అనుమానితుడు
దేవా మంచి చిత్రకారుడు. ఇప్పుడిప్పుడే అతడి చిత్రాలు మార్కెట్‌లో మంచి ధర పలుకుతున్నాయి.స్నేహితులు, సన్నిహితుల సలహా మేరకు తొలిసారిగా నగరంలో ‘ఆర్ట్ కార్నర్’ గ్యాలరీలో ఆర్ట్ షో ఏర్పాటు చేశాడు. మంచి స్పందన వచ్చింది. ఆర్ట్ షో మొదలై ఆరు రోజులవుతోంది.ఆరోజు పండగ కావడంతో సందర్శకులు పెద్దగా లేరు.ఏదో అర్జంటు కాల్ రావడంతో...ఒక స్నేహితుడిని గ్యాలరీలో కూర్చోమని చెప్పి బయటికి వెళ్లాడు దేవా.గ్యాలరీలో కూర్చున్న ఆ స్నేహితుడు... కొద్దిసేపటి తరువాత ఒక నవల చదవడంలో నిమగ్నమైపోయాడు.సాయంత్రం పూట గ్యాలరీకి వచ్చిన దేవా కొద్దిసేపటి తరువాత షాక్ తిన్నాడు.తనకు ఎంతగానో పేరు తెచ్చిన ‘ది బ్లూ రోజ్’ పెయింటింగ్ మాయమైంది! షాక్‌లో నుంచి తేరుకొని....
‘‘ది బ్లూ రోజ్‌ను ఎవరైనా అడిగారా?’’ అన్నాడు స్నేహితుడితో.‘‘ఎవరూ అడగలేదు’’ తాపీగా చెప్పాడు ఆ స్నేహితుడు.‘‘ది బ్లూ రోజ్ పెయింటింగ్‌ను ఎవరో దొంగిలించారు’’ విషయం చెప్పాడు దేవా. స్నేహితుడు షాక్ తిన్నాడు.ఇద్దరు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఆరోజు గ్యాలరీకి వచ్చిన సందర్శకులు అయిదు మంది.గ్యాలరీ హాల్‌లో ఎలాంటి వీడియో, కెమెరాలు లేవు.అందుకే పోలీసులు ‘ఎంట్రెన్స్ వీడియో’ను పరిశీలించారు.
మధ్యాహ్నం 1:10... ఒక మహిళ వచ్చారు.ఆతరువాత...
2: 06 ...ఒక పెద్దాయన వచ్చారు.
2:47.... ఇద్దరు కాలేజీ స్టూడెంట్స్ వచ్చారు.
3: 33....ఒక యువకుడు వచ్చాడు.
ఈ అయిదుగురు బయటికి వెళుతున్నప్పటి దృశ్యాలను చూశారు. ఎవరి చేతుల్లోనూ పెయింటింగ్ కనిపించలేదు. మరో విశేషం ఏమిటంటే...ఈ అయిదుగు బ్యాగ్‌లు లాంటి వస్తువులేమీ లేకుండా ఖాళీ చేతులతోనే గ్యాలరీకి వచ్చారు. అయినప్పటికీ.... చివర్లో వచ్చిన యువకుడిని ‘దొంగ’గా తేల్చారు.
ఏ ఆధారంతో పోలీసులు ఆ యువకుడిని అనుమానించారు?
2
తన గదిలో నిద్రపోతున్న బలరామ్‌ను విండో నుంచి కాల్చి చంపారు హంతకులు.
పోలీసులు ఆధారాల కోసం వెదకడం మొదలు పెట్టారు.
ఒక చోట... షూ గుర్తులు కనిపించాయి.
అన్నీ... సైజ్ నంబర్ 10
పోలీసులు ముగ్గురిని అనుమానించారు.
1.రాజు
2.రవి
3.రమణ
రాజు షూస్ సైజ్.... 9
రవి షూస్ సైజ్..... 10
రమణ షూస్ సైజ్... 9
‘‘ఇక ఆలస్యం ఎందుకు? రవే హంతకుడు. అరెస్ట్ చేద్దాం’’ అంటూ పోలీసులు రంగంలోకి దిగారు.
అయితే హత్యతో రవికి ఎలాంటి సంబంధం లేదనే విషయం తెలియడానికి ఎంతోసేపు పట్టలేదు. ఏ ఆధారంతో పోలీసులు రవి హంతకుడు కాదని, రాజు, రమణ హంతకులని తేల్చారు?
1
గ్యాలరీలోకి ప్రవేశించే ముందు... ఆ యువకుడు టక్ చేయలేదు. గ్యాలరీ నుంచి వెళ్లేటప్పుడు మాత్రం... టక్ చేసి కనిపించాడు. దొంగిలించిన పెయింటింగ్‌ను షర్ట్ లోపల దాచాడు.
2
నేరం రవి మీద పోవడానికే... 10 సైజ్ షూస్ ధరించి హత్యకు పాల్పడ్డారు రాజు, రమణ. గమనించాల్సిన విషయం ఏమిటంటే హత్యకు ఒకరోజు ముందు రవి దుబాయికి వెళ్లాడు. ఈ విషయం హంతకులకు తెలియదు!