డబ్బింగ్ సీరియల్... ఈ మాట ఆ మధ్య పెద్ద సంచలనమే సృష్టించింది. తెలుగు సీరియల్ సామ్రాజ్యంలో అల్ల కల్లోలం సృష్టించింది. డబ్బింగ్ సీరియల్స్‌ని నిలిపేయాలంటూ తెలుగు సీరియల్ నటీనటులు, టెక్నీషియన్లు డిమాండ్ చేశారు. వీరి పోరాటం న్యాయసమ్మతమైనదే. సీరియల్స్ మీద ఆధారపడి కొన్ని వేలమంది జీవిస్తున్నారు. నటీనటులు, డెరైక్టర్లు, డబ్బింగ్ కళాకారులు తదితరులందరికీ డబ్బింగ్ సీరియల్స్ కారణంగా ఉపాధి లేకుండా పోతోంది. దానివల్లే వాటిని నిషేధించాలని కోరుకున్నారు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. వాటి వల్ల వచ్చే ఆదాయం తక్కువ కాదు కాబట్టి, వాటిని ఆపడానికి చానెళ్ల నిర్వాహకులు అంగీకరించలేదు. దాంతో ఆ చర్చ అక్కడే నిలిచిపోయింది. డబ్బింగ్ సీరియళ్ల ప్రవాహం ఊపందుకుంది.
రాడాన్ సంస్థ నిర్మించే తమిళ సీరియల్సన్నీ తెలుగులోకీ డబ్ అవుతాయి. మరి కొన్ని తమిళ సీరియళ్లు కూడా తెలుగులోకి వస్తున్నాయి. ఇది చాలాకాలంగా జరుగుతూనే ఉంది. కానీ ఈ గొడవ ఇప్పుడెందుకు వచ్చినట్టు! ఎందుకంటే, ఈ మధ్య వీటి సంఖ్య మరింత పెరిగిపోయింది. దానికి కారణం... హిందీ సీరియళ్లు తెలుగులో ప్రవేశించడం. సరిగ్గా గమనిస్తే, తెలుగులో వస్తోన్న డెరైక్ట్ సీరియల్స్ కంటే, డబ్ అయిన హిందీ సీరియళ్ల సంఖ్యే ఎక్కువగా ఉందిప్పుడు. వసంత కోకిల, మధుబాల, చిన్నారి పెళ్లికూతురు, చూపులు కలిసిన శుభవేళ, కోడలా కోడలా కొడుకు పెళ్లామా, పవిత్ర, ఈ తరం ఇల్లాలు, నాదీ ఆడజన్మే, మా వారు, ఝాన్సీ లక్ష్మీబాయి, జోథా అక్బర్... ఒకటా రె ండా, కోకొల్లలుగా హిందీ సీరియళ్లు తెలుగు చానెళ్ల మీద దాడి చేశాయి. దీనివల్ల ఇండస్ట్రీ జనాలు ఇబ్బంది పడుతుండవచ్చు. కానీ ప్రేక్షకులు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగు సీరియళ్లతో సమానంగా, ఇంకా చెప్పాలంటే కాస్త అధికంగానే వాటిని ఆస్వాదిస్తున్నారు. అందుకే వీటి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే వాటిలో అంతగా నచ్చుతున్నదేంటి?
సీరియల్ అనగానే గుర్తొచ్చేది అత్తాకోడళ్ల గొడవలు, కన్నీళ్లే. హిందీ సీరియళ్లలో కూడా ఇవి ఉంటాయి. కానీ వాటితో పాటు ఇంకా చాలా ఉంటాయి. ప్రేమకథలు సినిమాలను తలదన్నేలా ఉంటాయి. కొన్నింటిలో అందమైన రొమాన్స్ కూడా ఉంటుంది. అవసరం లేని చోట కూడా పేజీలకు పేజీల డైలాగులు చొప్పించడం ఉండదు. పాటలు, డ్యాన్సులు, ఫైట్లు ఉంటాయి. పిక్చరైజేషన్ రిచ్‌గా ఉంటుంది. అందమైన ఇళ్లు, చక్కని వస్త్రధారణ, ఆధునికంగా, కాస్తంత ఫ్యాషనబుల్‌గా ఉండటం వంటి అంశాలు ఆకర్షిస్తాయి. సంప్రదాయాలను కూడా విడిచిపెట్టరు వాళ్లు. చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌నే తీసుకుంటే, పక్కా రాజస్థానీ కథ. అక్కడి సంప్రదాయాలన్నీ కొట్టొచ్చినట్టుంటాయి అందులో. అయినా మనవాళ్లు వాటిని ఎంజాయ్ చేశారు. అంటే, వాటిని అందంగా చూపించారనేగా!
ఇలా ఆకర్షించే విశేషాలు చాలా ఉండటం వల్లనే వాటిని ఆదరిస్తున్నారు. ‘అది డబ్బింగో, స్ట్రెయిట్ సీరియలో మాకు అనవసరం. కథ బాగుండాలి, ఆసక్తికంగా సాగాలి, డిఫరెంట్‌గా ఉండాలి, అంతే’ అంటున్నారు సీరియల్ ప్రియులు కొందరు. అంటే మన తెలుగు సీరియళ్ల శైలి మారాలనా? మన సీరియళ్లలో కాస్త వైవిధ్యత రావాలనా? ఆసక్తికరమైన అంశాలను పెంచాలనా? వీటికి సమాధానాలు సీరియళ్లు తీసేవాళ్లే వెతుక్కోవాలి మరి!
టీవీక్షణం: కనువిందు అనువాదం
Published Sun, Sep 22 2013 2:23 AM | Last Updated on Fri, Sep 1 2017 10:55 PM
Advertisement
Advertisement