ఇక చాలు | the target of violence against women | Sakshi
Sakshi News home page

ఇక చాలు

Published Sat, Nov 19 2016 10:54 PM | Last Updated on Sat, Jul 28 2018 8:43 PM

ఇక చాలు - Sakshi

ఇక చాలు

కవర్‌స్టోరీ

ఇంటా బయటా తేడా లేకుండా మహిళలు హింసకు గురవుతూనే ఉన్నారు. అట్టడుగు దేశాల్లోనే కాదు, అగ్రరాజ్యాల్లోనూ ఇదే పరిస్థితి. ఇల్లు, బడి, గుడి, ఆఫీసు,  బస్టాపు, సినిమా హాల్, షాపింగ్ మాల్... ఇవేవీ మహిళలకు  వందశాతం సురక్షితమైన ప్రదేశాలని నమ్మకం పెట్టుకునే పరిస్థితులే లేవు. వయో తారతమ్యాలు, చదువు సంధ్యలు, సామాజిక హోదా, ఆర్థిక స్థితిగతులతో నిమిత్తం లేకుండ  దాదాపు మహిళలందరూ ఏదోరకమైన హింసను అనుభవిస్తూనే ఉన్నారు. అయిన వారు, కాని వారు అనే తేడా లేకుండా పురుషాధిక్య సమాజంలో భాగస్వాములైన వారందరూ మహిళలపై యథేచ్ఛగా హింసకు పాల్పడుతూనే  ఉన్నారు. దేశ దేశాల్లో ఎన్ని చట్టాలు ఉన్నా మహిళల భద్రతకు  భరోసా కల్పించలేకపోతున్నాయి. ఎన్నాళ్లీ ‘హింస’ధ్వని?  ఇక చాలు... అని ముక్తకంఠంతో మహిళలు చేస్తున్న  ఆక్రందనలన్నీ అరణ్యరోదనలుగానే మిగిలిపోతున్నాయి.

అంతర్జాతీయ సమస్య
అతివలపై హింసాకాండ అనాదిగా కొనసాగుతున్న అంతర్జాతీయ సమస్య. అభివృద్ధి గణాంకాలు ఎలా ఉన్నా, ప్రపంచంలో మహిళలపై హింస మాత్రం అంతకంతకూ పెరుగుతూనే వస్తోంది. ఐక్యరాజ్య సమితి ఈ పరిస్థితి తీవ్రతను దాదాపు రెండు దశాబ్దాల కిందటే గుర్తించింది. మహిళలపై హింసను అరికట్టేందుకు కార్యాచరణ ప్రణాళికను 1993లోనే ప్రకటించింది. అయితే, దీనివల్ల ఒరిగిందేమీ లేదు. పైగా మహిళలపై అఘాయిత్యాలు మరింతగా పెరిగాయి. ఐక్యరాజ్య సమితి మహిళలపై హింసను అరికట్టేందుకు కార్యాచరణ ప్రణాళికను ప్రకటించిన ఇరవయ్యేళ్ల తర్వాత చూసుకుంటే, ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు లైంగిక దోపిడీకి, భౌతిక దాడులకు బాధితులుగా ఉంటున్నట్లు అంతర్జాతీయ గణాంకాలే చెబుతున్నాయి. అత్యాచార బాధితుల్లో దాదాపు 35 శాతం మంది బాగా తెలిసిన వారి చేతుల్లోనే లైంగిక దాడులకు గురవుతున్నట్లు ఈ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లైంగిక అత్యాచారాల బారిన పడిన బాలికల సంఖ్య 12 కోట్లకు పైమాటేనని కూడా ఐక్యరాజ్య సమితి గణాంకాలు చెబుతున్నాయి. ఆడ శిశువులపై హింస పుట్టుకకు ముందే మొదలవుతోందని, చాలామంది మహిళలు జీవిత చరమాంకంలోగా ఏదో రకమైన హింసను అనుభవిస్తూనే ఉన్నారని పలు అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

లెక్కలకు అందని హింస
మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు, పలు దేశాల ప్రభుత్వాలు లెక్కలు సేకరిస్తూనే ఉన్నా, లెక్కలకు అందని నేరాలు చాలానే ఉంటున్నాయి. యుద్ధవాతావరణం నెలకొన్న దేశాల్లో, సంఘర్షణలు జరుగుతున్న దేశాల్లో మహిళలపై జరుగుతున్న హింస చాలా వరకు లెక్కలకు అందకుండా పోతోంది. చాలా దేశాల్లో మహిళలపై నేరాలను అరికట్టేందుకు చట్టాలు ఉన్నా, వాటి అమలు తీరు అంతంత మాత్రంగానే ఉంటోంది. చాలా దేశాల్లో బాధిత మహిళలు న్యాయం కోరుతూ కనీసం ఫిర్యాదు చేసే పరిస్థితులు కూడా లేవు. తెగించి ఫిర్యాదు చేసినా, వారికి న్యాయం దక్కుతుందనే భరోసా కూడా లేదు.

ఇదీ పరిస్థితి
మహిళలపై హింస నానా రూపాల్లో సాగుతోంది. లింగ వివక్ష, భౌతిక దాడులు, లైంగిక దాడులు, మానసిక వేధింపులు...
లైంగిక దాడులు, గృహహింస బారిన పడుతున్న మహిళల్లో 15-44 సంవత్సరాల మధ్య వయసులో గలవారే ఎక్కువ.
మహిళలపై హింసకు పాల్పడుతున్న వారిలో సన్నిహితులు, పరిచితులే ఎక్కువ మంది.
లైంగిక దాడుల్లో దాదాపు 95% మంది నిందితులు బాధితులకు పరిచితులే
48%  జీవిత భాగస్వాముల చేతిలో హింసకు గురవుతున్న మహిళలు ప్రపంచవ్యాప్తంగా 48 శాతం పైగానే ఉంటారు.

మీకు తెలుసా?
హత్యలకు గురవుతున్న మహిళల్లో దాదాపు సగం మంది భర్తలు, సహజీవన భాగస్వాముల చేతిలో హతమారిపోతున్నవారే
వెనుకబడిన ఆఫ్రికన్ దేశాల్లో ప్రతి 6గంటలకు ఒక మహిళ జీవిత భాగస్వాముల హత్యకు గురవుతోంది అంటే  రోజుకు నాలుగన్నమాట

లైంగిక హింస
లైంగిక హింసకు సంబంధించి అంతర్జాతీయంగా లెక్కలకు అందుతున్న వివరాలు తక్కువే.
గణాంకాలకు అందుతున్న వివరాలు అతి తక్కువ మాత్రమేనని ఐరాస చెబుతోంది.
22.3% భాగస్వాములు కాని వారి చేతిలో లైంగిక హింసకు గురవుతున్న మహిళలు
54% 15-19 వయసు గల యువతుల్లో లైంగిక బెదిరింపులకు గురవుతున్న వారు.

యుద్ధ పరిస్థితుల్లో లైంగిక హింస
యుద్ధం, ఘర్షణలు కొనసాగుతున్న ప్రాంతాల్లో సైనిక బలగాల చేతిలో  లైంగిక దాడులకు గురవుతున్న మహిళల సంఖ్య లెక్కలకు అందనిది.
36  ఆఫ్రికన్ దేశాల్లో సగటున రోజుకు నమోదవుతున్న లైంగిక దాడుల కేసులు
5,00,000 రువాండాలో 1994లో నెలకొన్న కల్లోలంలో బలైన మహిళలు

మహిళలపై జరుగుతున్న ఈ నేరాలు సమాజానికి సిగ్గుచేటు ఇకనైనా మహిళలపై జరుగుతున్న నేరాలకు చరమగీతం పాడాలని ఐరాస ఆకాంక్షిస్తోంది.

వివిధ దశల్లో మహిళలపై హింస
గర్భస్థ పిండం :     లింగ నిర్ధారణ, భ్రూణహత్యలు
బాల్యం   :     ఆడ శిశువుల హత్యలు, మానసిక వేధింపులు, భౌతిక, లైంగిక దాడులు, బాల్య వివాహాలు, లైంగిక దోపిడీ, పోర్నోగ్రఫీ, జెనిటల్ మ్యుటిలేషన్, అక్రమ రవాణా

కౌమారం, యవ్వనం    :     ఆర్థిక ప్రలోభాలతో లైంగిక దోపిడీ, బాయ్‌ఫ్రెండ్స్ చేతిలో హింస, ప్రేమ పేరిట వేధింపులు, బెదిరింపులు, యాసిడ్ దాడులు,  అక్రమ రవాణా, లైంగిక బానిసత్వం, భౌతిక, లైంగిక దాడులు, పని ప్రదేశాల్లో వేధింపులు, వివక్ష, కక్ష సాధింపులు, శారీరక, మానసిక హింస, హత్యలు   

వార్ధక్యం :     శారీక, మానసిక హింస, పిల్లల నిరాదరణ

వివిధ రూపాల్లో హింస
మహిళలు నిత్యం వివిధ రూపాల్లో హింసను ఎదుర్కొంటున్నారు. ఇళ్లల్లో కుటుంబ సభ్యుల నుంచి గృహహింస, వరకట్న వేధింపులు, శారీరక, మానసిక హింసతో చాలామంది మహిళలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. కొన్నిసార్లు ఈ హింసాకాండ ఆత్మహత్యలకు దారితీస్తున్న సందర్భాలూ లేకపోలేదు. వరకట్నం కోసం అత్తింటి వారి చేతిలో హత్యలకు గురవుతున్న మహిళల సంఖ్య తక్కువేమీ కాదు. నచ్చిన వ్యక్తిని ప్రేమించిన పాపానికి కొందరు యువతులు పరువు హత్యలకు గురవుతున్నారు. విద్యాలయాలు కూడా సురక్షితంగా ఏమీ లేవు. పాఠశాల స్థాయిలోనే లైంగిక వేధింపులు, లైంగిక దాడుల బారిన పడ్డ బాలికల సంఖ్య ఐరాస అంచనా ప్రకారం దాదాపు 24.6 కోట్లు ఉంటుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. హెచ్‌ఐవీ/ఎయిడ్స్ బారినపడ్డ మహిళల్లో ఎక్కువ శాతం అత్యాచార బాధితులు, లైంగిక బానిసత్వంలో చిక్కుకున్న వారే ఉంటున్నారు.

ఇదిలా ఉంటే, ఇంటి నుంచి ఏదైనా పని మీద బయటికొస్తే గమ్యం చేరేలోగా వెంటాడే పోకిరీల వేధింపులు, అసభ్య వ్యాఖ్యలతో మానసిక వేదనకు గురవుతున్న మహిళలు మన దేశంలో దాదాపు 88 శాతం వరకు ఉన్నారు. కాయకష్టాన్ని నమ్ముకున్న మహిళా కార్మికులకు, కార్యాలయాల్లో ఉద్యోగాలు చేసే మహిళలకు కూడా ఇలాంటి కష్టాలు తప్పడం లేదు. లైంగిక దాడులు, అత్యాచార యత్నాలు, పనిప్రదేశంలో లింగ వివక్ష, అసభ్య వ్యాఖ్యలు, సందేశాలతో మానసిక వేధింపులు మహిళల పురోగతికి అడుగడుగునా అడ్డుతగులుతున్నాయి. హైటెక్ కాలం మొదలయ్యాక మహిళలకు సైబర్ వేధింపులూ ఎదురవుతున్నాయి. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా దాదాపు ప్రతిచోటా మహిళలు ఇలాంటి హింసను నిరంతరం ఎదుర్కొంటూనే ఉన్నారు. మారుమూల పల్లెల్లోనైతే పరిస్థితులు మరీ దారుణం. చేతబడుల వంటి ఆరోపణలతో భౌతిక దాడులకు, అత్యాచారాలకు, చివరకు హత్యలకు గురవుతున్న మహిళల సంఖ్య తక్కువేమీ కాదు.

లెక్కలకు చిక్కుతున్నవి తక్కువే!
మహిళలపై హింసకు సంబంధించి లెక్కలకు చిక్కుతున్న వివరాలు తక్కువే. ప్రపంచంలోని చాలా దేశాలు ఈ వివరాలను సేకరించడంలో, పరిస్థితిని చక్కదిద్దడంలో చిత్తశుద్ధి చూపడం లేదు. దాదాపు వంద దేశాలు మాత్రమే 1995 నుంచి 2014 మధ్య కాలంలో ఈ వివరాల కోసం ఒక్కసారి సర్వే చేసి సరిపెట్టుకున్నాయి. వాటిలో నలభైకి పైగా దేశాలు మాత్రమే ఈ మధ్య కాలంలో రెండోసారి సర్వే చేశాయి. గృహహింసకు వ్యతిరేకంగా 119 దేశాలు చట్టాలను అమలు చేస్తున్నాయి. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా 125 దేశాలు చట్టాలను అమలు చేస్తున్నాయి. అయితే, ఈ అన్ని దేశాల్లోనూ అమలవుతున్న చట్టాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయనేమీ లేదు. అలాగే, ఈ చట్టాలన్నీ బాధిత మహిళలకు సత్వర న్యాయం కల్పిస్తున్నాయనే దాఖలాలు కూడా లేవు. చాలా దేశాల్లో మహిళల రక్షణ కోసం పేరుకు చట్టాలు అమలవుతున్నా బాధిత మహిళలు కనీసం ఫిర్యాదు చేసేందుకైనా అనుకూలమైన పరిస్థితులు లేవు. ఫిర్యాదులు చేసేందుకు పోలీసులను ఆశ్రయించే బాధిత మహిళలపై సాక్షాత్తు పోలీసులే అత్యాచారాలకు, మానసిక, శారీరక వేధింపులకు తెగబడుతున్న సందర్భాలూ లేకపోలేదు. మహిళల శాంతియుత జీవనానికి, మహిళలకు పూర్తి భద్రత కోసం, మహిళల పట్ల లింగవివక్ష రూపుమాపడం కోసం ఐక్యరాజ్య సమితి గడచిన కొన్ని దశాబ్దాలుగా లెక్కలేనన్ని తీర్మానాలు చేసినా, అవేవీ సజావుగా అమలుకు నోచుకున్న దాఖలాలు లేవు.

మన దేశంలో మరీ దారుణం
అట్టడుగు దేశాల సంగతి సరే, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందిన మన భారత్‌లోనూ మహిళల పరిస్థితులు దారుణంగా ఉంటున్నాయి. మహిళల పట్ల నేరాల సంఖ్య మన దేశంలో నానాటికీ పెరుగుతోందని జాతీయ నేర గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి. ‘నిర్భయ‘ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత సైతం మన దేశంలో మహిళలపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా 2014లో 36,735 అత్యాచారం కేసులు నమోదైతే, 2015లో 34,651 కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కల ఆధారంగా అత్యాచారం కేసుల్లో 5.7 శాతం తగ్గుదల నమోదైందని జాతీయ నేర గణాంకాల విభాగం చెబుతున్నా, ఇది నామమాత్రపు తగ్గుదల మాత్రమే. గత ఏడాది అత్యాచారాలకు బలైన బాధితుల్లో 8,800 మంది చిన్నారులే ఉన్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అత్యాచార యత్నాలు, లైంగిక వేధింపులకు సంబంధించి 2014లో 82,235 కేసులు నమోదైతే, 2015లో ఇవి 84,222 కేసులకు పెరిగాయి. బాలికలు, యువతుల కిడ్నాప్‌లకు సంబంధించి 2014లో 57,311 కేసులు నమోదవగా, 2015లో 59,277 కేసులు నమోదయ్యాయి. వీటిలో దాదాపు 54 శాతం కిడ్నాప్‌లు బలవంతపు పెళ్లిళ్ల కోసం జరిగినవేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. మహిళల పట్ల ఇలాంటి నేరాలకు పాల్పడిన నిందితుల్లో దాదాపు 95 శాతం మంది బాధితులకు బాగా తెలిసిన వారేనని కూడా అధికార వర్గాలు చెబుతున్నాయి. చిన్నారులపై అత్యాచారాలకు తెగబడే వారిలో ఎక్కువగా కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు, ఇరుగు పొరుగు తెలిసిన వ్యక్తులు, ఉపాధ్యాయులు వంటి వారే నిందితులుగా ఉంటున్నారు. మరోవైపు పేదవర్గాలకు చెందిన బాలికలు, మహిళలు ఎక్కువగా మానవ అక్రమ రవాణా బారిన పడుతున్నారు. మానవ అక్రమ రవాణా బారిన పడిన బాలికలు, మహిళలు వ్యభిచార కూపాల్లో చిక్కుకుని, లైంగిక బానిసలుగా దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. మానవ అక్రమ రవాణా బాధితుల్లో చిన్నారుల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. గత ఏడాది దేశవ్యాప్తంగా 6,877 మంది మానవ అక్రమ రవాణా బారిన పడితే, వారిలో 3,490 మంది మైనారిటీ తీరని బాలికలే ఉన్నారు.

గృహహింస నిత్యకృత్యం
మన దేశంలో గృహహింస దాదాపు నిత్యకృత్యంగా ఉంటోంది. దేశ మహిళల్లో దాదాపు 70 శాతం మంది గృహహింస బాధితులేనని 2006 లో చేపట్టిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. వరకట్నం కోసం భర్త, అతడి తరఫు బంధువుల చేతిలో చాలామంది మహిళలు నిత్య యాతన అనుభవిస్తున్నారు. గృహహింసకు తట్టుకోలేక, దుర్భర జీవితం నుంచి తప్పించుకోలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంకొందరు భర్త, అత్తింటి వారి చేతిలో హత్యలకు గురవుతున్నారు. 2012-14 కాలంలో... అంటే, మూడేళ్ల వ్యవధిలో 24,771 మంది మహిళలు అత్తింటి వారి వరకట్నదాహానికి ప్రాణాలు కోల్పోయారు. ఈ మూడేళ్ల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా 3.48 లక్షల గృహహింస కేసులు నమోదయ్యాయి. గృహహింసకు సంబంధించి పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 61,259 కేసులు నమోదైతే, రాజస్థాన్‌లో 44,311 కేసులు, ఆంధ్రప్రదేశ్‌లో 34,835 కేసులు నమోదయ్యాయి. వరకట్న నిషేధ చట్టం 1961లోనే అమలులోకి వచ్చినా, మన దేశంలో వరకట్నానికి సంబంధించిన కేసులు తగ్గకపోగా, నానాటికీ పెరుగుతూనే ఉండటం గమనార్హం. మహిళలపై నేరాలను అరికట్టే లక్ష్యంతో ఎన్ని చట్టాలు వచ్చినా, ఆశించిన ఫలితం మాత్రం కనిపించకపోవడం శోచనీయం. ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతుండటం వల్లనే పార్లమెంటులో మహిళలకు రిజర్వేషన్ల బిల్లుకు మోక్షం లభించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మన దేశంలో 2015లో  మహిళలపై జరిగిన నేరాలు 34,651  లైంగిక దాడులు
►  84,222  అత్యాచార యత్నాలు, లైంగిక వేధింపులు
59,277 బాలికలు, యువతుల కిడ్నాప్‌లు
6,877 మానవ అక్రమ రవాణా బాధితులు
మూడేళ్ల వ్యవధిలో గృహహింస కేసులు 3,48,000  దేశవ్యాప్తంగా నమోదైనవి
61,259 పశ్చిమబెంగాల్‌లో...
44,311 రాజస్థాన్‌లో...
34,835  ఆంధ్రప్రదేశ్‌లో...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement