తపాలా: ముదురురంగు చొక్కా
నేను గుంటూరులో రూమ్‌లో ఉండి బీఎస్సీ చదివే రోజుల్లో హిందీ సినిమాలకు సెకండ్ షోలకు వెళ్లే అలవాటుండేది. అప్పట్లో శేషమహల్, రంగమహల్ అనే జంట థియేటర్లు ఉండేవి. వాటిలో రంగమహల్లో హిందీ సినిమాలు ఆడేవి. ఒకసారి షమ్మీకపూర్ సినిమాకు అనుకొంట. సెకండ్ షోకు వెళ్లాను. పెద్దగా జనం లేరు. ఫ్యాను కింద సీటు వెతుక్కుని కూర్చున్నాను. సినిమా మొదలు అవలేదు కానీ స్లైడ్స్, ట్రైలర్స్ మొదలైనాయి. ఇంతలో నా పక్కనే ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు. గుప్పుమని వాసన కొట్టింది. పరిస్థితి అర్థమైంది కానీ ఆ వ్యక్తి ఏమీ గొడవ చేయటం, ఇబ్బంది పెట్టటం చేయట్లేదు. ఒక్క వాసన మాత్రమే ఇబ్బందిగా ఉంది. లేచి మరొక సీటులోకి మారటానికి సంస్కారం అడ్డు వచ్చింది. ఇంటర్వెల్ దాకా ఓపిక పట్టి, తర్వాత సీటు మారొచ్చు అనుకొన్నాను.
ఇంటర్వెల్‌లో బయటకు వెళ్లి టీ తాగి కొత్త సీటు వెతుక్కొని కూర్చున్నాను. ఇంతలో సినిమా మొదలుపెట్టిన కాసేపటికి మళ్లీ ఆ తాగుబోతు నా పక్కకే వచ్చి కూర్చున్నాడు. ఇక చేసేది ఏమీ లేక, మిగిలిన సినిమా మందు వాసన భరిస్తూ చూశాను.
తరువాత నాకు అర్థమైందేమిటంటే, నేను వేసుకున్న ముదురురంగు చొక్కా అతనికి బండ గుర్తు. ఆ చొక్కా రంగు ఆధారంగా నన్ను గుర్తుపెట్టుకుని మళ్లా నా పక్కనే కూర్చున్నాడు. అప్పటినుంచి ముదురురంగు చొక్కాలు వేసుకోవటమే మానేశాను.
- అంబడిపూడి శ్యామసుందరరావు గుంటూరు
ఇది మీ కోసం పెట్టిన పేజీ. మీ అనుభవాలు, అనుభూతులు, ఆలోచింపజేసిన సంఘటనలు, మీ ఊరు విశేషాలు, మీ పిల్లల ముద్దుమాటలు, వారి అల్లరి చేష్టలు... అవీ ఇవీ అని లేదు, ఏవైనా మాకు రాసి పంపండి. మీ పిల్లలకు సంబంధించిన విశేషాలు పంపేటప్పుడు వాళ్ల ఫొటోలు పంపడం మర్చిపోకండి. మా చిరునామా: తపాలా, ఫన్‌డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1,
రోడ్ నం.1, బంజారాహిల్స్,
హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com