తోడుపెడితే... కొన్ని గంటల తర్వాత పెరుగు రెడీ అవుతుంది. ఎంత అర్జంట్ అయినా చేసేదేమీ ఉండదు. దాంతో చుట్టాలు వచ్చినప్పుడు, ఫంక్షన్లప్పుడూ ఒక్కోసారి ఇబ్బంది కలుగుతుంది. ఆ సమస్యను తీర్చడానికే ఈ యంత్రాలు పుట్టుకొచ్చాయి. వీటిని ఇన్స్టంట్ కర్డ్ మేకర్స్ లేక ఇన్స్టంట్ యోగర్ట్ మేకర్స్ అంటారు. ఐదు వందల నుంచి పది వేల వరకూ రకరకాల ఖరీదుల్లో లభిస్తున్నాయి. కరెంటుతో పని చేసే మెషీన్లో పాలు పోసి, రెండు చెంచాల పెరుగు వేసి మూతపెట్టి, స్విచ్ ఆన్ చేస్తే చాలు... పెరుగు తయారైపోతుంది. పాలు ఎంత పరిమాణంలో ఉన్నా తోడు కోవడానికి పట్టే సమయం రెండే రెండు గంటలు. కొన్ని మేకర్స్‌లో ఒకే గిన్నె కాకుండా చిన్న చిన్న డబ్బాల మాదిరిగా ఉంటాయి. తోడుకున్న తర్వాత వాటినలాగే ఫ్రిజ్‌లో పెట్టేసుకోవడానికి అనువుగా ఉండేందుకే ఇలా తయారు చేశారు. సాధారణంగా చలికాలంలో పాలు త్వరగా తోడుకోవు కదా! కానీ ఈ మెషీన్లు చలికాలంలో కూడా రెండు గంటల సమయంలోనే పాలను తోడు పెట్టేస్తాయి. -
ఇల్లు మారుతున్నారా?
వాయనం: అసౌకర్యాలు కలిగినప్పుడు ఇల్లు మారడం సహజమే. అయితే అది అంత సులభమైన విషయం మాత్రం కాదు. అందుకే చాలామంది ఎంత ఇబ్బందిగా ఉన్నా సర్దుకుపోతుంటారు తప్ప, ఇల్లు మారడానికి మాత్రం ఇష్టపడరు. అయితే కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఇల్లు షిఫ్టింగ్ అంత కష్టమనిపించదు. మీకు కనుక ఇల్లు మారే ఆలోచన ఉంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి చాలు... * ఇల్లు మారాలనుకున్నప్పుడు ముందుగా చేయాల్సింది... ఇప్పుడు ఉంటున్న ఇంటికి, కొత్తగా తీసుకున్న ఇంటికి మధ్య పోలికలు, వైరుధ్యాలు అంచనా వేసుకోవడం. అలా చేస్తే సామాన్లు సర్దుకోవడంలో ఇబ్బంది ఉండదు! * ఇప్పుడున్న ఇంట్లో ఉన్న ఒక వస్తువును, కొత్త ఇంట్లో ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని ముందుగానే అంచనా వేసుకోండి. ప్రతి వస్తువు స్థానాన్నీ ముందే నిర్దేశించుకోండి! * ఒకవేళ వెళ్లబోతున్న ఇల్లు ఇప్పటి ఇంటి కన్నా చిన్నది అయితే, అనవసరమైన వస్తువులు ఏవైనా ఉంటే ఇక్కడే తీసి పారేయండి, లేదంటే అమ్మేసుకోండి. అనవసరంగా మోసుకెళ్లడమెందుకు! * ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్లు వస్తే ఓకే. లేదంటే వస్తువులన్నింటినీ ఓ పద్ధతి ప్రకారం ప్యాక్ చేసుకోండి. సామాన్లను ఎప్పుడూ గదుల వారీగా ప్యాక్ చేసుకోవాలి తప్ప, అందులో ఒకటి ఇందులో ఒకటి ప్యాక్ చేసి అన్నిటినీ కలిపి ఒకచోట పారేయవద్దు! * ప్రతి ప్యాకెట్మీదా అందులో ఏమున్నాయో తప్పక రాసుకోండి. అలాగే ఏ గదిలోని వస్తువుల ప్యాకెట్లు ఆ గదిలోనే ఉంచుకోండి. లారీలో సర్దేటప్పుడు కూడా అదే పద్ధతి ప్రకారం ఎక్కిస్తే... దింపుకునేటప్పుడు కూడా ఆయా వస్తువుల్ని అవి పెట్టాల్సిన గదుల్లోకి చేరవేసుకోవడం తేలిక అవుతుంది! మొక్కలు కనుక ఉంటే... వాటన్నిటినీ కుండీలతో తీసుకెళ్లవద్దు. పొరపాటున కుండీలు పగిలితే, మట్టి అంతా రాలిపోయి, వేళ్లు బయటపడి, మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే మట్టితో సహా మొక్కను కుండీలోంచి జాగ్రత్తగా తీసి, వేళ్లను ఓ పాలిథీన్ కవర్లో గట్టిగా బిగించి కట్టండి. సామాన్లతో పాటు ఇష్టమొచ్చినట్టు లారీలో ఎక్కించకుండా, మొక్కలన్నిటినీ ఓ పక్కగా, వాటి మీద బరువు పడకుండా ఉండేలా సర్దండి. కొత్త ఇంటికి వెళ్లీ వెళ్లగానే ముందుగా మొక్కల్ని తీసి కుండీల్లో పెట్టి, నీళ్లు పోయడం మర్చిపోకండి! ఇంత ప్లాన్డ్గా ఉంటే ఇల్లు షిఫ్టింగ్ అనేది సమస్య ఎందుకవుతుంది! చక్కగా కొత్త ఇంటికెళ్లగానే ఏ గదిలో ప్యాకెట్లు ఆ గదిలో పెట్టేసుకుని, వాటి మీద రాసుకున్న వివరాలను బట్టి ఒక్కోటీ సర్దేసుకున్నారనుకోండి... రెండు మూడు రోజుల్లో అన్నీ సెట్ అయిపోతాయి. ఇక మీరు హ్యాపీగా ఉండవచ్చు!