టేస్టీ (స)మోసాలు!
హ్యూమర్
‘‘మోసాన్ని చాలా మంది నెగెటివ్‌గా చూస్తుంటార్రా... కానీ మోసం ఎంతో పాజిటివ్. పైగా అదెంతో అవసరం’’ అన్నాడు రాంబాబు గాడు.
‘‘మోసం పాజిటివా? పైగా మంచిదా? ఏం మాట్లాడుతున్నావ్‌రా నువ్వు?’’ అంటూ ఒకింత కోపంతో గద్దించాను నేను.
వాడేమీ చలించలేదు. ‘‘సజలం, సకాలం లోని పదాలలాగే మోసాలు అనే మాటకు ‘స’ను జోడించు. ఇప్పుడు చెప్పు ‘సమోసాలు’ అందరూ కోరుకునేవా, కావా నువ్వే చెప్పు’’ అన్నాడు వాడు. ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలిగానీ సమోసాలంటే నాకు ఇష్టమే. నా బలహీనతను ఆసరాగా తీసుకునేవాడిలా మాట్లాడుతున్నాడనిపించింది.
‘‘అదేంట్రా మోసాలకు ముందు ‘స’ అనే అక్షరం పెట్టినంత మాత్రాన మోసాలకూ, సమోసాలకూ సాపత్యమేమిటి?’’ అని అడిగా.
‘‘మోసం అన్నమాటే నీచం అన్నట్లుగా చెబుతుంటారు. కానీ అదే మోసాన్ని పాజిటివ్‌గా చూపే సామెతలనూ, కథలనూ మనకు చిన్నప్పట్నుంచే వినిపిస్తూ, మోసాలు చేయమని పెద్దలే చెబుతారు’’ అన్నాడు వాడు.
‘‘మోసాలు చెయ్యండంటూ పెద్దలే చెబుతారా?’’ ఒళ్లు మండి అనడిగాన్నేను.
‘‘ఆ... అవును. పైగా మోసం చేయడం చాలా అవసరం అని చెప్పడానికి నిదర్శనంగా ఒక కథ కూడా చెబుతారు. ఒక సింహం అడవిలోని జంతువులనన్నింటినీ రోజూ అప్పనంగా తినేస్తోందట.
‘రోజుకు ఒకటి చొప్పున స్వచ్ఛందంగా ఆహారమవుతాం’ అని జంతువులన్నీ ఆ సింహానికి నచ్చజెప్పాయట. ఒకరోజు ఒక కుందేలు వంతు వచ్చిందట. అది సింహం దగ్గరకు కాస్త ఆలస్యంగా వెళ్లిందట. సింహానికి కోపం వచ్చి జాప్యానికి కారణం అడిగిందట. అప్పుడా కుందేలు... ‘రాజా... నీకోసమే బయల్దేరితే మధ్యలో మరో సింహం ఎదురైంది. అది అటకాయించడం వల్లనే ఆలస్యం అయ్యింది’ అంటూ జవాబిచ్చిందట. అప్పుడా సింహానికి మరింత కోపం వచ్చి ఎవరా సింహం చూపమందట.
దాంతో ఆ కుందేలు ఒక పాడుబడ్డ బావిని చూపి అందులోనే అది ఉందని చెప్పిందట. అప్పుడు తన ప్రతిబింబాన్నే మరో మృగరాజుగా భావించిన ఆ సింహం దానితో పోరాడటానికి బావిలోకి దూకి చచ్చూరుకుందంటారు. కుందేలు మోసాన్ని మెచ్చుకుంటారు. ఇక్కడ చివరన... మోసాన్ని మోసంతోనే జయించాలని నీతి చెబుతారు విజ్ఞులు’’ అన్నాడు వాడు.
‘‘ఒరే ఇక్కడ కుందేలు చేసింది మోసం కాదురా... దాన్ని యుక్తి అంటారు’’ చెప్పాను నేను.
అప్పటికీ రాంబాబు గాడు తగ్గలేదు. ‘‘మనం ప్రదర్శిస్తే యుక్తి. అదే ఇతరులు మనకు చేస్తే మోసం. పైగా మోసాలు అనేవి తప్పు కాదనీ, అవి ప్రకృతి ధర్మమని తెలుసు కోవాలి’’ అన్నాడు వాడు.
‘‘మోసాలు ప్రకృతిలో భాగమా?’’ అడిగాను నేను.
‘‘అవున్రా. మొక్కలూ మోసాలు చేస్తాయి. ఫ్లై ఆర్కిడ్ అనే మొక్క ఎంత మోసం చేస్తుందో చూస్తే మతిపోతుంది. అది తన పూల ఆకృతిని ఎలా ఉంచుతుందో తెలుసా? అచ్చం ఆడ తుమ్మెద రూపంలా. అంతేకాదు... వయసుకు వచ్చిన ఆడ తుమ్మెద నుంచి వెలువడే వాసననూ ఆ పువ్వు వెలువరిస్తుంది. సదరు హార్మోన్ల పరిమళాలకు పరవశిస్తాయి మగ తుమ్మెదలు. అంతే... పాపం ఆ మగపురుగులు మోసపోయి... ఆడ తుమ్మెదను కలుస్తున్నాం కదా అన్న భ్రాంతితో ఆ పువ్వు మీద వాలిపోతాయి.
ఆ తర్వాత ఆశాభంగం చెంది కునారిల్లిపోతాయి. ‘తుమ్మెద ఫీలింగ్స్ ఎలా పోతే మనకెందుకు? మన పుప్పొడి దాని కాళ్లకు అంటి వ్యాపించింది కదా’ అని ఖుషీ అవుతుంది మన ఫ్లై ఆర్కిడ్ మొక్క. యుద్ధంలో, ప్రేమలో అంతా యుక్తమేనట. తమ పుప్పొడి ఆడపువ్వును చేరడం కోసం తమ పూ రెక్కలతో ఇలా మోసానికి పాల్పడతాయి ఆ మొక్కలు. ఇది ఇలా ఉంటే ఇక విజ్ఞులంతా వజ్రాన్ని వజ్రమే ఖండిస్తుంది. అలాగే మోసాన్ని మోసంతోనే జయించాలని ఉద్బోధిస్తుంటారు. అంటే మోసం ఈజ్ ఈక్వల్ టు వజ్రం అన్నమాట. మరి వజ్రమంత విలువైనదాన్ని అలా నెగెటివ్‌గా చూడటం మన తప్పుకాదా?’’ అన్నాడు వాడు.
రాంబాబు గాడితో ఇక నేను వాదించలేక ‘‘ఒరేయ్... ఎవరైనా నిన్ను మోసం చేసినప్పుడు తెలుస్తుందిరా నీకు ఆ బాధేమిటో’’ అన్నాను కినుకగా.
‘‘నీకు నేచురల్ సైన్స్‌లోని నేచర్ అర్థం కావడం లేదు. అందుకే నీకు అర్థమయ్యే భాషలో చెబుతా విను. చిన్నప్పటి మన ‘అడవిరాముడు’ దగ్గర్నుంచి మొన్నటి మహేశ్ బాబు ‘దూకుడు’ వరకూ... మన హీరోలు పాపం విలన్‌లను మోసం చేస్తూ ఆటపట్టిస్తూ ఉంటే... ఇంటర్వెల్‌లో సమోసాలు తెచ్చుకుని తింటూ మరీ ఆ మోసాలను ఎంజాయ్ చేశావా లేదా? మోసం నీకు మోదం ఇస్తుంటే అది నెగెటివ్ ఎలా అవుతుంద్రా’’ అన్నాడు వాడు. ఏమీ బదులు ఇవ్వలేక ‘‘నీదంతా తొండి. నువ్వు చేసేదంతా మాటల గారడీరా’’ అన్నాన్నేను.
‘‘గారడీ అంటేనే మోసం. అది కూడా నువ్వు ఎంజాయ్ చేసేదే’’ అంటే నిశ్శబ్దంగా మోసపోవడమే మరోమారు నా వంతయ్యింది.
- యాసీన్