రొమాంటిక్‌గా ఉంటుందనీ... | title yours seen is ours | Sakshi
Sakshi News home page

రొమాంటిక్‌గా ఉంటుందనీ...

Published Sun, Jan 21 2018 12:03 AM | Last Updated on Sun, Jan 21 2018 12:03 AM

title yours seen is ours - Sakshi

ఈమధ్యకాలంలో తెలుగులో వచ్చిన రొమాంటిక్‌ కామెడీ సినిమాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న సినిమాలోని సన్నివేశాలివి. చిన్న సినిమాగా వచ్చి మంచి విజయం సాధించిన ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం? 

ఆ అమ్మాయి ఎంతో ఇష్టంగా సినిమా చూద్దామని థియేటర్‌కి వచ్చింది. టికెట్స్‌ దొరకలేదు. ఆ అబ్బాయిదీ అదే పరిస్థితి. కానీ బ్లాక్‌లో రెండు టికెట్లు ఉన్నాయి. రెండూ కలిపి కొంటే తక్కువకే వస్తాయి. ఆ అబ్బాయి, వెళ్లిపోతున్న ఆ అమ్మాయికి దగ్గరగా వెళ్లి, ‘‘హలో!’’ అని పలకరించాడు.  ‘‘నాకు బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడు!’’ అంది ఆ అమ్మాయి, అబ్బాయి వైపు చూడకుండా. ‘‘నాకూ గర్ల్‌ఫ్రెండ్‌ ఉందీ!’’ అన్నాడు.
‘‘పేరూ?’’ అనడిగింది. ‘‘ఎన్‌.వెంకటేశ్వరరావు..’’ ‘‘చీ..’’ అని చిన్నగా నవ్వింది.      ‘‘వందకే ఆ రెండు టికెట్లూ తీసుకుందామా? యాభై రూపాయలిస్తాను..’’    \ ‘‘ప్రాబ్లమ్‌ అది కాదు. సినిమా మొత్తం పక్కపక్కనే!’’ చెప్తూ, చెప్పలేక నవ్వింది. ఆలోచిస్తున్నట్లు నిలబడిపోయాడు.  కాసేపటికి ఒప్పుకుంది.  ‘‘డబ్బులక్కర్లేదు కానీ.. ఇంటర్వెల్‌లో నాక్కూడా పాప్‌కార్న్‌ అండ్‌ కోక్‌’’ ఆ అబ్బాయితో మాట్లాడుతూనే పర్స్‌లోంచి డబ్బులు తీసి, బ్లాక్‌లో టికెట్స్‌ తీసుకుంది. థ్యాంక్స్‌ అన్నట్టు చూశాడు.  మూడు గంటలు గడిచాయి. హాల్లోనుంచి బయటకొచ్చారు. ‘‘సో మీరుండేదీ సీతమ్మధారే కదా?’’ అన్నాడు. అవునంది. ‘‘నేనుండేదీ అక్కడే! మీకు అభ్యంతరం లేకపోతే నా బైక్‌ మీద డ్రాప్‌ చేస్తా!’’ అంటూ సిగ్గుపడుతూ అన్నాడు. ఆ అమ్మాయి, ‘‘పర్లేదు. నే వెళ్తా’’ అంది. మళ్లీ ఏమనుకుందో, వెనక్కి తిరిగి, ‘‘సరే పదా! వెళ్దాం..’’ అంది సిగ్గుపడుతూ.  ఆ అబ్బాయి మాత్రం ముందుకు కదలకుండా అక్కడే నిలబడ్డాడు. తనలో తానే ఏదో గొణుక్కుంటున్నాడు. చెప్పాలనుకుంటున్న విషయం ఎలా చెప్పాలో తెలీట్లేదు. ‘‘మీకో విషయం చెప్పాలి! నాకు బైక్‌ లేదు. బస్‌ ఎక్కొచ్చా’’ అన్నాడు. గట్టిగా నవ్వి.. ‘‘మరి లిఫ్ట్‌ ఎలా ఇస్తానన్నారు?’’ అడిగింది.  ‘‘ఏదో!! రొమాంటిక్‌గా ఉంటుందనీ..’’ బదులిచ్చాడు. ఆ అమ్మాయిని చూస్తూ సరిగ్గా నిలబడి మాట్లాడలేకపోతున్నాడు ఆ అబ్బాయి. మొత్తం ఊగిపోతున్నాడు. నవ్వుతూ, సిగ్గుపడుతూ.  ‘‘నా స్కూటీ మీద వెళ్దాం.. పదండీ.!’’ అంది. మూడడుగులు వేశాక అబ్బాయికి ఒక డౌట్‌ వచ్చింది. ‘‘మీ దగ్గర స్కూటీ ఉంటే మరీ.. నా బైక్‌ ఎందుకు ఎక్కుతా అన్నారు?’’ అడిగాడు. ఆ అమ్మాయి సిగ్గుపడుతూ చిన్నగా నవ్వింది. ఆ అబ్బాయి నవ్వాడు.      ఆ అమ్మాయి స్కూటీపై అబ్బాయి, అమ్మాయి వెళుతున్నారు. ఇద్దరూ ఏం మాట్లాడుకోకుండా కూర్చున్నారు. అబ్బాయి ఇక నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ అడిగాడు – ‘‘మీరుండేది ఎల్‌ఐసీ అపార్ట్‌మెంట్సే, నేనుండేదీ ఎల్‌ఐసీ అపార్ట్‌మెంట్సే. కానీ మీ పేరింకా నాకు తెలీలేదండీ..’’. ‘‘ప్రభావతి..’’ ‘‘నైస్‌ నేమ్‌’’

‘‘ఏం బావుందీ! నా పూర్తి పేరు శ్రీ సాయి శిరీషా ప్రభావతి’’ చిరుకోపంతో చెప్పింది. తనకు అసలు ఆ పేరే నచ్చదని చెప్పింది ఆ అమ్మాయి.   ‘‘అయినా పేరుదేముంది? వదిలేసేయండి..’’ ‘‘నీకో విషయం చెప్పనా? నాకసలు ఏ బాయ్‌ఫ్రెండూ లేడు. ఈ ఊర్లో అయితే ఫ్రెండ్స్‌ కూడా లేరు. మాది ఢిల్లీ. ఫస్ట్‌ టైమ్‌ వైజాగ్‌కొచ్చా. అమ్మమ్మ వాళ్లింటికి.’’ ‘‘మాది హైద్రాబాద్‌. అత్తయ్య వాళ్లింటికొచ్చా. ఈ సెలవులిక్కడే!’’  ‘‘నీక్కూడా గర్ల్‌ఫ్రెండ్‌ లేదు కదా!?’’ అడిగింది.  ‘‘నిజం చెప్పమంటారా? అబద్ధం చెప్పమంటారా?’’  ‘‘ఏం చెప్పినా ఫర్వాలేదు. ఏం చెప్తున్నారో చెప్పి చెప్పండి..’’ ‘‘మొన్న మండే వరకూ గర్ల్‌ఫ్రెండ్‌ లేదండీ.. నిన్న ట్యూజ్‌డే వరక్కూడా గర్ల్‌ఫ్రెండ్‌ లేదండీ.. ఈరోజు వెడ్నస్‌డే పొద్దునవరకూ కూడా గర్ల్‌ఫ్రెండ్‌ .. లే.. దం..డీ..’’ అనేంతలో అపార్ట్‌మెంట్‌ వచ్చేసిందని బండి ఆపేస్తూ, ‘‘ఇంక చాలు..’’ అంది ఆ అమ్మాయి. 
 
వేసవి సెలవులు అయిపోతున్నాయి. వెంకటేశ్వర్లు, ప్రభావతి... పేర్లు తెలుసుకోవడం దగ్గర్నుంచి, ఇష్టాల్ని పంచుకునేవరకూ, ఆ ఇష్టాలను కలిసి ఆస్వాదించేవరకూ వచ్చేశారు.  ఇంక సెలవులు అయిపోతాయనుకునే టైమ్‌లో వెంకటేశ్వర్లు ప్రభావతికి అసలు విషయం చెప్పాలనుకున్నాడు. డిన్నర్‌కి పిలిచాడు.  ‘‘ఇంతకీ ఏదో అడగాలన్నావ్‌?’’ అడిగింది ప్రభావతి.   వెంకటేశ్వర్లు చెప్పకుండా జంకుతున్నాడు.  ‘‘కమాన్‌! అడిగెయ్‌! నేనేమైనా కొడతానా?’’ అంది.  వెంకటేశ్వర్లు గట్టిగా ఊపిరి పీల్చుకొని, ‘‘డూ యూ లవ్‌ మీ ప్రభా?’’ అనడిగాడు.  ‘‘కొడతాను.’’ ‘‘నిజం ప్రభా! నువ్వంటే నాకు చాలా ఇష్టం. మనిద్దరి మధ్య ఉన్న పరిచయానికి ఏ పేరు పెడతావ్‌?’’  ‘‘ఏదొక పేరు పెడితే కానీ ఏమీ లేనట్టా? నాకు నువ్వు నచ్చావ్‌! అది నిజం. యూ ఆర్‌ స్పెషల్‌.. అదీ నిజం. దానికిప్పుడు పేరు పెట్టాలా?’’ ‘‘అంటే నేను జస్ట్‌ ఫ్రెండ్‌నా?’’ ‘‘పోనీ బెస్ట్‌ఫ్రెండ్‌ అనుకో!’’  ‘‘ఇప్పుడు మనమేం చేద్దామంటావ్‌?’’ ‘‘చూద్దాం. టచ్‌లో ఉందాం. లెట్‌ లైఫ్‌ అన్‌ఫోల్డ్‌ నా!’’  వెంకటేశ్వర్లు చాలాసేపు ఏం మాట్లాడలేదు. కొంచెం కోపాన్ని కొనితెచ్చుకొని, ‘‘అర్థమైంది. ఢిల్లీ కల్చర్‌ కదా, మాకు కొత్తలే! పార్టీలు, పబ్బులూ, షికార్లూ..’’  వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉండగానే, ప్రభావతి కోపంగా అక్కణ్నుంచి లేచెళ్లిపోయింది. ఎంత బతిమిలాడినా వినిపించుకోలేదు.  ఆ వెంటనే ఊరు వదిలేసీ వెళ్లిపోయింది.. వెంకటేశ్వర్లుకు కనిపించకుండా. తన ఫోన్‌ నంబర్‌ కూడా తెలియనీయలేదు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement