ఇప్పుడే వస్తాను | Third prize-winning story | Sakshi
Sakshi News home page

ఇప్పుడే వస్తాను

Published Sun, May 8 2016 12:06 AM | Last Updated on Sun, Sep 3 2017 11:37 PM

ఇప్పుడే వస్తాను

ఇప్పుడే వస్తాను

మూడవ బహుమతి పొందిన కథ
 పెద్దమ్మది దుఃఖ ప్రపంచం. ఎడ తెర్పి లేనిది, వెత తీరనిది. ఎన్నో రోజుల్నుంచి అదే తీరు. కొడుకు మతిలో కొచ్చి, పెదనాన్న ఇంట్లో వున్నంత సేపు తిడతాడని మిన్నకుంటది. పెదనాన్న ఆఫీసుకు పోంగనే కొడుకుని తల్సుకొని, తల్సుకొని దుఃఖంతో చెరువు నిండి పొర్లినట్టు కళ్లమ్మెట అలుగు కాల్వలు పారిస్తుంటది. ఆరేళ్ల క్రితం నాటి జ్ఞాపకం... గోడకు దిగ్గొట్టిన ఫొటోఫ్రేమ్‌లా నిత్యం మెళ్లో వేలాడుతున్నట్టుండేది. ఆ జ్ఞాపకాలు, మనసులో కుత కుతా పొయిమీద అన్నం వుడికినట్టు వుడుకుతుంటయ్. పెద్దమ్మ ముంగట వుండటానికి బాధ, కష్టమనిపించేది.  ఆకాశం నుండి రాలే ప్రతి చినుకు మధ్యలో ఆకుల మీదో, చెట్లమీదో వాలి, కాస్త సేదతీరి భూమిపై రాలి ఇంకిపోతుంటది. మనిషీ అంతేనేమో, ఇప్పుడే వస్తానంటూ..! కొంతమందైతే, ‘మీ తమ్ముడేంట్రా, ఆ బండి తోలకం.’
 
 ‘నువ్వైనా చెప్పలేవా?’
 ‘చెప్తూనే వున్నా’ సంజాయిషీ తీగలాగ సాగలాడుతూ చెప్పుకొచ్చేవాడిని. తమ్ముడు కాదు, స్నేహితుడు అని చెప్పే సందర్భమూ రాలేదు, ఎవ్వరూ ఆ అవకాశం ఇవ్వలేదు. ఆ అవసరం లేదనిపించేది. అలా వుండిపోయాం. అలా జీవించేశాం. తను లేడు, జ్ఞాపకాల్ని మిగిల్చి రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోయాడు. పెద్దమ్మతో ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. యాక్సిడెంట్‌లో చినిగి, పీలికలు పీలి కలై ఒంటిమీద మిగిలిన చొక్కాలా అతకని అవిటితనంలా నేను.ఒక్కసారైనా వాణ్ని లాగి చెంపమీద కొట్టి మిగుల్చుకుంటే బాగుండేదని మనసు ఘోషి స్తుంది. పాత సామెత నన్ను బాగా వేధిస్తుంది. ‘చేతులు కాలినంక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటి?’ అని.
 
 ‘‘ప్రతి గింజ మీదా ముందుగానే తినేవాడి పేరు రాసే వుంటుందంటారు. అలా వాడి పేరున రాసివున్న ఆ నూకలన్నీ అయిపోయినాయేమో?’’ అని పెద్దమ్మతో చెప్పి ఓదార్చాలని చూసేవాడిని.మనసులో వున్న బాధ ఎవరితోనన్నా చెప్పుకుంటే, కాస్త తేలిక పడతామంటారే, అలా ఏమన్నా తేలిక పడతానేమోనన్న ప్రయత్నమే - ఈ కథ!అందరూ పునర్ జన్మల గురించే చెప్పారు. అవి ఒక్కలా లేకున్నా, అందరూ ఏదో రూపంలో బతికేస్తామంటారు.
 
 మళ్లీ ఇలానేనా? ఏమో!?
 చీము, నెత్తురు, ప్రేమ, ద్వేషం, మంచీ చెడుల సమహారం, ఏమో? ఐనా మేం జీవించిన బతుకుల గురించి, ఆ జ్ఞాపకాల గురించి ఇలా ప్రారంభిస్తాను. వాడు లేడు, ఆ రెండు కుటుంబాల మధ్య పుల్లకు గుచ్చిన ఐస్ ‘గోలా’కు నచ్చిన రంగులన్నీ చిమ్ముకుంటూ -
 ముందు మా ఇంటికెళ్దాం;
 
 ‘‘పెద్దమ్మ ఫోన్ చేసింది’’
 ‘‘నాకూ చేసింది. ఫోన్ని మైన్‌లోకి తీస్కోపోను గదా, మిస్డ్ కాల్స్‌లో వుంది, మళ్లీ చేద్దామనుకున్న మాటల్లో పడి మర్చిపోయిన.’’‘‘ఎన్నిసార్లు ఫోన్ చేయాల్రా నీకు, పోయి ఇల్లు వెకెట్ చేసి రాకపోయినవ్, నీచేయ్ పడంది ఏ పని చేయలేని బలహీనత వాళ్లది. పెద్దమ్మ సరే, ఆ సారు కూడ అంతే అలవాటైండు.’’
 
 ‘‘ఇక ఆపు. రేపు ఆదివారం డ్యూటీ చేసినంక సోమవారం రెస్ట్ పెట్టి, మంగళవారం ఒక లీవ్ పడేసి పోయి పని ముగించుకొని వస్తా. సరేనా.’’‘‘ఓ..హో... గదా నీ ప్లాన్. నైట్ షిఫ్ట్ వచ్చిందంటే డ్యూటీ ఎట్లా ఎగ్గొట్టాల్నా అని చూస్తుంటావ్. అక్కడ ఇంటి యజమాని పెద్దమ్మని నిద్ర పోనిస్త లేడంట. ఎప్పుడు ఖాళీ చేస్తరు అని ఒకటే నస పెడుతుండట.’’‘‘నేను ఆ ఇంట్లో దిగుతున్నప్పుడే చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పి. రైలు పట్టాల పొంటి ఇల్లిదీ, మీరు రైళ్ల రాకపోకల శబ్దాల మధ్య వుండలేరూ అని. ఇంటరా నా మాట మీరు?’’‘‘సర్లేరా బాబూ, సోమవారం వస్తనని పెద్దమ్మకు ఫోన్ చేసి చెప్పు. లేకుంటే మళ్లీ ఫోన్ చేస్తుంది.’’
 
 ‘‘సర్లే’’ అన్నాడు.
 ఆర్నెల్ల క్రితం అక్క వాళ్లకు జిల్లా సెంటర్ ఖమ్మంకు ట్రాన్స్‌ఫర్ అయింది. లేకుంటే ఇక్కడనే కొత్తగూడెంలోనే వుండేటోళ్లు. ఉద్యోగం గదా మరి పోక తప్పుద్దా. అద్దిండ్ల కిరికిరి. ఎవల్లకు కోపమొచ్చినా అద్దెకుండేటోళ్లే ఇల్లు ఖాళీ చేయాలె అనుకుంటా అప్పుడే డ్యూటీ నుంచొచ్చిన కొడుకుతో సంభాషణ ముగించి ‘టీ’ పెట్టడానికి వంటగదిలోకి వెళ్లింది. సింగరేణిలో ఉద్యోగం చేసుడంటే సర్కస్‌లో తాడుమీద నడుస్తున్న పిల్ల మాదిరి. ఒకటే టెన్షన్, తీవ్రమైన పని వత్తిడి. అలసిపోయే శారీరక శ్రమ. నరాలు తెగుతున్న చప్పుడు చెవుల్లో మార్మోగుతుంటది.
 
 రాత్రనక పగలనక భూమి గర్భంలోకి దూరి లోకానికి వెలుగు రాశులు పేర్చే కార్మికులు, అందుకే నైట్ షిఫ్ట్‌లలో డ్యూటీలు ఎగ్గొడుతుంటారు. వీధిలో వెలుగుతున్న స్ట్రీట్ లైట్‌లాగ రాత్రంతా మెలకువతో వుండాలి. నిత్యం ప్రమాదాల మధ్య పనిచేయాలి. అందుకే ఏ కార్మికుడైనా రాత్రి బదిలీ వచ్చిందంటే నాగాలు చేస్తుంటడు. తన కొడుకు ఒక్కనిదే కాదు, కార్మికులందరి సమస్య. ‘రాత్రి బదిలీ పెట్టినోన్ని చెప్పుచ్చుకొని కొట్టాల్రా’ అని తమలో తాము తిట్టుకుంటుంటరు. ఐనా తప్పదు.
   
 బస్సు సిటీలోకి అడుగుపెట్టినట్టుంది. నడక మందగించి స్లో అయిపోయింది. బస్సెక్కగానే మా చెడ్డ అలవాటుకు అలవాటు పడ్డడు. బస్సెక్కినంక కండక్టర్ టికెట్ చేతిలో పెట్టుడే ఆలస్యం. చిన్నపాటి గురుక పెట్టి నిద్రపోవుడే. ఒకొక్కపాలైతే సోయి మర్చి నిద్దుర పోతడు. కండక్టర్ లెక్కపెట్టుకొని వూరు దాటినంక లేపి దింపిన రోజులు ఎన్నో వున్నాయి. సిటీలోకి బస్సు దూరినంక స్లో మోషన్ల కదుల్తుంది. టూగుటాయాల తీర్గ ఊపుడుకు మంచిగనిపిస్తుంది. అమ్మ వూపిన ఊయల మాదిరి కళ్లు మూసుకొని బస్సులో ముచ్చట్లు ఆలకించుకుంట కూర్చున్నడు లతీఫ్.
 
 ‘‘అగో, అక్కా ఏదో జూలూస్ పోతున్నట్టున్నది.’’కిటికీ సందులోంచి తల బైటికి పెట్టి చూసినామె ‘‘జూలూస్ కాదే, ఎవలో తురుకోల ్లసావులాగుంది. మంది మస్తుగున్నరు. డబ్బు బాగున్నోడేమో? రోడ్డు మందితోటి కిక్కిర్సి పోతుంది. అందుకే బస్సుకు పోయే తోవ్వ లేక నిమ్మలంగ పోతుంది.’’ఈ ముచ్చట చెవులబడంగనే కండ్లు తెర్సి సీట్లోంచి లేసి బస్సు ముంగటికి చూసిండు. వందా, నూటా యాభైమంది కంటే ఎక్కువనే వున్నరు.
 
  తలలకు తెల్లటోపీలు పెట్టుకొని, తెల్లంగి, తెల్ల పైజమాలు వేసుకున్నోళ్లే వున్నరు. ఒకరినొకరు దాటుకుంటూ, భుజాలు మార్చు కుంటూ అంతిమ యాత్ర కొనసాగుతుంది. చీమలదండు కదులుతున్నట్టు కన్పిస్తుంది. ‘‘ఇగ సాల్దీయ్, గిట్ల ఎంత దూరం పోవాల్నో’’ అని గులుకుంటన్నరు. దూరాభారం ప్రయాణమైనోళ్లు.
 
 లతీఫ్ గబగబా సీట్లోంచి లేసి కండక్టర్ దగ్గరకు పోయి జర నాల్గు అంగలు భుజం ఇచ్చి వస్తానని, కండక్టరు పర్మిషన్ లేకుండనే చిన్నగా డొల్లుతున్న బస్సులోంచి దిగి వురికిండు లతీఫ్. కొంచెం దూరం పోయినంక శవయాత్ర కుడి వైపుకు తిరుగుతుందనగ పాడె పట్టిన లతీఫ్ తిరుగొచ్చి బస్సెక్కి, సీట్ల ఎప్పట్లాగనే కూర్చు న్నడు. బస్సులోని ఇతర ప్రయాణీకులు విచి త్రంగా చూస్తున్నరు. లతీఫ్ వైపు నడి వైసామె ‘‘మీకు మైల ఏమి వుండదా? పోయినాయన నీకేమైన సుట్టమా?’’ అని అడిగింది.
 
 లతీఫ్‌కు ఎట్లా చెప్పాల్నో సమజ్ కాలే, కొద్దిసేపు మౌనంగుండి ‘‘మైలా, గీల ఏమీ వుండదమ్మ. సుట్టమో, పక్కమో కానక్కరలేదు. గిట్ల బుజం ఇచ్చి మోస్తే ఎంతో పుణ్యం వుంటది. రేపు మనం సచ్చిన్నాడు ఎవలు మోస్తరు’’ అన్నడు మళ్లీ తనే.
 ‘‘మాదాంట్లో డబ్బున్నోడు, లేనోడు ఎక్కువ, తక్కువ చూడరు. భోజనాల బంతి కాడ, చావుకాడ అందరూ సమానమే’’ అని వేదాంతం చెప్పిండు లతీఫ్. ‘‘గట్లనా, బాగుంది బిడ్డా మీ రివాజు’’ అంది.గిట్ల సావు ముచ్చట రాంగనే లతీఫ్ భారమైపోతాడు. దుఃఖం తోటి మౌనమైపోతాడు. ఎన్నటికీ దిగని భారమేదో మోస్తున్నవాడిలా కుంగిపోతుంటడు. లతీఫ్ యాదిలోకి జారిపోతుంటడు.
   
 వర్షం కురుస్తుంది, ఏదో కొద్దిసేపు కురిసిపోయే వర్షంలా లేదు. అకాల వర్షమే కాని నింపాదిగా మురకసిరలో మొదలైన ముసురులా నింపాదిగా మొదలైంది. రెండు, మూడు దినాలకైనా విడవనిదానిలా చిమ్మని చీకట్లు కమ్మి భూమంతా చుట్టేసిన దానిలా వుంది. చూరు నుండి రాలుతున్న చినుకుల్ని తదేకంగా రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. ప్రతిసారి చూరునుండి వరసెమ్మట రాలే చినుకులు వేటికవే కొత్తవే గదా, సైజులోను, చూరు నుండి భూమిమీదకి రాలే తీరు పరీక్షల్లో కాపీ కొడుతున్న పిల్లకాయల్లా పొల్లుపోకుండా రాస్తున్నట్టు ఈ వర్షపు చినుకులు ఒకదాన్ని ఒకటి చూసి కాపీ కొడుతున్నట్టుగానే వున్నాయ్.
 
  వర్షం హెచ్చిన కొద్దీ చినుకుల సైజు పెరుగుతుంది. స్పీడు పెరుగుతుంది. తగ్గినప్పుడు అవి కూడబలుకున్నట్టు సైజు, స్పీడు తగ్గుతున్నాయి.రెండు చేతులూ బారచాపి నీటిని దోసీట్లో పట్టే ప్రయత్నం. పట్టి విడుస్తూ, పట్టి విడుస్తూ ఆట మొదలై చాలాసేపైంది. వర్షాన్ని, తనని ఆపేవాళ్లు ఎవరూ లేరు. చల్లగా వున్నాయి. స్వచ్ఛంగా వున్నాయి. కింద నేలమీద పడ్డ నీరంతా మురికి బారుతున్నాయి. భూమి ఏ రంగులో వుంటే ఆ రంగులోకి క్షణాల్లో మారిపోతున్నాయి. నీళ్లలా మనిషెందుకు మారడు? ఏదైనా వెంటనే వినడు.
 
  నీళ్లంత స్వచ్ఛత, స్పష్టతగా వుండకపోవడం మూలంగా కాబోలు. కూపస్తపు మండూకం.. ఎదుగడు, విస్తరించడు. ఎదుగుదలని డబ్బుల్లో కొలుస్తాడు. విస్తరించడమంటే పక్కవాడి భూమినో, ఆస్తినో నంజుకోవడానికి చేతులు బార్లా చాపుతాడు. అదాటున ఏదో యాదికొచ్చినోడికి మల్లే... ఇది ఎన్నోసారో వర్షంలాగే తనూ గొంతు పెంచి.‘‘ఖాలా (పిన్ని) నువ్వు వస్తవా, రావా?’’‘‘నువ్వు రానంటే నేనూ వెళ్లనంతే!’’ ఖరాఖండిగా చెప్పేశాడు.
 
 చానాసేపటి నుంచి వాదులాడేవాడిని, మొండిఘటాన్ని వాడి మానాన వాణ్ని వదిలేసి, ఇంట్లో ఏదో పని కల్పించుకొని చేసుకుంటున్న ఆమె వులిక్కిపడ్డట్టు అయి వీడి లోకంలోకి వచ్చింది. ఆమె కూడ ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పిన వాక్యాల్నే మళ్లీ వల్లె వేసింది.‘‘పెళ్లి నీదిరా, పిల్లను చూడాల్సింది నువ్వు. నాతో పేచీ పెట్టుకొని వెళ్లనంటావేవిటి?’’
 ‘‘ఆ పిల్లకు నిన్ను చూడాలని ఆశగా వుండదా?’’
 
 ‘‘మీ ఖాలూని నేను చూడకుండానే పెళ్లాడేశాను తెల్సా. మా కాలం వేరు.’’  ‘‘నేను మీ అమ్మతో చెప్పాను. అమ్మే అన్నీ చూస్తుందిలే. ఈ ఒక్కసారికి నన్ను వదిలేయ్ బాబ్బాబు’’ అని బతిమాలటం మొదలుపెట్టింది.ఇద్దరి మధ్య వాదులాట తెగటం లేదు. ‘‘పోయినవారం బర్లిఫీట్‌లో చూసిన సంబంధం వాళ్లు నిన్ను అదోలా చూశారనే కదా నువ్వు రానంటుంది?’’‘‘కాదురా!’’‘‘ఐతే బయలుదేరు, నీ రాకను ఇష్టపడ్డవాళ్ల అమ్మాయినే నేను చేసుకుంటాను. లేకుంటే పెళ్లి చేసుకోను. అంతే...’’ ఖరాఖండిగా చెప్పేశాడు. బదులుగా ఎక్కడో గట్టిగా వురిమింది ఆకాశం.
 
 జానకీ ఫాతిమా ఇద్దరూ క్లాస్‌మేట్స్. చిన్ననాటి స్నేహితులు. జానకి వాళ్ల నాన్న టీచర్, ఫాతిమా వాళ్ల నాన్న హెడ్ కానిస్టేబుల్. ఇద్దరి ఉద్యోగాలు ఒక్క ఊర్లోనే. చాలాకాలం చేయడం మూలంగా ఇద్దరి కుటుంబాల మధ్య, వీళ్ల మధ్య స్నేహం పెనవేసుకుపోయింది. అక్కడే చదువులై పోయినయి. ఇద్దరికీ పెళ్లిళ్లు అయిపోయినయ్. ఇద్దరి అత్తగార్ల ఊరు ఒకటే అవడం మూలంగా వాళ్ల స్నేహం చెరిగిపోలేదు. ఇంకా బలపడి పెనవేసుకోపోయింది.
 
 ఆ స్నేహితురాలి కొడుకే ఇప్పుడు తగాదా పడుతున్న కృష్ణమూర్తి, జానకి కొడుకు. వీళ్లిద్దరి స్నేహం ఆ రెండు కుటుంబాల మధ్య వారధి. భర్తల మధ్య స్నేహం, పిల్లల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య విస్తరించింది. పిల్లలు వాళ్లిద్దరినీ ఏమని పిలవాలో అని తర్జన భర్జనల తరువాత ఒక నిర్ణయానికి వచ్చారు. ఇద్దరి సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకొని డేటాఫ్ బర్త్ తేదీల రీత్యా జానకి, ఫాతిమా కంటే నెల రోజులు పెద్దదవడం మూలంగా జానకి పెద్దమ్మ అయింది. ఫాతిమాను పిన్నిగా తేల్చేశారు. అట్లా స్నేహితులిద్దరూ అక్కాచెల్లెళ్లుగా మారారు.
 
 ‘‘కష్టమూతి’’ అని ఫాతిమా వాళ్ల అత్త మధ్య లోకి దూరింది. ‘‘ఓ..సే ముసల్‌దాన. నువ్వెక్కడి నుంచి దాపురించావే? పిలవటం రాకో, కావాలని అలా పిలుస్తుందో అర్థంకాక జుట్టు పీక్కుంటాడు. గొంతు పిసికి చంపి అవతల గిరాటు వేయాల న్నంత కోపాన్ని మనసులో దిగమింగుకొని ‘దాదీ ఇంతకు ముందే వచ్చాను’ అన్నాడు ముభావంగా. ‘‘పిల్ల నచ్చిందా? వాళ్లకు నువ్వు నచ్చావా లేదా? ఏమైంది, ఏమన్నారు’’ అని ఆరా తీయడం మొదలు పెట్టింది. ‘‘కాస్త ఆపుతావా. నీ డిటెక్టివ్ బుద్ధి పోనిచ్చుకోవు గదా.
 
 అయినదానికి కానిదానికి మధ్యలో దూరేస్తావ్’’ అన్నాడు.
 ఇదంతా నిన్న మొన్న జరిగిన సంఘటనలా తనకి జ్ఞాపకమొస్తూ వుంటుంది. కళ్లు నీళ్లతో నిండి దృశ్యం మసక బారుతుంది. కన్నీళ్లు కర్చీఫ్‌తో వత్తుకొని మరో దృశ్యంలోకి వెళ్లిపోతాడు లతీఫ్. చిన్ననాటి స్నేహితుడు కృష్ణమూర్తి యాదులోకి వస్తడు. యాదికి వచ్చినప్పుడల్లా ‘అరే లతీఫ్, నేనిక్కడ రోడ్డుమీద శవమై పడున్నారా’ అని అర్చినట్టే చెవుల్లో మార్మోగుతుంటుంది.
 
  కళ్లెమ్మట కన్నీళ్లు కారుతుంటయ్. తను ఆ రోజు సెకండ్ షిఫ్ట్‌కు బండి (టూ వీలర్) లేకుండా తోటి కార్మికుడి బండి మీద డ్యూటీకి పోయిండు. అప్పుడే నైట్ షిఫ్ట్‌కు వచ్చినవాళ్లు మ్యాన్ వే దగ్గర యాక్సిడెంటులో ఎవరో చనిపోయిన ముచ్చట చెప్పిన్రు. పోయేటప్పుడు చూసి పోదాంలే అనుకున్నడు లతీఫ్. కాని బండి తోటాయన యాక్సిడెంట్ ప్లేస్ వచ్చేటాల్లకే ‘ఏం జుత్తంతీ అన్న, చూసి పోయినంక నిద్రపట్టదు. కండ్లల్ల అదే మెదుల్తుంటుంది’... అని మోటర్ సైకిల్ ఆపకుండా పోనిచ్చిండు. చూసి, చూడనట్టు గట్ల నజర్ వేసి వెళ్లిపోయిన్రు ఇద్దరు.
 
 రాత్రి పడుకునే ముందు సెల్ స్విచ్ ఆఫ్ చేసి పడుకునే అలవాటు. మీద గట్లనే చేసి పడు కుండు. తెల్లారంగ ఆలస్యంగా నిద్రలేసిండు లతీఫ్. నిద్ర లేసేటప్పటికే నాలుగైదు మిస్డ్ కాల్స్ వచ్చి వున్నయ్ మిత్రుల దగ్గరి నుండి. ఒక మిస్డ్ కాల్‌కి రింగిచ్చి మాట్లాడితే పిడుగులాంటి వార్త. రాత్రి యాక్సిడెంట్‌లో చనిపోయింది మరెవరో కాదు తన ప్రాణమిత్రుడు కృష్ణమూర్తి. నిర్గాంత పోయిండు, విగత జీవిలాగ రోడ్డుపై పడి వుండిన మిత్రుణ్ని చూడకుండా వచ్చినందుకు తనని ఎన్నిసార్లు తిట్టుకున్నడో. ఏం అనుకుంటే ఏం లాభం, ఎంత ఏడిస్తే ఏం మిత్రుడు తిరిగి రాడుగా, తను ఒక్క తీర్గ బాధపడుతున్న తీరు చూస్తూ ‘‘ఎందుకు నిన్ను నువ్వు నిందించు కుంటావు.
 
 అందులో నీ తప్పేముంది, అంతలా బాధ పట్టం వల్ల లాభమేంటి? పోయినోడు తిరిగొస్తాడా చెప్పు? పద పోదాం, పోయి చివరిచూపులు చూసి జరగాల్సింది చూద్దాం, అత్త ఎట్లుందో ఏమో’’ అని తొందరపెట్టింది భార్య. కానీ లతీఫ్‌కి నిన్న మొన్న జరిగిన సంఘటనలాగే ఆ రాత్రి దృశ్యం వెంటా డుతూ ‘అరే లతీఫ్, నేనక్కడ శవమై పడు న్నారా, నన్ను గిట్ల రోడ్డుమీద అనాథలా ఇడ్సివెట్టి పోతున్న వేందిరా’ అని చెవుల్లో రొద పెడుతూనే వుంటుంది మిత్రుని గొంతు.
 
 మా ‘ఖాలా’ (ఫాతిమా చెల్లెలు) రొమ్ము కాన్సర్‌తో చనిపోయినప్పుడు కృష్ణమూర్తి ఎంత జేసిండు, సొంత బిడ్డ తీర్గ ఏడ్సిండు. దస్మా (పది రోజుల నాటి దినం) అయ్యేంతవరకు సొంత బిడ్డ తీర్గ ఇంటి చుట్టూ తిరిగిండు. ఖాలా జారత్ నాడు ఎక్కడెక్కట్నుంచి తెచ్చిండో, ఎన్ని పూలు పట్టుకొచ్చిండు. రకరకాల పూలు ఓ పెద్ద గంప నిండా తెచ్చిండు. ఖాలా చేతి వంటల రుచుల గురించి ఎన్నో తీర్ల పొగిడేటోడు. ‘‘ఖాలా పోయి చాన్నాలైంది గదరా, ఇంక మరవవా’’ అంటే, ‘ఆ చేతి రుచుల్ని అందుకున్న నాలుక నాతోని వుంది కదా, ఎట్లా మర్చిపోద్దిరా, ఈ నాలుక గడ్డ కొట్టకోపోయన్నాడే...’ అంటుండేవాడు.
 
 ‘దునియాలో ప్రతి తల్లికి ఇంట్లాంటి బిడ్డ ఒక్కడుంటే చాలు, ఆ తల్లి జీవితం ధన్యమైనట్టే’ అట్లాంటి ఆ మిత్రుణ్ని మరవడం తనవల్ల కావట్లేదు’ అంటుంటాడు లతీఫ్. మిత్రుని శవ యాత్రలో లతీఫ్ కోరిక తీరనీయ లేదందరు. తనని వారించారు, మిత్రులు సముదాయిం చారు. మిత్రుని పాడె మోయాలన్న కోరిక తీర కుండా లతీఫ్ మనసులో వెల్తిగానే మిగిలిపో యింది.
 
 వద్దు అని మిత్రులందరూ వారించారు. ఇప్పుడు మా అందరితో పాటు తోడుగా నడుస్తు న్నావుగా, మిత్రునితో నడిచినట్లే లెక్క. మిత్రున్ని భుజాన ఎత్తుకున్నట్లే లెక్క, మనసులో దాస్కో, ఇంత కంటే నివాళి ఏముంటుంది. అని హితో క్తులు చెప్పారు. అందుకే తెల్లటి పైజామా, కుర్తా, నెత్తిన తెల్ల టోపీతో తనకు ఎదురుపడ్డ ఆ చివరి యాత్రలో అందరితో కలసి నాలుగడుగులు కలసి నడుస్తాడు. మిత్రునికి నివాళి అర్పిస్తాడు.
   
 పెద్దమ్మ గేటు ముంగటే నిల్చోనుంది. ఎదురు చూస్తుంది. రావడం తోటే గేటు తెర్చి పట్టుకొని నిల్చుంది. ‘‘నేనొస్తగదా, ఎప్పట్నుంచి ఎదురు చూస్తున్నవో; ఏందో? దార్లో కాస్త లేటైంది’’ సంజాయిషీ గొంతుతో!‘‘వేడినీళ్లు పెట్టే వుంచిన, స్నానం చేసి; రెస్ట్ తీసుకో’’ ఈ పూటేం వద్దులే, షిఫ్టింగ్ పని రేపు చూద్దాం అంది. ‘‘ఈ పూట సర్దుదాం, నువ్వన్నట్టే షిఫ్టింగ్ రేపే చేద్దాం’’ అన్నాడు.
 ఇప్పుడు ఆ స్నేహితులిద్దరికి తానొక్కడే కొడుకు.                                                                

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement