
ఈ స్టార్... రెస్టారెంట్ల రూటే మార్చేశాడు!
ఆదర్శం
వికలాంగుల కోసం నిపున్ మొదలు పెట్టిన పోరాటం పెద్ద సంచలనాన్నే సృష్టించింది. ప్రభుత్వాన్ని కదిలించింది. రెస్టారెంట్లలోనే కాక ఆఫీసులు ఇతరత్రా ప్రదేశాల్లో కూడా వికలాంగులకు ఇబ్బంది లేని విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆలోచించడం మొదలుపెట్టారు.
‘‘ఈరోజు సరదాగా అందరం కలసి రెస్టారెంట్‌కు వెళదాంరా...’’
‘‘వెళదాం వెళదాం అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఈరోజు మాత్రం తప్పకుండా వెళ్లాల్సిందే.’’
‘‘ఆలస్యమెందుకు పదండి మరి.’’
‘‘నాకైతే టైగర్ ప్రాన్స్ థాయి స్టైల్ కావాలి.’’
‘‘నాకు క్రిస్పీ ఫిష్ విత్ రోస్టెడ్ చిల్లీ.’’
‘‘నాకు ఇవేమీ వద్దు బాబూ... ఓల్డ్ ఫ్యాషన్‌డ చిల్లీ చికెన్ చాలు.’’
‘‘ఆపండి మీ గోల... కెయా వచ్చేసింది.’’
సౌత్ ఢిల్లీ... కెయా రెస్టారెంట్.
ఫ్రెండ్స్‌తో పాటు రెస్టారెంట్‌లోకి వస్తోన్న నిపున్ మల్హోత్రాను డోర్ దగ్గరే ఆపేశాడు మేనేజర్. ‘‘సారీ సార్. మా పాలసీ ప్రకారం వికలాంగులకు అనుమతి లేదు’’ అన్నాడు.
ఆ స్నేహితుల బృందంలో అంత వరకూ ఉన్న ఉత్సాహం ఒక్కసారిగా నీరు గారిపోయింది. ‘‘మీరు కానీయండిరా... నేను వెళతాను’’ అన్నాడు నిపున్.
‘‘నువ్వు లేకుండా పార్టీ ఏమిటి?!’’ అంటూ అందరూ వెనక్కి తిరిగి వచ్చారు. ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. అందరూ ప్రశాంతంగా నిద్రపోయారు. నిపున్ తప్ప!
మనసంతా చేదుగా ఉంది నిపున్‌కి. హోటల్లో తనకు ఎదురైన అనుభవం గుండెల్లో గుచ్చుతోంది. ఆ బాధ క్షణ క్షణానికీ హెచ్చుతోంది. ఎవరితో పంచు కోవాలో అర్థం కాలేదు. సోషల్ మీడి యాను ఆశ్రయించాడు. ఫేస్‌బుక్‌లో తన ఆవేదనను వెలిబుచ్చాడు. దానిపై పెద్ద చర్చ జరిగింది. వికలాంగుల హక్కుల సంఘాలు విరుచుకు పడ్డాయి. వెంటనే ఢిల్లీ ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశించింది.
ఆ రోజుతో నిపున్ అందరికీ పరిచితుడు అయిపోయాడు. ఎందరో వికలాంగులు తమకు ఎదురైన చేదు అనుభవాలను నిపున్‌తో పంచుకున్నారు. అవన్నీ విన్న తరువాత మథనం మరింత ఎక్కువయ్యింది నిపున్‌లో. తనలాంటి వాళ్లందరి కోసం ఏదో ఒకటి చేయాలనే పట్టుదల పెరిగింది. అప్పుడే అతనికి ‘యెల్ప్’ గుర్తొచ్చింది.
‘యెల్ప్’ అనేది పాశ్చాత్య దేశాల్లో పాపులర్ యాప్. వికలాంగుల కోసం ప్రత్యేక సదుపాయలు ఉన్న రెస్టారెంట్ల గురించి యెల్ప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఒక కోర్స్ కోసం నిపున్ అమెరికాకు వెళ్లినప్పుడు దాని గురించి తెలిసింది. అది ఇప్పుడు గుర్తొచ్చింది. ఇలాంటి సదుపాయం ఇండియాలో ఎందుకుండకూడదు అనుకున్నాడు. అను కోవడమే కాదు, ఆ దిశలో ప్రయత్నం మొదలు పెట్టాడు. దానికోసం ‘జొమటో’ సహకారం తీసుకున్నాడు నిపున్.
‘జొమటో’ అనేది మన దేశంతో సహా 22 దేశాల్లో పనిచేస్తున్న సెర్చ్ అండ్ డిస్కవరీ సర్వీస్ వెబ్‌సైట్. 2008లో మొదలైన దీనిలో రెస్టారెంట్లకు సంబం ధించిన పూర్తి సమాచారం... మెనూ, ఫొటోలు, రివ్యూలతో సహా ఉంటుంది.
‘‘అమెరికా, బ్రిటన్ మొదలైన దేశాల్లో ఎటు వెళ్లినా డిజేబుల్డ్ ఫ్రెండ్లీ వాతా వరణం కనిపిస్తుంది. ఇలాంటిది మన దేశంలో కూడా కనిపించాలి’’ అంటూ రంగంలోకి దిగాడు నిపున్. ‘మన దేశంలో అది సాధ్యపడదు’ అని కొందరు నిరాశ పరిచినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. వికలాంగుల హక్కుల కార్యకర్తలతో కలిసి ‘జొమటో’లో నమోదైన రెస్టారెంట్ల యజ మానులతో మాట్లాడాడు.
వికలాంగుల ఇబ్బందుల గురించి వివరించాడు. వాళ్లకు అందరిలాగే జీవించి ఆనందించే అవకాశం కల్పించాలని కోరాడు. వాళ్ల మనసులు కదిలాయి. చాలామంది తమ రెస్టారెంట్లలో వికలాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ఇలాంటి రెస్టారెంట్ల గురించి చెప్పడానికి ‘డిజేబుల్డ్-ఫ్రెండ్లీ’ పేరుతో కొత్త ఫీచర్‌ను సైతం మొదలు పెట్టింది జొమటో.
అయితే ఇంకా ఎన్నో సవాళ్లు మిగిలే ఉన్నాయి. డిజేబుల్డ్ అనేది పెద్ద ఏరియా. ఇందులోని అన్ని కోణాల గురించి ఆలోచించడం, వాటికి పరిష్కారా లను కనిపెట్టడం మనలాంటి దేశాల్లో కాస్త కష్టమే కావచ్చు. అందుకే ప్రస్తుతానికి రెయిలింగులు అడ్డం రాకుండా, వీల్ చెయిర్లు తిరగడానికి వీలుగా ఉండేలా తమ రెస్టారెంట్లను తీర్చిదిద్దే పనిలో ఉన్నారు చాలామంది. బహుశా విక లాంగులకు మరిన్ని సౌకర్యాలు కల్పించ డానికి అన్ని రెస్టారెంట్లూ మున్ముందు పూనుకోవచ్చు. తన ఆశయం సంపూర్ణంగా ఫలించినందుకు నిపున్ మల్హోత్రా పెదాలపై విజయపు నవ్వు కనిపించవచ్చు.