మేనకోడలిపై అత్యాచారం: యువకుడికి జీవితఖైదు
తన మేనకోడలిపై మూడేళ్లుగా పదే పదే అత్యాచారం చేయడంతో పాటు.. ఆమె ముఖంపై యాసిడ్ పోస్తానని బెదిరించినందుకు ఓ యువకుడికి ఢిల్లీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అతడు అత్యంత క్రూరంగా ప్రవర్తించినందున క్షమించి వదిలేసే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. మేనమామ అయి ఉండి మేనకోడలి ఆత్మగౌరవాన్ని, ఆమె శీలాన్ని కాపాడాల్సింది పోయి.. అతడే ఇంతటి అఘాయిత్యానికి పాల్పడటం దారుణమని, ఇలాంటి వాళ్ల వల్ల రక్తసంబంధాలు కలుషితం అయిపోతున్నాయని జడ్జి వ్యాఖ్యానించారు.
బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు అతడిమీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడని, విషయం వెలుగులోకి రావడానికి ముందు మూడేళ్ల నుంచి ఈ ఘోరానికి పాల్పడుతున్నాడని, అది క్షమించరాని నేరమని చెప్పారు. జీవితఖైదుతో పాటు అతగాడికి రూ. 11 వేల జరిమానా కూడా విధించారు. ఐపీసీ సెక్షన్లు 6, లైంగిక వేధింపుల నుంచి బాలలకు రక్షణ చట్టం, సెక్షన్ 506ల కింద అతడిపై నేరం రుజువైంది. ఢిల్లీ ప్రభుత్వం బాలిక సంక్షేమం, పునరావాసానికి నష్టపరిహారంగా లక్ష రూపాయలు చెల్లించాలని జడ్జి ఇలా అరుణ్ ఆదేశించారు. బేగంపూర్ పోలీసు స్టేషన్లో గత సంవత్సరం జూలై నెలలో ఈ ఫిర్యాదు నమోదైంది. తమతోపాటే కలిసుంటున్న పాప మేనమామే ఇలా చేశాడని తల్లిదండ్రులు ఫిర్యాదుచేశారు.